నల్లని వలయాలకు చక్కని మందు
బ్యూటిప్స్
ముఖం జీవకళ కోల్పోయినట్టుగా కనిపిస్తుందనిపిస్తే ముందుగా చెక్ చేయాల్సింది కంటి చుట్టూత భాగాన్ని. కంటి కింద చర్మం వదులుగా అవడం, నల్లబడటం వంటి సమస్యను గుర్తిస్తే నిద్రవేళలను సరిగ్గా పాటించడం లేదని, పోషకాహారం మీద దృష్టిపెట్టడం లేదని, మానసిక ఒత్తిడి పెరుగుతోందని గుర్తించాలి. అంతేకాదు చర్మం ముడతలు పడుతుంది అనే విషయాన్నీ కంటిచుట్టూత చర్మమే ముందుగా తెలియపరుస్తుంది. అందుకని... నిద్రించేటప్పుడు తల-మెడ సమాంతరంగా ఉండేలా దిండును అమర్చుకోవాలి. దీని వల్ల ద్రవాలు సక్రమంగా చేరి, కంటిచుట్టూత చర్మం బిగువును కోల్పోదు.
చర్మం ముడతలు తగ్గడానికి, తెల్లబడటానికి స్కిన్ టైటనింగ్, వైటనింగ్ క్రీమ్‌లను ముఖానికి వాడతారు. కాని కళ్ల కింద వాడలేరు. దీంతో కంటిచుట్టూ నల్లగా తయారవుతుంది. అందుకని రాత్రి, పగలు ఎలాంటి క్రీములు వాడినా ఫేసియల్ మాయిశ్చరైజర్‌ను కొద్దిగా చూపుడు వేలికి అద్దుకొని కంటి చుట్టూత మృదువుగా రెండు నిమిషాలు రాయాలి. దీంతో కంటి చుట్టూ ఉన్న చర్మం లోపల రక్తప్రసరణ జరిగి, పొడిబారడం తగ్గుతుంది. కంటి చుట్టూత చర్మం సున్నితంగా ఉంటుంది. అందుకని రాత్రిపూట మేకప్ నుంచి, ఇతరత్రా ఫేసియల్ ఉత్పత్తులనుంచి తగినంత విశ్రాంతిని కంటికి ఇవ్వాలి. నల్లని వలయాలకు మనం తీసుకునే జాగ్రత్తలే మంచి రెమిడీగా పనిచేస్తాయి.