ముఖానికి మంచినీటితో ఆవిరి పట్టడాన్ని స్టీమింగ్ అంటారు. ముఖానికి పట్టే జిడ్డుని, పొల్యూషన్‌ని వదిలించడానికి స్టీమింగ్ ఉపయోగపడుతుంది. ప్రతిసారీ బ్యూటీపార్లర్‌కు వెళ్లడం కష్టంగా ఉన్నా, బ్యూటీపార్లర్ అందుబాటులో లేకపోయినా ఇంట్లోనే స్టీమింగ్ చేసుకోవచ్చు. ఇందుకోసం మార్కెట్‌లో చిన్న కంటెయినర్లు దొరుకుతున్నాయి.
కంటెయినర్‌లో ఒక గ్లాసు నీటిని పోసి ప్లగ్‌లో పెట్టి కరెంట్ స్విచ్ ఆన్ చేస్తే నిమిషం లోపు నీరు మరుగుతాయి. మరుగుతున్న నీటి మీద నుంచి వచ్చే ఆవిరిని ముఖానికి అందించాలి. ఇందుకోసం కంటెయినర్‌కి ఒక వైపు చిన్న మూత ఉంటుంది. ఆ మూత తెరిస్తే ఆవిరి పక్కలకు వృథాగా పోకుండా నేరుగా ముఖానికి తగులుతుంది.
ఇక్కడ చిన్న జాగ్రత్త పాటించాలి. మరిగే నీటికంటే ఆవిరికి వేడి ఎక్కువ. కాబట్టి దేహం భరించలేనంత వేడి ఒక్కసారిగా తగిలితే ముఖం కమిలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆవిరి వచ్చే మూత తెరిచిన వెంటనే... ఆ ఆవిరి నేరుగా చేతికి తగిలేలా చేసి వేడిని గమనించుకోవాలి. భరించగలిగినంత వేడి మాత్రమే ఉందని నిర్ధారించుకున్న తర్వాత ముఖానికి పట్టించాలి.
ముఖానికి పట్టించేటప్పుడు కూడా ఒకేచోట ఎక్కువ సేపు ఉంచకూడదు. కొద్ది సెకన్లు చెంపలు, ఆ తర్వాత చుబుకం, నుదురు, కణతలు, మళ్లీ కొద్ది సెకన్లు చుబుకం... ఇలా ముఖమంతా పట్టేటట్లు చేయాలి. దాదాపుగా రెండునిమిషాలు స్టీమింగ్ పెడితే సరిపోతుంది. స్టీమింగ్ తర్వాత ముఖాన్ని టవల్‌తో తుడిచి బొప్పాయి గుజ్జుతో ప్యాక్ వేయాలి. బొప్పాయి అన్ని రకాల చర్మాలకీ మేలు చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment