D.V.R
-
ధర్మజుని గర్వభంగం
పురానీతి ధర్మరాజు అశ్వమేథ యాగం చేశాడు. ఈ సందర్భంగా ప్రజలందరికీ అన్నదానాలు, గోదానాలు, భూదానాలు, హిరణ్యదానాలు, వస్తుదానాలు చేశాడు. యాగం చేసిన రుత్విక్కులకు, బ్రాహ్మణులకు భూరిదక్షిణలిచ్చాడు. ధర్మరాజు దానగుణానికి అందరూ అనేక విధాలుగా ప్రశంసిస్తున్నారు. అది చూసి ధర్మజునిలో కొద్దిగా అహంకారం పొడసూపింది. ఇంతలో ఎక్కడినుంచి వచ్చిందో ఒక ముంగిస వచ్చింది. దాని శరీరం మూడువంతుల వరకు బంగారు రంగులో మెరుస్తోంది. అది సభాసదులను, ధర్మరాజును చూసి పకనకా నవ్వింది. అందరూ ఆశ్చర్యంగా, కోపంగా ‘‘ఎవరు నువ్వు? ఎలా వచ్చావిక్కడికి? ఎందుకు నవ్వుతున్నావు?’’ అని అడిగారు. ‘‘నేనెవరినో, ఎందుకు వచ్చానో తర్వాత చెబుతాను. మీరంతా ధర్మరాజును పొగడ్తలతో ముంచెత్తుతుంటే నవ్వు వచ్చింది. ఎందుకంటే, రారాజైన ధర్మరాజు చేసిన యాగం కానీ, దానధర్మాలు కానీ నిరుపేద బ్రాహ్మణుడైన సక్రుప్రస్థుడు చేసిన దానికన్నా గొప్పవి కావు కాబట్టి నవ్వొచ్చింది’’ అంది. ‘‘ఇంతకీ ఎవరా సక్రుప్రస్థుడు?’’ అనడిగాడు ధర్మరాజు అసూయగా. అప్పుడా ముంగిస ఇలా చెప్పింది. ‘‘కురుక్షేత్రంలో సక్రుప్రస్థుడనే పేద బ్రాహ్మణుడున్నాడు. ఆయనకు భార్య, కుమారుడు, కోడలు ఉన్నారు. వారు ఒక చిన్న పూరిపాక నిర్మించుకుని అందులో నివాసం ఉంటున్నారు. ఆ పక్కనే నా బిలం ఉంది. ఆయన వెదురుబియ్యాన్ని ఏరుకొస్తే, దానినే పిండి చేసుకుని అందరూ జీవించేవారు. ఉన్నదానిలోనే ఆయన అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ, సంతృప్తిగా జీవిస్తున్నాడు. ఆయన భార్య, కొడుకు, కోడలు అందరూ ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. ఒకసారి ఆ ప్రాంతంలో తీవ్రమైన దుర్భిక్షం నెలకొంది. దాంతో ఆయనకు వెదురుబియ్యమే కాదు, ఎక్కడా భిక్ష కూడా దొరకడం లేదు. ఆకలి బాధకు అందరూ ప్రాణాలు కళ్లల్లో పెట్టుకుని ఉన్నారు. ఈ పరిస్థితుల్లోనే ధర్మదేవతకు ఆయనను పరీక్షించాలని బుద్ధిపుట్టి వారి ఇంటికి బాటసారి వేషంలో అతిథిగా వచ్చాడు. అప్పటికే మూడురోజుల నుంచి పస్తులున్న ఆ కుటుంబం తలా పిడికెడు పేలపిండిని తినడానికి కూర్చున్నారు. ఇంతలో అతిథి రావడంతో ఇంటి యజమాని అతణ్ణి సాదరంగా ఆహ్వానించి, కాళ్లకు నీళ్లిచ్చి, విస్తరి వేసి తన వాటా పేలపిండిని సమర్పించాడు. అతిథికి ఆకలి తీరినట్టు కనిపించలేదు. దాంతో సక్రుప్రస్థుని భార్య తన వాటా ఇచ్చింది. అది తిన్నాక కూడా, అతిథి కళ్లల్లో ఆకలి తీరిన జాడలు కనిపించలేదు. కుమారుడు తన వంతు పేలపిండిని ఇచ్చాడు. ఊహు.. ఆకలి తీరనే లేదు. కోడలు తన పేలపిండిని తెచ్చి వడ్డించింది. అప్పుడా అతిథి తృప్తిగా తేన్చాడు. ఒకపక్క ఆకలితో ప్రాణాలు కడగట్టిపోతున్నా సరే, అతిథినే దేవుడిగా ఎంచిన ఇంటి యజమాని, అతని ఆకలి తీర్చడమే తన బాధ్యతగా భావించాడు. అతని బాటలోనే అతని భార్య, కొడుకు, కోడలు కూడా నడిచారు. వారి త్యాగానికి మెచ్చిన ధర్మదేవత తన నిజరూపంతో వారికి సాక్షాత్కారమిచ్చాడు. వారికోసం బ్రహ్మలోకం నుంచి విమానం వచ్చింది. ఆ నలుగురినీ వెంటబెట్టుకుని ధర్మదేవత సగౌరవంగా స్వర్గానికి తీసుకెళ్లాడు. ఇదంతా చూసిన నేను సక్రుప్రస్థుడు అతిథికి అర్ఘ్యమిచ్చిన నీటిలో పొర్లాడాను. ఆ నీటితో తడిసినంత మేరా నా శరీర భాగాలు బంగారు రంగులోకి మారిపోయాయి. మిగతావి కూడా సువర్ణమయం అవుతాయేమోనన్న ఆశతో నేను ఎన్నో యజ్ఞశాలలకు వెళ్లి, వారు యజ్ఞం చేసిన ప్రదేశంలో పొర్లాడుతున్నాను కానీ, నా శరీరం బురదమయం, బూడిద మయం అవుతున్నదేగానీ, సువర్ణరూపు సంతరించుకోనేలేదు. ఇంతలో ధర్మరాజు గురించి విని, ఇక్కడికి వచ్చాను. ఇప్పటివరకూ అతడు దానం చేసిన గోవులు తరలి వెళ్లగా ఏర్పడిన మడుగులో పొర్లాడి వచ్చాను కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. అది అతన్నే అడుగుదామని ఇక్కడికి వచ్చేసరికి మీరంతా అతన్ని పొగడ్తలతో ముంచెత్తడం చూసి నాకు నవ్వు వచ్చింది. ధర్మరాజు చేసిన దాన ధర్మాలేవీ భక్తితో చేసినవి కాదు. అహంకారంతో కూడుకున్నవి. అసలు అదంతా అతని కష్టార్జితం అయితేనే కదా... దాని ఫలితం అతనికి దక్కేది’’ అంటూ మరోమారు ఫక్కున నవ్వింది. ధర్మరాజుకు తల తీసేసినట్లయింది. అసంకల్పితంగా కృష్ణునివైపు చూశాడు. శ్రీకృష్ణుడు చిద్విలాసంగా చూస్తూ, జగన్మోహనంగా నవ్వాడు. ధర్మరాజుకు తన తప్పు తెలిసి వచ్చింది. - డి.వి.ఆర్ -
నేను... భాద్రపద మాసాన్ని...
చాంద్రమానం ప్రకారం పున్నమి చంద్రుడు ఉత్తరాభాద్ర లేదా పూర్వాభాద్ర నక్షత్రాలలో సంచరిస్తుంటాడు కాబట్టి నాకా పేరు వచ్చింది. మొదటి పదిహేను రోజులూ దేవతల పక్షం... రెండో పదిహేను రోజులూ పితృదేతల పక్షంగా నన్ను అంటే భాద్రపద మాసాన్ని గుర్తుంచుకుంటారందరూ. అయితే నన్ను శూన్యమాసమని, శుభకార్యాలకు పనికిరానని చాలామంది చిన్నచూపు చూస్తారు కానీ, దేవతలలో ప్రథమ పూజనీయుడైన వినాయకుడు ఉద్భవించినదీ, విఘ్నేశ్వరునికి గణాధిపత్యం ఇచ్చి, లోకపూజ్యుడిని చేసిందీ ఈ మాసంలోనే అని ఎవరికీ గుర్తురావెందుకో! వినాయక చవితి మర్నాడే కదా, సప్తరుషులను స్మరించుకునే ఋషిపంచమీ వ్రతం చేసుకునేది అందరూ! అంతేనా..? శ్రీ మహావిష్ణువు దశావతారాల్లోని వరాహ, వామనావతారాలు ధరించింది నా మాసంలోనే కదా! ఇంకా పరివర్తన ఏకాదశి, అనంత పద్మనాభస్వామి వ్రతం, ఉండ్రాళ్ల తదియ వంటి ఎన్నో పర్వదినాలు కూడా నా హయాంలోనే కదా అందరూ జరుపుకునేది! ఒక్కోమాసం లో ఒక్కో దేవతకు ప్రాధాన్యమిచ్చే మన ఆచార సంప్రదాయాలు భాద్రపద మాసంలో పితృదేవతలకు పెద్దపీట వేశాయి. మీ మనుషులకు ఒక సంవత్సరం పితృదేవతలకు ఒకరోజుతో సమానం. అందుకే ఏడాదికోసారి వారికి తద్దినం పెట్టడం లేదా తర్పణలు విడవడం సంప్రదాయం. అయితే కొన్ని వర్ణాలలో ఇలా తద్దినాలు పెట్టే అవకాశం, అలవాటు ఉండదు. అటువంటివారు నేను జరిగే పౌర్ణమి వెళ్లిన పాడ్యమి నుంచి అమావాస్య వరకు... దీనికే మహాలయపక్షమనీ, పితృపక్షమనీ పేరులెండి. ఈ కాలంలో ఇతర లోకాలలో ఉన్న తలిదండ్రులు, తాతముత్తాతలు, ఇతర బంధుమిత్రులకు తర్పణ వదిలి, వారి పేరు మీదుగా పేదలను లేదా బంధుమిత్రులను పిలిచి అన్నం పెడుతుంటారు. అలా పెడితే పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. మీ నమ్మకాలు, ఆచారాలు, విశ్వాసాల మాటెలా ఉన్నా, కనీసం పదిమంది పేద ల కడుపు నింపేందుకు అవకాశం కలుగుతున్నది నా మాసంలోనే కదా అనే ఆనందంతో నా గుండె నిండుతుంది. అసలు మీరు ఏ మర చి పని చేసినా భగవంతుడిపై విశ్వాసంతో మీ మీద మీరు పూర్తి నమ్మకంతో చేస్తే చాలు... అది విజయవంతమవుతుందని నేనంటాను. మీరేమనుకుంటారో మీ ఇష్టం. అన్నట్టు నన్ను భద్రకరమైన మాసమని కూడా అంటారు మరి మీకు తెలుసో లేదో! - డి.వి.ఆర్. -
మృదువుగా.. పదునుగా... అదనుగా
పుస్తకం పురాణ వాచస్పతి, కవి, కథకుడు, నాటకకర్త, ఆధునిక వ్యాసవాల్మీకిగా పేరొందిన ఉషశ్రీ తెలియని నాటి తరం వారుండరు. కారణం ఆయన మాటే. బంగారంలాంటి ఆయన పలుకే. ఖంగున మోగిన ఆ గొంతే! రామాయణ భారత భాగవతాలను సరళమైన భాషలో రచించి, మృదుగంభీరమైన నోట ఉపన్యాసాలు చెప్పిన ఉషశ్రీ భారత మహేతిహాసంలోని పాత్రలను మథించి, ఆ పాత్రల ద్వారా వ్యాసమహాముని పలికించిన పలుకు బంగారాలను పొల్లుపోకుండా భావగర్భితంగా, వ్యాఖ్యాన సహితంగా పండిత, పామర రంజకంగా అందించారు. ‘భారతంలో రాయబారాలు’గా అప్పటిలో వేలాది పాఠకులను అలరించింది ఈ చిన్నిపొత్తం. దీనికి కాలానుగుణంగా ఆయన రచనా వారసురాలు, ఆయుర్వేద వైద్యనిపుణురాలైన పెద్దకుమార్తె డాక్టర్ గాయత్రీదేవి చేసిన రూపాంతరమే ఈ ‘ఎవరు ఎలా మాట్లాడతారు?’. మహాభారతం ఉద్యోగపర్వంలోని ప్రత్యేక సన్నివేశాలలో ద్రుపద పురోహితుడు, సంజయుడు, శ్రీకృష్ణుడు, కర్ణుడు, విదురుడు, ధర్మరాజు, భీష్ముడు, కుంతి, ద్రౌపది వంటి వారు ఎవరు ఎలా మాట్లాడారో తెలుసుకుని, దానిని వ్యక్తిత్వ వికాస పాఠాలుగా ఎలా మలచుకోవాలో చెప్పే ఈ పుస్తకం ప్రతి ఇంటా ఉండదగ్గది, ప్రతి నోటా పలకదగ్గది. ఎవరు ఎలా మాట్లాడతారు? పుటలు: 56, వెల రూ. 50 ప్రతులకు: ఉషశ్రీ మిషన్, విజయవాడ, హైదరాబాద్ 8008551232,9848113681 - డి.వి.ఆర్ -
శని త్రయోదశి
వారం... పర్వం చాలామంది శని పేరు వింటేనే అరిష్టం అని, ఆయన విగ్రహాన్ని తాకితే ఆ దోషం ఎక్కడ తమకు అంటుకుంటుందో అని భయపడుతుంటారు. అయితే అవన్నీ అపప్రథలు మాత్రమే. వాస్తవానికి శని న్యాయాధికారి వంటి వాడు. ఆయన అకారణంగా ఎవరినీ బాధించడు. మానవుల పాపకర్మలను అనుసరించి గోచార రీత్యా ఆయా వ్యక్తులను ప్రేరేపించి వారితో ఆయా కర్మల ఫలితాలను అనుభవించేలా చేస్తాడు. అంతేకాదు, ఆయన చాలా సత్యదేవుడు. దానధర్మాలతో సత్యం, అహింసలను ఆచరిస్తూ, పవిత్రంగా జీవించేవారికి ఎటువంటి ఆపద వాటిల్లకుండా కాపాడుతూ వారికి సకల శుభాలను కలుగ చేస్తాడు. వైరాగ్యం కలిగించి భగవంతుని స్మరించమని గురువై బోధిస్తాడు. భయంతో కాకుండా, భక్తితో ఆయనను వేడుకుంటే సర్వశుభాలు కలిగి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. శనిదోష పరిహారానికి... శని త్రయోదశి రోజున తిల, తైలాభిషేకాలు చేయించి దానాలు ఇవ్వాలి. శనికి ప్రీతికరమైంది, శని దోష శాంతిని చేసేది అయ్యప్పదీక్ష. భైరవ స్తోత్రం చేసినా, ఆంజనేయుని అర్చించినా, వేంకటేశ్వరుని ఆరాధించినా శనిదేవుని ప్రసన్నం చేసుకోవచ్చు. శనివారం- త్రయోదశి తిథి శనీశ్వరుని తైలాభిషేకానికి శ్రేష్ఠమైనది. శని బాధలు పడేవారు జమ్మిచెట్టుకు లేదా రావిచెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు. అలాగే నల్లని వస్త్రం, నల్ల నువ్వులు, నల్లని వస్తువులు, గాజులు, నల్ల ద్రాక్ష మొదలైనవి జమ్మిచెట్టు వద్ద వదిలి వెళితే కష్టాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయని, ఆదివారం నాడు గో పూజ చేస్తే శనిదోషం పరిహారం కాగలదని విశ్వాసం. కాకులకు, నల్లచీమలకు, నల్ల కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల కూడా శనిబాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే వృద్ధులకు, వికలాంగులకు సేవ చేయడం వల్ల కూడా శని బాధల నుంచి గట్టెక్కవచ్చునని శాస్త్రం. (ఫిబ్రవరి 6 శని త్రయోదశి) - డి.వి.ఆర్ -
ఓం కారం... శబ్దాలకు ప్రధాన ద్వారం
అకార ఉకార మకారాలలో అకారం... భూమి, చె ట్లు లేదా ఇతర వస్తువులకు, ఉ కారం... ఆకారం, రూపం లేని నీరు, గాలి, నిప్పులకు, మకారం... ఆకృతి ఉండీ లేనటువంటివానికి ప్రతీకగా ఉండటం, అంటే ప్రపంచంలో దృఢమైన శక్తి కలిగి ఉండటం. ఈ మూడు పదాంశాలను కలిపితే ఓం వస్తుంది. అంటే ఈ మూడూ కలిస్తేనే సృష్టి అన్నమాట. ఓంకారాన్ని నిరంతరాయంగా ఉచ్చరిస్తూండటం వల్ల, శాశ్వతప్రపంచంలో, అంటే జీవుడు శరీరం విడిచిన తరవాత మోక్షం పొందగలుగుతాడు. అలౌకికం దేనిగురించయినా అదే మొదటిది అని చెప్పేటప్పుడు ఓం ప్రథమంగా అని చెబుతారు.ఎందుకంటే ఓంకారం అన్నింటికన్నా ముందుండేది. ఓంకారానికి మతపరంగా ఎనలే ని ప్రాధాన్యముంది. వేదపారాయణం చేసేటప్పుడు, ఇష్టదేవతలను స్తుతించేటప్పుడు ప్రతినామానికీ మొదటగా ఓంకారాన్ని చేర్చిన తర్వాతే ఉచ్చరిస్తారు. సృష్టి ప్రారంభమయ్యాక వచ్చిన మొట్టమొదటి అక్షరం ఓంకారమని వే దోక్తి. ఓంకారం నుంచి వెలువడే ప్రతిధ్వనులు భగవంతుడు సర్వవ్యాపకుడని వివరిస్తాయి. బౌద్ధం, జైనం, హిందూ... ఏ మతంలోనైనా దీనికి ప్రాధాన్యత ఎక్కువ. దీనికే ప్రణవ నాదమని కూడా పేరు. ఓంకారాన్ని నాసికతో సుదీర్ఘంగా పలుకుతారు. ఓంకారం అన్ని శబ్దాలకు ప్రధానద్వారం. ఓం అనేది ఏకాక్షరం. పంచ పరమేష్ఠుల నుంచి తయారుచేయబడిందనేది వారి విశ్వాసం. ఓం నమః అనేది నమక మంత్రానికి సూక్ష్మరూపం. ఓంకారాన్ని మొట్టమొదటగా ఉపనిషత్తులు వర్ణించాయి. ఇది ఒక్క భారతీయ సంప్రదాయంలోనే కాదు,నేపాల్లో కూడా ఓం అనే అక్షరం అన్నిచోట్లా కనిపిస్తోంది. ఓం అనేది భగవంతుడి పేరు. ఆయనకు సంబంధించిన ప్రతిధ్వని. ఒక్కొక్క అక్షరాన్నీ వరసగా పరిశీలిస్తే అకార ఉకార మకారాలు. ఇది ఆధ్యాత్మికశక్తిని ఈ మూడు శబ్దాలలో చూపుతుంది. ఓంకారం చేత మనలో శక్తి ప్రజ్జ్వరిల్లి ఆ శబ్దోచ్చారణ వల్ల సమాధిస్థితి కలిగి అంత్యాన అపరిమితానందం కలుగుతుంది. ఓంకారం నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని తెలియచేస్తుంది. అక్షరాలన్నీ ఏర్పడి సగుణబ్రహ్మగా మారుతుంది. మూలాధారంతో బ్రహ్మానందాన్ని కలిగిస్తుంది.. శరీరంలో ఉన్న నాడీవ్యవస్థలో ఇడ (కుడివైపున ఉన్నవి) అ కారంతోను, పింగళ (ఎడమవైపున ఉన్నవి) ఉ కారంతోను, సుషుమ్న (మధ్యలో ఉన్నవి) నాడీ వ్యవస్థ మ కారంతోనూ ఉత్తేజం చెంది, స్వస్థత పొందుతాయి. ఆర్యసమాజం ఓంకారాన్ని దైవస్వరూపంగా భావించింది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునితో, ‘నేను ఈ సృష్టికి తండ్రిని. నేనే తల్లిని, ఆధారాన్ని కూడా నేనే. జ్ఞానాన్ని ప్రసాదించే ఓంకారాన్ని నేనే అని ఓంకారం గురించి వివరించాడు. బ్రహ్మశక్తి (సృష్టి), విష్ణుశక్తి (స్థితి), శివశక్తి (లయ) ఓం అనేది ఒక ప్రతీకాత్మక చిహ్నం. విశ్వమంతా ఇదే. మనం దేనిని చూస్తున్నామో, దేనిని స్పృశిస్తున్నామో, దేనిని వింటున్నామో, దేనిని అనుభూతి చెందుతున్నామో అదంతా ఓంకారమే. మన పరిధిలో ఉండేది మాత్రమే కాక, మన పరిధిని దాటి ఉన్నది కూడా ఓంకారమే. మనం ఓంకారాన్ని శబ్ద మాత్రంగా పరిగణించినా, భగవంతునికి ప్రతీకగా భావించినా అన్నిటినీ కోల్పోయినట్టే. - డి.వి.ఆర్