ఇంపుగా I పలికే P లక్షణం L | Biography of Vindhya Visakha | Sakshi
Sakshi News home page

ఇంపుగా I పలికే P లక్షణం L

Published Mon, May 7 2018 1:34 AM | Last Updated on Mon, May 7 2018 1:34 AM

Biography of Vindhya Visakha - Sakshi

ఐపీఎల్‌ హోస్ట్‌ కావాలంటే ఇంపుగా పలికే లక్షణం... దాంతోపాటు... విన్నర్‌ కావాలనే ఆశయం ఉండాలి. సెంచరీ కొట్టే స్ఫూర్తి ఉండాలి. టెస్ట్‌ మ్యాచ్‌లో సాధించే లక్ష్యాలు... ట్వంటీ ట్వంటీలోనే సాధించేయాలనే తపన ఉండాలి. వింధ్యలో అవన్నీ ఉన్నాయి. ఆమెను విజేతగా చూడాలన్న అమ్మ, అమ్మమ్మ, నానమ్మల ఆశలు... ఆమెను శిఖరం వైపు అడుగులు వేయిస్తున్నాయి.


ఓణీ వేసుకుని, చెవులకు జూకాలు పెట్టుకుని కోలాటం వేసేటప్పుడు ఆమెలో అచ్చమైన తెలుగుదనంతోపాటు ముఖంలో స్నిగ్ధత్వం కనిపిస్తుంది. సినిమాల ఆడియో లాంచ్‌ ప్రోగ్రామ్‌ నిర్వహించేటప్పుడు అతిశయించిన ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. ఫ్యాషన్‌ షోలో ర్యాంప్‌ మీద నడుస్తున్నప్పుడు ఆధునికతకు ఆహ్వానం పలుకుతున్నట్లు కనిపిస్తుంది మేడపాటి వింధ్య విశాఖ. రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌ వింధ్య సొంతూరు.

అమ్మ పుట్టిల్లు సికింద్రాబాద్‌. బాల్యం అంతా ఘట్‌కేసర్, సికింద్రాబాద్‌ల మధ్య సాగింది. ప్రాథమిక విద్య ఘట్‌కేసర్‌లో. వారాంతం సికింద్రాబాద్‌ అమ్మమ్మ దగ్గరకు ప్రయాణం. సికింద్రాబాద్‌లోని సెయింట్‌ఆన్స్‌ గర్ల్స్‌ హైస్కూల్‌కి వచ్చాక సెలవులు వస్తే నానమ్మ ఊరికి పరుగులు. ఒక్కమాటలో చెప్పాలంటే అచ్చమైన బాల్యాన్ని చూసింది. తండ్రి గుర్రం స్వారీ చేస్తున్నప్పుడు హీరోలా కనిపించేవాడామెకి. అప్పటి నుంచి ఐపిఎల్‌ హోస్ట్‌గా ఎంపికయ్యే వరకు ఉద్వేగభరితమైన ఆనంద క్షణాలు జీవితంలో ఎన్నో ఉన్నాయంటారామె.

అన్నా హజారే ఉద్యమం
డిగ్రీకి కస్తూర్బా గాంధీ కాలేజ్‌లో చేరడం వింధ్య జీవితంలో పెద్ద మలుపు అనే చెప్పాలి. చదువులో, ఆటల్లో చురుగ్గా ఉండే అమ్మాయి కావడంతో కాలేజ్‌లో ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీ అంటే ఆమె పేరే గుర్తొచ్చేది. ఇష్టంగా కొన్ని, లెక్చరర్‌లు పేరు రాసేసుకున్నారు కాబట్టి కొన్నింటిలో పాల్గొనేది. ‘మిస్‌ కస్తూర్బా’ పోటీల్లో విజేత ఆమె.

ఫ్రెష్‌ మిస్‌ బ్యూటిఫుల్‌ స్మైల్, ఫ్రెష్‌ ఫేస్‌ టైటిల్స్‌ అందుకునే వరకు మోడలింగ్‌ వంటి గ్లామర్‌ ఫీల్డ్‌ మీద పెద్దగా అవగాహన లేదామెకు. డిగ్రీ తొలి ఏడాది ఇలా ప్రైజ్‌లందుకుంటూ గడిచిపోయింది. రెండవ ఏడాదిలో ఉన్నప్పుడు అన్నా హజారే లోక్‌పాల్‌ కోసం ఉద్యమించారు. దేశమంతటా అవగాహన సదస్సులు జరుగుతున్నాయి. అసెంబ్లీలో నిర్వహించిన డిబేట్‌లో కస్తూర్బా కాలేజ్‌కు ప్రాతినిథ్యం వహించారు వింధ్య.

లోక్‌పాల్‌ గురించి ఆమె మాట్లాడుతున్న తీరు, విషయాన్ని నిరాఘాటంగా, నిర్భయంగా, ఆత్మవిశ్వాసంతో వ్యక్తీకరిస్తున్న విధానం పలువురి దృష్టిని ఆకర్షించింది. మానిటర్‌ మీద వింధ్య హావభావాలు, ఆంగికం, వాచకం చక్కగా అమరినట్లు ఉన్నాయి. ‘ఆ అమ్మాయికి వార్తలు చదవడం ఇష్టమేమో అడగండి’ అని నిర్వాహకులకు వర్తమానం అందింది.

మూడు నెలలు పట్టింది
‘‘మా ఇంట్లో ఎవరూ న్యూస్‌ మీడియాలో లేరు. ‘ఎస్‌’ అనడానికి ధైర్యం అసలే లేదు. వాళ్లు చాలా కన్విన్స్‌ చేశారు. ‘వార్తలు చదవాలా వద్దా’ అనే నిర్ణయానికి తర్వాత రావచ్చు. అప్పుడప్పుడూ ఆఫీస్‌కి వచ్చి చూసి వెళ్తూ ఉంటే, ఈ వాతావరణం అర్థమవుతుందన్నారు. పెద్దవాళ్లు అంతగా చెప్పారు కదా అని నాలుగైదు సార్లు వెళ్లాను.

జస్ట్‌ ఆఫీస్‌ చూడడం, అక్కడ ఏమేం పనులు జరుగుతుంటాయో, ఎలా జరుగుతుంటాయో తెలుసుకోవడమే. మూడు నెలల తర్వాత వార్తలు చదువుతానని చెప్పాను. అలా హెచ్‌ఎమ్‌టీవీతో నా జర్నీ మొదలైంది. అప్పటికి నేను డిగ్రీ సెకండియర్‌లోనే ఉన్నాను’’ అని తన కెరీర్‌ తొలినాళ్లను గుర్తు చేసుకున్నారు వింధ్య.

మళ్లీ టీవీకి
న్యూస్‌ రీడర్‌గా ఉన్నప్పుడు డెంటల్‌ ట్రీట్‌మెంట్‌ కోసం కొంత గ్యాప్‌ తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు మోడలింగ్‌ అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. మన గౌరవానికి ఇబ్బంది కలగనంత వరకు ఎప్పుడు ఏ అవకాశం వస్తే దానిని అందిపుచ్చుకోవాలనేది ఆమె అనుసరించిన జీవన సూత్రం. ఓ ఏడెనిమిది నెలలకు ఆ రంగంలో ఉండే అసౌకర్యాలు అర్థమవసాగాయి.

కొందరు కోఆర్డినేటర్‌లు వృత్తిపరమైన ఫోన్‌ కాల్స్‌ చేయకూడని టైమ్‌లో ఫోన్‌ చేసేవాళ్లు. అత్యవసరమైతే తప్పదు, దానికి తప్పు పట్టాల్సిన పని లేదు. నిజానికి మోడలింగ్‌ థీమ్‌ గురించి అప్పుడే మాట్లాడి తీరాల్సిన తప్పని సరి పరిస్థితులేవీ లేకపోయినా అలాంటి వంకతో ఫోన్‌ కాల్స్‌ వచ్చేవి. ఆ కారణంతోనే మోడలింగ్‌ని వదిలేశానంటున్నారు వింధ్య.

