
అజహరుద్దీన్‌కు ఒక్కొక్కటిగా అర్థమవుతున్నాయా?
పాత గాయం
సినిమా వేరు... జీవితం వేరు... సెలబ్రిటీ జీవితం వేరు... పబ్లిక్‌లోకి వచ్చి, సామాన్యుడిలా నిలబడడం వేరు.... మనకు నోటికొచ్చింది మీడియా మీట్‌లో చెప్పేసి వెళ్ళిపోవడం వేరు... ప్రత్యేక ఇంటర్వ్యూకు ఒప్పుకొని, అడిగిన ప్రశ్నకల్లా జవాబు చెప్పగలగడం వేరు. క్రికెటర్‌గా పేరు తెచ్చుకొని, భారత క్రికెట్ జట్టుకు సారథిగా కూడా వెలిగిన మహమ్మద్ అజహరుద్దీన్‌కు ఈ విషయాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా అర్థమవుతున్నాయా? వరుస చూస్తుంటే, అలాగే అనిపిస్తోంది.
అజహరుద్దీన్ జీవితంపై తాజాగా హిందీలో ‘అజహర్’ అనే సినిమా వస్తోంది. ఇమ్రాన్ హష్మీ ప్రధానపాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ఈ శుక్రవారమే విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా చిత్ర ప్రచారం కోసం అజహర్ ఇప్పుడు వరుసపెట్టి బోలెడన్ని ప్రెస్‌మీట్లలో మాట్లాడుతున్నారు. అడిగినవాడికి లేదనకుండా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే అలాంటి ఒక ఇంటర్వ్యూ ఆయనకు కొరకరాని కొయ్యగా మారింది. అజహర్ క్రికెట్ ఆడుతున్న సందర్భంలో తలెత్తిన మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం గురించి సదరు ఇంటర్వ్యూలో లోతైన ప్రశ్నలు వేశారట!
మాల్కమ్ మార్షల్, కోట్నీ వాల్ష్ లాంటి ఫాస్ట్‌బౌలర్ల బౌలింగ్‌ను కూడా సమర్థంగా ఎదుర్కొన్న అజహర్ ఈ వాడి వేడి ప్రశ్నల బంతులకు మాత్రం చేతులెత్తేశారు. ఆ ఇంటర్వ్యూ నుంచి వాకౌట్ చేశారు. ఇంటర్వ్యూ చేస్తున్నవాళ్ళు పదే పదే అభ్యర్థించినా మళ్ళీ వచ్చి కూర్చోలేదు, ఇంటర్వ్యూ కొనసాగించలేదు. విచిత్రం ఏమిటంటే బౌన్సర్ల లాంటి ప్రశ్నల్ని ఎదుర్కోవాల్సి వస్తుందనే అనుమానంతో మరో న్యూస్ ఛానల్ నిర్వహించే ఒక పెద్ద టీవీ షోకు కూడా మన హైదరాబాదీ క్రికెటర్ నో చెప్పేశారట.
‘జవాబివ్వడానికి తడుముకోవాల్సి వచ్చే ప్రశ్నలు ఎవరైనా అడగడం ఆయనకు ఇష్టం లేదు. అందుకే, ఆ టీవీ షోకైనా, ఈ ఇంటర్వ్యూకైనా ఆయన దూరంగానే ఉండిపోయారు’ అని ఆంతరంగిక వర్గాలు చెప్పాయి. ఎంతైనా ఇంటర్వ్యూలో సంధించే లోతైన ప్రశ్నల్ని తట్టుకోవడం మైదానంలో క్రికెట్ ఆడినంత సులభం కాదని అజహరుద్దీన్ తాజాగా అనుభవంలోకి వచ్చినట్లుంది!