e cigarette
-
ఈ–సిగరెట్స్‌పై నిఘా
సాక్షి, సిటీబ్యూరో: దేశ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ సిగరెట్ల వాడకం, దిగుమతి, అమ్మకం తదితరాలను నిషేధిస్తూ కేంద్రం గత వారం ఆర్డినెన్స్ జారీ చేసింది. వీటిని వినియోగిస్తున్న వారిలో 70 శాతం యువతే ఉండటం, వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిని తక్షణం అమలులోకి తీసుకువస్తూ నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిఘా, దాడులు ముమ్మరం చేశారు. ఫలితంగా పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం ఇద్దరిని అరెస్ట్ చేసి వారి నుంచి 250 ఈ–సిగరెట్స్ స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు తెలిపారు. ఆర్డినెన్స్ జారీ చేసిన కేంద్రం అందులోని సెక్షన్లకు సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా వెలువరించలేదు. దీంతో పోలీసులు ప్రస్తుతానికి సీఓటీపీ చట్టం కిందే ఈ–సిగరెట్ల కేసులను నమోదు చేస్తున్నారు. తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన మహ్మద్ షోయబ్, మొఘల్‌పుర వాసి మహ్మద్ మాజ్ చార్మినార్ సమీపంలోని షెరిటన్ మార్కెట్లో లక్కీ కలెక్షన్స్, మాజ్ కలెక్షన్స్ పేరుతో వేర్వేరు దుకాణాలు నిర్వహిస్తున్నారు. వివిధ వస్తువుల విక్రయం ముసుగులో ఈ ద్వయం కేంద్రం నిషేధించిన ఈ–సిగరెట్లనూ హోల్‌సేల్‌గా, రిటైల్‌గా అమ్మేస్తున్నారు. దీనిపై సమాచారం అందడంతో పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు పి.మల్లికార్జున్, ఎల్.భాస్కర్‌రెడ్డి, బి.దుర్గారావు, మహ్మద్ ముజఫర్ అలీలతో కూడిన బృందాలు దాడి చేశాయి. షోయబ్, మాజ్‌లను అదుపులోకి తీసుకుని వారి నుంచి 250 ఈ–సిగరెట్ మిషన్లు, అందులో వాడే ఫ్లేవర్స్ బాటిల్స్ 56 స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న వాటినీ మీర్‌చౌక్ పోలీసులకు అప్పగించారు. ఈ–సిగరెట్లను నిషేధించిన కేంద్రం వాటిని వినియోగించడం, విక్రయించడం, కలిగి ఉండటం, రవాణా చేయడాన్ని తీవ్రమైన నేరాలుగా పరిగణించింది. ఈ నేరాలు చేసిన వారికి జైలు, భారీ జరిమానాలు విధిస్తామని పేర్కొంది. అయితే ఆర్డినెన్స్ ఇచ్చినప్పటికీ ఆ నిషేధ చట్టంలోని సెక్షన్లు, శిక్షలను వివరిస్తూ నోటిఫికేషన్ జారీ చేయలేదు. దీంతో పోలీసులు ప్రస్తుతానికి సిగరెట్స్ అండ్ అదర్ టుబాకో ప్రొడక్టŠస్ (సీఓటీపీ) చట్టం కింద కేసు నమోదు చేస్తున్నారు. ఇది అత్యంత సాధారణ కేసు రావడంతో నిందితులకే అదే రోజు పోలీసుస్టేషన్లోనే బెయిల్ లభిస్తోంది. కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసి, అది అధికారికంగా పోలీçసు విభాగానికి అందితే ఈ–సిగరెట్స్ కేసుల్లో నిందితుల్ని రిమాండ్ చేయడానికి ఆస్కారం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఇకపై నగరంలో ఈ–సిగరెట్లపై నిఘా కొనసాగుతుందని, చిక్కిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. వ్యాపారులు, వ్యక్తులు... ఇలా ఎవరి వద్దనైనా ఈ–సిగరెట్లు ఉంటే తక్షణం వాటిని స్థానిక పోలీసుస్టేషన్లలో అప్పగించాలని పోలీసులు సూచిస్తున్నారు. -
ఈ–సిగరెట్ సహాయంతో పొగతాగడం మానేయడం మంచిదేనా?
నా వయసు 48 ఏళ్లు. విపరీతంగా సిగరెట్లు తాగుతాను. ఎంత ప్రయత్నించినా చైన్స్మోకింగ్ మానడం సాధ్యం కావడం లేదు. స్నేహితులు ఈ–సిగరెట్‌ను ప్రయత్నించమని చెబుతున్నారు. ఈ–సిగరెట్ (ఎలక్ట్రానిక్ సిగరెట్) ఉపయోగించడం ద్వారా సిగరెట్ మానేయవచ్చా? ఇది సురక్షితమేనా?– ఆర్. మోహన్, విశాఖపట్నం ఎలక్ట్రానిక్ సిగరెట్లు (ఈ–సిగరెట్స్) అన్నీ ఒకేలా పని చేస్తాయి. అందులో ఒక బ్యాటరీ ఉంటుంది. దాని కాటరిడ్జ్ (మందు నింపే బోలు ప్రదేశం)లో నికోటిన్ ఉంటుంది. మామూలు సిగరెట్‌కూ, ఈ–సిగరెట్‌కూ తేడా ఒక్కటే. ఈ–సిగరెట్లో పొగాకు ఉండదు. అంతే. అయితే కేవలం పొగాకు మాత్రమే గాక... సాధారణ సిగరెట్లో ప్రమాదకరమైన రసాయనాలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉండి, అవన్నీ ఆరోగ్యానికి చేటు చేస్తాయని నిరూపితమైంది. అదే పరిణామంలో కాకపోయినా ఈ–సిగరెట్‌లోనూ దాదాపు సాధారణ సిగరెట్లో ఉండే ప్రమాదకరమైన రసాయనాల్లో కొన్నైనా ఉంటాయి. నికోటిన్ అనే పదార్థం మామూలు సిగరెట్లు, ఈ–సిగరెట్లు... ఈ రెండింటిలోనూ ఉంటుంది. తనకు బానిస అయ్యేలా చేసుకోవడానికి నికోటిన్ ప్రతీతి. మందుల భద్రత విషయంలో ప్రామాణికమైన అమెరికాలోని అత్యున్నత సంస్థ ఎఫ్‌డీఏ విశ్లేషణల ప్రకారం... ఈ–సిగరెట్‌లోనూ గుర్తించగల స్థాయిలో క్యాన్సర్ కారకాలూ, విషపూరిత రసాయనాలూ ఉన్నాయి. ఈ–సిగరెట్లో కాటరిడ్జ్లో డీ–ఇథైల్ గ్లైకాల్ అనే విషపూరిత పదార్థం, నైట్రోజమైన్స్ అనే క్యాన్సర్ కారకాలు ఉన్నాయి. పైగా ఎన్నో రకాల కాలుష్యాలు సైతం ఈ–సిగరెట్ ద్వారా శరీరంలోకి వెళ్తుంటాయి. ఈ పొగను లోపలికి పీల్చినప్పుడు అది మామూలు సిగరెట్లలాగే గొంతు, ఊపిరితిత్తుల్లో దీర్ఘకాలిక మంట, ఇన్ఫెక్షన్లను (క్రానిక్ ఇన్ఫ్లమేషన్ను) కలిగిస్తుంది. ఇలా పొగ పీల్చడం దీర్ఘకాలం పాటు కొనసాగితే అది ఈ–సిగరెట్ పొగ అయినా సరే... కొన్నాళ్ల తర్వాత బ్రాంకైటిస్, ఎంఫసిమా, గుండెజబ్బుల వంటి వ్యాధులకు కారణమవుతుంది. కాబట్టి ఈ–సిగరెట్ మామూలు సిగరెట్ కంటే చాలా సురక్షితౖమేమీ కాదు. పైగా ఏ సిగరెట్ అయినప్పటికీ అందులోని పొగ వల్ల సిరలు, ధమనులు చాలా ఎక్కువగా ధ్వంసమవుతాయి. ఈ పరిణామమే ఆ తర్వాత గుండెజబ్బులకు దారితీస్తుంది. ఇక ఈ–సిగరెట్‌లోని పొగలో మామూలు సిగరెట్లో పోలిస్తే రసాయనాల సంఖ్య కొంచెం తగ్గితే తగ్గుతుండవచ్చు. అంతమాత్రాన అది మామూలు సిగరెట్ కంటే సురక్షితం అని కచ్చితంగా చెప్పడానికి ఆస్కారం లేదు. దీర్ఘకాలంలో మామూలు సిగరెట్‌తో వచ్చే దాదాపు అన్ని రకాల దుష్పరిణామాలూ ఈ–సిగరెట్‌తోనూ వస్తాయి. ఈ–సిగరెట్‌లోనూ ఉండేది నికోటినే కాబట్టి దానికి బానిసై మళ్లీ మీరు ఈ–సిగరెట్‌కు అలవాటు పడతారు. మీరు సిగరెట్ వదిలేయదలిస్తే... ఒక్కసారిగా వదిలేయడం. మానేయగానే కాస్త చిరాకు, కోపం, నిస్పృహ, అస్థిమితంగా ఉండటం వంటి కొన్ని తాత్కాలిక లక్షణాలు కనిపించినా, దీర్ఘకాలంలో సిగరెట్ మానేయడం వల్ల కలిగే ప్రయోజనాల సంఖ్య చాలా ఎక్కువ. కాబట్టి ఈ–సిగరెట్ సహాయంతో కాకుండా వెంటనే మీరు పొగతాగడం మానేయడం చాలా మంచిది.డాక్టర్ రమణ ప్రసాద్కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్, స్లీప్ స్పెషలిస్ట్,కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
ఈ-సిగరెట్టూ ‘పొగ’ పెడుతుంది!
ధూమపానం జీవితానికే పొగ పెడుతుంది. ఇది తెలిసినా మానలేని పరిస్థితి. ఈ వ్యసనాన్ని మాన్పించేందుకంటూ ఇటీవల ఈ-సిగరెట్లు విస్తృతంగా వాడకంలోకి వస్తున్నాయి. అయితే, వీటితోనూ ముప్పు అధికమేనన్న ఆందోళన లు వ్యక్తమవుతున్నాయి. దేశంలో తొలుత పంజాబ్, ఇటీవల మహారాష్ట్ర వీటిపై నిషేధం విధించాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ-సిగరెట్లపై నిషేధం విధించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ సిగరెట్ల గురించి పలు సంగతులు... ఎలా హానికరం..? కేన్సర్ కారక ఫార్మాల్డిహైడ్ వంటివి ఈ-సిగరెట్లలోనూ ఉంటాయి. వీటిలోనూ నికోటిన్ ఉంటుంది. దీనివల్ల గుండెజబ్బులు వస్తాయి. ఈ-సిగరెట్‌లోని నికోటిన్ లిక్విడ్‌ను వేగంగా ఖాళీ చేస్తే.. శరీరంలో వణుకు పుడుతుంది. కండరాలు పట్టు తప్పుతాయి. కోమాలోకి వెళ్లి, మరణించే ప్రమాదమూ ఉంటుంది. నోటి ద్వారా 30-60 మి.గ్రా. నికోటిన్‌ను తీసుకుంటే చాలు.. పక్షవాతంతో ఊపిరితిత్తులు విఫలమై చనిపోతారు. 10 మి.గ్రా. నికోటిన్ కూడా పిల్లల ప్రాణాలు హరిస్తుంది. వీటిని వాడటం అంటే.. ధూమపానాన్ని కొనసాగించడమేనని నిపుణులు చెబుతున్నారు. ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్స్-ఎండ్స్(ఈ-సిగరెట్లు)కు ప్రాచుర్యం పెరగడం అనేది.. ధూమపానం మాన్పించేందుకు ఏళ్ల తరబడి జరిగిన శ్రమను బలహీనం చేస్తోంది. సాధారణ సిగరెట్లలో ఉండే టార్ వంటి విషపూరిత ఉప ఉత్పన్నాలు, పొగ ఎండ్స్‌లో ఉండవన్న వాదన ఉంది. కానీ వాస్తవమేంటంటే ఎండ్స్పై జరిగిన పరిశోధనలు చాలా తక్కువ. ఈ-సిగరెట్లు ‘పొగ మానిపించేందుకు ఉత్తమ పరికరాలు’ అన్నది కచ్చితంగా తేలలేదు. యువతను బాగా ఆకర్షిస్తున్న ఎండ్స్‌కు వివిధ ఫ్లేవర్లను జోడించడాన్ని నిషేధించాలి. బహిరంగ ప్రదేశాలు, పనిచేసే చోట ఎండ్స్ వాడకాన్ని నిషేధించాలి. పొగ తాగనివారు, టీనేజ్ పిల్లలు వీటి బారిన పడకుండా ఉండేందుకు గాను వీటి ప్రకటనలకు పరిమితులు విధించాలి. ఏ దేశంలో ఎలా..? కెనడా : ఈ-సిగరెట్లు వ్యక్తిగతంగా వినియోగించవచ్చు. కానీ మార్కెట్లో అమ్మడం నిషిద్ధం. కొరియా : పొగాకు ఉత్పత్తుల మాదిరిగానే వీటిపైనా పన్ను ఉంటుంది. భారత్ : పాన్‌షాపులలో విక్రయిస్తున్నారు. పంజాబ్, మహారాష్ట్ర నిషేధించాయి. నిషేధంపై కేంద్రం యోచిస్తోంది. బ్రెజిల్, చైనా : ఈ-సిగరెట్లు చట్ట వ్యతిరేకం. ఐరోపా : బహిరంగంగా దుకాణాల్లో అమ్ముతారు. కానీ ప్రకటనలు మాత్రం నిషేధం. మరికొన్ని విశేషాలు... సాధారణ సిగరెట్లతో పోల్చితే ఈ-సిగరెట్లు మూడు రెట్లు చౌక. ఒక ఈ-సిగరెట్ ధర రూ. 500-3,000. ఆరు నెలలు పనిచేస్తుంది. సిగరెట్లో వాడే ఫ్లేవర్ లిక్విడ్‌కు నెలకు రూ. 1,000 ఖర్చవుతుంది. మింట్, చాకొలేట్, స్ట్రాబెర్రీ, పొగాకు ఫ్లేవర్లలో లిక్విడ్ లభిస్తుంది. ప్రతి ఈ-సిగరెట్లో 2 మిల్లీలీటర్ల లిక్విడ్ ఉంటుంది. ఈ-సిగరెట్లలో ఆవిరిని పీల్చుకోవడాన్ని ‘వ్యాపింగ్’ అంటారు. 2 ఎంఎల్ లిక్విడ్‌తో వందసార్లు వ్యాప్ చేయొచ్చు.