డెంటల్‌ ట్రీట్‌మెంట్‌ తర్వాత తిరిగి టీవీలోకి వచ్చేశారు. ఆ రావడం రావడం... సినిమా వార్తలు, సినీ అవార్డు వార్తలు – విశేషాలతోపాటు జువెలరీ షో, రెడ్‌కార్పెట్, హాట్‌వీల్, చాయ్‌బిస్కట్, హంగామా, సఖిలను సమర్థంగా నిర్వహిస్తూ  మా ఊరి వంట అంటూ తెలుగింటి రుచిని చూపించారు. గార్డెన్‌ పెంచడం, చక్కగా వంట చేయడం, కొత్త కొత్త ప్రదేశాల్లో పర్యటించడం ఆమె హాబీ. ఆఫ్రికా, అమెరికాలలో షోలు చేసే అవకాశం వచ్చినప్పుడు అది పర్యటనలకు కూడా కలిసొచ్చిన అదృష్టంగా భావించారు.

ఆరేళ్లలో నేర్చుకున్నది కొండంత
‘‘కస్తూర్బా కాలేజ్‌ నన్ను విలువలతో జీవించేటట్లు తీర్చిదిద్దింది. మన జీవితం మనకోసం మాత్రమే కాదు సమాజం కోసం కూడా అని నేర్పించింది. అయితే నన్ను ఈ రోజు ఐపీఎల్‌ హోస్ట్‌గా నిలబెట్టింది మాత్రం టీవీలో పనిచేసిన అనుభవమే. 2012 నుంచి 150కి పైగా ఇంటర్వ్యూలు చేశాను. మనకంటే ఎక్కువ తెలిసిన వాళ్లను ఇంటర్వ్యూ చేయడానికి బాగా హోమ్‌వర్క్‌ చేయాలి. నేర్చుకోవడానికి అది గొప్ప అవకాశం.

ప్రభాస్, కమల్‌హాసన్, విక్రమ్‌ వంటి గొప్ప హీరోలు ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం చాలా ఆశ్చర్యం వేసింది. ‘ఐ’ సినిమా రిలీజ్‌ అయినప్పుడు విక్రమ్‌గారు ఆ సినిమా ఎలా ఉందని అడిగారు. అప్పటికే ఎన్నోసార్లు నిరూపణ అయిన పెర్‌ఫార్మెన్స్‌ ఆయనది. అయినా సరే...  ప్రతి సినిమాని పరీక్షలాగానే భావిస్తారు. ప్రేక్షకులు అంగీకరిస్తున్నారా లేదా అనే గమనింపు చాలా ఎక్కువ. ప్రభాస్‌గారు చాలా నిజాయితీగా మాట్లాడతారు. అలా ఒక్కో ఇంటర్వ్యూ నాకు ఒక్కో మంచి విషయాన్ని నేర్పించింది.

క్రికెట్‌ పాఠం నేర్చుకున్నాను
స్కూల్లో కబడ్డీ బాగా ఆడేదాన్ని. నాకు ఇష్టమైన ఆట కావడంతో ప్రో కబడ్డీకి కామెంటేటర్‌ అవకాశం వచ్చినప్పుడు చాలా సంతోషించాను. కానీ ఐíపీఎల్‌కి హోస్ట్‌ చేయడానికి కొంత సంశయించిన మాట నిజమే. ఎందుకంటే నేను క్రికెట్‌ మ్యాచ్‌లు చూస్తాను. కానీ ఆట మీద పెద్దగా పట్టులేదు. అది కూడా ముంబయిలో ఉద్యోగం. హైదరాబాద్‌లో ఇన్ని అవకాశాలుంటే ముంబయి వెళ్లి చేయడం అవసరమా అనిపించింది.

పెద్ద బ్యానర్‌లో పని చేస్తే ఆ అనుభవం కెరీర్‌లో బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే అంగీకరించాను. ఆ తర్వాత క్రికెట్‌ను పాఠంలా నేర్చుకున్నాను. బ్యాటు, బాలుతో పిచ్‌ మీద ఆడలేదనే కానీ, ఇప్పుడు క్రికెట్‌ రూల్స్, ఆటగాళ్ల రికార్డులు కంఠతా వచ్చినట్లే. ప్రీ మ్యాచ్, పోస్ట్‌ మ్యాచ్, మ్యాచ్‌ ఎనాలసిస్‌ను హోస్ట్‌ చేయడం కూడా కుకరీ ప్రోగ్రామ్‌ చేసినట్లే చేయగలుగుతున్నాను.

నూరుశాతం శ్రమించడమే
నాకు అవకాశాల కోసం పరుగులు తీయాల్సిన అవసరం రాలేదు. కానీ ఒకసారి ఒప్పుకున్న తర్వాత ఆ పనిలో ఇన్‌వాల్వ్‌ అయిపోయి నూరుశాతం ఇవ్వడానికి ప్రయత్నించేదాన్ని. ఆ అంకితభావమే ఈ రోజు నన్ను ఈ స్థాయికి తెచ్చింది. నిజానికి ‘ఐపీఎల్‌ హోస్ట్‌గా తొలి తెలుగు మహిళ’ అనే రికార్డు యాదృచ్ఛికమే కావచ్చు. ఒక క్రికెట్‌ ప్లేయర్‌ సెంచరీ చేయడమే టార్గెట్‌ చేసుకున్నట్లు ఒక లక్ష్యంతో చేసిన రికార్డు కాదది.

ఐపీఎల్‌ నిర్వాహకులు తెలుగు కామెంటరీ ప్రవేశపెట్టాలనుకున్నారు. వారి ఎంపికలో నాకు అవకాశం వచ్చింది. నా ట్రాక్‌ రికార్డే నన్ను ఈ రికార్డుకు దగ్గర చేసింది. అయితే తొలి తెలుగు మహిళా హోస్ట్‌ అనే ట్యాగ్‌ నాకు ఎప్పటికీ ఉంటుంది. ఆ సంగతి ఎప్పుడు తలుచుకున్నా సరే... చిన్నప్పుడు మా నాన్న హార్స్‌ రైడింగ్‌ చేస్తున్నప్పుడు కలిగిన ఉద్వేగభరితమైన ఆనందమే కలిగి తీరుతుంది. ఆ సంతోషం  పువ్వుకు తావిలా నన్ను జీవితాంతం అంటి పెట్టుకునే ఉంటుంది.

మా పేరెంట్స్‌ మమ్మల్ని (నన్ను, అన్నయ్యను) నిరాశావాదంతో రోజులు గడిపేటట్లు పెంచలేదు, ఆశావహ దృక్పథంతో సంతోషాలను ఆస్వాదిస్తూ జీవించడమే నేర్పించారు. అందుకే నాకు జీవితంలో ప్రతి అంశంలో మంచిని చూడడం అలవాటైంది’’ అన్నారు వింధ్య.

కెరీర్‌తోపాటు వింధ్య చేసే పనులు చూస్తే తల్లిదండ్రులు ఆమెకు... లేనిదాని కోసం అర్రులు చాచకుండా, ఉన్న దానిని పంచడంలో ఆనందాన్ని పొందడాన్ని నేర్పించారనే అనిపిస్తుంది. ఆమె స్థాపించిన స్వేచ్ఛ ఫౌండేషన్‌ ద్వారా ఎనిమిది మంది విద్యార్థులను చదివిస్తున్నారు. పర్యావరణం పట్ల అవగాహన కలిగించడానికి చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లేటప్పటికి ఆమె కోసం ఎదురు చూసే పెట్‌డాగ్స్‌ ఇరవైకి పైగా ఉంటాయి.

పెళ్లి గురించి అడిగినప్పుడు సమాధానం దాటవేయకుండా సూటిగా ‘త్వరలోనే పెళ్లి గురించి ఓపెన్‌గానే ప్రకటిస్తాను. నా జీవితభాగస్వామి తన తల్లిదండ్రులను గౌరవించినట్లే మా అమ్మానాన్నలను కూడా గౌరవించాలని కోరుకుంటున్నాను. నన్ను ఇష్టపడినట్లే నా ప్రొఫెషన్‌ని కూడా ఇష్టపడాలి. అలాంటి అబ్బాయే నాకు వరుడవుతాడు’ అని చెప్పారు. వింధ్యకు యాంకర్‌ సుమ రోల్‌మోడల్‌. సుమలాగానే కెరీర్‌ని, కుటుంబాన్ని చక్కగా బ్యాలెన్స్‌ చేసుకుంటూ పరిపూర్ణమైన జీవితాన్ని జీవించాలనేది వింధ్య ఆశయం. ఆల్‌ ది బెస్ట్‌.

తాతయ్య ఒప్పుకుని ఉంటే...
మా తాతయ్య ఒప్పుకుని ఉంటే మా అమ్మ స్పోర్ట్స్‌ పర్సన్‌గా ప్రపంచానికి పరిచయమై ఉండేది. పెళ్లయి, అన్నయ్య, నేను పుట్టిన తరవాత కూడా అమ్మకి ఆ అసంతృప్తి పోలేదు. ఆడపిల్లగా పుట్టినందువల్ల ఎదురైన ఆంక్షలే అవన్నీ అనేది. అమ్మమ్మ కూడా... అప్పట్లో తాతయ్యకు నచ్చచెప్పి అమ్మను ప్రోత్సహించి ఉంటే మంచి స్పోర్ట్స్‌ పర్సన్‌ అయ్యేదని బాధపడుతుండేది. వాళ్లిద్దరూ నాలో ఒక విజేతను చూడాలని ఆశపడ్డారు.

నానమ్మ కూడా వాళ్ల తరంలో ఆడపిల్లకు అందుబాటులో లేని స్వేచ్ఛను నాకిచ్చారు. నువ్వు ఏ ఫీల్డ్‌ ఎంచుకున్నా సరే, దానికి రాణింపు వచ్చేలా శ్రమించాలని చెప్పేవారు. ఆ ప్రొఫెషన్‌ వల్ల నీకు, నీ పని తీరు వల్ల ఆ పనికి గౌరవం పెరగాలి. ‘ఫలానా అమ్మాయి తనకు వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసింది, ప్రొఫెషన్‌కే మచ్చ తెచ్చింద’న్నట్లు ఉండకూడదని చెప్పేవారు. వాళ్లిచ్చిన ధైర్యంతోపాటు వాళ్ల హెచ్చరికలు కూడా గుర్తు వస్తూనే ఉంటాయి.

ప్రతిభకు ఆకాశమే హద్దు
ఆడవాళ్లకు పెళ్లి, పిల్లల కారణంగా కెరీర్‌లో కొంత గ్యాప్‌ తప్పకపోవచ్చు. కానీ పెళ్లి అడ్డంకి కాకూడదు. ఇంట్లో ఉండి కూడా అనేక రంగాల్లో తమ ప్రతిభను నిరూపించుకోవచ్చు. ఫ్యాషన్‌ డిజైనింగ్, వంటల పుస్తకాలు రాయడం, బ్లాగ్‌లు నిర్వహించడం వంటివి చేయవచ్చు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్‌ ఉంటుంది. ఎక్స్‌ప్లోర్‌ యువర్‌సెల్ఫ్‌ అంటాను. ఇష్టమైన ఏ రంగాన్నయినా ఎంచుకోవచ్చు.

అడుగు పెట్టిన రంగంలో ప్రతి అవకాశాన్ని ఒక్కో సోపానంగా భావిస్తూ శిఖరానికి ఎదగాలి. అంతే తప్ప... మనకు పెద్ద పెద్ద లక్ష్యాలు ఉన్నాయి కదా అని ఎవరూ మనల్ని నేరుగా తీసుకెళ్లి పెద్ద హోదాలో కూర్చోబెట్టరు. అలా ఎవరైనా గాడ్‌ఫాదర్‌లుండి కూర్చోబెట్టినా వాళ్ల సపోర్టు హ్యాండ్‌ పక్కకు తీయగానే దబ్బున పడిపోతాం. మనకు మనమే ప్రతిదీ నేర్చుకుంటూ ఎదిగినప్పుడే ఆ ఎదుగుదల పటిష్టంగా ఉంటుంది. – వింధ్య విశాఖ మేడపాటి, ఐపీఎల్‌ హోస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement