balki
-
మోడర్న్ మదర్‌స్టార్స్
తెల్ల చీర.. ఓ కంట్లో కుండల కొద్దీ కన్నీళ్లు.. మొహంలో దయనీయత... కంపిస్తున్న జీవితం..టాలీవుడ్, బాలీవుడ్ అమ్మకు ప్రతిరూపం పదేళ్ల కిందటిదాకా! ఎప్పుడూ ఎవరో ఒకరు ఆదుకోవాలని చూసే సెల్ఫ్ పిటీతో కుంగిపోతూ ఉంటుంది ఆ అమ్మ. ఇప్పుడు పరిస్థితులు మారాయి కనీసం బాలీవుడ్లో. ఆత్మవిశ్వాసం, ఆత్మస్థయిర్యంతో ఆధునిక అమ్మ తెర మీద ధైర్యంగా అడుగులేస్తోంది. అంతకుముందు అమ్మంటే సినిమా కథ ఫార్ములాలో ఓ పాత్ర మాత్రమే. కానీ ఇప్పుడు అలా కాదు.. కథను నడిపించే ప్రధాన నాయిక. ఉదాహరణ.. నిల్ బత్తే సన్నాట! నిజానికి ఈ మార్పు ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమా నుంచి మొదలైందని చెప్పొచ్చు. అందులో కథానాయిక కాజోల్‌కి తల్లిగా నటించిన ఫరిదా జలాల్ కొంచెం రివల్యూషనరీ మదర్‌గా కనిపించారు. ఆ తర్వాత నుంచి వచ్చిన చాలా సినిమాల్లో అమ్మ రూపురేఖలు.. వ్యక్తిత్వమూ మారిపోయాయి కొత్తగా... తల్లుల్లో ఉత్సాహాన్ని పెంచేలా! ఆ సినిమాలు కొన్ని.. పైన నిల్ బత్తే సన్నాట ఊసెత్తాం కాబట్టి దాన్నే మొదట ఉదహరించుకుందాం. అందులో తల్లే ప్రధాన పాత్ర. స్వర భాస్కర్ పోషించింది. ఆమె ఓ పనిమనిషి. కూతురిని పెద్ద చదువులు చదివించాలని కలలు కంటూంటుంది. కానీ పనిమనిషి కూతురు ఇంకో పనిమనిషి కాక ఐఏఎస్ ఆఫీసర్ అవుతుందా అనే నిస్పృహతో బతుకుతుంది. అంతే నిస్సత్తువగా బడికి వెళ్తూంటుంది. బిడ్డ ఆలోచనలు మార్చడానికి ఆ తల్లీ స్కూల్లో చేరుతుంది. కూతురితో కలిసి పదవ తరగతి పరీక్ష రాసి ఆమెలో పోటీని రగిలిస్తుంది. జీవితం పట్ల ఆశను రేపుతుంది. ఉత్తేజాన్ని నింపుతుంది. అచ్చంగా ఓ అమ్మను హీరోయిన్గా చూపించిన ఈ సినిమా.. తీరు మారిన బాలీవుడ్ తలపుకు మచ్చు తునక. జానే తూ.. యా జానే నా.. ఫ్రెండ్లీ మదర్ కాన్సెప్ట్‌ను ప్రమోట్ చేసిన సినిమా జానే తూ.. యా జానే నా! ఆమిర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్‌ఖాన్ సెల్యూలాయిడ్ ఫస్ట్ ఎంట్రీ ఈ మూవీ. అందులో అతనికి అమ్మగా రత్నా పాటక్ షా నటించింది. సర్కాస్టిక్ మదర్. విడో. భర్త పట్ల మిస్సింగ్ ఫీలింగ్‌నూ ఆ వ్యంగ్యంతోనే భర్తీ చేసుకుంటుంది. కొడుకుకు ఆప్తమిత్రురాలిలా మసలుకుంటుంది. బోలెడు ధైర్యాన్నిస్తుంది. అలా ‘జానే తూ యా జానే నా’ లో అమ్మను డేరింగ్ అండ్ డైనమిక్‌గా చిత్రీకరించారు. ఈ మధ్య వచ్చిన మంచి సినిమా కపూర్ అండ్ సన్స్‌లో కూడా రత్నా పాటక్ షా ఇన్స్పైరింగ్ మదర్‌లా నటించారు. భర్త వివాహేతర సంబంధం... కొడుకు గే అని తేలడం.. ఇలాంటి షాకింగ్ సందర్భాల్లో గట్టిగా అరుస్తూ కూలిపోకుండా.. సంయమనంగా డీల్ చేయగల స్త్రీగా అద్భుతంగా చిత్రీకరించిన పాత్ర అది. రత్నా పాటక్ షా ఒదిగిపోయి మహిళకు మరో నిర్వచనంగా నిలిచారు. ఇంగ్లిష్ వింగ్లిష్.. ‘‘నాకు కావాల్సింది ప్రేమ కాదు.. గౌరవం’’ అంటుంది ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ సినిమాలోని అమ్మ ‘శశి’. నిజమే.. వంటింటికే పరిమితమైన ఇల్లాలిని.. వంట తప్ప ఏమీ రాదని హేళన చేస్తే భర్త, ఇంగ్లిష్ రాకపోతే ఆ అమ్మకు ఏమీ తెలియదని.. ఒట్ట జడ్డని.. టీచర్, పేరెంట్ మీటింగ్‌కు ఆమెను అవాయిడ్ చేయాలని చూసే కూతురుంటే .. ఏ తల్లైనా ఆశ పడేది కాసింత గౌరవం పొందాలనే కదా! ఇంగ్లిష్ నేర్చుకొని అనర్గళంగా ఆ భాషలో స్పీచ్ కూడా ఇచ్చి ఆ గౌరవాన్ని దక్కించుకుంటుంది శశి. అమ్మ ఆత్మగౌరవం అనే ఓ సున్నితమైన అంశాన్నే ప్రధానం చేసుకొని మధ్య వయసు మహిళనే ముఖ్య భూమికగా పెట్టుకొని తీసిన ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ ఎంత సూపర్ హిట్టో తెలియంది కాదు! అంటే అమ్మకు ప్రేమతో పాటు గౌరవాన్నీ ఇవ్వాలని మనమందరం కోరుకుంటున్నట్టేగా. మరెందుకు జాలి పాత్రలు? ఈ సినిమా శ్రీదేవికి రీ ఎంట్రీ. శశిగా ఆమె సింప్లీ సూపర్బ్. పా.. ప్రిజేరియా ఉన్న కుర్రాడి సింగిల్ పేరెంట్ స్ట్రగులే ‘పా’. ఆ సింగిల్ పేరెంటే విద్యా బాలన్. అసాధారణ జబ్బున్న పిల్లాడికి తల్లిగా ఏ మాత్రం నిరాశకు లోనవకుండా.. ఆ కొడుకుని సాధారణ పిల్లల్లాగే పెంచగలిగే ఆత్మబలం ఉన్న అమ్మ ఆమె. అసలా కథను ఎంచుకున్నందుకు బాల్కీకి, నటించి మెప్పించిన విద్యాబాలన్‌కు హ్యాట్సాఫ్. లిజన్ అమాయా.. భర్త మరణం భార్య కలలు, కలర్‌ఫుల్ లైఫ్‌కి ఫుల్స్టాప్ కానక్కర్లేదు. ఆయన జ్ఞాపకాలతో బతికే మొండితనమన్నా ఉండాలి.. లేదా కొత్త భాగస్వామిని ఎంచుకొని జీవితాన్ని మళ్లీ మొదలుపెట్టే ధైర్యమన్నా కావాలి. రెండో కోవకు చెందినదే అమాయా తల్లి. తండ్రిని తప్ప ఇంకో వ్యక్తిని ఆ స్థానంలో ఊహిచంలేని కూతురికి ఇంకో భాగస్వామిని ఎంచుకున్నానని ఎలా చెప్పాలి? అని మథన పడుతుందే తప్ప బలహీనపడదు. తనకూ కొత్తగా జీవించే హక్కుందని బిడ్డకు చెప్పాలని ప్రయత్నిస్తుంది. ఇలాంటి సంఘర్షణను కన్నీళ్లు.. దిగులు భావాలతో కాకుండా స్థిరమైన ఆలోచనలు, అభిప్రాయాలతో అధిగమిస్తుంది. ఆ పాత్రలో దీప్తి నావల్ జీవించింది. ఇవి ట్రైలర్స్ మాత్రమే. గే కొడుకును యాక్సెప్ట్ చేసే అమ్మగా ‘దోస్తానా’లో కిరణ్ ఖేర్, ప్రత్యర్థి మూఠాను వణికించే తల్లిగా ‘రామ్‌లీలా’ లో సుప్రియా పాఠక్, సెరిబ్రల్ పాల్సీ ఉన్న కూతురిని సంబాళించే తల్లిగా ‘మార్గరిటా విత్ స్ట్రా’లో రేవతి, ‘మిత్ర్’లో శోభనా, పంజాబీ బ్యూటీషియన్ అండ్ చిల్ మదర్‌గా ‘విక్కీ డోనర్’లో డాలీ అహ్లువాలియా వీళ్లంతా ఆధునిక అమ్మ బలం చూపించారు.ఆమె గౌరవం పెంచారు. అనవసరమైన త్యాగాలు, ఔన్నత్యాలకు జీవితాన్ని అంకితం చేసుకునే బేలతనం లేదు వాళ్లకు. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తూ.. పిల్లల వ్యక్తిత్వాలను తీర్చిదిద్దే అమ్మతనం వాళ్లది. సెల్యులాయిడ్ను మోడర్న్ యాంగిల్లో సెట్ చేస్తున్న మదర్ స్టార్స్‌కి వందనాలు! నిల్ బత్తే సన్నాటలో.. ‘పా’లో విద్యా, అభిషేక్ -
మళ్లీ ఆ మేజిక్ రిపీట్ అవుతుందా?
అమితాబ్ బచ్చన్, శ్రీదేవిల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుంది. అందుకు నిదర్శనం ఈ ఇద్దరూ జంటగా నటించిన ‘ఇంక్విలాబ్’, ‘ఆఖరీ రాస్తా’, ‘ఖుదాగ వా’. ఆ తర్వాత మళ్లీ ఈ ఇద్దరూ జంటగా నటించలేదు. కానీ, సెకండ్ ఇన్నింగ్స్‌లో శ్రీదేవి చేసిన తొలి చిత్రం ‘ఇంగ్లిష్ వింగ్లిష్’లో అమితాబ్ అతిథి పాత్ర చేశారు. ఒకప్పుడు హిట్ పెయిర్ అయిన ఈ ఇద్దరూ మళ్లీ జతకట్టనున్నారని సమాచారం. అమితాబ్‌తో ‘చీనీ కమ్’, ‘పా’, ‘షమితాబ్’ లాంటి విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన బాల్కీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందని భోగట్టా. శ్రీదేవి నటించిన ‘ఇంగ్లిష్ వింగ్లిష్’కి బాల్కీ భార్య గౌరీ షిండే దర్శకత్వం వహించారు. కాగా, ఇటీవల శ్రీదేవిని బాల్కీ కలిశారట. ఈ చిత్రంలో నటించడానికి ఆమె సుముఖంగానే ఉన్నారని సమాచారం. బాల్కీతో ఇప్పటికే మూడు వైవిధ్యభరిత చిత్రాల్లో చేసిన అనుభవం ఉంది కాబట్టి, అమితాబ్ కూడా ఇందులో నటించడానికి సిద్ధమయ్యారట. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నారట. అమితాబ్, శ్రీదేవి ఇప్పుడు వయసు మీద పడ్డ జంటగా మునుపటి మేజిక్‌ని రిపీట్ చేస్తారా? -
షమితాబ్ సినిమాలో పాట పాడుతున్న అమితాబ్
బాల్కి దర్శకత్వంలో కొత్తగా వస్తున్న 'షమితాబ్' చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఓ పాట పాడుతున్నారు. అవధేష్ శ్రీవాస్తవతో కలిసి ఆయన మ్యూజిక్ స్టూడియోలో రాత్రి చాలా సేపు కూర్చున్నానని, షమితాబ్ సినిమా కోసం మరోసారి తాను పాట పాడుతున్నానని అమితాబ్ తన బ్లాగ్ ద్వారా తెలిపారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా స్వరాలు సమకూర్చిన అద్భుతమైన బాణీలకు తాను పాడానని ఆయన రాశారు. ఇళయరాజా సంగీత ప్రపంచంలో ప్రవేశించి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినా, ఇప్పటికీ ఆయన స్వరాలు మాత్రం సరికొత్తగానే ఉంటాయని, ఆయన ప్రాధాన్యం అలాగే కొనసాగుతోందని అమితాబ్ చెప్పారు. చాలామంది సుప్రసిద్ధ సంగీతదర్శకులను ఆయన తయారుచేశారని, దాదాపు 900కు పైగా చిత్రాలకు సంగీతం సమకూర్చారని ప్రశంసల జల్లు కురిపించారు. షమితాబ్ చిత్రంలో రజనీకాంత్ అల్లుడు ధనుష్, కమల్ కూతురు అక్షర కూడా నటిస్తున్నారు. అక్షర బాలీవుడ్ రంగప్రవేశం అమితాబ్ చిత్రంతో జరగడం విశేషం. -
అక్క బాటలో అక్షర!
‘‘మా అమ్మాయిల ఇష్టాన్ని నేనెప్పుడూ కాదనను. వాళ్లు ఏ కెరీర్‌ని సెలక్ట్ చేసుకుంటే దాన్ని ఆమోదిస్తా’’ అని కమల్‌హాసన్ పలు సందర్భాల్లో చెప్పారు. ఆ మేరకు పెద్ద కుమార్తె శ్రుతిహాసన్ హీరోయిన్ అవ్వాలనుకుంటే ‘ఎస్’ అన్నారు. ఇప్పుడు రెండో కుమార్తె అక్షరహాసన్ కథానాయిక అవ్వాలని తీసుకున్న నిర్ణయానికి కూడా ఆయన ఆమోదముద్ర వేశారు. ఆ మధ్య శ్రుతిలా అక్షర కథానాయిక అవాలనుకోవడం లేదనే వార్తలు వచ్చాయి. తను డెరైక్షన్ డిపార్ట్మెంట్లో పని చేయడం ఆ మాటలకు ఊతం ఇచ్చింది. అయితే, ఇప్పుడు అక్షర మనసు మార్చుకుంది. చీనీ కమ్, పా చిత్రాలతో మంచి దర్శకునిగా గుర్తింపు తెచ్చుకున్న బాల్కీ దర్శకత్వం వహించనున్న చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం కాబోతోంది అక్షరహాసన్. ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్‌బచ్చన్ నటించనుండగా, ‘రాన్‌జనా’ ద్వారా బాలీవుడ్‌కి పరిచయమైన తమిళ హీరో ధనుష్ కూడా నటించబోతున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా పాటలు స్వరపరుస్తారు. పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం చేయబోతున్నారు. ఇదిలా ఉంటే.. శ్రుతిహాసన్ కూడా ముందుగా బాలీవుడ్ చిత్రం ద్వారానే కథానాయిక అయ్యి, దక్షిణాది సినిమాలు చేయడం మొదలుపెట్టింది. అక్క బాటలో అక్షర కూడా ముందు ఉత్తరాదివారికి పరిచయం కానుంది. సో.. ఈ తేనెకళ్ల సుందరి సౌత్‌కి కూడా వస్తుందని ఊహించవచ్చు. ఇక, అక్షర వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. మాజీ తార రతి అగ్నిహోత్రి తనయుడు తనుజ్ వీర్వాణీతో ప్రేమాయణం సాగిస్తోందని సమాచారం. -
భలే మంచి వ్యాపారి ఈ బాల్కీ!
సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఏడేళ్ల అబ్బాయి డబ్బు సంపాదనకు పూనుకొంటే... ఖాళీ సమయాల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తే... ఎంతమంది తల్లిదండ్రులు ఒప్పుకొంటారు ఈ పనికి? అతడిని ప్రోత్సహిస్తారా? చదువును దృష్టిలో పెట్టుకొని లేదా ఇతర కారణాలతో అలాంటి పనులకు ఒప్పుకోకపోవచ్చు. సయీద్బాల్కీ తల్లిదండ్రులు మాత్రం అభ్యంతరం చెప్పలేదు. ఏడేళ్ల వయసులోనే ఒకవైపు చదువుకొంటూ మరో పక్క డబ్బు సంపాదన మొదలుపెడితే... అతడు చిట్టి చేతులతో తెచ్చిన సొమ్మునుగాక... అతడిలో ఎదుగుతున్న వ్యాపారవేత్తను చూశారు ఆ తల్లిదండ్రులు. పాకిస్థాన్‌కి చెందిన 22 సంవత్సరాల సయీద్బాల్కీ ఇప్పుడు ప్రపంచంలోనే ప్రముఖ యంగెస్ట్ ఎంటర్ప్రెన్యూర్లలో ఒకడు. బాల్కీ కుటుంబం పాకిస్థాన్‌లో ఉన్న రోజుల్లో ఈద్ సందర్భంగా గ్రీటింగ్ కార్డులను అమ్మడంతో కెరీర్ మొదలుపెట్టాడు బాల్కీ. తన తల్లి గ్రీటింగ్ కార్డులను కొనడానికి కొంత డబ్బు ఇచ్చేదని, ఆ డబ్బుతో కార్డులు కొని, వాటిని అమ్మి లాభాన్ని సంపాదించే వాడినని, అలా తన వ్యాపార జీవితం ఏడేళ్ల వయసులో లాభసాటిగా మొదలైందని చెబుతాడు బాల్కీ. అయితే బాల్కీలోని వ్యాపారవేత్త అంతటితో ఆగిపోలేదు. స్నాక్స్ తినడమంటే ఇష్టపడే వయసులో తన వీధిలోనే ఒక స్నాక్ షాప్‌ను ప్రారంభించి, లాభాలు ఆర్జించాడు. బాల్కీకి తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు వీరి కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది. అదే అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. కొత్త దేశం, కొత్త ప్రాంతం, కొత్త ఊరు.. ఫ్రెండ్స్ అంతగా లేరు. ఈ సమయంలో తనకు కంప్యూటరే ప్రియనేస్తమైందనీ, అలాగే ‘మౌంటెన్ డ్యూ’ తాగడం వ్యసనంగా మారిందనీ, ఆ వ్యసనం కోసం సొంతంగా డబ్బు సంపాదించుకునే మార్గం అన్వేషించా ననీ, తన కజిన్ ద్వారా ‘డొమైన్ బిజినెస్’లోకి ప్రవేశించాననీ బాల్కీ చెబుతాడు. కజిన్ గెడైన్స్‌తో డొమైన్లు రిజిస్టర్ చేయించడంలో, అమ్మడంలో ప్రావీణ్యత సంపాదించాడు. క్రమంగా వెబ్డిజైన్పై పట్టు సాధించింది సొంతంగా ఫ్రీలాన్స్ వెబ్ డిజైన్ బిజినెస్‌ను ప్రారంభించి, వ్యక్తిగత ప్రతిభతో షైన్ అయ్యాడు. ఇతడు ప్రారంభించిన లిస్ట్ 25 అనే వెబ్సైట్ పాపులర్ అయ్యింది. పే పల్, క్విక్ సిల్వర్, కివ, వర్డ్ ప్రెస్, డోనర్స్ ఛాయిస్ కంపెనీ సీఈవోలతో పనిచేశానని, వారితో పనిచేయడం గొప్ప అనుభవమని బాల్కీ చెప్పాడు. ఇతడి విజయగాథ గురించి న్యూయార్క్‌టైమ్స్, బిజినెస్ ఇన్సైడర్, వైర్డ్ మ్యాగజీన్, యాహూ, అమెక్స్ ఓపెన్ ఫోరమ్ వంటి మీడియా సంస్థలు ప్రత్యేక కథనాలు ప్రచురించాయి. తగిన అవకాశాలుంటే యువత రాణిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు బాల్కీ.