ధూమపానం జీవితానికే పొగ పెడుతుంది. ఇది తెలిసినా మానలేని పరిస్థితి. ఈ వ్యసనాన్ని మాన్పించేందుకంటూ ఇటీవల ఈ-సిగరెట్లు విస్తృతంగా వాడకంలోకి వస్తున్నాయి. అయితే, వీటితోనూ ముప్పు అధికమేనన్న ఆందోళన లు వ్యక్తమవుతున్నాయి. దేశంలో తొలుత పంజాబ్, ఇటీవల మహారాష్ట్ర వీటిపై నిషేధం విధించాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ-సిగరెట్లపై నిషేధం విధించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ సిగరెట్ల గురించి పలు సంగతులు...
ఎలా హానికరం..?
కేన్సర్ కారక ఫార్మాల్డిహైడ్ వంటివి ఈ-సిగరెట్లలోనూ ఉంటాయి. వీటిలోనూ నికోటిన్ ఉంటుంది. దీనివల్ల గుండెజబ్బులు వస్తాయి. ఈ-సిగరెట్‌లోని నికోటిన్ లిక్విడ్‌ను వేగంగా ఖాళీ చేస్తే.. శరీరంలో వణుకు పుడుతుంది. కండరాలు పట్టు తప్పుతాయి. కోమాలోకి వెళ్లి, మరణించే ప్రమాదమూ ఉంటుంది. నోటి ద్వారా 30-60 మి.గ్రా. నికోటిన్‌ను తీసుకుంటే చాలు.. పక్షవాతంతో ఊపిరితిత్తులు విఫలమై చనిపోతారు. 10 మి.గ్రా. నికోటిన్ కూడా పిల్లల ప్రాణాలు హరిస్తుంది. వీటిని వాడటం అంటే.. ధూమపానాన్ని కొనసాగించడమేనని నిపుణులు చెబుతున్నారు.
ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్స్-ఎండ్స్(ఈ-సిగరెట్లు)కు ప్రాచుర్యం పెరగడం అనేది.. ధూమపానం మాన్పించేందుకు ఏళ్ల తరబడి జరిగిన శ్రమను బలహీనం చేస్తోంది. సాధారణ సిగరెట్లలో ఉండే టార్ వంటి విషపూరిత ఉప ఉత్పన్నాలు, పొగ ఎండ్స్‌లో ఉండవన్న వాదన ఉంది. కానీ వాస్తవమేంటంటే ఎండ్స్‌పై జరిగిన పరిశోధనలు చాలా తక్కువ. ఈ-సిగరెట్లు ‘పొగ మానిపించేందుకు ఉత్తమ పరికరాలు’ అన్నది కచ్చితంగా తేలలేదు. యువతను బాగా ఆకర్షిస్తున్న ఎండ్స్‌కు వివిధ ఫ్లేవర్లను జోడించడాన్ని నిషేధించాలి. బహిరంగ ప్రదేశాలు, పనిచేసే చోట ఎండ్స్ వాడకాన్ని నిషేధించాలి. పొగ తాగనివారు, టీనేజ్ పిల్లలు వీటి బారిన పడకుండా ఉండేందుకు గాను వీటి ప్రకటనలకు పరిమితులు విధించాలి.
ఏ దేశంలో ఎలా..?
కెనడా : ఈ-సిగరెట్లు వ్యక్తిగతంగా వినియోగించవచ్చు. కానీ మార్కెట్లో అమ్మడం నిషిద్ధం.
కొరియా : పొగాకు ఉత్పత్తుల మాదిరిగానే వీటిపైనా పన్ను ఉంటుంది.
భారత్ : పాన్‌షాపులలో విక్రయిస్తున్నారు. పంజాబ్, మహారాష్ట్ర నిషేధించాయి. నిషేధంపై కేంద్రం యోచిస్తోంది.
బ్రెజిల్, చైనా : ఈ-సిగరెట్లు చట్ట వ్యతిరేకం.
ఐరోపా : బహిరంగంగా దుకాణాల్లో అమ్ముతారు. కానీ ప్రకటనలు మాత్రం నిషేధం.
మరికొన్ని విశేషాలు...
- సాధారణ సిగరెట్లతో పోల్చితే ఈ-సిగరెట్లు మూడు రెట్లు చౌక.
- ఒక ఈ-సిగరెట్ ధర రూ. 500-3,000. ఆరు నెలలు పనిచేస్తుంది.
- సిగరెట్‌లో వాడే ఫ్లేవర్ లిక్విడ్‌కు నెలకు రూ. 1,000 ఖర్చవుతుంది.
- మింట్, చాకొలేట్, స్ట్రాబెర్రీ, పొగాకు ఫ్లేవర్లలో లిక్విడ్ లభిస్తుంది.
- ప్రతి ఈ-సిగరెట్‌లో 2 మిల్లీలీటర్ల లిక్విడ్ ఉంటుంది.
- ఈ-సిగరెట్లలో ఆవిరిని పీల్చుకోవడాన్ని ‘వ్యాపింగ్’ అంటారు.
- 2 ఎంఎల్ లిక్విడ్‌తో వందసార్లు వ్యాప్ చేయొచ్చు.