భలే మంచి వ్యాపారి ఈ బాల్కీ!
భలే మంచి వ్యాపారి ఈ బాల్కీ!
Published Mon, Oct 7 2013 12:12 AM | Last Updated on Fri, Sep 1 2017 11:24 PM
సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఏడేళ్ల అబ్బాయి డబ్బు సంపాదనకు పూనుకొంటే... ఖాళీ సమయాల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తే... ఎంతమంది తల్లిదండ్రులు ఒప్పుకొంటారు ఈ పనికి? అతడిని ప్రోత్సహిస్తారా? చదువును దృష్టిలో పెట్టుకొని లేదా ఇతర కారణాలతో అలాంటి పనులకు ఒప్పుకోకపోవచ్చు. సయీద్‌బాల్కీ తల్లిదండ్రులు మాత్రం అభ్యంతరం చెప్పలేదు. ఏడేళ్ల వయసులోనే ఒకవైపు చదువుకొంటూ మరో పక్క డబ్బు సంపాదన మొదలుపెడితే... అతడు చిట్టి చేతులతో తెచ్చిన సొమ్మునుగాక... అతడిలో ఎదుగుతున్న వ్యాపారవేత్తను చూశారు ఆ తల్లిదండ్రులు. పాకిస్థాన్‌కి చెందిన 22 సంవత్సరాల సయీద్‌బాల్కీ ఇప్పుడు ప్రపంచంలోనే ప్రముఖ యంగెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌లలో ఒకడు.
బాల్కీ కుటుంబం పాకిస్థాన్‌లో ఉన్న రోజుల్లో ఈద్ సందర్భంగా గ్రీటింగ్ కార్డులను అమ్మడంతో కెరీర్ మొదలుపెట్టాడు బాల్కీ.
తన తల్లి గ్రీటింగ్ కార్డులను కొనడానికి కొంత డబ్బు ఇచ్చేదని, ఆ డబ్బుతో కార్డులు కొని, వాటిని అమ్మి లాభాన్ని సంపాదించే వాడినని, అలా తన వ్యాపార జీవితం ఏడేళ్ల వయసులో లాభసాటిగా మొదలైందని చెబుతాడు బాల్కీ. అయితే బాల్కీలోని వ్యాపారవేత్త అంతటితో ఆగిపోలేదు. స్నాక్స్ తినడమంటే ఇష్టపడే వయసులో తన వీధిలోనే ఒక స్నాక్ షాప్‌ను ప్రారంభించి, లాభాలు ఆర్జించాడు. బాల్కీకి తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు వీరి కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది. అదే అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. కొత్త దేశం, కొత్త ప్రాంతం, కొత్త ఊరు.. ఫ్రెండ్స్ అంతగా లేరు. ఈ సమయంలో తనకు కంప్యూటరే ప్రియనేస్తమైందనీ, అలాగే ‘మౌంటెన్ డ్యూ’ తాగడం వ్యసనంగా మారిందనీ, ఆ వ్యసనం కోసం సొంతంగా డబ్బు సంపాదించుకునే మార్గం అన్వేషించా ననీ, తన కజిన్ ద్వారా ‘డొమైన్ బిజినెస్’లోకి ప్రవేశించాననీ బాల్కీ చెబుతాడు.
కజిన్ గెడైన్స్‌తో డొమైన్‌లు రిజిస్టర్ చేయించడంలో, అమ్మడంలో ప్రావీణ్యత సంపాదించాడు. క్రమంగా వెబ్‌డిజైన్‌పై పట్టు సాధించింది సొంతంగా ఫ్రీలాన్స్ వెబ్ డిజైన్ బిజినెస్‌ను ప్రారంభించి, వ్యక్తిగత ప్రతిభతో షైన్ అయ్యాడు. ఇతడు ప్రారంభించిన లిస్ట్ 25 అనే వెబ్‌సైట్ పాపులర్ అయ్యింది. పే పల్, క్విక్ సిల్వర్, కివ, వర్డ్ ప్రెస్, డోనర్స్ ఛాయిస్ కంపెనీ సీఈవోలతో పనిచేశానని, వారితో పనిచేయడం గొప్ప అనుభవమని బాల్కీ చెప్పాడు. ఇతడి విజయగాథ గురించి న్యూయార్క్‌టైమ్స్, బిజినెస్ ఇన్‌సైడర్, వైర్డ్ మ్యాగజీన్, యాహూ, అమెక్స్ ఓపెన్ ఫోరమ్ వంటి మీడియా సంస్థలు ప్రత్యేక కథనాలు ప్రచురించాయి. తగిన అవకాశాలుంటే యువత రాణిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు బాల్కీ.
Advertisement
Advertisement