former cricketers
-
మాజీ క్రికెటర్లకు, అంపైర్లకు గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ..
మాజీ క్రికెటర్లు, అంపైర్లకు బీసీసీఐ గుడ్‌న్యూస్ అందించింది. మాజీ క్రికెటర్లు, అంపైర్ల నెలవారీ పెన్షన్లను పెంచుతున్నట్లు బీసీసీఐ సోమవారం ప్రకటన చేసింది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 900 మంది సిబ్బందికి ప్రయోజనం చేకూరునుంది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా బీసీసీఐ సెక్రటరీ జై షా వెల్లడించారు. మాజీ క్రికెటర్లు (పురుషులు అండ్ మహిళలు) అంపైర్ల నెలవారీ పెన్షన్‌ను పెంచుతున్నట్లు ప్రకటించినందుకు నేను సంతోషిస్తున్నాను. దాదాపు 900 మంది సిబ్బంది ఈ ప్రయోజనాన్ని పొందుతారు ఇందులో 75శాతం కంటే ఎక్కువ మంది లబ్ధిదారులు 100% పెన్షన్ పెంపు అందుకోనున్నారు అని జై షా ట్విటర్లో పేర్కొన్నారు. ఇక రూ. 15,000 చెల్లించే ఫస్ట్‌క్లాస్ ఆటగాళ్లకు ఇప్పుడు రూ. 30,000 అందజేయగా, రూ.22,500 పెన్షన్ అందుకునేవారికి రూ.45,000, రూ.30వేల పెన్షన్ అందుకునేవారికి రూ.52,500 లభించనుంది. చదవండి: India Vs South Africa: ఇక గెలవాల్సిందే! NEWS 🚨- BCCI announces increase in monthly pensions of former cricketers, umpires. READ -https://t.co/wmjylA1sb4 — BCCI (@BCCI) June 13, 2022 -
బీసీసీఐ తీరు దారుణం: యువరాజ్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టుకు ఆడి వీడ్కోలు చెప్పే క్రమంలో బీసీసీఐ వ్యహరించే తీరు సరిగా ఉండటం లేదని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మండిపడ్డాడు. ఆట నుంచి రిటైర్మెంట ప్రకటించిన క్రికెటర్లను గౌరవించడంపై బీసీసీఐ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నాడు. గతేదాడి జూన్ 10వ తేదీన యువరాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే తన రిటైర్మెంట్ సమయంలో బీసీసీఐ ప్రవర్తించిన తీరు అసంతృప్తి కలిగించిందని అన్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యువరాజ్ తన రిటైర్మెంట్కు సంబంధించి పలు విషయాలను షేర్ చేసుకున్నాడు. (క్రికెట్ మ్యాచ్‌కు ప్రేక్షకులు షురూ) తానేమీ లెజెండ్‌ను కాదని, అయితే భారత్‌కు ఆడినప్పుడు ప్రాణం పెట్టి ఆడేవాడినని యువీ చెప్పాడు. తాను టెస్టు క్రికెట్ చాలా తక్కువగా ఆడానని, టెస్టుల్లో అమోఘమైన రికార్డులున్న కొంతమందికి ఫేర్వెల్ నిర్వహించిన విషయాన్ని యువీ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ‘ఎవరైనా ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు అతడికి గౌరవంగా వీడ్కోలు పలకడమనేది బీసీసీఐ చేతిలో ఉంటుంది. అయితే ఒక్కటి మాత్రం చెప్పగలను. నా రిటైర్మెంట్ సమయంలో బీసీసీఐ ప్రవర్తించిన తీరు మాత్రం సరిగా లేదు. నా విషయంలోనే కాదు.. వీరేంద్ర సెహ్వాగ్, హర్బజన్ సింగ్, జహీర్ ఖాన్ వంటి అనేకమంది ఆటగాళ్ల విషయంలో బీసీసీఐ ప్రవర్తించిన తీరు దారుణం. కానీ ఇది భారత క్రికెట్లో ఎప్పటినుంచో ఉంది. అందుకే నేనేమీ ఆశ్చర్యపోను. దాని గురించి అంతగా పట్టించుకోను’ అని యువీ తెలిపాడు. కనీసం భవిష్యత్తులోనైనా గొప్ప ఆటగాళ్లను బీసీసీఐ గౌరవించాలని ఆశిస్తున్నట్లు యువీ పేర్కొన్నాడు. భారత్ గెలిచిన టీ20 వరల్డ్‌కప్(2007), వన్డే వరల్డ్‌కప్(2011)రెండు వరల్డ్‌కప్‌ల్లో యువీ కీలక పాత్ర పోషించాడు.(‘ఆ తరహా క్రికెటర్ భారత్‌లో లేడు’) -
గంగూలీ చేసిందేమీ లేదు!
న్యూఢిల్లీ: ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్(ఐసీఏ)లో డైరెక్టర్లతో ఏమీ చర్చించకుండానే బహిరంగ విమర్శలు చేస్తున్న ప్రెసిడెంట్ అశోక్ మల్హోత్రా మరోసారి వివాదానికి తెరలేపారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడిగా ఎన్నికైన సౌరవ్ గంగూలీ ఇప్పటివరకూ 10 నెలల కాలాన్ని పూర్తి చేసుకున్నా వృద్ధాప్యంలో ఉన్న మాజీ క్రికెటర్ల డిమాండ్ల విషయంలో చేసేందేమీ లేదంటూ బహిరంగ విమర్శలు చేశారు. సోమవారం పీటీఐతో మాట్లాడుతూ.. ‘ గంగూలీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత మాజీ క్రికెటర్లకు ఇప్పటివరకూ ఎటువంటి మేలు జరగలేదు. భర్తలు కోల్పోయిన మాజీ క్రికెటర్ల భార్యలు దగ్గర్నుంచీ, మెడికల్ ఇన్సురెన్స్‌ను ఐదు నుంచి పది లక్షల రూపాయలకు పెంచమన్న ప్రతిపాదన కూడా అమలుకు నోచుకోలేదు. (‘రిషభ్ పంత్‌ను చూస్తే బాధేస్తోంది’) బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ 10 నెలల నుంచి కొనసాగుతున్నా మాజీ క్రికెటర్లకు అందించాల్సిన చేయూతలో ఒక్క అడుగుకూడా ముందుకు పడలేదు. మాజీ క్రికెటర్ల సంక్షేమం కోసం పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను వెంటనే పరిష్కరించండి. చాలా మంది ఇప్పటికే 70 ఏళ్ల ఒడిలో ఉన్నారు. వారిని ఇంకా నిరీక్షించాలే చేయడం తగదు.. వారు కూడా వెయిట్ చేసే పరిస్థితి కూడా ఉండదు గంగూలీతో పాటు ఐసీఏ ప్రతినిధులుగా ఉన్న శాంతా రంగస్వామి, అన్షుమన్ గైక్వాడ్‌లు మా డిమాండ్ల పరిష్కారానికి కృషి చేయాలి. పరిస్థితిని అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నా’ అని అశోక్ మల్హోత్రా విజ్ఞప్తి చేశారు. అశోక్ మల్హోత్రా బీసీసీఐకి అభ్యర్ధించిన దాంట్లో మానవతా కోణం ఉన్నప్పటికీ బహిరంగంగా చెప్పడమే వివాదంగా మారుతూ వస్తోంది. ప్రధానంగా ఐసీఏలో డైరెక్టర్లతో ఎవరితో కనీసం చర్చించకుండానే మల్హోత్రా ఇలా మీడియా ఎదుట మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ఐసీఏలో డైరెక్టర్లంతా తమకు ఈ విషయంతో సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తూ మల్హోత్రాను దోషిగా నిలబెట్టే యత్నం చేస్తున్నారు. -
మరో 24 మంది మాజీ క్రికెటర్లకు ఐసీఏ చేయూత
న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌తో దేశంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత మాజీ క్రికెటర్లను ఆదుకునేందుకు నడుం బిగించిన భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ) రూ. 78 లక్షల రూపాయలను సేకరించిందని ఐసీఏ అధ్యక్షుడు అశోక్ మల్హోత్రా పేర్కొన్నారు. ఈ మొత్తంతో తాజాగా మరో 24 మాజీ క్రికెటర్లకు ఆర్థిక సహాయం చేసే వీలు కలుగుతుందని ఆయన అన్నారు. తొలుత 20 నుంచి 25 మంది ప్లేయర్లను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, అయితే పెద్ద సంఖ్యలో దాతలు ముందుకు రావడంతో మొత్తం 57 మందికి సాయం చేసే అవకాశం లభించిందన్నారు. తాజా జాబితాలో 2012 అంధుల టి20 ప్రపంచకప్, 2014 అంధుల వన్డే ప్రపంచకప్‌ల్లో భారత జట్టుకు నాయకత్వం వహించడంతోపాటు జట్టును చాంపియన్‌గా నిలిపిన శేఖర్ నాయక్ ఉన్నాడు. గత ఏడాది ఏర్పాటైన భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ)లో మొత్తం 1,750 మంది మాజీ క్రికెటర్లు సభ్యత్వం తీసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐసీఏకు బీసీసీఐ రూ. 2 కోట్లు విరాళం ఇచ్చింది. -
కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు సిద్ధూ, అజహర్
రాయ్‌పూర్: రాజకీయ నేతలుగా మారిన మాజీ క్రికెటర్లు నవజ్యోత్ సింగ్ సిద్ధూ, మహ్మద్ అజహరుద్దీన్‌లు ఛత్తీస్‌గఢ్ తొలిదశ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచార బరిలోకి దిగనున్నారు. తొలిదశ ఎన్నికల కోసం 40 మంది స్టార్ క్యాంపెయినర్లను కాంగ్రెస్ బుధవారం ప్రకటించింది. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, యూపీఏ చైర్పర్సన్ సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్, ఇతర సీనియర్ కాంగ్రెస్ నేతలు అశోక్ గెహ్లాట్, సుశీల్ కుమార్ షిండే, పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, గులాం నబీ ఆజాద్, రాజ్ బబ్బర్, జ్యోతిరాదిత్య సింధియా తదితరులున్నారని ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 సీట్లుండగా, గత 15 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రతిపక్షానికే పరిమితమైంది. -
మాజీ రంజీ క్రికెటర్ల భేటీ
సాక్షి, హైదరాబాద్: మాజీ రంజీ క్రికెటర్లు ఆదివారం జింఖానా గ్రౌండ్‌సలోని హెచ్‌సీఏ కార్యాలయంలో సమావేశమయ్యారు. క్రికెట్ ప్లేయర్ల సంఘం (సీపీఏ) అధ్యక్షుడు మనోహర్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ మీటింగ్‌లో 34 మంది హైదరాబాద్‌కు ఆడిన మాజీ క్రికెటర్లు పాల్గొన్నారు. లోధా కమిటీ సిఫార్సుల్ని హెచ్‌సీఏ అమలుచేయడంపై వీరంతా చర్చించారు. ఈ సందర్భంగా పలువురు మాజీలు తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చారు. ప్రస్తుత నిబంధనల మేరకు కొత్త ప్లేయర్ల సంఘాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఇందుకోసం స్టీరింగ్ కమిటీని నియమించారు. ఈ కమిటీ హెచ్‌సీఏతో సమన్వయంతో పనిచేస్తుంది. ఇది కేవలం మధ్యంతర కమిటీ మాత్రమేనని విజయ్ మోహన్‌రాజ్ స్పష్టం చేశారు. ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఎన్నుకునేవరకు మాత్రమే ఇది పనిచేస్తుందన్నారు. ఈ కమిటీలో ఎం.వి.నరసింహారావు, వెంకటపతి రాజు, నోయల్ డేవిడ్, విజయ్ మోహన్‌రాజ్‌లు ఉన్నారు. ఇందులో ఐదో సభ్యుడిగా శివలాల్‌యాదవ్‌ను తీసుకోవాలని భావిస్తున్నారు. ఆయన సమ్మతి మేరకు తుది నిర్ణయం తీసుకుంటామని కమిటీ తెలిపింది. -
వీడియో పోస్ట్ చేసి.. షేన్ వార్న్ బుక్కయ్యాడు
హోబర్ట్: మాజీ దిగ్గజ క్రికెటర్లు షేన్ వార్న్, కెవిన్ పీటర్సన్, మైఖేల్ స్లేటర్లకు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు జరిమానా వేశారు. ఆస్ట్రేలియాలో మాజీ క్రికెటర్లు కారు రైడింగ్‌కు వెళ్లినపుడు సీటు బెల్ట్ పెట్టుకోనందుకు పోలీసులు దాదాపు 20,500 రూపాయల జరిమానా విధించారు. షేన్ వార్న్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో ఈ ముగ్గురూ ట్రాఫిక్ రూల్స్ పాటించనట్టు తేలింది. ఆస్ట్రేలియాలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌కు వార్న్, పీటర్సన్, స్లేటర్లు కామెంటేటర్లుగా పనిచేస్తున్నారు. ఆసీస్ మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ కారులో మాజీ కీపర్ ఇయాన్ హేలీతో కలసి వీరు ముగ్గురు రైడింగ్‌కు వెళ్లారు. రెండో టెస్టు మూడో రోజు ఆట అనంతరం ఈ వీడియోను వార్న్ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. 4 నిమిషాల నిడివి గల ఈ వీడియోలో మార్క్ టేలర్ కారు డ్రైవింగ్ చేస్తున్నట్టు కనిపించగా, ముందు సీట్లో అతని పక్కన హేలీ కూర్చున్నాడు. వీరిద్దరూ సీటు బెల్టులు ధరించగా, కారు వెనుక సీట్లో కూర్చున్న వార్న్, పీటర్సన్, స్లేటర్లు సీటు బెల్ట్ పెట్టుకోలేదు. ఈ వీడియో ఫేస్బుక్లో వైరల్ కావడంతో తస్మేనియన్ పోలీసులు మంగళవారం ఈ విషయాన్ని గుర్తించారు. టేలర్, హేలీలను మినహాయించి, నిబంధనలను ఉల్లంఘించిన వార్న్, పీటర్సన్, స్లేటర్లకు జరిమానా వేశారు. -
ఎంసీఎల్ జట్టును కొన్న సంజయ్ దత్
దుబాయ్: మాజీ క్రికెటర్లతో ప్రారంభం కాబోతున్న మాస్టర్స్ చాంపియన్స్ లీగ్ (ఎంసీఎల్)లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ జట్టును కొన్నారు. ప్రస్తుతం దత్ జైలులో ఉన్నందున అతని భార్య మాన్యత దీనికి సంబంధించిన డీల్‌ను మాట్లాడినట్లు సమాచారం. ‘మా కుటుంబంలో అందరికీ క్రీడల పట్ల ఆసక్తి ఉంది. ముఖ్యంగా సంజయ్‌కు చిన్నప్పటి నుంచి క్రీడలపై ఆసక్తి ఎక్కువ’ అని మాన్యత చెప్పారు. దత్ బయటకు వచ్చేవరకూ ఓ టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఈ జట్టుకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. అలాగే ధోని స్నేహితుడు అరుణ్ పాండే కూడా ఓ జట్టులో వాటా కొనుక్కుం టున్నట్లు సమాచారం. వచ్చే జనవరిలో జరిగే ఈ లీగ్‌లో సెహ్వాగ్, లారా, కలిస్ తదితర మాజీ క్రికెటర్లు ఆడుతున్నారు. -
'ఇంట్రెస్ట్' గందరగోళం
బీసీసీఐ కొత్త నిబంధనతో సచిన్ సహా మాజీలందరికీ ఇబ్బందే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్... ఇప్పుడు భారత క్రికెట్లో పెద్ద గందరగోళానికి దారి తీసిన పదం ఇది. బీసీసీఐతో పాటు రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో ఉన్న వారెవరూ క్రికెట్‌కు సంబంధించి ఆదాయాన్ని తెచ్చిపెట్టే వేరే పనులు, వ్యాపారాలు చేయకూడదు. దీనికి అంగీకరిస్తూ అందరూ సంతకాలు చేయాలని బోర్డు ఇటీవల ఆదేశించింది. దీనివల్ల అధికారులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. సాక్షి క్రీడావిభాగం ఐపీఎల్, క్రికెట్ కామెంటరీ... ఈ రెండూ మాజీ క్రికెటర్లకు వరం. రిటైరైన తర్వాత ఏదో ఒక జట్టు మెంటార్‌గా వ్యవహరించడమో, కామెంటరీ చెప్పుకోవడమో చేస్తూ డబ్బు సంపాదించుకుంటున్నారు. తాజాగా బీసీసీఐ చెబుతున్న ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్’ (పరస్పర విరుద్ధ ప్రయోజనాలు) నిబంధన వల్ల ఇలాంటి పనులు చేస్తున్న వాళ్లందరూ వాటిని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు బీసీసీఐ ఏర్పాటు చేసిన క్రికెట్ కమిటీలో సభ్యులు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ ముగ్గురికీ ఐపీఎల్ జట్లతో లేదంటే కామెంట రీతోనే ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. బోర్డుతో సంబంధాలు ఉండి... ఇతర మార్గాల ద్వారా క్రికెట్‌తో ఆదాయం పొందుతున్న వారి జాబితాను పరిశీలిస్తే దాదాపు మాజీ క్రికెటర్లంతా ఈ జాబితాలో ఉన్నారు. అలాగే బ్రిజేశ్ పటేల్ లాంటి పరిపాలకులకూ ఈ లాభాలు ఉన్నాయి. రెండు రకాల వాదనలు ఈ అంశం ఇప్పుడు బీసీసీఐలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ ఈ నిబంధన అమలులోకి వస్తే క్రికెటర్లకూ వర్తింపజేయాలనేది ఒక వాదనైతే... సచిన్ లాంటి మాజీలను దీని నుంచి మినహాయించాలనేది మరో వాదన. ‘బెంగళూరు జట్టుతో కలిసి ఐపీఎల్లో పని చేస్తున్నానని కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందంటున్నారు. మరి అనిల్ కుంబ్లే ముంబైతో, లక్ష్మణ్ హైదరాబాద్‌తో కలిసి పని చేస్తున్నారుగా’ అని కర్ణాటక క్రికెట్ సంఘం కార్యదర్శి బ్రిజేశ్ పటేల్ ప్రశ్నిస్తున్నారు. అయితే బీసీసీఐ కోశాధికారి అజయ్ షిర్కే ఈ వాదనతో విభేదిస్తున్నారు. ‘క్రికెటర్లు ఐపీఎల్ జట్లకు మెంటార్స్‌గా పని చేయడం వల్ల క్రికెట్‌కే లాభం. కాబట్టి దీనిని కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనలేం. దీనివల్ల వాళ్లకి ఆర్థిక ప్రయోజనాలు వచ్చినా ఆట అభివృద్ధికి దోహదపడుతున్నారు. కాబట్టి మాజీ క్రికెటర్లకు మినహాయింపు ఇవ్వొచ్చు’ అని షిర్కే అంటున్నారు. బీసీసీఐ అధికారులు మాత్రం ఇది చాలా సున్నితమైన అంశంగా అభివర్ణిస్తున్నారు. క్రికెటర్లు వదిలేస్తారేమో... సచిన్, లక్ష్మణ్, గంగూలీ వాళ్లంతట వాళ్లు క్రికెట్ కమిటీలోకి రాలేదు. దేశంలో క్రికెట్ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ బీసీసీఐ ఈ ముగ్గురితో కమిటీని నియమించింది. దీనివల్ల వీళ్లు బోర్డు నుంచి పొందే ఆర్థిక ప్రయోజనం ఎంతనేది బయటకు తెలియకపోయినా... భారీగా ఉండదనేది మాత్రం వాస్తవం. వీళ్లని కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నిబంధన కింద చేరిస్తే... క్రికెట్ కమిటీ నుంచి తప్పుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ‘ఆటకు మేలు చేయడం కోసం వాళ్లు పదవులు తీసుకున్నారు. దీనివల్ల ఆర్థికంగా పెద్దగా ప్రయోజనం లేదు. అదే కామెంటేటర్‌గా, ఐపీఎల్లో మెంటార్స్‌గా, కోచ్‌లుగా పని చేయడం వల్ల ఎక్కువ మొత్తం లభిస్తుంది. కాబట్టి వీళ్లని ఈ నిబంధన కింద చేరిస్తే బోర్డు పదవిని వదులుకునే ప్రమాదం ఉంటుంది’ అని ఓ మాజీ క్రికెటర్ అంటున్నారు. దీనిపై సెప్టెంబరులో జరిగే బీసీసీఐ వార్షిక సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అప్పటివరకూ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు అనే అంశం ముందుకు కదలకపోవచ్చు. మాజీల ‘ఇంట్రెస్ట్‌లు’ సచిన్ టెండూల్కర్: బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీలో సభ్యుడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు మెంటార్. అనిల్ కుంబ్లే: బీసీసీఐ టెక్నికల్ కమిటీ చైర్మన్. ముంబై ఇండియన్స్ జట్టుకు మెంటార్. క్రికెట్ టెక్నాలజీకి సంబంధించిన కంపెనీ ఉంది. రవిశాస్త్రి: భారత జట్టు డెరైక్టర్. ఐపీఎల్ కౌన్సిల్ మెంబర్. కామెంటేటర్. బ్రిజేశ్ పటేల్: బీసీసీఐ ఏరియా డెవలప్మెంట్ కమిటీ సభ్యుడు. కర్ణాటక క్రికెట్ సంఘం కార్యదర్శి, ఐపీఎల్లో బెంగళూరు జట్టు ఆపరేషన్స్ హెడ్. సునీల్ గవాస్కర్: బీసీసీఐ కామెంటేటర్. ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ గ్రూప్ నిర్వహిస్తున్నారు. పలువురు క్రికెటర్లకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను ఈ సంస్థ పర్యవేక్షిస్తుంది. క్రికెటర్లతో కాలమ్స్ రాయిస్తుంది. రాహుల్ ద్రవిడ్: భారత్ ‘ఎ’, అండర్-19 జట్ల కోచ్. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ మెంటార్. లక్ష్మణ్: బీసీసీఐ సలహా కమిటీ సభ్యుడు. సన్‌రైజర్స్ జట్టుకు మెంటార్. సంజయ్ బంగర్: భారత జట్టు సహాయక కోచ్. ఐపీఎల్లో పంజాబ్ జట్టు ప్రధాన కోచ్. సౌరవ్ గంగూలీ: బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ సభ్యుడు. కామెంటేటర్. బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీలో వాటాలు. -
‘రింగ్ మాస్టర్’పై ముప్పేట దాడి!
‘రింగ్ మాస్టర్’ గ్రెగ్ చాపెల్‌పై భారత ప్రస్తుత, మాజీ క్రికెటర్లు ముప్పేట దాడి ప్రారంభించారు. ద్రవిడ్‌ను తప్పించి, తనను కెప్టెన్‌ని చేస్తానని గ్రెగ్ చాపెల్ చెప్పినట్లు సచిన్ తన ఆత్మకథలో పేర్కొన్నాక... ఈ అంశంపై వాడివేడి వ్యాఖ్యలు ప్రారంభమయ్యాయి. అసలు తాను సచిన్‌తో అలాంటి చర్చ ఎప్పుడూ చేయలేదంటూ మాస్టర్ పుస్తకంలోని అంశాన్ని గ్రెగ్ చాపెల్ ఖండించారు. అయితే చాపెల్ వల్లే భారత క్రికెట్ సర్వనాశనమైందని, తిరిగి మన క్రికెట్ బాగుపడటానికి మూడేళ్లు పట్టిందని జహీర్ అంటే... తమ జట్టులోనే అప్పట్లో కొందరు క్రికెటర్లు చాపెల్‌తో కుమ్మక్కయ్యారని, వారి పేర్లు త్వరలో బయటపెడతానని హర్భజన్ చెప్పాడు. మొత్తంమీద అప్పుడు భారత జట్టులో ఉన్న క్రికెటర్లంతా చాపెల్‌పై ధ్వజమెత్తుతూ మాస్టర్ వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచారు. మొత్తంమీద సచిన్ తన పుస్తకం ‘ప్లేయింగ్ ఇట్ మై వే’లో రాసిన అంశాలు మాత్రం క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్లో మంగళవారం పలువురు క్రికెటర్లు, చాపెల్ మాట్లాడిన అంశాలు వారి మాటల్లోనే... జూనియర్స్, సీనియర్స్‌ను వేరు చేశాడు సచిన్ చెప్పిందంతా నేను నమ్ముతున్నాను. 2000 నుంచి నేను మిడిలార్డర్లోనే ఆడుతున్నాను. కానీ 2006లో నన్ను ఓపెనర్‌గా ఆడమన్నాడు. నేను తిరస్కరించాను. ‘ఇంటి దగ్గర కూర్చోవడానికి 31 ఏళ్ల వయసు సరిపోదా’ అని అన్నాడు. ఆ మాటలకు నేను ఆశ్చర్యపోయా. భారత క్రికెట్లో అత్యంత కలుషితమైన డ్రెస్సింగ్‌రూమ్ వాతావరణం 2006లో ఉంది. చాపెల్ భారత క్రికెట్‌ను చాలా వెనక్కు తీసుకెళ్లాడు. జూనియర్లు, సీనియర్ల మధ్య స్పర్థలు తెచ్చే ప్రయత్నం చేశాడు. క్రికెట్ అంటే జట్టుగా ఆడే ఆట. జట్టు ఒక కుటుంబంలా ఉండాలి. ఎందుకు అన్ని విషయాలు బయటకు చెప్పవని నేను అనేకసార్లు సచిన్‌ను అడిగాను. ఆటంటే గౌరవం కాబట్టే అనవసర వివాదాలు రాకుండా చూడాలనేది సచిన్ అభిప్రాయం. తన ప్రయాణంలో ఎదురైన అనుభవాలను బయటకు చెప్పే హక్కు మాస్టర్‌కు ఉంది. - వీవీఎస్ లక్ష్మణ్ సచిన్‌నూ తీద్దామన్నాడు సచిన్, లక్ష్మణ్, జహీర్, హర్భజన్, సెహ్వాగ్‌లను జట్టులోంచి తప్పించమని చాపెల్ నాతో అన్నాడు. చాపెల్ మాటలను అప్పట్లో నేను బోర్డు దృష్టికి తీసుకెళ్లాను. కోచ్ మాటలను వ్యతిరేకించాను. ఫలితంగా జింబాబ్వే పర్యటన తర్వాత జట్టులో నాకు స్థానం పోయింది. నాకే స్థానం పోతే ఇక మిగిలిన క్రికెటర్లు ఎలా స్పందిస్తారు. అందుకే ఈ వ్యవహారంలో మాట్లాడని క్రికెటర్లను తప్పుపట్టడానికేం లేదు. చాపెల్ చేసిన తప్పులు మాత్రం క్షమించరానివి. - గంగూలీ మా వాళ్లూ కొందరు ఉన్నారు చాపెల్ వల్ల భారత క్రికెట్ దారుణంగా దెబ్బతింది. మా జట్టులోనే కొంతమంది ఆటగాళ్లు తప్పుడు సమాచారం కోచ్‌కు ఇచ్చి పెద్ద పెద్ద గొడవలు పెట్టేవాళ్లు. సమయం వచ్చినప్పుడు ఆ ఆటగాళ్లు ఎవరనేది చెబుతా. చాపెల్‌ను నమ్ముకుంటే ఆటతో పనిలేకుండా జట్టులో ఉండొచ్చని వాళ్లు భావించారు. జింబాబ్వేలో గంగూలీ టెస్టులో బ్యాటింగ్ చేస్తుంటే... డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చుని చాపెల్ గంగూలీకి వ్యతిరేకంగా బీసీసీఐకి ఈ-మెయిల్ పంపాడు. మ్యాచ్‌లో ఏం జరుగుతుందనే అంశాన్ని కూడా చాపెల్ పట్టించుకోలేదు. గంగూలీ రాగానే తనకి ఈ విషయం చెప్పా. తను కూడా షాక్ తిన్నాడు. మొత్తం ఏడుగురిని చాపెల్ జట్టు నుంచి తప్పించాలని చూశాడు. గంగూలీ మొదటి వాడు. నేను, సెహ్వాగ్, నెహ్రా, జహీర్, యువరాజ్ ఆ జాబితాలో ఉన్నాం. (భజ్జీ ఆరు పేర్లు మాత్రమే చెప్పాడు). ఆ సమయంలో ప్రతి ఒక్కరికీ పక్క వ్యక్తి అంటే భయం ఉండేది. ఒకరి మీద ఒకరికి నమ్మకం లేక సరిగా మాట్లాడుకునేవాళ్లం కాదు. 2001 నుంచి 2005 వరకు గంగూలీ కష్టపడి నిర్మించిన మంచి జట్టును చాపెల్ సర్వనాశనం చేశాడు. ఆటగాళ్లను ఒకళ్ల మీదకు ఒకళ్లని ఉసిగొల్పేవాడు. లేదంటే బీసీసీఐ అధికారుల మధ్య పుల్లలు పెట్టేవాడు. - హర్భజన్ పుస్తకం చదివాక చెబుతా: ద్రవిడ్ ‘సచిన్ పుస్తకం నేను ఇంకా చదవలేదు. అందులో చాలా అంశాలు ఉండే అవకాశం ఉంది. అవన్నీ చదివిన తర్వాత... ఒకవేళ నేను ఏదైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడతా. ఇప్పుడు స్పందించడం కరెక్ట్ కాదు. సచిన్ మాట్లాడిన ప్రతి అంశంపై నేను ఎలా కామెంట్ చేయగలను. ఇద్దరు వ్యక్తుల మధ్య ఏం జరిగిందో వాళ్లిద్దరికే తెలుస్తుంది’ - ద్రవిడ్ అవి చీకటి రోజులు 2005లో చాపెల్ కోచ్ అయిన తర్వాత ఒకసారి నా దగ్గరకు వచ్చాడు. ‘నేను కోచ్‌గా ఉన్నంతకాలం నువ్వు భారత జట్టుకు ఆడలేవు’ అని చెప్పాడు. నాకేం అర్థం కాలేదు. కొద్దిసేపు అయోమయంలో ఉండిపోయాను. ఇప్పుడేం చేయాలి? నేను తిరగబడాలా? కెప్టెన్‌తో మాటాడాలా? ఏం చేయాలో అర్థం కాలేదు. చాపెల్ కోచ్‌గా ఉన్న రెండేళ్ల కాలం భారత క్రికెట్‌కు చీకటి రోజులు. నాకో విషయం అర్థమైంది. తనొక ఎజెండాతో ఉండేవారు. అది జరగకపోతే సంబంధిత వ్యక్తులను పక్కన బెట్టాలని ప్రయత్నించేవారు. జట్టులోని చాలామంది సీనియర్లతో తనకు పడేది కాదు. నేను తిరిగి భారత జట్టులోకి రాకుండా ఉండటానికి చాపెల్ చాలా గట్టిగా ప్రయత్నాలు చేశారు. నా పేరు సెలక్షన్లో ప్రస్తావనకు వస్తే చాపెల్ అడ్డుచెప్పేవాడు. తన వల్లే కనీసం 3 నుంచి నాలుగు నెలలు ఆలస్యంగా జట్టులోకి వచ్చాను. జట్టు అంతా సంతోషంగా ఉంటే విజయాలు వస్తాయి. కానీ చాపెల్ సమయంలో జట్టు అలా లేదు. ఒక వ్యక్తి ఇష్టాయిష్టాలతో మొత్తం డ్రెస్సింగ్ రూమ్‌ను నియంత్రించాలని అనుకునేవాడు. భారత క్రికెటర్ల దాకే ఎందుకు? వెళ్లి చాపెల్‌తో కలిసి పని చేసిన ఆస్ట్రేలియా క్రికెటర్లను ఎవరినైనా అడ గండి. వాళ్లు కూడా ఇదే చెబుతారు. 2008లో భారత్‌లో ఆస్ట్రేలియా ఆడినప్పుడు మా ప్రత్యర్థి డ్రెస్సింగ్ రూమ్‌లో చాపెల్‌ను చూసి మేం మరింత కసిగా ఆడాం. (ఆ సిరీస్‌కు చాపెల్ ఆస్ట్రేలియా జట్టుకు కన్సల్టెంట్‌గా వచ్చాడు). ప్రతి మ్యాచ్‌లోనూ చాపెల్నే ఓడించాలనే కసితో మా సత్తా మైదానంలో చూపించాం. (ఆ సిరీస్‌ను భారత్ 2-0తో గెలిచింది) - జహీర్ ఖాన్ పూర్తిగా అబద్ధం ‘నేను మాటల యుద్ధంలోకి వెళ్లదలచుకోలేదు. కానీ స్పష్టంగా ఒక విషయం చెబుతున్నా. నేను భారత్‌కు కోచ్‌గా పని చేసిన సమయంలో ఎప్పుడూ ద్రవిడ్ స్థానంలో సచిన్‌ను కెప్టెన్‌గా పరిగణనలోకే తీసుకోలేదు. పుస్తకంలో సచిన్ నా గురించి చెప్పిన విషయాలు ఆశ్చర్యానికి గురి చేశాయి. ఆ రోజుల్లో నేను సచిన్ ఇంటికి కేవలం ఒక్కసారి మాత్రమే వెళ్లాను. అది కూడా అతను చెబుతున్న కాలానికి ఏడాది ముందు. అప్పుడు నాతో ఫిజియో, అసిస్టెంట్ కోచ్ కూడా ఉన్నారు. కేవలం అతను గాయం నుంచి కోలుకుంటున్నందున... ఎలా కోలుకుంటున్నాడో పరిశీలించడానికే వెళ్లాను. ఆ రోజు మధ్యాహ్నం ఉల్లాసంగా గడిచింది. అసలు కెప్టెన్సీ గురించి చర్చ రాలేదు’. -గ్రెగ్ చాపెల్