నా వయసు 48 ఏళ్లు. విపరీతంగా సిగరెట్లు తాగుతాను. ఎంత ప్రయత్నించినా చైన్‌స్మోకింగ్ మానడం సాధ్యం కావడం లేదు. స్నేహితులు ఈ–సిగరెట్‌ను ప్రయత్నించమని చెబుతున్నారు. ఈ–సిగరెట్ (ఎలక్ట్రానిక్ సిగరెట్) ఉపయోగించడం ద్వారా సిగరెట్ మానేయవచ్చా? ఇది సురక్షితమేనా?– ఆర్. మోహన్, విశాఖపట్నం
ఎలక్ట్రానిక్ సిగరెట్లు (ఈ–సిగరెట్స్) అన్నీ ఒకేలా పని చేస్తాయి. అందులో ఒక బ్యాటరీ ఉంటుంది. దాని కాటరిడ్జ్ (మందు నింపే బోలు ప్రదేశం)లో నికోటిన్ ఉంటుంది. మామూలు సిగరెట్‌కూ, ఈ–సిగరెట్‌కూ తేడా ఒక్కటే. ఈ–సిగరెట్‌లో పొగాకు ఉండదు. అంతే. అయితే కేవలం పొగాకు మాత్రమే గాక... సాధారణ సిగరెట్‌లో ప్రమాదకరమైన రసాయనాలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉండి, అవన్నీ ఆరోగ్యానికి చేటు చేస్తాయని నిరూపితమైంది. అదే పరిణామంలో కాకపోయినా ఈ–సిగరెట్‌లోనూ దాదాపు సాధారణ సిగరెట్‌లో ఉండే ప్రమాదకరమైన రసాయనాల్లో కొన్నైనా ఉంటాయి. నికోటిన్ అనే పదార్థం మామూలు సిగరెట్లు, ఈ–సిగరెట్లు... ఈ రెండింటిలోనూ ఉంటుంది. తనకు బానిస అయ్యేలా చేసుకోవడానికి నికోటిన్ ప్రతీతి. మందుల భద్రత విషయంలో ప్రామాణికమైన అమెరికాలోని అత్యున్నత సంస్థ ఎఫ్‌డీఏ విశ్లేషణల ప్రకారం... ఈ–సిగరెట్‌లోనూ గుర్తించగల స్థాయిలో క్యాన్సర్ కారకాలూ, విషపూరిత రసాయనాలూ ఉన్నాయి.
ఈ–సిగరెట్‌లో కాటరిడ్జ్‌లో డీ–ఇథైల్ గ్లైకాల్ అనే విషపూరిత పదార్థం, నైట్రోజమైన్స్ అనే క్యాన్సర్ కారకాలు ఉన్నాయి. పైగా ఎన్నో రకాల కాలుష్యాలు సైతం ఈ–సిగరెట్ ద్వారా శరీరంలోకి వెళ్తుంటాయి. ఈ పొగను లోపలికి పీల్చినప్పుడు అది మామూలు సిగరెట్లలాగే గొంతు, ఊపిరితిత్తుల్లో దీర్ఘకాలిక మంట, ఇన్ఫెక్షన్లను (క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్‌ను) కలిగిస్తుంది. ఇలా పొగ పీల్చడం దీర్ఘకాలం పాటు కొనసాగితే అది ఈ–సిగరెట్ పొగ అయినా సరే... కొన్నాళ్ల తర్వాత బ్రాంకైటిస్, ఎంఫసిమా, గుండెజబ్బుల వంటి వ్యాధులకు కారణమవుతుంది. కాబట్టి ఈ–సిగరెట్ మామూలు సిగరెట్ కంటే చాలా సురక్షితౖమేమీ కాదు. పైగా ఏ సిగరెట్ అయినప్పటికీ అందులోని పొగ వల్ల సిరలు, ధమనులు చాలా ఎక్కువగా ధ్వంసమవుతాయి. ఈ పరిణామమే ఆ తర్వాత గుండెజబ్బులకు దారితీస్తుంది. ఇక ఈ–సిగరెట్‌లోని పొగలో మామూలు సిగరెట్‌లో పోలిస్తే రసాయనాల సంఖ్య కొంచెం తగ్గితే తగ్గుతుండవచ్చు. అంతమాత్రాన అది మామూలు సిగరెట్ కంటే సురక్షితం అని కచ్చితంగా చెప్పడానికి ఆస్కారం లేదు. దీర్ఘకాలంలో మామూలు సిగరెట్‌తో వచ్చే దాదాపు అన్ని రకాల దుష్పరిణామాలూ ఈ–సిగరెట్‌తోనూ వస్తాయి. ఈ–సిగరెట్‌లోనూ ఉండేది నికోటినే కాబట్టి దానికి బానిసై మళ్లీ మీరు ఈ–సిగరెట్‌కు అలవాటు పడతారు. మీరు సిగరెట్ వదిలేయదలిస్తే... ఒక్కసారిగా వదిలేయడం. మానేయగానే కాస్త చిరాకు, కోపం, నిస్పృహ, అస్థిమితంగా ఉండటం వంటి కొన్ని తాత్కాలిక లక్షణాలు కనిపించినా, దీర్ఘకాలంలో సిగరెట్ మానేయడం వల్ల కలిగే ప్రయోజనాల సంఖ్య చాలా ఎక్కువ. కాబట్టి ఈ–సిగరెట్ సహాయంతో కాకుండా వెంటనే మీరు పొగతాగడం మానేయడం చాలా మంచిది.డాక్టర్ రమణ ప్రసాద్‌కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్, స్లీప్ స్పెషలిస్ట్,కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్
Comments
Please login to add a commentAdd a comment