
బేబీస్ నైట్ అవుట్
చదివింత...
‘‘లేడికి లేచిందే పరుగు... చిన్నారి అడిగిందో డ్రింకు’’ అంటూ ఆశ్చర్యపోయారు బస్సులోని సహప్రయాణీకులంతా. ఫిలడెల్ఫియాలో నివసించే నాలుగేళ్ల చిన్నారి అన్నాబెల్లెకి తెల్లవారుఝామున 3 గంటలకు మెలకువ వచ్చింది. అర్జంటుగా తనకెంతో ఇష్టమైన ఫ్రోజెన్ డ్రింక్ తాగాలనిపించింది. వెంటనే రెయిన్‌కోట్ వేసేసుకుని మరీ బయటకు వచ్చేసింది. దారిలో కనపడిన బస్సు ఎక్కేసింది. సీట్లో కూచుని కాళ్లూపుతూ ‘‘నాకో స్లాషీ (మంచుతో కప్పిన కూల్‌డ్రింక్) కావాలి’’ అంటూ ఆర్డరేసింది.
ఆ చిన్నారి ఎవరో ఏమిటో అర్ధం కాక తికమకపడిన బస్సు ప్రయాణికులు విషయాన్ని బస్ డ్రైవర్ చెవిలో ఊదారు. దీంతో డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ముందుగా ఆ బుడతని ఒక హాస్పిటల్‌కి తీసుకెళ్లి అక్కడ నుంచి తల్లిదండ్రులకు అప్పజెప్పారు. అసలు అప్పటిదాకా పాప బయటకు వెళ్లిందనే విషయమే గమనించని తల్లి జాక్లిన్ మేజర్...‘‘ఊహించలేకపోతి నీ ‘పోక’... ఊపిరులూదింది నీ రాక’’ అంటూ అన్నాబెల్లిని అక్కున చేర్చుకుందట.
సత్యవర్షి