వెయ్యి కోట్ల కథ | Bahubali 2 likely to rake in Rs 1000 crore | Sakshi
Sakshi News home page

వెయ్యి కోట్ల కథ

Published Tue, May 9 2017 12:17 AM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

వెయ్యి కోట్ల కథ - Sakshi

వెయ్యి కోట్ల కథ

వెయ్యి కోట్లకు అడుగేసింది... ఇంకెన్ని కోట్లకు పడగలేస్తుందో!

ఒక ఇండియన్‌ సినిమా.. అందులోనూ ఒక  తెలుగు సినిమా వెయ్యి కోట్ల క్లబ్‌కి నాందిపలికింది. ‘సాహో.. తెలుగు సినిమా’ అని అందరూ అనేట్లుగా ‘బాహుబలి’ మన ఖ్యాతిని పెంచింది. వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసి, పదిహేను వందల కోట్ల దిశగా దూసుకెళుతోంది. పిండి కొద్దీ రొట్టె. కథ కొద్దీ సినిమా. ‘బాహుబలి’కి బహు బలమైన కథ ఇచ్చిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్‌.

‘బాహుబలి’ ఆలోచన ఎప్పుడు వచ్చింది?
2012లో రాజమౌళి నాతో రాజుల కాలం నాటి సినిమా చేయాలని ఉందన్నాడు. క్యారెక్టర్స్‌ అన్నీ స్ట్రాంగ్‌గా ఉండాలన్నాడు. మంచి వ్యక్తిగా ఉంటూ పరిస్థితుల ప్రభావంతో చెడుగా మారే పాత్ర కూడా స్ట్రాంగ్‌గా ఉండాలన్నాడు. అప్పుడు కథ రాయడం మొదలుపెట్టాను.
     
కథావస్తువు పెద్దది కాబట్టి క్లిష్టంగా అనిపించిందా?

అస్సలు లేదు. అన్ని కథలు రాసినట్లుగానే ఇది కూడా సునాయాసంగానే రాసేశాను. మనం ఏం రాయాలనే దాని మీద స్పష్టమైన అవగాహన ఉంటే రాయడం ఈజీ.
     
కథ తయారు కావడానికి ఎన్ని నెలలు పట్టింది?
మూడు నాలుగు నెలల్లో రాసేశాను.
     
రెండు భాగాలుగా తీయాలనే రాయడం మొదలుపెట్టారా?

ఒక సినిమానే అనుకున్నాం. కానీ, కథ రాయడం మొదలుపెట్టాక అది సాధ్యం కాదనిపించింది. పెద్ద కథ అయిపోయింది. అందుకని రెండు భాగాలు ప్లాన్‌ చేశాం.
     
‘బాహుబలి’ అని ఎందుకు టైటిల్‌ పెట్టాలనిపించింది?
తెలుగు, తమిళ భాషల్లో సినిమా తీసి, హిందీలో అనువదించాలనుకున్నాం. ‘బాహుబలి’ అంటే హిందీలో బలవంతుడు అని అర్థం. సౌత్‌వాళ్లకూ టైటిల్‌ అర్థం అవుతుంది. పవర్‌ఫుల్‌గా ఉంది కాబట్టి ఆ టైటిల్‌ పెట్టాం.

కట్టప్ప, శివగామి తదితర పాత్రల పేర్లు పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది?
కథ రాసుకున్నప్పుడే పెట్టాం. తమిళనాడు నుంచి ఇక్కడికొచ్చిన అమ్మాయిగా రమ్యకృష్ణ  పాత్రను మలిచాం. అందుకే శివగామి అని పెట్టాం. శివగామి అంటే మధురై మీనాక్షి అమ్మవారు. శివగామితో పాటే వచ్చిన వ్యక్తి కట్టప్ప అన్నమాట. అందుకే తమిళవాళ్లు రిలేట్‌ చేసుకునేట్లు సత్యరాజ్‌ పాత్రకు కట్టప్ప అని పెట్టాం. తమిళ వాళ్ల పేర్లలో దాదాపు ‘అప్పా’ అని ఉంటుంది. అందుకే కట్టప్ప అయితే బాగుంటుందను కున్నాం. ప్రభాస్‌ చేసిన తండ్రీ కొడుకు పాత్రలకు అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి అనుకున్నాం. భల్లాలదేవా, బిజ్జల దేవా, దేవసేన.. ఇవన్నీ కూడా కథ రాస్తునప్పుడే పెట్టాం.

వెయ్యి కోట్ల సినిమా అవుతుందనుకున్నారా?
భారీ సినిమా అవుతుందనుకున్నాను కానీ, ఈ స్థాయి ఊహించలేదు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు లభిస్తున్న ఆదరణ చూస్తుంటే ఆనందంగా ఉంది.

మీ అబ్బాయి రాజమౌళి కోట్ల ప్రాజెక్ట్‌ భుజాన వేసుకున్నందుకు ఎప్పుడైనా టెన్షన్‌గా అనిపించిందా?
నాకేం అనిపించలేదు. నిజానికి టెన్షన్‌ మొత్తం నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేనిలదే. కోట్ల రూపాయల బడ్జెట్‌ అంటే రిస్క్‌. కానీ, వాళ్ల ముఖాల్లో టెన్షన్‌ చూడలేదు. ఈ సినిమాకి వాళ్లే హీరోలు.
     
వెయ్యి కోట్లకు నాంది పలికిన తొలి ఇండియన్‌ మూవీ మన తెలుగు సినిమా కావడం ఎలా అనిపిస్తోంది?
చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే హద్దులు చెరిపేసింది. కథ, కథకు తగ్గ బడ్జెట్, టేకింగ్, నటీనటుల పర్ఫార్మెన్స్, టెక్నీషియన్స్‌ వర్క్‌.. ఇవన్నీ బాగుంటే భాషతో సంబంధం లేకుండా అందరూ చూస్తారని అర్థమైంది. కథ బాగుంటే సినిమా ఆదరణ పొందుతుందనే ధైర్యాన్ని ఇచ్చింది. బలమైన కథను నమ్మి, భారీగా ఖర్చు పెట్టవచ్చని నిరూపించింది.

ఇంత భారీ కథ రాశాక.. వేరే కథ రాయడం అంటే ఓ సవాల్‌లా అనిపిస్తోందా?
అలా ఏం లేదు. ఏ సినిమా కథ దానిదే. ఐడియా రావడం.. రాసేయడం. ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు. ఇవాళ ‘బాహుబలి’.. రేపు ఇంకోటి రావాలి. అప్పుడే బాగుంటుంది. పరిశ్రమ పచ్చగా ఉంటుంది.    

2012లో రాజమౌళి నాతో
రాజుల కాలం నాటి సినిమా చేయాలని ఉందన్నాడు. క్యారెక్టర్స్‌ అన్నీ స్ట్రాంగ్‌గా ఉండాలన్నాడు. మంచి వ్యక్తిగా ఉంటూ పరిస్థితుల ప్రభావంతో చెడుగా మారే పాత్ర కూడా స్ట్రాంగ్‌గా ఉండాలన్నాడు.

ఇండియన్‌ సినిమాకు ‘బాహుబలి’ ఓ మైలు రాయి. సినిమా రంగానికి చెందిన మా అందరికీ గర్వకారణం. టీమ్‌ వర్క్‌ బాగుంది. రాజమౌళి మాస్టర్‌ పీస్‌ తీశారు. అందరికీ శుభాకాంక్షలు.
– ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్‌

‘బాహుబలి’ విజయం ఇండియన్‌ సెలబ్రేషన్‌. ఈ సినిమాను ఎక్కడెక్క షూట్‌ చేశారో తెలుసుకోవాలని ఉంది. ఈ సినిమా చూశాక.. సినిమా అనే ఈ వ్యాపారంలో నేనూ ఓ భాగమైనందుకు ఆనందంగా ఉంది.
– ప్రముఖ నటుడు రిషీ కపూర్‌

రాజమౌళి నాకెందుకు నచ్చాడంటే.. ఎంతో దమ్మూ ధైర్యంతో తాను అనుకున్నది క్రియేట్‌ చేశాడు. అసమాన ప్రతిభ కనబర్చాడు.
– దర్శక–నిర్మాత–నటుడు శేఖర్‌ కపూర్‌

నేను థియేటర్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా సినిమా నుంచి బయటకు రాలేకపోయాను. విజువల్స్, లొకేషన్స్, బడ్జెట్‌ ఇలాంటి విషయాలతో ‘బాహుబలి’ సినిమాను కొలవలేం. ఈ సినిమా అంతకుమించి. రాజమౌళికి హ్యాట్సఫ్‌.
– సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌

‘బాహుబలి’ టీమ్‌ గొప్ప విజయం సాధించింది. రాజమౌళి, ప్రభాస్, అనుష్క, సత్యరాజ్‌ , నాజర్‌ వీరికే కాకుండా టీం అందరికీ శుభాకాంక్షలు.
– నటుడు అరవింద్‌ స్వామి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement