బస్తీమే బాబా దంగల్ విత్ రెపెషాజ్
రామ్‌దేవ్ తెలిసిన మనిషే. హిందూ బాబా. మరి ఈ రెపెషాజ్ ఎవరు? ముస్లిం బాబానా? కాదు. రెపెషాజ్ అసలు మనిషే కాదు. అంటే.. రాక్షసుడు అని కాదు. రెపెషాజ్ అనేది ఇంగ్లిష్ మాట. స్పెల్లింగ్ వచ్చేసి repechage. దాటించడం అని అర్థం. గట్టెక్కించడం అని కూడా. కొన్ని ఆటల్లో రెపెషాజ్ ఉంటుంది. బాగా ఆడి కూడా గెలవలేకపోయిన ఆటగాడిని గట్టెక్కించడం కోసం ఫైనల్‌లో ఓ చాన్స్ ఇస్తారు. ఇంచుమించు అది ‘వైల్డ్‌కార్డ్ ఎంట్రీ’ లాంటిది. స్పెషల్‌గా సెలక్ట్ అయిపోవడం.
రామ్‌దేవ్ బాబా.. ఇక్కడ రెజ్లింగ్‌లో తలపడుతున్నది ఆండ్రీ స్టాడ్నిక్‌తో. 2008 ఒలింపిక్స్‌లో స్టాడ్నిక్ సిల్వర్ మెడలిస్టు. ఆ మెడలిస్టు మెడలు వంచి 12–0 స్కోర్‌తో విన్ అయిపోయారు బాబా! పతంజలి పవరీటా ప్రో రెజ్లింగ్ లీగ్ (పి.డబ్లు్య.ఎల్) ప్రమోషనల్ బౌట్ (మ్యాచ్) ఇది. మొన్న బుధవారం న్యూఢిల్లీలో జరిగింది.
బాబా మీద పోటీకి సాహసించిన ఆండ్రీ స్టాడ్నిక్ తక్కువవాడేమీ కాదు. బీజింగ్ ఒలింపిక్స్‌లో మన స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌ను గిరగిర తిప్పి ఎత్తి పడేసినవాడు. ఆండ్రీది ఉక్రెయిన్. ఉక్రెయిన్ సుశీల్‌కు రెపెషాజ్ ఇవ్వడంతో అప్పట్లో అతడికి ఫైనల్‌లో ఆండ్రీతో పోటీ పడే అవకాశం వచ్చింది. కాంస్యమూ వచ్చింది.
అంతటి ఆండ్రీని ఇప్పుడు రామ్‌దేవ్ బాబా తలకిందులుగా తిప్పి కుదేలు చేసేశాడు. 34 ఏళ్ల గండరగండడిని 51 ఏళ్ల రామ్‌దేవ్ బాబా ఎలా ఓడించాడబ్బా?!
ఫ్రెండ్లీ మ్యాచ్‌లో ఓడిపోవడమే గెలుపు. అలా ఆండ్రీ గెలిచి, బాబాను గెలిపించారు.
ఇదో రకం రెపెషాజ్.