
అహ్మదాబాద్: ఐపీఎల్ (IPL) టీమ్ గుజరాత్ టైటాన్స్‌లో (Gujarat Titans) ప్రముఖ పారిశ్రామిక సంస్థ టోరెంట్ గ్రూప్ (Torrent Group) 67 శాతం వాటాను దక్కించుకుంది. ఈ ఒప్పందం గతంలోనే ఖాయమైనా... బుధవారం ఫ్రాంచైజీ యాజమాన్యం దీనిని అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత యజమాని సీవీసీ క్యాపిటల్స్ ఇక ముందు మిగిలిన 33 శాతం వాటాతో సహ యజమానిగా కొనసాగుతోంది. ఐపీఎల్ జట్టులో భాగమయ్యేందుకు సీవీసీ క్యాపిటల్స్‌కు టోరెంట్ సుమారు రూ.5,025 కోట్లు చెల్లించినట్లు సమాచారం.
2021లో టైటాన్స్‌ను సీవీసీ రూ.5,625 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. ఈ టీమ్ ప్రస్తుత విలువను రూ.7,500 కోట్లుగా లెక్కగట్టారు. ఈ నేపథ్యంలో సీవీసీ గ్రూప్ తాము పెట్టిన పెట్టుబడిలో సుమారు 89 శాతాన్ని తిరిగి తెచ్చుకోవడంతో పాటు 33 శాతం వాటాను ఇంకా తమ వద్దే ఉంచుకోవడం విశేషం.
కొత్త ఒప్పందం కారణంగా ఐపీఎల్‌లో భాగం కావ డం పట్ల సంతోషంగా ఉన్నామని... లీగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు టోరెంట్ గ్రూప్ డైరెక్టర్ జినాల్ మెహతా వ్యాఖ్యానించారు. టోరెంట్ దేశవ్యాప్తంగా ఫార్మాస్యూటికల్స్, విద్యుత్, గ్యాస్ రంగాల్లో పెద్ద ఎత్తున తమ వ్యాపారాలను సాగిస్తోంది. కంపెనీ విలువ దాదాపు రూ.41 వేల కోట్లుగా ఉంది. 2022 ఐపీఎల్ సీజన్‌లో టైటిల్ సాధించిన గుజరాత్ టైటాన్స్ 2023తో రన్నరప్‌గా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment