చెన్నై : కమల్ హాసన్ హోస్ట్‌గా విశేష ఆదరణ పొందిన బిగ్ బాస్ తమిళ్ మూడో సీజన్ ఈనెల 23న ప్రారంభం కావాల్సి ఉండగా ఈ షోపై నీలినీడలు అలుముకున్నాయి. బిగ్ బాస్ షో న్యాయపరమైన వివాదంలో కూరుకుపోయింది. గత రెండు సీజన్‌లు భారీగా సక్సెస్ కావడంతో మూడో సీజన్‌పై అభిమానులు భారీ ఆశలు పెంచుకోవడంతో పాటు ప్రేక్షకుల్లోనూ అంచనాలు మిన్నంటాయి. కాగా, వివాదాస్పద బిగ్ బాస్ షోను నిషేధించాలని కోరుతూ సుధన్ అనే అడ్వకేట్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
బిగ్ బాస్ తమిళ్‌లో హౌస్‌మేట్స్ పొట్టి దుస్తులు ధరించడంతో పాటు పిల్లలు, యువతను తప్పుదారిపట్టించేలా అశ్లీల అర్ధాలు ధ్వనించేలా మాట్లాడుతున్నారని పిటిషనర్ తన పిటిషన్‌లో అభ్యంతరం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. మరోవైపు ఇండియన్ బ్రాడ్‌కాస్ట్ ఫౌండేషన్ (ఐబీఎఫ్)నుంచి సెన్సార్ సర్టిఫికెట్ లేకుండా ఈ షోను ప్రసారం చేసేందుకు అనుమతించరాదని కూడా పిటిషనర్ న్యాయస్ధానాన్ని కోరినట్టు సమాచారం. మద్రాస్ హైకోర్టు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిందని, త్వరలోనే విచారణ చేపడతారని తెలిసింది. మరికొన్ని రోజుల్లో బిగ్‌బాస్ తమిళ్ సీజన్ త్రీ ప్రారంభం కానున్న సమయంలో ఈ షోను న్యాయపరమైన వివాదాలు చుట్టుముట్టడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment