ఆయుర్వేద కౌన్సెలింగ్ | Ayurvedic counseling | Sakshi
Sakshi News home page

ఆయుర్వేద కౌన్సెలింగ్

Published Mon, Jul 27 2015 10:56 PM | Last Updated on Sun, Sep 3 2017 6:16 AM

Ayurvedic counseling

వళ్లంతా పులిపిర్లు... తగ్గేదెలా?
 
నా వయసు 47. శరీరంలో చాలా చోట్ల పులిపిర్లు మొలిచాయి. ఇవి తగ్గటానికి ఆయుర్వేద మందులు తెలియజేయగలరు.
 - యాదయ్య, నల్గొండ


ఆయుర్వేద పరిభాషలో వీటిని ‘చర్మకీల’ అంటారు. కలబంద ఆకుని కావలసిన పరిమాణంలో ముక్కలుగా కోసి పులిపిరులపై ఉంచి కట్టుకట్టాలి లేదా చింతాకు రసం, కొంచెం సైంధవ లవణం కలిపి ముద్దగా నూరి లేపనంగా వాడుకోవచ్చు. ఇలా చేస్తే 5 రోజులలో అవి రాలిపోయి నున్నటి చర్మం వస్తుందని శాస్త్రోక్తం. శారిబాద్యాసవ ద్రావకం 4 చెంచాలు తీసుకుని సమానంగా నీళ్లు కలిపి రోజూ రెండుపూటలా ఒక నెలరోజులు తాగాలి.
 
నా వయసు 22. గత ఆరు నెలలుగా నా శిరోజాలు రాలిపోతున్నాయి. అందువల్ల జుత్తు పల్చబడిపోతోంది. మంచి మందులు, సలహాలు సూచించ ప్రార్థన.
 - అర్చన, హైదరాబాద్


 తలమీద వచ్చే చుండ్రువంటి స్థానిక వికారాలు, అన్ని రకాలైన విటమిన్లు, ప్రొటీన్లు, ఖనిజధాతువులతో కూడిన పోషకాహార లోపాలు, మానసిక ఒత్తిడి, తగినంత నిద్ర, విశ్రాంతి లేకపోవడం మొదలైనవి జుత్తు రాలిపోవటానికి ముఖ్య కారణాలు. కారణాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. రెండు నెలలపాటు ఈ దిగువన వివరించిన సలహాలు పాటించండి. ఫలితం కనపడుతుంది.

 ఆహారంలో ఆకు కూరలు, మునగకాడలు, క్యారట్, బీట్‌రూట్ సమృద్ధిగా తీసుకోవాలి. ముడిబియ్యం చాలా మంచిది. చేపలు, మాంసరసం, కోడిగుడ్లు ప్రయోజనకరం. బొప్పాయి, అరటి, సీతాఫలాల వంటి తాజా పళ్లు, జీడిపప్పు, బాదం వంటి శుష్కఫలాలు తగు ప్రమాణంలో సేవించాలి. ఆరేడుగంటలపాటు రాత్రి నిద్రపోవాలి. రోజూ కనీసం ఐదులీటర్ల నీరు తాగాలి. వ్యాయామం, ప్రాణాయామం తప్పనిసరిగా ఆచరించండి. రోజూ ఒక లీటరు ఆవుపాలు తాగండి. కొంతకాలం పాటు షాంపూలు వాడటం మానేసి కుంకుడుకాయ, షీకాకాయ పొడులతోటే స్నానం చేయండి. మీకు ఎలర్జీ కలిగించే మందులను వాడవద్దు.

 నీలిభృంగాది తైలాన్ని రోజూ తలనూనెగా వాడండి. కొంతకాలం తర్వాత స్వచ్ఛమైన కొబ్బరినూనెను వాడుకోవచ్చు. పునర్నవాది మండూర మాత్రలు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి. భృంగరాజాసవ ద్రావకం నాలుగు చెంచాల మందుకి సమానంగా నీళ్లు కలిపి రెండుపూటలా తాగాలి. గురివింద గింజల చూర్ణాన్ని నీళ్లతో ముద్దగా చేసి తలపై రాసుకుని, ఓ అరగంట తర్వాత స్నానం చేస్తే జుత్తు రాలటం చాలా త్వరగా తగ్గుతుంది.
 
 డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
 ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement