శని త్రయోదశి
వారం... పర్వం
చాలామంది శని పేరు వింటేనే అరిష్టం అని, ఆయన విగ్రహాన్ని తాకితే ఆ దోషం ఎక్కడ తమకు అంటుకుంటుందో అని భయపడుతుంటారు. అయితే అవన్నీ అపప్రథలు మాత్రమే. వాస్తవానికి శని న్యాయాధికారి వంటి వాడు. ఆయన అకారణంగా ఎవరినీ బాధించడు. మానవుల పాపకర్మలను అనుసరించి గోచార రీత్యా ఆయా వ్యక్తులను ప్రేరేపించి వారితో ఆయా కర్మల ఫలితాలను అనుభవించేలా చేస్తాడు. అంతేకాదు, ఆయన చాలా సత్యదేవుడు. దానధర్మాలతో సత్యం, అహింసలను ఆచరిస్తూ, పవిత్రంగా జీవించేవారికి ఎటువంటి ఆపద వాటిల్లకుండా కాపాడుతూ వారికి సకల శుభాలను కలుగ చేస్తాడు. వైరాగ్యం కలిగించి భగవంతుని స్మరించమని గురువై బోధిస్తాడు. భయంతో కాకుండా, భక్తితో ఆయనను వేడుకుంటే సర్వశుభాలు కలిగి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది.
శనిదోష పరిహారానికి...
శని త్రయోదశి రోజున తిల, తైలాభిషేకాలు చేయించి దానాలు ఇవ్వాలి. శనికి ప్రీతికరమైంది, శని దోష శాంతిని చేసేది అయ్యప్పదీక్ష.
భైరవ స్తోత్రం చేసినా, ఆంజనేయుని అర్చించినా, వేంకటేశ్వరుని ఆరాధించినా శనిదేవుని ప్రసన్నం చేసుకోవచ్చు.
శనివారం- త్రయోదశి తిథి శనీశ్వరుని తైలాభిషేకానికి శ్రేష్ఠమైనది. శని బాధలు పడేవారు జమ్మిచెట్టుకు లేదా రావిచెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు. అలాగే నల్లని వస్త్రం, నల్ల నువ్వులు, నల్లని వస్తువులు, గాజులు, నల్ల ద్రాక్ష మొదలైనవి జమ్మిచెట్టు వద్ద వదిలి వెళితే కష్టాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయని, ఆదివారం నాడు గో పూజ చేస్తే శనిదోషం పరిహారం కాగలదని విశ్వాసం. కాకులకు, నల్లచీమలకు, నల్ల కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల కూడా శనిబాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే వృద్ధులకు, వికలాంగులకు సేవ చేయడం వల్ల కూడా శని బాధల నుంచి గట్టెక్కవచ్చునని శాస్త్రం.
(ఫిబ్రవరి 6 శని త్రయోదశి)
- డి.వి.ఆర్