ఇది ఐపీఎల్ సీజన్. ఓ అమ్మాయి కామెంటరీ ఇస్తోంది. ‘అరే! తెలుగమ్మాయి. చక్కగా మాట్లాడుతోంది. బాడీ లాంగ్వేజ్ ప్రొఫెషనల్‌గా ఉంది. ఏ ముంబయి అమ్మాయో అనుకునేటట్లు ఉంది’ అని టీవీక్షకుల కళ్లను ఆకర్షిస్తోన్న ఆ అమ్మాయి పేరు వింధ్య విశాఖ మేడపాటి. స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా మగవాళ్లను మాత్రమే చూసిన తెలుగు తెరకు పరిచయమైన తొలి తెలుగమ్మాయి.
వింధ్య ఇప్పుడు ముంబయిలో ఉన్న మాట నిజమే. కానీ ఆమె అచ్చమైన హైదరాబాదీ. పుట్టింది ఘట్‌కేసర్, హైస్కూల్ నుంచి సికింద్రాబాద్‌లోని అమ్మమ్మగారింట్లో పెరిగింది. నాన్న గుర్రపు స్వారీ చేసేవాడు, జీవితంలో రాజీ పడాల్సిన అవసరం లేని జీవితం ఆయనది. అమ్మ మాత్రం తనను క్రీడాకారిణి కానివ్వకుండా ఆపిన సంప్రదాయపు ఇనుప కచ్చడాన్ని తలచుకుంటూ బాధపడుతుండేది. ‘ఆడపిల్లలు ప్యాంటులేసుకుని ఆటలాడడం ఏంటి’ అని తాతయ్య మొండిపట్టు పట్టకుండా ఉండి ఉంటే మా ఇంట్లో గడచిన తరంలోనే ఓ మహిళావిజయం నమోదై ఉండేది’ అంటోంది వింధ్య.
‘ఆడపిల్ల’ ఈ ఆటలే ఆడాలి, ఈ దుస్తులే ధరించాలి... అని సూత్రీకరించిన ‘సంప్రదాయం’ మా అమ్మకు ఒక జీవితకాలపు అసంతృప్తిని మిగిల్చింది. ఆమె కల నెరవేరలేదు. ‘‘నేను కోరుకున్నట్లుగా నేను ఏదీ సాధించలేకపోయాను. నువ్వు అలా ఉండిపోవాల్సిన అవసరం లేదు. ఈ సమాజం నిర్దేశించిన అడ్డంకులు నిన్ను అడ్డుకోకుండా నేను అడ్డుపడతాను. నువ్వు కావాలనుకున్న రంగంలో నువ్వు కోరుకున్న లక్ష్యాన్ని సాధించు’’ అని చెప్పేది అమ్మ. ఆశ్చర్యంగా మా అమ్మమ్మ, నాన్నమ్మ కూడా ఎప్పుడూ అమ్మ అభిప్రాయంతో ఏకీభవించేవారు. నేను స్కూల్లో కబడీ ఆడేటప్పుడు ఇంట్లో వాళ్లు అడ్డుచెప్పలేదు.
నాలుగేళ్ల కిందట ప్రో కబడ్డీ ప్రజెంటర్‌గా అవకాశం వచ్చినప్పుడు కూడా ఇంట్లో అందరూ సంతోషించారు. ఆ ప్రజెంటేషనే నాకు ఐపీఎల్‌లో ప్రజెంటర్ అవకాశాన్ని తెచ్చింది. ఇంగ్లిష్‌లో మందిరాబేడీ, మయంతి లాంగర్ ఉన్నారు. కానీ తెలుగులో లేరు. తెలుగులో తొలి ఉమన్ స్పోర్ట్స్ ప్రజెంటర్ అనే రికార్డుతో సంతృప్తి చెందాలనుకోవడం లేదు. బెస్ట్ స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా గుర్తింపు తెచ్చుకోవడమే నా అసలైన టార్గెట్. నా కెరీర్ విషయంలో అమ్మ ఒకే ఒక్క షరతు పెట్టింది. డిగ్రీ సెకండియర్‌లో ఉన్నప్పుడు న్యూస్ ప్రజెంటర్‌గా, మోడల్‌గా అవకాశాలు ఎక్కువగా వస్తున్నప్పుడు ‘చదువుని నిర్లక్ష్యం చేయకూడదు. తప్పనిసరిగా పీజీ చేయాల్సిందే’నని చెప్పింది. అమ్మ చెప్పినట్లే ఎం.ఏ ఇంగ్లీష్ చేశాను.
తోడుగా అమ్మ వచ్చేది
స్టార్ స్పోర్ట్స్‌లో ఉద్యోగం వచ్చిన తర్వాత ముంబయిలో ఉద్యోగం చేయడానికి భయపడలేదు. కానీ హైదరాబాద్ వదలడం బాధనిపించింది. నా లైఫ్‌లో తొలిసారి హోమ్‌సిక్ అయింది ముంబయిలోనే. ఆ సంగతి తెలిసి అమ్మ మరునాడే ముంబయికి వచ్చింది. నా పెళ్లయిన తర్వాత కూడా ఎక్కువగా అమ్మనే తోడు తీసుకెళ్లేదాన్ని. మా వాళ్లు ఎవరూ లేకుండా ముంబయిలో ఇన్ని రోజులు ఉండడం ఇదే మొదటిసారి. ఈ దఫా ఏప్రిల్ ఫస్ట్ నుంచి ముంబయిలోనే ఉన్నాను. రెండు రోజులకోసారి కోవిడ్ టెస్టులు చేయించుకుంటున్నాం. వర్క్ నుంచి నేరుగా మేము బస చేసిన హోటల్‌కి వచ్చేయాలి. క్వారంటైన్‌లో ఉంటూ పని చేయడమన్నమాట. హైదరాబాద్‌కి వచ్చేది ఐపీఎల్ పూర్తయిన తర్వాతే’’ అంటూ నవ్వారు వింధ్య విశాఖ.
అవకాశం గొప్పది
మా హజ్బెండ్ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్. చాలా ఏళ్లుగా తెలిసిన కుటుంబమే. ఆయనకు క్రికెట్ అంటే పిచ్చి. అర్ధరాత్రయినా సరే మ్యాచ్ చూడాల్సిందే. టెస్ట్‌మ్యాచ్‌లు కూడా పూర్తిగా చూస్తారు. మరీ ఇంత పిచ్చేంటి? ఇతడిని పెళ్లి చేసుకుంటే ఏంటి పరిస్థితి అని కూడా అనుకున్నాను. అయితే కబడ్డీ ప్రజెంటర్ నుంచి క్రికెట్ వైపు రావడానికి ప్రోత్సాహం, ట్రైనింగ్ ఇచ్చింది కూడా ఆయనే. ఈ తరం యువతులు తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే... వినూత్నమైన కెరీర్‌ని ఎంచుకునేటప్పుడు పెళ్లయితే అవకాశాలు ఉండవేమోనని చాలామంది భయపడుతుంటారు. అది కేవలం అపోహ మాత్రమేనని చెప్పడానికి నిదర్శనం నేనే. అలాగే నేను తెలుసుకున్న సత్యం మరొకటుంది. టాలెంట్ చాలామందిలో ఉంటుంది. అవకాశాలు కొందరికే వస్తాయి. వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకూడదు.
– వింధ్య విశాఖ మేడపాటి, స్పోర్ట్స్ ప్రజెంటర్
తల్లి మమతా చక్రవర్తితో వింధ్య
– వాకా మంజులారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment