గబ్బిలాలు రోజూ స్నానం చేస్తాయా?! | Bats do daily bath ? | Sakshi
Sakshi News home page

గబ్బిలాలు రోజూ స్నానం చేస్తాయా?!

Published Sat, Feb 21 2015 11:25 PM | Last Updated on Sat, Sep 2 2017 9:41 PM

గబ్బిలాలు రోజూ  స్నానం చేస్తాయా?!

గబ్బిలాలు రోజూ స్నానం చేస్తాయా?!

జంతు  ప్రపంచం
 

{పపంచం మొత్తంలో వెయ్యి రకాలకు పైగా గబ్బిలం జాతులు ఉన్నాయి. ‘ఫ్లయింగ్ ఫాక్స్’ జాతి గబ్బిలాలు అన్నిటికంటే పెద్దగా ఉంటాయి. వీటి రెక్కలు ఆరడుగుల పొడవు వరకూ పెరుగుతాయి. ‘బంబుల్ బీ’ జాతికి చెందినవి అతి చిన్న గబ్బిలాలు. ఇవి మనిషి బొటన వేలంత కూడా ఉండవు!
     
ఎగిరే జీవుల్లో క్షీరదం ఏదైనా ఉందీ అంటే... అది గబ్బిలమే!

     
ఇవి చాలా వేగంగా తింటాయి. గంటలో ఆరు వందలకు పైగా కీటకాలను, పన్నెండు వందలకు పైగా దోమలను ఆరగించేయగలవు. ఒక్కోసారి తమ శరీరపు బరువు కంటే ఎక్కువ బరువైన ఆహారాన్ని తినేసి కదలలేక ఇబ్బంది పడుతుంటాయి. అయితే వీటి జీర్ణశక్తి అద్భుతంగా, అత్యంత వేగంగా ఉండటం వల్ల సమస్య ఉండదు!
     
గబ్బిలం పిల్లలను కొన్ని వేల గబ్బిలాల మధ్యలో వదిలేసినా వాటి తల్లి వాటిని గుర్తిస్తుంది. ఎందుకంటే ప్రతి గబ్బిలం స్వరం వేర్వేరుగా ఉంటుంది. అందుకే పిల్లల అరుపును బట్టి తల్లులు తేలికగా గుర్తిస్తాయి!

వ్యాంపైర్ జాతి గబ్బిలాలు రక్తం తాగి జీవిస్తాయని అంటారు. వీటిలో మూడు రకాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఇవి అమెరికాలోని కొన్ని జూలలో తప్ప మరెక్కడా కనిపించడం లేదు అంటారు జీవ శాస్త్రవేత్తలు!

పశ్చిమ ఆఫ్రికాలో నివసించే ఒక రకమైన గబ్బిలాలు అతి చిన్నగా, సాలీళ్ల మాదిరిగా ఉంటాయి. సాలెగూళ్లలాంటి గూళ్లనే అల్లుకుని, వాటిలో జీవిస్తుంటాయి!
గబ్బిలాలు మిగతా పక్షుల్లా నేలమీద నిలబడలేవు. అందుకే విశ్రాంతి తీసుకుంటున్నా, నిద్రపోతున్నా, తింటున్నా, చివరకు పిల్లలను కనేటప్పుడు కూడా తలకిందులుగానే వేళ్లాడుతుంటాయి
     
ఇవి పది నుంచి ఇరవయ్యేళ్లు జీవిస్తాయి. కొన్ని రకాలైతే ముప్ఫయ్యేళ్ల వరకూ కూడా జీవిస్తాయి!
     
గబ్బిలాలు నివసించే చోట చాలా దుర్వాసన వస్తూ ఉంటుంది కదా! అయితే అది అవి విసర్జించిన వ్యర్థాల వల్లే వస్తుంది. నిజానికి ఇవి ఎంతో శుభ్రంగా ఉంటాయి. ప్రతిరోజూ రెక్కలు విదిలించడం, వాటికీ వీటికీ రాసుకుని ఒంటికున్న దుమ్మును దులుపుకోవడం, నీటిలో తడిపి ఆరబెట్టుకోవడం వంటి వాటి ద్వారా తమ ఒంటిని శుభ్రం చేసుకుంటూ ఉంటాయి తెలుసా?!

చలికి ఇవి తాళలేవు. ఒక పరిమితి దాటి చలి పెరిగిందంటే వీటి గుండె కొట్టుకునే వేగం తగ్గిపోతూ ఉంటుంది. ఒక్కోసారి నిమిషానికి రెండుసార్లే కొట్టుకునే స్థితికి చేరుకుంటుంది. అది వీటికి ప్రమాదకర పరిస్థితి. అందుకే ఆ సమయంలో ఇవి వెచ్చదనం కోసం గుహల్లోనూ, భవంతుల్లోనూ దూరిపోయి, వెచ్చగా ఉన్నచోట దాగిపోతాయి తప్ప బయటకు రావు!
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement