నడకే... నడత! | Back to School | Sakshi
Sakshi News home page

నడకే... నడత!

Published Fri, Jun 2 2017 10:37 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

నడకే... నడత! - Sakshi

నడకే... నడత!

బ్యాక్‌ టు స్కూల్‌

హాలిడేస్‌ అయిపోతున్నాయి.బ్యాగు, బుక్స్‌ సర్దుకోవాల్సిన టైమ్‌ దగ్గరకొచ్చింది.పిల్లల్ని స్కూల్‌ మూడ్‌లోకి తేవాలి.ఉదయాన్నే లేవడం అలవాటు చేయాలి.ఇవన్నీ చేస్తుంటాం... కానీ రోడ్‌ సేఫ్టీ గుర్తు చేయడం మాత్రం మర్చిపోతుంటాం.అందుకే... మీ పిల్లలకు రోడ్‌రూల్స్‌ను ఓ సారి గుర్తు చేస్తారా?

రోడ్డు మీద నడవడం తప్పు, ఫుట్‌పాత్‌ మీదనే నడవాలి.సైన్‌బోర్డులను అనుసరించాలి.జీబ్రా క్రాసింగ్‌ చారల మీదనే రోడ్డుదాటాలి.రోడ్ల మీద ఆటలు ఆడకూడదు. రోడ్డు మీద నడుస్తున్నప్పుడు సెల్‌ఫోన్‌లను వాడరాదు.ఎక్కువ మంది పిల్లలు నడుస్తున్నప్పుడు అడ్డదిడ్డంగా కాకుండా ఒకరి వెనుక ఒకరు వెళ్లాలి.రోడ్డు మలుపు దగ్గర రోడ్డు దాటకూడదు. మరికొంత ముందుకెళ్లి దూరంగా వస్తున్న వాహనాలు కూడా కనిపించే స్థితిలోనే దాటాలి. ఒకరిద్దరు పిల్లలకు చెప్పడమే కాదు... స్కూళ్లకు వెళ్లి మరీ పిల్లలకు నేర్పిస్తున్నారు రమాదేవి. వీటితోపాటు సైకిల్‌ తొక్కేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా చెబుతుంటారామె.

‘‘తల్లిదండ్రులు... పిల్లలను ఏ బడిలో చేర్చాలి, ఎక్కడ బాగా చదువు చెబుతారు. ఎక్కడైతే పిల్లాడు చక్కగా చదువుకోగలుగుతాడు. ఇలా ఎన్నో ఎన్నెన్నో ఆలోచిస్తారు. అంతకంటే ముఖ్యమైనది పిల్లల రక్షణ.  పిల్లలు రోడ్డుపై ఎలా నడుస్తున్నారు. రోడ్డు పక్కన నడుస్తున్నారా మధ్యలో నడుస్తున్నారా... వంటివి పెద్దగా పట్టించుకోరు’’ అంటారు స్కేప్స్‌ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు ముత్యాల రమాదేవి. కొన్నిసార్లు ఈ అజాగ్రత్తే పిల్లల ప్రాణాలమీదికి తెస్తుంది. అందుకే పిల్లల్లో రోడ్‌ సేఫ్టీ పట్ల అవేర్‌నెస్‌ తేవాలని ఈ పని చేస్తున్నానంటారు రమాదేవి.

ఆలోచనకు నాంది!
వాహనాల సంఖ్య పెరిగింది. వాహనాల వేగం పెరిగిపోయింది. ఎవరు ఎప్పుడు ఎక్కడ ప్రమాదానికి గురవుతారో చెప్పలేం. అందుకు తన జీవితంలో జరిగిన ఘటనను ఉదహరిస్తారు రమాదేవి. హైదరాబాద్‌లో ఉంటున్న రమ బంధువు ఒకరు 2007, సెప్టెంబర్‌ ఆరో తేదీ అర్ధరాత్రి రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయారు. ఈ ఘటన ఆ కుటుంబానికి పెను విషాదాన్ని మిగిల్చింది. ఆ ప్రమాదమే రోడ్‌ సేఫ్టీ అవేర్‌నెస్‌ ఆలోచనకు బీజం వేసింది. ప్రమాదాలను పూర్తిగా అరికట్టడం సాధ్యం కాకపోవచ్చు. అయితే ప్రజలకు ప్రమాదాలపై అవగాహన పెంచే గట్టి ప్రయత్నమంటూ జరిగితే ప్రమాదాలను తగ్గించవచ్చని రమ, నరేంద్ర దంపతులు ఈ ప్రయత్నం మొదలు పెట్టారు. ఆ ఆలోచనలకు ప్రతిరూపమే స్కాప్స్‌ (సొసైటీ టు క్రియేట్‌ అవేర్‌నెస్‌ ఆన్‌ పబ్లిక్‌ సేఫ్టీ). ఈ సంస్థను అదే నెల 25వ తేదీన ఏర్పాటుచేశారు.

లక్ష్యం ఏమిటంటే...
వాక్‌ రైట్‌ ప్రోగ్రాం కింద ప్రభుత్వ పాఠశాలలకు చెందిన లక్ష మంది విద్యార్థులకు రోడ్డు భద్రత పట్ల అవగాహన కల్పించాలనేది వీరి లక్ష్యం. ఇప్పటికే ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదు వేల మంది విద్యార్థులకు అవగాహన కలిగించారు. రోడ్‌అండ్‌ జనరల్‌ సేఫ్టీ ఎడ్యుకేషన్‌’ మెటీరియల్‌ను తమిళం, తెలుగు, హిందీ భాషలలో ప్రచురించారు. ‘పబ్లిక్‌ సేఫ్టీ ఇండియా.కామ్‌’వెబ్‌సైట్‌లో ఇ–బుక్స్, పోస్టర్లు, లఘుచిత్రాలు, డూ ఇట్‌ యువర్‌సెల్ఫ్‌ కిట్‌ (డీఐవై) లను అందుబాటులో ఉంచారు. వీటిని ఫ్రీగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

మున్ముందు...
రోడ్డు భద్రత అంశంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, వెబ్‌సైట్‌ని అన్ని ప్రాంతీయ భాషల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చి దేశపౌరులకు రోడ్డు, సాధారణ భద్రతపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలతో స్కేప్స్‌ సేవలను విస్తరించనున్నారు.


స్కేప్స్‌ ఏమేం చేస్తోంది?
∙గత ఏడాది... రహదారులు, బహిరంగ ప్రదేశాలను వినియోగించుకునే క్రమంలో తోటివారితోపాటు వాహనదారులకు ఇబ్బంది కలగకుండా నడక సాగించే విధానాన్ని బడిపిల్లలకు బోధించాలనే ఉద్దేశంతో ‘వాక్‌ రైట్‌’ కార్యక్రమాన్ని ‘డూ ఇట్‌ యువర్‌సెల్ఫ్‌’ కిట్‌తో రూపొందించింది.‘నడిచే హక్కుతో బాధ్యతగా నడుద్దాం’ అనే నినాదంతో ఓ స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. బాధ్యతగా నడుస్తామంటూ భావిభారత పౌరులతో ప్రమాణం చేయిస్తారు.2016లో శివరాత్రి పండుగను సోషియో–స్పిరిచ్యువల్‌ ఈవెంట్‌గా నిర్వహించింది.

∙2014లో వరలకష్మ వ్రతం సందర్భంగా ఇరుగుపొరుగువారితోపాటు తెలిసిన మహిళలను ఇంటికి పిలిపించి రోడ్డు ప్రమాదాలు,తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జనరల్‌ సేఫ్టీకి సంబంధించి అవగాహన కల్పించింది.2011లో శివరాత్రి సందర్భంగా కీసరలో అటువంటి మరో డెమో క్యాంపు నిర్వహించింది.2010లో మేడారం జాతర సందర్భంగా అక్కడ బ్యానర్లు ఏర్పాటుచేసి పిల్లలు తప్పిపోకుండా ఉండేందుకు, తొక్కిసలాట జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించింది.

– కొల్లూరి

ప్రమాదాలను తగ్గించడం సాధ్యమే!
ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులను గుర్తించి వారికి ఈ కార్యక్రమం ముఖ్యేద్దేశాన్ని తెలియజేస్తాం. ‘డూ ఇట్‌ యువర్‌సెల్ప్‌’ కిట్లు, పోస్టర్లు, సైన్‌బోర్డులు, పుస్తకాలు, లఘుచిత్రాల సీడీలు పంపిస్తాం. పిల్లలకు లఘుచిత్రం ద్వారా ఈ కిట్‌ని ఎలా వినియోగించాలనే దానిపై అవగాహన కల్పిస్తాం. డీఐవై కిట్‌లోని అంశాల ప్రాతిపదికగా ‘పెడస్టియ్రన్స్‌–జనరల్‌ పబ్లిక్‌ రోడ్‌ సేఫ్టీ గురించి సమగ్రంగా వివరిస్తాం. కార్యక్రమం ముగింపులో భాగంగా విద్యార్థులు పిల్లలతో ప్రతిజ్ఞ చేయిస్తాం. ?ప్రతిజ్ఞ కార్డు ?ప్రతి రోజూ కనిపించేలా ఎదురుగా ఉంచుకోవాలి. ఈ కార్యక్రమం నిర్వహించే విధానాన్ని ఒక వివరణాత్మక నోట్‌తోపాటు మూడు నిమిషాల నిడివిగల వీడియో కాప్సూల్స్‌ద్వారా వివరిస్తున్నాం. పిల్లలకు నేర్పిస్తే భవిష్యత్తు తరంలో ప్రమాదాలను నివారించవచ్చనేది మా ఉద్దేశం.
– ఎం. రమాదేవి,స్కేప్స్‌ నిర్వహకురాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement