నేను... భాద్రపద మాసాన్ని...
చాంద్రమానం ప్రకారం పున్నమి చంద్రుడు ఉత్తరాభాద్ర లేదా పూర్వాభాద్ర నక్షత్రాలలో సంచరిస్తుంటాడు కాబట్టి నాకా పేరు వచ్చింది. మొదటి పదిహేను రోజులూ దేవతల పక్షం... రెండో పదిహేను రోజులూ పితృదేతల పక్షంగా నన్ను అంటే భాద్రపద మాసాన్ని గుర్తుంచుకుంటారందరూ. అయితే నన్ను శూన్యమాసమని, శుభకార్యాలకు పనికిరానని చాలామంది చిన్నచూపు చూస్తారు కానీ, దేవతలలో ప్రథమ పూజనీయుడైన వినాయకుడు ఉద్భవించినదీ, విఘ్నేశ్వరునికి గణాధిపత్యం ఇచ్చి, లోకపూజ్యుడిని చేసిందీ ఈ మాసంలోనే అని ఎవరికీ గుర్తురావెందుకో!
వినాయక చవితి మర్నాడే కదా, సప్తరుషులను స్మరించుకునే ఋషిపంచమీ వ్రతం చేసుకునేది అందరూ! అంతేనా..? శ్రీ మహావిష్ణువు దశావతారాల్లోని వరాహ, వామనావతారాలు ధరించింది నా మాసంలోనే కదా! ఇంకా పరివర్తన ఏకాదశి, అనంత పద్మనాభస్వామి వ్రతం, ఉండ్రాళ్ల తదియ వంటి ఎన్నో పర్వదినాలు కూడా నా హయాంలోనే కదా అందరూ జరుపుకునేది!
ఒక్కోమాసం లో ఒక్కో దేవతకు ప్రాధాన్యమిచ్చే మన ఆచార సంప్రదాయాలు భాద్రపద మాసంలో పితృదేవతలకు పెద్దపీట వేశాయి.
మీ మనుషులకు ఒక సంవత్సరం పితృదేవతలకు ఒకరోజుతో సమానం. అందుకే ఏడాదికోసారి వారికి తద్దినం పెట్టడం లేదా తర్పణలు విడవడం సంప్రదాయం. అయితే కొన్ని వర్ణాలలో ఇలా తద్దినాలు పెట్టే అవకాశం, అలవాటు ఉండదు. అటువంటివారు నేను జరిగే పౌర్ణమి వెళ్లిన పాడ్యమి నుంచి అమావాస్య వరకు... దీనికే మహాలయపక్షమనీ, పితృపక్షమనీ పేరులెండి. ఈ కాలంలో ఇతర లోకాలలో ఉన్న తలిదండ్రులు, తాతముత్తాతలు, ఇతర బంధుమిత్రులకు తర్పణ వదిలి, వారి పేరు మీదుగా పేదలను లేదా బంధుమిత్రులను పిలిచి అన్నం పెడుతుంటారు. అలా పెడితే పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు.
మీ నమ్మకాలు, ఆచారాలు, విశ్వాసాల మాటెలా ఉన్నా, కనీసం పదిమంది పేద ల కడుపు నింపేందుకు అవకాశం కలుగుతున్నది నా మాసంలోనే కదా అనే ఆనందంతో నా గుండె నిండుతుంది. అసలు మీరు ఏ మర చి పని చేసినా భగవంతుడిపై విశ్వాసంతో మీ మీద మీరు పూర్తి నమ్మకంతో చేస్తే చాలు... అది విజయవంతమవుతుందని నేనంటాను. మీరేమనుకుంటారో మీ ఇష్టం. అన్నట్టు నన్ను భద్రకరమైన మాసమని కూడా అంటారు మరి మీకు తెలుసో లేదో!
- డి.వి.ఆర్.