Cricket Commentary
-
గల్లీ కుర్రాడు.. అంతర్జాతీయ మ్యాచ్‌లకు కామెంటరీ
సాక్షి, మహబూబ్‌నగర్: చిన్నప్పటి నుంచి వివిధ క్రీడలకు సరదాగా కామెంటరీ చేసిన ఆ యువకుడు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. క్రికెట్లో తనకున్న నైపుణ్యంతో అనతికాలంలోనే హిందీ, ఇంగ్లిష్, తెలుగులో కామెంటేటర్ (వ్యాఖ్యాత) గా ఎదిగాడు వనపర్తి జిల్లాలోని పెబ్బేరు పట్టణానికి చెందిన మహ్మద్ షోయబ్. 2013 నుంచి కామెంటేటర్‌గా.. తను పాలిటెక్నిక్ చదివే రోజుల్లో 2013 నుంచి కళాశాలల్లో నిర్వహించే క్రీడల్లో పాల్గొంటూ కామెంటేటర్‌గా మారిపోయాడు షోయబ్. దీనిపై పట్టు సాధించి జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లకు కామెంటరీ చేశాడు. 2014లో ఆల్ ఇండియా అండర్–19 టీ–20 లీగ్ మ్యాచ్‌లో కామెంటరీ చేశాడు. మహబూబ్‌నగర్‌లో జరిగిన ఎస్జీఎఫ్ జాతీయస్థాయి, ఎంపీఎల్ పోటీలకు హిందీలో కామెంటరీ చేసి ఆకట్టుకున్నాడు. 2016లో జరిగిన ఇండో–రష్యన్ ప్రమోషనల్ సిరీస్ క్రికెట్ మ్యాచ్‌లో (ఐసీసీ) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అధికారిక సభ్యులతో కలిసి కామెంటరీ చేశాడు. 2017లో ఇండియా–శ్రీలంక మధ్య జరిగిన బ్లైండ్ వరల్డ్‌కప్ మ్యాచ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. 2019 ఐపీఎల్ మ్యాచ్‌లకు తెలుగులో రేడియో కామెంటరీ చేసి ఆకట్టుకున్నాడు. ఇదే ఏడాది ఐసీసీ వరల్డ్‌కప్ మ్యాచ్‌లకు ఢిల్లీలో ఐడియా మొబైల్ చానల్ తరపున తెలుగులో కామెంటరీ చేశాడు. 2020లో ఇండియన్ సూపర్‌లీగ్ (ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు) ముంబై వేదికగా ఓ స్పోర్ట్స్ చానల్‌కు తెలుగులో వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. సిద్దిపేటలో జరిగిన సీఎం కేసీఆర్ కప్ క్రికెట్ పోటీలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి మంత్రి హరీష్‌రావుతో అభినందనలు అందుకున్నాడు. ఇండియా–ఇంగ్లాండ్ టెస్ట్‌కు.. ఈనెల 2 నుంచి 6వ తేదీ వరకు ఓవల్గ్రౌండ్లో జరిగిన ఇండియా–ఇంగ్లాండ్ నాల్గో టెస్ట్‌కు షోయబ్ తెలుగులో కామెంటరీ చేసి ఆకట్టుకున్నాడు. భారత మాజీ ఆటగాడు వెంకటపతిరాజు, స్పోర్ట్స్ ఎనలిస్ట్ సీహెచ్.వెంకటేశ్, విజయ్ మహవడి, డబ్ల్యూవీ రామన్, సందీప్‌కుమార్‌తో కలిసి షోయబ్ కామెంటరీ చేశాడు. ఎంతో సంతోషంగా ఉంది ఇండియా–ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్‌కు అవకాశం రావడం ఊహించలేదు. నాలుగో టెస్ట్‌లో కామెంటరీ చేశాను. ఈ టెస్ట్ మ్యాచ్‌ను ఇండియా చరిత్రాత్మక విజయం సాధించడం సంతోషంగా ఉంది. నేను తెలుగులో కామెంటరీ చేయడం చాలా గర్వంగా ఉంది. – మహ్మద్ షోయబ్, కామెంటేటర్ -
Michael Holding: కామెంటరీకి హోల్డింగ్ గుడ్‌బై
క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ వ్యాఖ్యాతల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న వెస్టిండీస్ పేస్ దిగ్గజం మైకేల్ హోల్డింగ్ కామెంటరీనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. గత 20 ఏళ్లుగా స్కై స్పోర్ట్స్‌కు హోల్డింగ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. నిష్పక్షపాతంగా తన అభిప్రాయాలు వెల్లడించడం, ఎలాంటి ఒత్తిడులకు లొంగకుండా నిజాయితీగా, లోతుగా తన విశ్లేషణను అందించడంలో అగ్రభాగాన నిలిచిన హోల్డింగ్ వ్యాఖ్యానం క్రికెట్ అభిమానులను సుదీర్ఘ కాలంగా ఆకట్టుకుంది. చదవండి: ICC Mens T20I Rankings: టాప్- 10లో భారత్ నుంచి వాళ్లిద్దరే! ఈసారి కూడా టైటిల్ వాళ్లదే: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ -
'ఇతరుల బ్యాట్లు పక్కింటి వ్యక్తి భార్యలాంటివి..' డీకే ఆసక్తికర వ్యాఖ్యలు
లండన్: బ్యాట్లు పక్కింటి వ్యక్తి భార్యలాంటివని, అవి ఎప్పుడూ చాలా బాగా అనిపిస్తాయని టీమిండియా మాజీ వికెట్ కీపర్, ప్రస్తుత వ్యాఖ్యాత దినేశ్ కార్తీక్ అన్నాడు. ఇటీవల ముగిసిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ద్వారా క్రికెట్ వ్యాఖ్యాతగా మారిన డీకే.. బ్యాట్స్‌మెన్, బ్యాట్ల మధ్య రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఈ రకంగా స్పందించాడు. బ్యాట్స్‌మెన్‌కు తమ బ్యాట్లు నచ్చకపోవడం అనేది చాలా కామన్ విషయమని, ఇతర బ్యాట్స్మెన్లు వాడే బ్యాట్లపై వారికి విపరీతమైన మోజు ఉంటుందని, ఓ విధంగా చెప్పాలంటే ఇతరుల బ్యాట్లు పక్కింటి వ్యక్తి భార్యలాంటివి, అవి ఎప్పుడూ చాలా బాగా అనిపిస్తాయని కార్తీక్ సరదాగా అన్నాడు. @DineshKarthik take a bow👏🏻👏🏻 Brilliant commentary 😂😂 I can imagine @felixwhite and @gregjames applauding right now #tailendersoftheworlduniteandtakeover pic.twitter.com/SLD4kxIB2n — Jon Moss (@Jon_Moss_) July 1, 2021 కార్తీక్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. నెటిజన్లు తమదైన స్టైల్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తన వ్యక్తిగత విషయాలు గుర్తుకువచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేశాడేమోనని కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా హర్షా భోగ్లే, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ తమ కామెంటరీలో ఇలాంటి సరదా విషయాలను ప్రస్తావించి ప్రేక్షకులను నవ్విస్తుంటారు. ఇదిలా ఉంటే, వ్యాఖ్యాతగా సెకెండ్ ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టడానికి గల కారణాలను ఆయన తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో వెల్లడించాడు. 'వ్యాఖ్యాతగా మారడం అనేది మాటల్లో వర్ణించలేనని, క్రికెట్లోని మరో కోణాన్ని చూడటానికే ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టానని పేర్కొన్నాడు. భారత్ తరఫున 26 టెస్టులు, 94 వన్డేలు, 32 టీ20లు ఆడిన డీకే.. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించకుండానే వ్యాఖ్యత అవతారమెత్తాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో చివరిసారిగా టీమిండియాకు ఆడిన ఆయన.. జట్టులో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ అతన్ని పరిగణలోకి తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. -
ఇతడిని పెళ్లి చేసుకుంటే నా పరిస్థితి ఏంటి? అనుకున్నా..
ఇది ఐపీఎల్ సీజన్. ఓ అమ్మాయి కామెంటరీ ఇస్తోంది. ‘అరే! తెలుగమ్మాయి. చక్కగా మాట్లాడుతోంది. బాడీ లాంగ్వేజ్ ప్రొఫెషనల్‌గా ఉంది. ఏ ముంబయి అమ్మాయో అనుకునేటట్లు ఉంది’ అని టీవీక్షకుల కళ్లను ఆకర్షిస్తోన్న ఆ అమ్మాయి పేరు వింధ్య విశాఖ మేడపాటి. స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా మగవాళ్లను మాత్రమే చూసిన తెలుగు తెరకు పరిచయమైన తొలి తెలుగమ్మాయి. వింధ్య ఇప్పుడు ముంబయిలో ఉన్న మాట నిజమే. కానీ ఆమె అచ్చమైన హైదరాబాదీ. పుట్టింది ఘట్కేసర్, హైస్కూల్ నుంచి సికింద్రాబాద్‌లోని అమ్మమ్మగారింట్లో పెరిగింది. నాన్న గుర్రపు స్వారీ చేసేవాడు, జీవితంలో రాజీ పడాల్సిన అవసరం లేని జీవితం ఆయనది. అమ్మ మాత్రం తనను క్రీడాకారిణి కానివ్వకుండా ఆపిన సంప్రదాయపు ఇనుప కచ్చడాన్ని తలచుకుంటూ బాధపడుతుండేది. ‘ఆడపిల్లలు ప్యాంటులేసుకుని ఆటలాడడం ఏంటి’ అని తాతయ్య మొండిపట్టు పట్టకుండా ఉండి ఉంటే మా ఇంట్లో గడచిన తరంలోనే ఓ మహిళావిజయం నమోదై ఉండేది’ అంటోంది వింధ్య. ‘ఆడపిల్ల’ ఈ ఆటలే ఆడాలి, ఈ దుస్తులే ధరించాలి... అని సూత్రీకరించిన ‘సంప్రదాయం’ మా అమ్మకు ఒక జీవితకాలపు అసంతృప్తిని మిగిల్చింది. ఆమె కల నెరవేరలేదు. ‘‘నేను కోరుకున్నట్లుగా నేను ఏదీ సాధించలేకపోయాను. నువ్వు అలా ఉండిపోవాల్సిన అవసరం లేదు. ఈ సమాజం నిర్దేశించిన అడ్డంకులు నిన్ను అడ్డుకోకుండా నేను అడ్డుపడతాను. నువ్వు కావాలనుకున్న రంగంలో నువ్వు కోరుకున్న లక్ష్యాన్ని సాధించు’’ అని చెప్పేది అమ్మ. ఆశ్చర్యంగా మా అమ్మమ్మ, నాన్నమ్మ కూడా ఎప్పుడూ అమ్మ అభిప్రాయంతో ఏకీభవించేవారు. నేను స్కూల్లో కబడీ ఆడేటప్పుడు ఇంట్లో వాళ్లు అడ్డుచెప్పలేదు. నాలుగేళ్ల కిందట ప్రో కబడ్డీ ప్రజెంటర్‌గా అవకాశం వచ్చినప్పుడు కూడా ఇంట్లో అందరూ సంతోషించారు. ఆ ప్రజెంటేషనే నాకు ఐపీఎల్లో ప్రజెంటర్ అవకాశాన్ని తెచ్చింది. ఇంగ్లిష్‌లో మందిరాబేడీ, మయంతి లాంగర్ ఉన్నారు. కానీ తెలుగులో లేరు. తెలుగులో తొలి ఉమన్ స్పోర్ట్స్ ప్రజెంటర్ అనే రికార్డుతో సంతృప్తి చెందాలనుకోవడం లేదు. బెస్ట్ స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా గుర్తింపు తెచ్చుకోవడమే నా అసలైన టార్గెట్. నా కెరీర్ విషయంలో అమ్మ ఒకే ఒక్క షరతు పెట్టింది. డిగ్రీ సెకండియర్‌లో ఉన్నప్పుడు న్యూస్ ప్రజెంటర్‌గా, మోడల్‌గా అవకాశాలు ఎక్కువగా వస్తున్నప్పుడు ‘చదువుని నిర్లక్ష్యం చేయకూడదు. తప్పనిసరిగా పీజీ చేయాల్సిందే’నని చెప్పింది. అమ్మ చెప్పినట్లే ఎం.ఏ ఇంగ్లీష్ చేశాను. తోడుగా అమ్మ వచ్చేది స్టార్ స్పోర్ట్స్‌లో ఉద్యోగం వచ్చిన తర్వాత ముంబయిలో ఉద్యోగం చేయడానికి భయపడలేదు. కానీ హైదరాబాద్ వదలడం బాధనిపించింది. నా లైఫ్‌లో తొలిసారి హోమ్‌సిక్ అయింది ముంబయిలోనే. ఆ సంగతి తెలిసి అమ్మ మరునాడే ముంబయికి వచ్చింది. నా పెళ్లయిన తర్వాత కూడా ఎక్కువగా అమ్మనే తోడు తీసుకెళ్లేదాన్ని. మా వాళ్లు ఎవరూ లేకుండా ముంబయిలో ఇన్ని రోజులు ఉండడం ఇదే మొదటిసారి. ఈ దఫా ఏప్రిల్ ఫస్ట్ నుంచి ముంబయిలోనే ఉన్నాను. రెండు రోజులకోసారి కోవిడ్ టెస్టులు చేయించుకుంటున్నాం. వర్క్ నుంచి నేరుగా మేము బస చేసిన హోటల్‌కి వచ్చేయాలి. క్వారంటైన్లో ఉంటూ పని చేయడమన్నమాట. హైదరాబాద్‌కి వచ్చేది ఐపీఎల్ పూర్తయిన తర్వాతే’’ అంటూ నవ్వారు వింధ్య విశాఖ. అవకాశం గొప్పది మా హజ్బెండ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. చాలా ఏళ్లుగా తెలిసిన కుటుంబమే. ఆయనకు క్రికెట్ అంటే పిచ్చి. అర్ధరాత్రయినా సరే మ్యాచ్ చూడాల్సిందే. టెస్ట్‌మ్యాచ్‌లు కూడా పూర్తిగా చూస్తారు. మరీ ఇంత పిచ్చేంటి? ఇతడిని పెళ్లి చేసుకుంటే ఏంటి పరిస్థితి అని కూడా అనుకున్నాను. అయితే కబడ్డీ ప్రజెంటర్ నుంచి క్రికెట్ వైపు రావడానికి ప్రోత్సాహం, ట్రైనింగ్ ఇచ్చింది కూడా ఆయనే. ఈ తరం యువతులు తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే... వినూత్నమైన కెరీర్‌ని ఎంచుకునేటప్పుడు పెళ్లయితే అవకాశాలు ఉండవేమోనని చాలామంది భయపడుతుంటారు. అది కేవలం అపోహ మాత్రమేనని చెప్పడానికి నిదర్శనం నేనే. అలాగే నేను తెలుసుకున్న సత్యం మరొకటుంది. టాలెంట్ చాలామందిలో ఉంటుంది. అవకాశాలు కొందరికే వస్తాయి. వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకూడదు. – వింధ్య విశాఖ మేడపాటి, స్పోర్ట్స్ ప్రజెంటర్ తల్లి మమతా చక్రవర్తితో వింధ్య – వాకా మంజులారెడ్డి -
భారత తొలి మహిళా క్రికెట్ వ్యాఖ్యాత కన్నుమూత
న్యూఢిల్లీ: భారతదేశపు తొలి మహిళా క్రికెట్ వ్యాఖ్యాత చంద్ర నాయుడు(88) ఆదివారం కన్నుమూశారు. గత కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ఇండోర్‌లోని తన నివాసంలో పరమపదించారు. చంద్ర నాయుడు క్రికెట్ దిగ్గజం డా. సీకే నాయుడు కుమార్తె. క్రికెట్ వ్యాఖ్యానంతోపాటు ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించిన ఆమె.. 50 వ దశకంలో జాతీయ జట్టు తరఫున క్రికెట్ ఆడారు. అయితే, ఆరోజుల్లో మహిళల క్రికెట్‌కు అంతగా ప్రాముఖ్యత లేని కారణంగా, ఆమె కామెంటరీపై దృష్టి సారించి, భారతదేశపు తొలి మహిళా వ్యాఖ్యాతగా రికార్డుల్లోకెక్కారు. క్రికెట్ పట్ల ఆమెకున్న ఆసక్తి ఆమెకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో బీసీసీఐ, ఐసీసీ నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. చంద్ర నాయుడు మృతి పట్ల మాజీ క్రికెటర్, మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(ఎంపీసీఏ) అధ్యక్షుడు సంజయ్ జగ్దలే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చదవండి: పృథ్వీషా ఆ అలవాటును మార్చుకోవాలి: పాంటింగ్ -
డేవిడ్ వార్నర్ కొత్త అవతారం
ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కామెంటేటర్‌గా కొత్త అవతారం ఎత్తనున్నాడు. బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన అతను ఈ నెల 13 నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల మధ్య ప్రారంభం కానున్న ఐదు వన్డేల సిరీస్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. ‘దశాబ్ద కాలంగా టి20, వన్డేల్లో వార్నర్ అత్యుత్తమ బ్యాట్స్‌మన్. ఇప్పుడు అతను మాతో కలవనున్నాడు’ అని ఈ సిరీస్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్న చానెల్–9 డైరెక్టర్ టామ్ మలాన్ తెలిపారు. జూన్ 16న కార్డిఫ్‌లో జరిగే రెండో మ్యాచ్‌లో వార్నర్ కామెంటేటర్‌గా కనిపించనున్నాడు. -
'ఇంట్రెస్ట్' గందరగోళం
బీసీసీఐ కొత్త నిబంధనతో సచిన్ సహా మాజీలందరికీ ఇబ్బందే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్... ఇప్పుడు భారత క్రికెట్లో పెద్ద గందరగోళానికి దారి తీసిన పదం ఇది. బీసీసీఐతో పాటు రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో ఉన్న వారెవరూ క్రికెట్‌కు సంబంధించి ఆదాయాన్ని తెచ్చిపెట్టే వేరే పనులు, వ్యాపారాలు చేయకూడదు. దీనికి అంగీకరిస్తూ అందరూ సంతకాలు చేయాలని బోర్డు ఇటీవల ఆదేశించింది. దీనివల్ల అధికారులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. సాక్షి క్రీడావిభాగం ఐపీఎల్, క్రికెట్ కామెంటరీ... ఈ రెండూ మాజీ క్రికెటర్లకు వరం. రిటైరైన తర్వాత ఏదో ఒక జట్టు మెంటార్‌గా వ్యవహరించడమో, కామెంటరీ చెప్పుకోవడమో చేస్తూ డబ్బు సంపాదించుకుంటున్నారు. తాజాగా బీసీసీఐ చెబుతున్న ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్’ (పరస్పర విరుద్ధ ప్రయోజనాలు) నిబంధన వల్ల ఇలాంటి పనులు చేస్తున్న వాళ్లందరూ వాటిని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు బీసీసీఐ ఏర్పాటు చేసిన క్రికెట్ కమిటీలో సభ్యులు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ ముగ్గురికీ ఐపీఎల్ జట్లతో లేదంటే కామెంట రీతోనే ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. బోర్డుతో సంబంధాలు ఉండి... ఇతర మార్గాల ద్వారా క్రికెట్‌తో ఆదాయం పొందుతున్న వారి జాబితాను పరిశీలిస్తే దాదాపు మాజీ క్రికెటర్లంతా ఈ జాబితాలో ఉన్నారు. అలాగే బ్రిజేశ్ పటేల్ లాంటి పరిపాలకులకూ ఈ లాభాలు ఉన్నాయి. రెండు రకాల వాదనలు ఈ అంశం ఇప్పుడు బీసీసీఐలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ ఈ నిబంధన అమలులోకి వస్తే క్రికెటర్లకూ వర్తింపజేయాలనేది ఒక వాదనైతే... సచిన్ లాంటి మాజీలను దీని నుంచి మినహాయించాలనేది మరో వాదన. ‘బెంగళూరు జట్టుతో కలిసి ఐపీఎల్లో పని చేస్తున్నానని కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందంటున్నారు. మరి అనిల్ కుంబ్లే ముంబైతో, లక్ష్మణ్ హైదరాబాద్‌తో కలిసి పని చేస్తున్నారుగా’ అని కర్ణాటక క్రికెట్ సంఘం కార్యదర్శి బ్రిజేశ్ పటేల్ ప్రశ్నిస్తున్నారు. అయితే బీసీసీఐ కోశాధికారి అజయ్ షిర్కే ఈ వాదనతో విభేదిస్తున్నారు. ‘క్రికెటర్లు ఐపీఎల్ జట్లకు మెంటార్స్‌గా పని చేయడం వల్ల క్రికెట్‌కే లాభం. కాబట్టి దీనిని కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనలేం. దీనివల్ల వాళ్లకి ఆర్థిక ప్రయోజనాలు వచ్చినా ఆట అభివృద్ధికి దోహదపడుతున్నారు. కాబట్టి మాజీ క్రికెటర్లకు మినహాయింపు ఇవ్వొచ్చు’ అని షిర్కే అంటున్నారు. బీసీసీఐ అధికారులు మాత్రం ఇది చాలా సున్నితమైన అంశంగా అభివర్ణిస్తున్నారు. క్రికెటర్లు వదిలేస్తారేమో... సచిన్, లక్ష్మణ్, గంగూలీ వాళ్లంతట వాళ్లు క్రికెట్ కమిటీలోకి రాలేదు. దేశంలో క్రికెట్ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ బీసీసీఐ ఈ ముగ్గురితో కమిటీని నియమించింది. దీనివల్ల వీళ్లు బోర్డు నుంచి పొందే ఆర్థిక ప్రయోజనం ఎంతనేది బయటకు తెలియకపోయినా... భారీగా ఉండదనేది మాత్రం వాస్తవం. వీళ్లని కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నిబంధన కింద చేరిస్తే... క్రికెట్ కమిటీ నుంచి తప్పుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ‘ఆటకు మేలు చేయడం కోసం వాళ్లు పదవులు తీసుకున్నారు. దీనివల్ల ఆర్థికంగా పెద్దగా ప్రయోజనం లేదు. అదే కామెంటేటర్‌గా, ఐపీఎల్లో మెంటార్స్‌గా, కోచ్‌లుగా పని చేయడం వల్ల ఎక్కువ మొత్తం లభిస్తుంది. కాబట్టి వీళ్లని ఈ నిబంధన కింద చేరిస్తే బోర్డు పదవిని వదులుకునే ప్రమాదం ఉంటుంది’ అని ఓ మాజీ క్రికెటర్ అంటున్నారు. దీనిపై సెప్టెంబరులో జరిగే బీసీసీఐ వార్షిక సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అప్పటివరకూ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు అనే అంశం ముందుకు కదలకపోవచ్చు. మాజీల ‘ఇంట్రెస్ట్‌లు’ సచిన్ టెండూల్కర్: బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీలో సభ్యుడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు మెంటార్. అనిల్ కుంబ్లే: బీసీసీఐ టెక్నికల్ కమిటీ చైర్మన్. ముంబై ఇండియన్స్ జట్టుకు మెంటార్. క్రికెట్ టెక్నాలజీకి సంబంధించిన కంపెనీ ఉంది. రవిశాస్త్రి: భారత జట్టు డెరైక్టర్. ఐపీఎల్ కౌన్సిల్ మెంబర్. కామెంటేటర్. బ్రిజేశ్ పటేల్: బీసీసీఐ ఏరియా డెవలప్మెంట్ కమిటీ సభ్యుడు. కర్ణాటక క్రికెట్ సంఘం కార్యదర్శి, ఐపీఎల్లో బెంగళూరు జట్టు ఆపరేషన్స్ హెడ్. సునీల్ గవాస్కర్: బీసీసీఐ కామెంటేటర్. ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ గ్రూప్ నిర్వహిస్తున్నారు. పలువురు క్రికెటర్లకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను ఈ సంస్థ పర్యవేక్షిస్తుంది. క్రికెటర్లతో కాలమ్స్ రాయిస్తుంది. రాహుల్ ద్రవిడ్: భారత్ ‘ఎ’, అండర్-19 జట్ల కోచ్. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ మెంటార్. లక్ష్మణ్: బీసీసీఐ సలహా కమిటీ సభ్యుడు. సన్‌రైజర్స్ జట్టుకు మెంటార్. సంజయ్ బంగర్: భారత జట్టు సహాయక కోచ్. ఐపీఎల్లో పంజాబ్ జట్టు ప్రధాన కోచ్. సౌరవ్ గంగూలీ: బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ సభ్యుడు. కామెంటేటర్. బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీలో వాటాలు. -
రిచీ బెనాడ్ ఇక లేరు
సిడ్నీ : ఓ మ్యాచ్‌లో ఆసీస్ పేసర్ మెక్‌గ్రాత్ బ్యాటింగ్‌కు దిగాడు. కిందామీదా పడి రెండు పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ సమయంలో మ్యాచ్‌కు వ్యాఖ్యాతగా పని చేస్తున్న ఓ వ్యక్తి... మెక్‌గ్రాత్ సెంచరీకి కేవలం 98 పరుగుల దూరంలోనే అవుటయ్యాడు.. అంటూ కామెంట్ విసిరారు. అంతే ప్యానెల్లో ఉన్న ఇతర సభ్యులు నవ్వు ఆపుకోలేకపోయారు. అంటే మెక్‌గ్రాత్‌కు అసలు బ్యాటింగే రాదనే విషయాన్ని వ్యంగ్యంగా చెప్పిన ఆ కామెంటేటర్ రిచీ బెనాడ్. క్రికెట్ కామెంటరీలో ప్రమాణాలను నిర్దేశించిన బెనాడ్ గురువారం రాత్రి మరణించారు. సుదీర్ఘకాలంగా చర్మ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఈ ఆస్ట్రేలియా పాతతరం ఆల్‌రౌండర్ వయసు 84 ఏళ్లు. 2013లో జరిగిన కారు ప్రమాదం నుంచి కోలుకుంటున్న బెనాడ్ నిద్రలోనే తుది శ్వాస విడిచారు. 1952లో ఆసీస్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన బెనాడ్ 63 మ్యాచ్‌లు ఆడారు. 2201 పరుగులతో పాటు తన లెగ్ స్పిన్‌తో 248 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆసీస్ తరఫున మేటి టెస్టు బౌలర్‌గా పేరుతెచ్చుకున్నారు. 259 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 11,179 పరుగులతో పాటు 945 వికెట్లు తీశాడు. 1964లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన బెనాడ్ ఆ తర్వాత ఆసీస్, ఇంగ్లండ్‌లో బ్రాడ్‌కాస్టర్ అవతారమెత్తారు. తన విలక్షణమైన సెటైర్లతో, కామెంట్రీని రక్తికట్టించేవారు. 1977లో వరల్డ్ సిరీస్ క్రికెట్‌ను ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన బెనాడ్... కెర్రీ-ప్యాకర్ సిరీస్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిం చారు. సచిన్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా మాజీ, ప్రస్తుత క్రికెటర్లు ఆయనకు నివాళులు అర్పించారు. ఐసీసీ, బీసీసీఐ సంతాపం ప్రకటించాయి. ఆసీస్ ఓ చాంపియన్ క్రికెటర్‌ను కోల్పోయిందని ఆ దేశ ప్రధాని టోనీ అబాట్ ట్వీట్ చేశారు. అధికార లాం ఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. నిఖార్సైన ఆల్‌రౌండర్ ఆసీస్ పాతతరం క్రికెటర్లలో బెనాడ్ పాత్ర ఎప్పటికీ మరువలేనిది. దూకుడైన బ్యాటింగ్‌తో పాటు లెగ్ స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థులకు వణుకు పుట్టించేవారు. ముఖ్యంగా భారత్‌పై బెనాడ్‌కు అద్భుతమైన బౌలింగ్ రికార్డు ఉంది. 8 టెస్టుల్లో 52 వికెట్లు తీశారు. 1956లో జరిగిన సిరీస్‌లో మూడు టెస్టుల్లో 23 వికెట్లు పడగొట్టారు. ఒక సిరీస్‌లో ఇన్ని వికెట్లు తీయడం ఏ బౌలర్‌కైనా ఇదే అత్యుత్తమం. చెన్నైలో జరిగిన ఓ మ్యాచ్‌లో 72 పరుగులకు 7 వికెట్లు తీసి కెరీర్ బెస్ట్ నమోదు చేశారు. ఇక 1959లో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 29 వికెట్లు తీశారు. బెనాడ్ ఆసీస్ తరఫున టెస్టుల్లో 2 వేల పరుగులు, 200 వికెట్లు తీసిన తొలి క్రికెటర్. కెప్టెన్‌గా కూడా తిరుగులేని ఆధిపత్యాన్ని చూపించారు. 1958-59లో యాషెస్ గెలిచిన ఏడేళ్ల విరామం తర్వాత తిరిగి ట్రోఫీని ఆసీస్‌కు అందించారు. స్వదేశంలో 1960-61లో విండీస్‌తో జరిగిన సిరీస్‌లో కీలక పాత్ర పోషించారు. ఓవరాల్‌గా తన కెప్టెన్సీలో ఒక్క సిరీస్ కూడా బెనాడ్ కోల్పోకపోవడం విశేషం. -
మాటల మాంత్రికులు నచ్చే కెరీర్..
క్రీడా వ్యాఖ్యానం టీవీలు విస్తృతంగా అందుబాటులోకి రాకముందు క్రికెట్ కామెంటరీని ట్రాన్సిస్టర్లలో వినడం చాలామందికి ఒక మధుర జ్ఞాపకం. ప్రతి బంతిని, పరుగును విశ్లేషిస్తూ, ఎప్పటికప్పుడు స్కోర్‌ను తెలియజేస్తూ వ్యాఖ్యాతలు మ్యాచ్‌ను కళ్లకు కట్టినట్టు చూపించేవారు. కామెంటేటర్లకు ఎందరో అభిమానులుండేవారు. మాటల మాంత్రికులు స్పోర్ట్స్ కామెంటరీని కెరీర్‌గా ఎంచుకుంటే నేడు ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. స్పోర్ట్స్ చానళ్ల సంఖ్య పెరగడంతో కామెంటేటర్లకు డిమాండ్ పెరిగింది. కాబట్టి క్రీడలపై ఆసక్తి ఉన్నవారు ఇందులోకి ప్రవేశించొచ్చు. గ్లామరస్ జాబ్: స్పోర్ట్ కామెంటరీ అనేది గ్లామరస్ జాబ్. కామెంటరీ బాక్సుల్లో కూర్చొని లైవ్ మ్యాచ్‌ను ఆసక్తికరంగా విశ్లేషించాల్సి ఉంటుంది. ఒకప్పుడు క్రికెట్‌కే పరిమితమైన వ్యాఖ్యానం ఇప్పుడు ఇతర క్రీడలకు కూడా పాకింది. స్పోర్ట్స్ చానళ్లలో అన్ని రకాల క్రీడలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. కామెంటేటర్లను తప్పనిసరిగా నియమిస్తున్నారు. వ్యాఖ్యాతలుగా సాధారణంగా క్రీడాకారులకే ప్రాధాన్యత ఉంటుంది. కానీ, హర్షా బోగ్లే, పద్మజీత్ షెరావత్ లాంటివారు క్రీడలతో సంబంధం లేకపోయినా కామెంటేటర్లుగా మంచి గుర్తింపు తెచ్చుకోగలిగారు. కాబట్టి ప్రతిభాపాటవాలు ఉంటే ఇందులో సులువుగా రాణించొచ్చు. క్రీడా వ్యాఖ్యాతలకు స్పోర్ట్స్ చానళ్లు, ఆలిండియా రేడియో, దూరదర్శన్‌లో అవకాశాలున్నాయి. జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి టోర్నమెంట్లలోనూ కామెంటేటర్ల అవసరం ఉంటోంది. వ్యాఖ్యాతలకు నిత్యం పని దొరకదు. ఒక్కోసారి నెలలపాటు ఖాళీగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని పార్ట్‌టైమ్ కెరీర్‌గా ఎంచుకోవడం మంచిది. ఆర్థికంగా వెసులుబాటు ఉంటే దీన్ని పూర్తిస్థాయి కెరీర్‌గా మార్చుకోవచ్చు. కావాల్సిన నైపుణ్యాలు: స్పోర్ట్స్ కామెంటేటర్లకు ఆంగ్ల, హిందీ భాషలపై గట్టి పట్టు ఉండాలి. క్రీడలను ప్రేమించే గుణం అవసరం. క్రీడల నియమ నిబంధనలు, పాత రికార్డులపై పరిజ్ఞానం చాలా ముఖ్యం. సమయస్ఫూర్తిని ప్రదర్శించే నేర్పు, వినసొంపైన స్వరం, ఆకట్టుకొనే రూపం ఉండాలి. అర్హతలు: క్రీడా రంగంలో సుదీర్ఘమైన అనుభవం ఉన్నవారు రిటైర్మెంట్ తర్వాత వ్యాఖ్యాతలుగా రాణిస్తున్నారు. జాతీయస్థాయి మాజీ క్రీడాకారులు కామెంటరీ బాక్సుల్లో దర్శనమిస్తున్నారు. కాబట్టి మొదట క్రీడల్లో పాల్గొని కామెంటేటర్‌గా మారొచ్చు. వ్యాఖ్యాతలకు సాధారణ విద్యార్హతలు ఉంటే సరిపోతుంది. మొదట స్పోర్ట్స్ చానళ్లలో పనిచేసి, అనుభవం పెంచుకున్న తర్వాత ఆలిండియా రేడియో, దూరదర్శన్‌లో అవకాశాలు పొందొచ్చు. వేతనాలు: క్రీడా వ్యాఖ్యాతలకు ప్రతినెలా స్థిరమైన వేతనం అందకపోయినా పని దొరికినప్పుడు మాత్రం ఆర్జన భారీగానే ఉంటుంది. సాధారణ కామెంటేటర్ రోజుకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు సంపాదించుకోవచ్చు. ఈ రంగంలో అనుభవం పెంచుకుంటే రోజుకు రూ.25 వేలకు పైగానే అందుకోవచ్చు. ఎక్కువ రోజులు పనిచేస్తే ఎక్కువ ఆదాయం లభిస్తుంది. అవకాశాలు ఎక్కడున్నాయో వెతుక్కోగల నైపుణ్యం ఉంటే డబ్బుకు లోటుండదు. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: క్రీడలపై వ్యాఖ్యానం చెప్పడం తరగతి గదిలో నేర్చుకొనే విద్య కాదు. స్పోర్ట్స్ కామెంటరీపై మనదేశంలో ఎలాంటి కోర్సులు లేవు. ఆంగ్ల, హిందీ భాషలు నేర్చుకోవడంతోపాటు వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ స్కిల్స్ కోర్సులు చదివినవారు ఈ రంగంలోకి అడుగుపెట్టొచ్చు. ఈ కింది సంస్థల్లో ఆయా స్కిల్స్‌పై కోర్సులు ఉన్నాయి. ఆర్.కె.ఫిలింస్ అండ్ మీడియా అకాడమీ-న్యూఢిల్లీ వెబ్సైట్: http://rkfma.com/ డబ్లిన్ బిజినెస్ స్కూల్ వెబ్సైట్: www.dbs.ie