'ఇంట్రెస్ట్' గందరగోళం | BCCI with new Clause troble to the former cricketers | Sakshi
Sakshi News home page

'ఇంట్రెస్ట్' గందరగోళం

Published Tue, Aug 4 2015 2:11 AM | Last Updated on Sun, Sep 3 2017 6:43 AM

'ఇంట్రెస్ట్' గందరగోళం

'ఇంట్రెస్ట్' గందరగోళం

బీసీసీఐ కొత్త నిబంధనతో సచిన్ సహా మాజీలందరికీ ఇబ్బందే కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్... ఇప్పుడు భారత క్రికెట్‌లో పెద్ద గందరగోళానికి దారి తీసిన పదం ఇది. బీసీసీఐతో పాటు రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో ఉన్న వారెవరూ క్రికెట్‌కు సంబంధించి ఆదాయాన్ని తెచ్చిపెట్టే వేరే పనులు, వ్యాపారాలు చేయకూడదు. దీనికి అంగీకరిస్తూ అందరూ సంతకాలు చేయాలని బోర్డు ఇటీవల ఆదేశించింది. దీనివల్ల అధికారులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు.
 
సాక్షి క్రీడావిభాగం

ఐపీఎల్, క్రికెట్ కామెంటరీ... ఈ రెండూ మాజీ క్రికెటర్లకు వరం. రిటైరైన తర్వాత ఏదో ఒక జట్టు మెంటార్‌గా వ్యవహరించడమో, కామెంటరీ చెప్పుకోవడమో చేస్తూ డబ్బు సంపాదించుకుంటున్నారు. తాజాగా బీసీసీఐ చెబుతున్న ‘కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్’ (పరస్పర విరుద్ధ ప్రయోజనాలు) నిబంధన వల్ల ఇలాంటి పనులు చేస్తున్న వాళ్లందరూ వాటిని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు బీసీసీఐ ఏర్పాటు చేసిన క్రికెట్ కమిటీలో సభ్యులు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ ముగ్గురికీ ఐపీఎల్ జట్లతో లేదంటే కామెంట రీతోనే ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. బోర్డుతో సంబంధాలు ఉండి... ఇతర మార్గాల ద్వారా క్రికెట్‌తో ఆదాయం పొందుతున్న వారి జాబితాను పరిశీలిస్తే దాదాపు మాజీ క్రికెటర్లంతా ఈ జాబితాలో ఉన్నారు. అలాగే బ్రిజేశ్ పటేల్ లాంటి పరిపాలకులకూ ఈ లాభాలు ఉన్నాయి.
 
రెండు రకాల వాదనలు

ఈ అంశం ఇప్పుడు బీసీసీఐలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ ఈ నిబంధన అమలులోకి వస్తే క్రికెటర్లకూ వర్తింపజేయాలనేది ఒక వాదనైతే... సచిన్ లాంటి మాజీలను దీని నుంచి మినహాయించాలనేది మరో వాదన. ‘బెంగళూరు జట్టుతో కలిసి ఐపీఎల్‌లో పని చేస్తున్నానని కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందంటున్నారు. మరి అనిల్ కుంబ్లే ముంబైతో, లక్ష్మణ్ హైదరాబాద్‌తో కలిసి పని చేస్తున్నారుగా’ అని కర్ణాటక క్రికెట్ సంఘం కార్యదర్శి బ్రిజేశ్ పటేల్ ప్రశ్నిస్తున్నారు. అయితే బీసీసీఐ కోశాధికారి అజయ్ షిర్కే ఈ వాదనతో విభేదిస్తున్నారు. ‘క్రికెటర్లు ఐపీఎల్ జట్లకు మెంటార్స్‌గా పని చేయడం వల్ల క్రికెట్‌కే లాభం. కాబట్టి దీనిని కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనలేం. దీనివల్ల వాళ్లకి ఆర్థిక ప్రయోజనాలు వచ్చినా ఆట అభివృద్ధికి దోహదపడుతున్నారు. కాబట్టి మాజీ క్రికెటర్లకు మినహాయింపు ఇవ్వొచ్చు’ అని షిర్కే అంటున్నారు. బీసీసీఐ అధికారులు మాత్రం ఇది చాలా సున్నితమైన అంశంగా అభివర్ణిస్తున్నారు.
 
క్రికెటర్లు వదిలేస్తారేమో...
సచిన్, లక్ష్మణ్, గంగూలీ వాళ్లంతట వాళ్లు క్రికెట్ కమిటీలోకి రాలేదు. దేశంలో క్రికెట్ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ బీసీసీఐ ఈ ముగ్గురితో కమిటీని నియమించింది. దీనివల్ల వీళ్లు బోర్డు నుంచి పొందే ఆర్థిక ప్రయోజనం ఎంతనేది బయటకు తెలియకపోయినా... భారీగా ఉండదనేది మాత్రం వాస్తవం. వీళ్లని కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నిబంధన కింద చేరిస్తే... క్రికెట్ కమిటీ నుంచి తప్పుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ‘ఆటకు మేలు చేయడం కోసం వాళ్లు పదవులు తీసుకున్నారు. దీనివల్ల ఆర్థికంగా పెద్దగా ప్రయోజనం లేదు. అదే కామెంటేటర్‌గా, ఐపీఎల్‌లో మెంటార్స్‌గా, కోచ్‌లుగా పని చేయడం వల్ల ఎక్కువ మొత్తం లభిస్తుంది. కాబట్టి వీళ్లని ఈ నిబంధన కింద చేరిస్తే బోర్డు పదవిని వదులుకునే ప్రమాదం ఉంటుంది’ అని ఓ మాజీ క్రికెటర్ అంటున్నారు. దీనిపై సెప్టెంబరులో జరిగే బీసీసీఐ వార్షిక సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అప్పటివరకూ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు అనే అంశం ముందుకు కదలకపోవచ్చు.
 
మాజీల ‘ఇంట్రెస్ట్‌లు’
సచిన్ టెండూల్కర్: బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీలో సభ్యుడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు మెంటార్.
అనిల్ కుంబ్లే: బీసీసీఐ టెక్నికల్ కమిటీ చైర్మన్. ముంబై ఇండియన్స్ జట్టుకు మెంటార్. క్రికెట్ టెక్నాలజీకి సంబంధించిన కంపెనీ ఉంది.
రవిశాస్త్రి: భారత జట్టు డెరైక్టర్. ఐపీఎల్ కౌన్సిల్ మెంబర్. కామెంటేటర్.
బ్రిజేశ్ పటేల్: బీసీసీఐ ఏరియా డెవలప్‌మెంట్ కమిటీ సభ్యుడు. కర్ణాటక క్రికెట్ సంఘం కార్యదర్శి, ఐపీఎల్‌లో బెంగళూరు జట్టు ఆపరేషన్స్ హెడ్.
సునీల్ గవాస్కర్: బీసీసీఐ కామెంటేటర్. ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్ గ్రూప్ నిర్వహిస్తున్నారు. పలువురు క్రికెటర్లకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను ఈ సంస్థ పర్యవేక్షిస్తుంది. క్రికెటర్లతో కాలమ్స్ రాయిస్తుంది.
రాహుల్ ద్రవిడ్: భారత్ ‘ఎ’, అండర్-19 జట్ల కోచ్. ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ మెంటార్.
లక్ష్మణ్: బీసీసీఐ సలహా కమిటీ సభ్యుడు. సన్‌రైజర్స్ జట్టుకు మెంటార్.
సంజయ్ బంగర్: భారత జట్టు సహాయక కోచ్. ఐపీఎల్‌లో పంజాబ్ జట్టు ప్రధాన కోచ్.
సౌరవ్ గంగూలీ: బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ సభ్యుడు. కామెంటేటర్. బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీలో వాటాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement