
అందంగా... మొదటి అడుగు...
మెట్టినింట పెట్టే మొదటి అడుగు అందంగా ఆ తర్వాతి అడుగు ఆనందంగా సాగాలని నవవధువు కోరుకుంటుంది. అమ్మాయిల ఊహలకు తగ్గట్టు డిజైనర్లు పెళ్లికూతురి పాదాలను ఆభరణాల అలంకరణలతో ముచ్చటగొలుపుతున్నారు. వివాహ సమయాలలో పెళ్లికూతురికి నగల అలంకరణ ఎంత బాగుంటే అంత కళగా ఉంటుంది. అందుకే పెద్దలు కూడా వధువు ఆభరణాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. మెడకు, చేతులకు, నడుముకు నగలను ఆలంకరించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంటారు.
ఇప్పుడు పాదాలను ఈ జాబితాలో చేర్చుతున్నారు ఆభరణాల నిపుణులు. కాళ్లపట్టీల గురించి తెలిసిందే! కానీ పాదాలను కప్పినట్టుగా ఉంచే ఈ డిజైన్లు అతివలను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. పాదాల ఆభరణాలలో కుందన్స్, పూసలు, ముత్యాల మెరుపులు కొత్తగా కాంతులీనుతున్నాయి. బంగారు, వెండి ఆభరణాలలోనే కాకుండా వన్ గ్రామ్ గోల్డ్‌లో ఇవి కనువిందు చేస్తున్నాయి.