క్యాన్సర్‌... అందరూ తెలుసుకోవాల్సిన నిజాలు | Awareness on Cancer Treatment | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌... అందరూ తెలుసుకోవాల్సిన నిజాలు

Published Thu, Jul 25 2019 9:05 AM | Last Updated on Thu, Jul 25 2019 9:05 AM

Awareness on Cancer Treatment - Sakshi

వైద్యవిజ్ఞానం ఎంతగానో అభివృద్ధి చెందినా ఇప్పటికీ తెలిసిన వారికి, బంధువులకు క్యాన్సర్‌ అని తెలిస్తే... ఒళ్లు జలదరిస్తుంది. ఎన్నో సందేహాలు, భయాలు, అనుమానాలు వెంటాడుతుంటాయి. తొలిదశలోనే గుర్తిస్తే చికిత్సకు లొంగే క్యాన్సర్‌  గురించి ప్రముఖ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ చిగురుపాటి మోహనవంశీ అందిస్తున్న కొన్ని వివరాలు...

1. క్యాన్సర్‌ లక్షణాలు ఎలా ఉంటాయి?
క్యాన్సర్‌ లక్షణాలన్నవి ఆ వ్యాధి సోకిన అవయవాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అందరిలోనూ అన్నిరకాల క్యాన్సర్‌లలో కనిపించే సాధారణ లక్షణాలు ఇవి... తీవ్రమైన అలసట. జ్వరం, రోగనిరోధక శక్తి తగ్గడం, ఆకలితగ్గడం, వాంతులు, విరేచనాలు, అకారణంగా బరువు తగ్గడం, రక్తహీనత. (ఇవి క్యాన్సర్‌ ముదిరాక కనిపించే సాధారణ లక్షణాలని తెలుసుకోండి).

2. క్యాన్సర్‌ కణం శరీరంలో ఎక్కడైనా ఉందా అని ముందే తెలుసుకోవచ్చా?
శరీరం మొత్తంలో క్యాన్సర్‌ కణం ఎక్కడైనా ఉందా అని ముందే తెలుసుకోడానికి నిర్దిష్టమైన పరీక్ష అయితే లేదు. ఎందుకంటే ఏ అవయవానికి క్యాన్సర్‌ వచ్చిందని అనుమానిస్తే... ఆ అవయవానికి సంబంధించిన పరీక్షలు వేర్వేరుగా ఉంటాయి. వీటిలో బయాప్సీ, ఎఫ్‌ఎన్‌ఏ టెస్ట్, బ్లడ్‌ మార్కర్స్, ఎక్స్‌–రే, సీటీస్కాన్, ఎమ్మారై, పెట్‌ స్కాన్‌ ఇలా.. అవసరాన్ని బట్టి రకరకాల పరీక్షలు చేస్తుంటారు. ఒక్క సర్వైకల్‌ క్యాన్సర్‌ను మాత్రమే పాప్‌స్మియర్‌ ద్వారా చాలా ముందుగా గుర్తించవచ్చు.

3. క్యాన్సర్‌ రాకుండా వ్యాక్సిన్‌ లేదా?
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ (సర్వైకల్‌ క్యాన్సర్‌)కు కారణం ఖచ్చితంగా హెచ్‌పీవీ వైరస్‌ అని తెలుసు కాబట్టి ఇది రాకుండా అమ్మాయిలకు వ్యాక్సిన్‌ ఉంది. తొమ్మిదేళ్ల నుంచి పెళ్లికాని అమ్మాయిలందరూ (అంటే శృంగార జీవితం ప్రారంభం కాకముందుగా) ఈ వ్యాక్సిన్‌ తీసుకుంటే ఈ క్యాన్సర్‌ బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

4. క్యాన్సర్‌ నివారణ మన చేతుల్లో లేదా?
సర్వైకల్‌ క్యాన్సర్‌కు తప్పితే మిగతా ఏ క్యాన్సర్‌కూ ఖచ్చితమైన కారణం తెలియదు కాబట్టి నివారణ మన చేతుల్లో లేనట్టే. అయితే పుష్కలంగా పీచుపదార్థాలు ఉండే ఆహారం, వ్యాయామం, కాలుష్యానికీ, రసాయనాలకూ దూరంగా ఉండటం, పొగతాగడం–ఆల్కహాల్‌ వంటి అలవాట్లకు దూరంగా ఉండటం, తరచూ ఇన్ఫెక్షన్స్‌ గురికాకుండా చూసుకోవడం ద్వారా కొంత మేరకు ప్రయత్నం చేయవచ్చు.  

5. ఏదైనా క్యాన్సర్స్‌ వంశపారంపర్యమా?
ఖచ్చితంగా చెప్పలేం గానీ... రొమ్ము క్యాన్సర్‌ రక్తసంబంధీకుల్లో ఉన్నప్పుడు... మిగతా వారితో పోలిస్తే... వీళ్లకువచ్చే ముప్పు ఎక్కువ. బీఆర్‌సీఏ–1, బీఆర్‌సీఏ–2 వంటి జీన్‌ మ్యూటేషన్‌ పరీక్షల ద్వారా రొమ్ముక్యాన్సర్‌ వచ్చే ప్రమాదాన్ని పసిగట్టడచ్చు. రొమ్ము క్యాన్సర్‌ బాధితులు 80% వంశపారంపర్యంగా లేనివారే కాబట్టి ప్రతి మహిళా తన 20వ ఏటి నుంచే రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోవాలి. నెలసరి అయిన ఏడో రోజున సబ్బు చేతులతో వేళ్ల మధ్యభాగంతో రొమ్ములను పరీక్షించుకుని, చిన్న చిన్న గడ్డలు ఏవైనా తగులుతున్నాయా అని గమనించుకోవాలి. 30 ఏళ్ల నుంచి ఇతర పరీక్షలు, 40 ఏళ్ల పైబడ్డాక మామోగ్రామ్‌ వంటివి డాక్టర్‌ సలహా మేరకు ఏడాదికి ఒకసారి (ఇది కుటుంబ చరిత్రను అనుసరించి) లేదా మూడేళ్లకు ఒకసారి చేయించుకుంటే రొమ్ముక్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించగలిగితే వెంటనే చికిత్స తీసుకోని, దాని బారినుంచి విముక్తం కావడానికి అవకాశాలుంటాయి.

6. క్యాన్సర్‌ను కొంతమంది జయిస్తే మరికొంతమంది తెలిసిన కొద్దిరోజుల్లోనే మరణిస్తారు. ఎందుకని?
ప్రతి మనిషి ప్రవర్తనలో తేడా ఉన్నట్లే, క్యాన్సర్‌ కణం ఒక్కొక్కరిలో ఒక్కోలా ప్రవర్తిస్తూ ఉంటుంది. క్యాన్సర్‌ను జయించడం అన్న విషయం క్యాన్సర్‌ను ఏ దశలో కనుక్కున్నాం, వారి క్యాన్సర్‌ గడ్డకు త్వరగా పాకే గుణం ఉందా లేదా వచ్చిన ప్రదేశానికే పరిమితమయ్యిందా అనే అంశాల మీద ఆధారపడి ఉంటుంది. సర్జరీ, మందులు, థెరపీలు కూడా ఆ విషయాల మీదే ఆధారపడి ఉంటాయి. క్యాన్సర్‌ను జయించడంలో త్వరగా గుర్తించడంతో పాటు ఆ గడ్డ తాలూకు స్టేజ్, గ్రేడింగ్‌ కూడా చాలా ముఖ్యం.

7. క్యాన్సర్‌కు వయోభేదం లేదా?
లేదు. ఏ వయసువారిలోనైనా కనిపించవచ్చు. అదృష్టవశాత్తు చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్స్‌ చాలావరకు పూర్తిగా నయం చేయగలిగేవే. వయసు పెరిగేకొద్దీ క్యాన్సర్స్‌ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. పెద్ద వయసు వారిలో వచ్చే క్యాన్సర్స్‌ తీవ్రత చాలా ఎక్కువ. అందుకే క్యాన్సర్‌ చికిత్స అన్నది కూడా రోగి వయసును బట్టి మారుతూ ఉంటుంది.

8. క్యాన్సర్‌ చికిత్స సమయంలోనూ, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి?
పరిశోధకులు క్యాన్సర్‌ చికిత్సతో వచ్చే దుష్ప్రభావాలను (సైడ్‌ఎఫెక్ట్స్‌ను) కొంతవరకు తగ్గించగలిగారు గానీ ఇప్పటికీ అవి ఎంతోకొంత ఉన్నాయి. వైద్యుల సలహాలు పాటించడం, అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన డాక్టర్‌ దగ్గరికి వెళ్లడం, మనోధైర్యంతో యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఉండటం మంచిది. ప«థ్యాలు ఏవీ పాటించనక్కర్లేదు. ఇంకా మంచి పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. క్యాన్సర్‌ కణాలమీదే పనిచేసే కీమోథెరపీ, రేడియోథెరపీలతో పాటు ల్యాపరోస్కోపిక్‌ పద్ధతిలో చేసే కీ–హోల్‌ సర్జరీలు కూడా నేడు క్యాన్సర్‌కు చేయగలుగుతున్నారు. సర్జరీ చేశాక రేడియోధెరపీ, కీమో, హార్మోన్‌ థెరపీ వంటివి ఇచ్చినా లేదా థెరపీ తర్వాత సర్జరీ చేసినా చికిత్స అంతటితో ముగిసిందని అనుకోడానికి లేదు. క్రమం తప్పకుండా చెకప్స్‌కు వెళ్లడం, పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. మొదటి ఐదేళ్లలో వ్యాధి తిరగబెట్టకపోతే అది మళ్లీ వచ్చే అవకాశాలు తక్కువ. అయితే కొంతమందిలో పది, ఇరవై ఏళ్ల తర్వాత వ్యాధి వచ్చిన భాగంలో కాకుండా మరో అవయవంలో వచ్చిన సందర్భాలున్నాయి. కాబట్టి క్యాన్సర్‌ అదుపులో ఉంది అంటారుగానీ పూర్తిగా నయమైంది అని చెప్పలేరు. ఒక రొమ్ములో క్యాన్సర్‌ వచ్చిన వారిలో మరో రొమ్ములోనూ వచ్చే అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా కొన్ని రకాల క్యాన్సర్‌లు శరీరంలోని ఒక అవయవం నుంచి ఇంకో అవయవానికి విస్తరించి, మిగతా భాగాలకు వ్యాపించి, ఇతర అవయవాలకూ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వాటిని నిర్ధారణ చేసే పరీక్షలను చికిత్స ముగిశాక కూడా చేయించుకుంటూ ఉండాలి.

Dr. Ch. Mohana Vamsy
Chief Surgical Oncologist
Omega Hospitals, Hyderabad
Ph: 98480 11421,
Kurnool 08518273001

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement