
మృదువుగా.. పదునుగా... అదనుగా
పురాణ వాచస్పతి, కవి, కథకుడు, నాటకకర్త, ఆధునిక వ్యాసవాల్మీకిగా పేరొందిన ఉషశ్రీ తెలియని నాటి తరం వారుండరు.
పుస్తకం
పురాణ వాచస్పతి, కవి, కథకుడు, నాటకకర్త, ఆధునిక వ్యాసవాల్మీకిగా పేరొందిన ఉషశ్రీ తెలియని నాటి తరం వారుండరు. కారణం ఆయన మాటే. బంగారంలాంటి ఆయన పలుకే. ఖంగున మోగిన ఆ గొంతే! రామాయణ భారత భాగవతాలను సరళమైన భాషలో రచించి, మృదుగంభీరమైన నోట ఉపన్యాసాలు చెప్పిన ఉషశ్రీ భారత మహేతిహాసంలోని పాత్రలను మథించి, ఆ పాత్రల ద్వారా వ్యాసమహాముని పలికించిన పలుకు బంగారాలను పొల్లుపోకుండా భావగర్భితంగా, వ్యాఖ్యాన సహితంగా పండిత, పామర రంజకంగా అందించారు.
‘భారతంలో రాయబారాలు’గా అప్పటిలో వేలాది పాఠకులను అలరించింది ఈ చిన్నిపొత్తం. దీనికి కాలానుగుణంగా ఆయన రచనా వారసురాలు, ఆయుర్వేద వైద్యనిపుణురాలైన పెద్దకుమార్తె డాక్టర్ గాయత్రీదేవి చేసిన రూపాంతరమే ఈ ‘ఎవరు ఎలా మాట్లాడతారు?’. మహాభారతం ఉద్యోగపర్వంలోని ప్రత్యేక సన్నివేశాలలో ద్రుపద పురోహితుడు, సంజయుడు, శ్రీకృష్ణుడు, కర్ణుడు, విదురుడు, ధర్మరాజు, భీష్ముడు, కుంతి, ద్రౌపది వంటి వారు ఎవరు ఎలా మాట్లాడారో తెలుసుకుని, దానిని వ్యక్తిత్వ వికాస పాఠాలుగా ఎలా మలచుకోవాలో చెప్పే ఈ పుస్తకం ప్రతి ఇంటా ఉండదగ్గది, ప్రతి నోటా పలకదగ్గది.
ఎవరు ఎలా మాట్లాడతారు?
పుటలు: 56, వెల రూ. 50
ప్రతులకు: ఉషశ్రీ మిషన్, విజయవాడ, హైదరాబాద్
8008551232,9848113681
- డి.వి.ఆర్