
బాగ్‌నగర్- సిటీ ఆఫ్ గార్డెన్స్
ఇబ్రహీం కాలంలో (1556) విజయనగరం పతనమైంది. హంపిలో కొల్లగొట్టిన అపారమైన సంపద గోల్కొండ చేరింది. ఇబ్రహీం చివరిరోజుల నుంచి అతని వారసుడు మహమ్మద్ కులీ పరిపాలనా కాలం వరకూ గోల్కొండ చరిత్రలో స్వర్ణయుగం అని చరిత్రకారులు భావిస్తారు. అహ్మద్‌నగర్ పతనం, అక్బర్ చక్రవర్తితో సంధి, బీజాపూర్ సుల్తాన్‌తో స్నేహ సంబంధాలు ఆనాటి తెలంగాణలో శాంతి సౌఖ్యాలు నెలకొల్పాయి. నిర్మాణాలు ఊపందుకున్నాయి.
విస్తరించిన గోల్కొండ చుట్టూ మరో కోటగోడ నిర్మాణమైంది (ఖుతుబ్‌షాహీ సమాధుల వద్ద నయాఖిల్లా అదే). మూసీనదికి దక్షిణాన మరో మహానగరానికి పునాదులు పడ్డాయి. నేటి పురానాపూల్ నుంచి లాడ్ బజార్‌కి సమానాంతరంగా కారవాన్ రాస్తాకి రెండువైపులా విస్తారమైన తోటలు, మహళ్ళతో కొత్త లేఔట్ వేయబడింది. దాన్నే ‘సిటీ ఆఫ్ గార్డెన్స్- బాగ్‌నగర్’ అన్నారు. నాలుగు మినార్లతో ఖుతుబ్‌షాహి ప్రతిష్టని ఇనుమడించేలా చార్‌మినార్ నిర్మించబడింది. 20 వేల మంది వడ్డె, ఉప్పర కార్మికులతో మక్కామిసీద్ నిర్మాణం ప్రారంభమైంది.
ఈ కాలంలోనే మధ్య ఆసియాకి చెందిన ముస్లింలు అనేకమంది ఇండియాకి వలసవచ్చారు. వారిని ‘అఫాకీలు’ అనేవారు. సుల్తాన్లు సైన్యంలో, అధికార యంత్రాంగంలో అటువంటివారి మీదే ఎక్కువగా ఆధారపడ్డట్లు కనిపిస్తుంది. అయితే ప్రజ్ఞ ఉన్న హిందువులకి పదవులు ఇవ్వలేదనటానికి వీలులేదు. అక్కన, మాదనల వంటి అనేకులు పెద్దపెద్ద పదవులు చేపట్టారు. రాజకీయాలని నిర్దేశించారు. అలా వచ్చిన ముస్లిం బృందాలు ఎలా జనస్రవంతిలో కలిసిపోయాయో చెప్పేందుకు వేమన రాశాడని చెబుతున్న ఒక పద్యం ఉంది.
షేకు సైదు మొగలలు చెలగి పఠానులు తురుకులు దొరతనము తొలుత చేసి రాగరాగ విడిచి రౌతులై కొలిచిరి విశ్వదాభిరామ వినుర వేమా! కుతుబ్ షాహీ సుల్తానులు తెలుగు భాషని కూడా ఆదరించారు. ఇబ్రహీం కులీ ఆస్థానాన్ని వేదపురాణశాస్త్ర విద్వాంసులు అలంకరించినట్లు అద్దంకి గంగాధరుడు తన ‘తపతీ సంవరణోపాఖ్యానం’ అనే గ్రంథంలో చెప్పాడు. ఇబ్రహీం కులీని ‘మల్కిభరాముడ’ని ప్రస్తుతించే అనేక చాటువులు దొరికాయి. గోల్కొండలో మజ్లీస్ దివాన్‌దారీ అనే పరిషత్తులో తెలుగు పండితులకి కూడా చోటు ఉండేది.
నాటి తెలంగాణ రాజ్యం ఇప్పటి కోస్తాంధ్రలో పూర్తిగా విస్తరించింది. తూర్పు ఆసియా దీవులు కేంద్రంగా డచ్చి, ఇంగ్లిష్ వర్తకులు పోర్చుగీసులో వాణిజ్యానికి పోటీ వచ్చారు. మచిలీపట్నం, పెద్దపల్లి (నిజాంపట్నం), నరసాపురం, భీమ్లీ తెలంగాణకి ముఖ్య రేవు పట్టణాలుగా అభివృద్ధ్ది చెందాయి.
మహమ్మద్ షా ఇచ్చిన ఫర్మానాతో డచ్చివారు కోస్తాలో అనేక కలంకారీ, లేస్, తుపాకీ మందు కర్మాగారాలు స్థాపించారు. ఇండెంచర్ నమూనాతో కార్మికులని గ్రామాలలో కొనుగోలు చేసి పగలూ రాత్రీ బలవంతంగా పనిచేయించి, ఎగుమతులలో విపరీతమైన లాభాలు గడించారు. గోల్కొండ నుంచి మచిలీపట్నం, విశాఖపట్నం, అహ్మద్‌నగర్, బీదర్, బీజాపూర్, పెనుగొండలకి వెళ్ళే మార్గాలు విస్తరించబడ్డాయి. ఈ దండుబాటలలో రక్షణ వ్యవస్థ పటిష్టం చేయబడింది. ఒక ముసలవ్వ బంగారం నిండిన పెట్టెతో ఒంటరిగా గోల్కొండ నుండి మచిలీపట్నం సురక్షితంగా ప్రయాణించ గలిగేదని ఫరిష్తా చెప్పాడు. చేతిలో ఈటె, కాళ్ళకు గజ్జెలతో ఒక్కొక్కరూ 400 మీటర్లు మాత్రమే వేగంగా పరుగెత్తే టపాబంట్ల రిలే వ్యవస్థ ద్వారా గోల్కొండ నుండి రాజమండ్రికి ఉత్తరాలు ఒక్కరోజులో చేరేవి. అందుకనే ప్రజలు వాడుక భాషలో ‘గోల్కొండ టపా’ అనే పదాన్ని అర్జంటు అనే అర్థం వచ్చేట్లు ఉపయోగించారు.