బీడీకి జీఎస్‌టీ పొగ | Beedi Industries with the GST reached the brink of crisis | Sakshi
Sakshi News home page

బీడీకి జీఎస్‌టీ పొగ

Published Wed, Aug 16 2017 12:03 AM | Last Updated on Sun, Sep 17 2017 5:33 PM

బీడీకి జీఎస్‌టీ పొగ

బీడీకి జీఎస్‌టీ పొగ

పన్ను పోటు

పొద్దంతా కష్ట పడతారు. ఆరోగ్యం పొగచూరుతున్నా లెక్క చేయకుండా బీడీలు చుడతారు. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకున్నా కూలి కూడా గిట్టుబాటు కాదు. వారి బతుకులు వెళ్లబారేది ఆ కాస్త డబ్బుతోనే. బీడీలు చుట్టి చుట్టి వాళ్ల వేళ్లు వంగిపోతున్నాయి... అంతే తప్ప వాళ్ల బతుకులు నిలబడడం లేదు. దీనికి తోడు ‘గోరుచుట్టపై రోకటి పోటు’లా వచ్చి పడింది జీఎస్‌టీ. ఈ వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)కు పరిశ్రమల యజమానులే వణికి పోతున్నారు. బీడీ కార్మికులు చిగురుటాకులు కాక మరేమవుతారు? జీఎస్‌టీతో బీడీ పరిశ్రమలు సంక్షోభం అంచుకు చేరాయి. జీఎస్‌టీ సెగకు బీడీలు చుట్టి బతుకు వెళ్లదీస్తున్న లక్షలాది మంది ఉపాధి పొగచూరుతోంది.

ఇది పూర్వ కరీంనగర్‌ జిల్లా, వేములవాడ పట్టణంలోని సుభాష్‌నగర్‌. గజ్జెల శశికళ కుటుంబం. శశికళ, ఆమె కూతులు, ఇద్దరు కోడళ్లు. ఈ ఇంట్లో ఉన్న నలుగురు మహిళలూ బీడీలు చుడుతున్నారు. వారికి ఈ వృత్తే జీవనాధారం. ఒకప్పుడు నెలలో 25 రోజులు పని దొరికేది. ఇప్పుడు10 రోజులకు పడిపోయింది. పొద్దంతా రెక్కలు ముక్కలు చేసుకుంటే ఒక్కొక్కరికీ వచ్చేది వంద రూపాయల లోపే. జూలై ఒకటి తర్వాత మారిన ముఖచిత్రం ఇది. వారి మాటల్లో ఆవేదన ప్రస్ఫుటమవుతుంది.

‘‘గిప్పుడేమో బీడీలకు లవుగోస అచ్చిపడ్డది. ఏదో జీఎస్టీనట అదొచ్చినంక పని దొరుకుడు కష్టమైంది. మేమంతా బీడీలు సుడితేనే తిండికి పైసలు. పిల్లలను ఎలా సాదుకునుడో ఏమో. మేము మొత్తం 12 మందిమి ఉన్నం. మా ఖర్సులు ఎట్లా ఎల్లాలే దేవుడా అని మొక్కుకుంటున్నం’’ అన్నారు దీనంగా. ఇది శశికళ ఇంటి ఆవేదన. మరో గడపలో అడుగుపెడితే... అది దొంత కమల ఇల్లు. కోడలు శిరీషతో కలిసి కమల బీడీలు చుడుతోంది. ఈ ఇంట్లో మొత్తం ఎనిమిది మంది ఉంటారు. బీడీల పని దొరికితేనే ఈ కుటుంబానికి మూడు పూటల ముద్ద నోట్లోకి వెళ్లేది. ‘‘ఇప్పడి దాకా కిందికి మీదికో నెట్టుకొచ్చినమ్‌ గానీ.. ఈ జీఎస్‌టీ వచ్చినాక పని ఎక్కువ రోజులు దొరుకత లేదు, గిట్టుబాటు అయిత లేదు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అత్తాకోడళ్లు. ఈ రెండు కుటుంబాలే కాదు, బీడీలు చుట్టి బతికే మహిళాకార్మికులను ఎవరిని కదిలించినా ఇదే వేదన.

ఇందూరు నుంచి బీడీ పరిశ్రమ
పూర్వ కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, మెదక్‌ తదితర జిల్లాల్లో బీడీ కార్మికులు ఎక్కువగా ఉంటారు. వ్యవసాయం, చేనేత తర్వాత ఎక్కువ కుటుంబాలు ఆధారపడింది బీడీ పరిశ్రమపైనే. వ్యవసాయ, చేనేత రంగాల్లో పని లేకపోవడంతో మగవాళ్లు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తుంటారు. ఏడాదిలో పది నెలల వరకు బయటే ఉంటారు. మగవాళ్లు వచ్చే వరకు మహిళలు బీడీలు చుట్టి ఇంటిని నడుపుతుంటారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమ 1901 సంవత్సరంలో నిజామాబాద్‌ జిల్లా కేంద్రం(ఇందూరు) లో మొదలైంది. కిషాన్‌లాల్‌ రామ్‌ సురూప్‌ బీడీ కంపెనీ మొదట ప్రారంభమైంది. ఇక్కడి నుంచి బీడీ పరిశ్రమ ఇతర జిల్లాలకు విస్తరించింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 8.50 లక్షల మంది బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రధానంగా బడుగు, బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలే బీడీ పనిని నమ్ముకుని బతుకుతున్నారు. రాష్ట్రంలో రోజుకు దాదాపు 100 కోట్ల బీడీలు ఉత్పత్తి అవుతాయి. 40 నుంచి 50 కంపెనీలు పనిచేస్తున్నాయి. అయితే బీడీ కట్టపై పుర్రె గుర్తు పెట్టాలని గత యూపీఎ ప్రభుత్వం నిర్ణయంతో బీడీ పరిశ్రమపై అప్పట్లోనే తీవ్ర ప్రభావం పడింది. పుర్రెగుర్తు జీవోకు వ్యతిరేకంగా బీడీకార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. దీంతో పుర్రె బొమ్మ స్థానంలో ఊపిరితిత్తుల బొమ్మను ముద్రించారు. తరువాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం బీడీ కట్టలపై రెండు వైపులా 85 శాతం మేర గొంతు క్యాన్సర్‌ బొమ్మ వేయాలని 2016 ఆగస్టులో జీవో 727(ఈ) ని తీసుకువచ్చింది. కొత్తగా జీఎస్టీ పన్నుల భారం మహిళ కార్మికుల ఉపాధిని అగాధంలోకి నెట్టింది.

బీడీ కార్మికులకు మిగిలేది జబ్బులే...
బీడీల ఉత్పత్తి ద్వారా ఇంత టర్నోవర్‌ ఉన్నా బీడీలు చుట్టే వారికి జబ్పులు తప్ప మరేమీ మిగలడం లేదు. బీడీలు చుట్టడమంటే ఆరోగ్యాన్ని రోజుకింత కుళ్లపొడుచుకోవడమే. రోజుకు 12 నుంచి 16 గంటల శ్రమిస్తే తప్ప ఇల్లు గడవదు. మెడ, భుజం, వెన్ను, నడుం, కాళ్లనొప్పులు, టీబీ, క్యాన్సర్, గర్భకోశ, శ్వాసకోశ వ్యాధులు, జలుబు, దగ్గు, గ్యాస్‌ ట్రబుల్, నీరసం, నిస్సత్తువ, మలబద్దకం, రక్తహీనత, చూపు మందగించడం... ఇలాంటి సవాలక్ష అనారోగ్యాలే వీరు కూడబెట్టుకుంటున్న ఆస్తులు. బీడీలు చుట్టే తల్లులకు తొలికాన్పు గర్భశోకాన్నే మిగులుస్తుంది. ఎవరింట్లోనైనా తొలిబిడ్డ బతికితే పూర్వజన్న సుకృతంగా కళ్లకు అద్దుకుంటారు. తమకు పుట్టే శిశువు బరువు అతితక్కువగా ఉండటం మరో శాపం.

బీడీ పరిశ్రమపై జీఎస్టీ ప్రభావం...
బీడీ పరిశ్రమపై బీడీలకు 2.8 శాతం, తునికాకుపై 18 శాతం, పాగాకుపై ఐదు శాతం జీఎస్టీ నిర్ణయించారు. గతంలో అన్ని కలిపితే వెయ్యి బీడీలకు సెంట్రల్‌ ఎకై ్సజ్‌ టాక్స్‌ రూ.16లు ఉండేది. ఇప్పుడు జిఎస్‌టీ అమలుతో రూ.193ల వరకు అవుతోంది. ఫలితంగా బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న బీడీ కార్మికులు, ప్యాకింగ్‌ కార్మికులు, బట్టీ కార్మికులు, చాటన్‌ కార్మికులు, టేకేదార్లు, పొగాకు రైతులు, తునికాకు కూలీల బతుకులపై తీవ్ర ప్రభావం చూపనుంది. బీడీ పరిశ్రమపై జీఎస్టీ విధించడం మూలంగా ప్రత్యక్షం, పరోక్షంగా దీనిపై ఆధారపడ్డ 8.50 లక్షల మంది కార్మికుల ఉపాధి దెబ్బతినే ప్రమాదం ఉంది.

ఎవరికి లాభం?
బీడీలు తాగే వాళ్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. బీడీలు చుట్టే వాళ్ల ఆరోగ్యమూ పాడవుతుంది. మరి ఇంత పెద్ద పరిశ్రమలో లాభపడుతున్నదెవరంటే... ముమ్మాటికీ ప్రభుత్వమే, దానితోపాటు కంపెనీ యాజమాన్యాలు.

కేంద్రానికి ఆదాయం కోట్లలో...
నిజమే. పేదోడీ సిగిరెట్టుగా పేరున్న బీడీ ప్రభుత్వానికి భారీ ఆదాయమే సమకూర్చి పెడుతున్నది. గల్ఫ్‌ దేశాల్లో మంచి క్రేజ్‌ సంపాదించిన మన బీడీలు విదేశీమారక ద్రవ్యం ఆర్జించిపెడుతున్నాయి. మన దేశంలో రోజుకు సుమారు 150 కోట్ల బీడీలు తయారవుతుండగా, వాటిమీద ప్రభుత్వాలకు సెస్‌ రూపంలో రెండు కోట్ల రూపాయలు లభిస్తుందని ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. ప్రతిరోజూ ఇంత సొమ్మును ఖజానాలో జమ చేసుకుంటున్న ప్రభుత్వాలు... పొగుచూరిపోతున్న బతుకుల గురించి పట్టించుకోకపోవడమే బాధాకరం. మనదేశంలో ఏటా లక్ష నుంచి లక్షన్నర కోట్ల బీడీ వ్యాపారం జరుగుతోంది.
– గడ్డం రాజిరెడ్డి, సాక్షి, కరీంనగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement