‘రింగ్ మాస్టర్’పై ముప్పేట దాడి! | Sachin Tendulkar gets backing from teammates over Greg Chappell issue | Sakshi
Sakshi News home page

‘రింగ్ మాస్టర్’పై ముప్పేట దాడి!

Published Wed, Nov 5 2014 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 3:51 PM

‘రింగ్ మాస్టర్’పై ముప్పేట దాడి!

‘రింగ్ మాస్టర్’పై ముప్పేట దాడి!

‘రింగ్ మాస్టర్’ గ్రెగ్ చాపెల్‌పై భారత ప్రస్తుత, మాజీ క్రికెటర్లు ముప్పేట దాడి ప్రారంభించారు. ద్రవిడ్‌ను తప్పించి, తనను కెప్టెన్‌ని చేస్తానని గ్రెగ్ చాపెల్ చెప్పినట్లు సచిన్ తన ఆత్మకథలో పేర్కొన్నాక... ఈ అంశంపై వాడివేడి వ్యాఖ్యలు ప్రారంభమయ్యాయి. అసలు తాను సచిన్‌తో అలాంటి చర్చ ఎప్పుడూ చేయలేదంటూ మాస్టర్ పుస్తకంలోని అంశాన్ని గ్రెగ్ చాపెల్ ఖండించారు.

అయితే చాపెల్ వల్లే భారత క్రికెట్ సర్వనాశనమైందని, తిరిగి మన క్రికెట్ బాగుపడటానికి మూడేళ్లు పట్టిందని జహీర్ అంటే... తమ జట్టులోనే అప్పట్లో కొందరు క్రికెటర్లు చాపెల్‌తో కుమ్మక్కయ్యారని, వారి పేర్లు త్వరలో బయటపెడతానని హర్భజన్ చెప్పాడు. మొత్తంమీద అప్పుడు భారత జట్టులో ఉన్న క్రికెటర్లంతా చాపెల్‌పై ధ్వజమెత్తుతూ మాస్టర్ వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచారు. మొత్తంమీద సచిన్ తన పుస్తకం ‘ప్లేయింగ్ ఇట్ మై వే’లో రాసిన అంశాలు మాత్రం క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్‌లో మంగళవారం పలువురు క్రికెటర్లు, చాపెల్ మాట్లాడిన అంశాలు వారి మాటల్లోనే...
 
 జూనియర్స్, సీనియర్స్‌ను వేరు చేశాడు
 సచిన్ చెప్పిందంతా నేను నమ్ముతున్నాను. 2000 నుంచి నేను మిడిలార్డర్‌లోనే ఆడుతున్నాను. కానీ 2006లో నన్ను ఓపెనర్‌గా ఆడమన్నాడు. నేను తిరస్కరించాను. ‘ఇంటి దగ్గర కూర్చోవడానికి 31 ఏళ్ల వయసు సరిపోదా’ అని అన్నాడు. ఆ మాటలకు నేను ఆశ్చర్యపోయా. భారత క్రికెట్‌లో అత్యంత కలుషితమైన డ్రెస్సింగ్‌రూమ్ వాతావరణం 2006లో ఉంది.

చాపెల్ భారత క్రికెట్‌ను చాలా వెనక్కు తీసుకెళ్లాడు. జూనియర్లు, సీనియర్ల మధ్య స్పర్థలు తెచ్చే ప్రయత్నం చేశాడు. క్రికెట్ అంటే జట్టుగా ఆడే ఆట. జట్టు ఒక కుటుంబంలా ఉండాలి. ఎందుకు అన్ని విషయాలు బయటకు చెప్పవని నేను అనేకసార్లు సచిన్‌ను అడిగాను. ఆటంటే గౌరవం కాబట్టే అనవసర వివాదాలు రాకుండా చూడాలనేది సచిన్ అభిప్రాయం. తన ప్రయాణంలో ఎదురైన అనుభవాలను బయటకు చెప్పే హక్కు మాస్టర్‌కు ఉంది.    - వీవీఎస్ లక్ష్మణ్
 
 సచిన్‌నూ తీద్దామన్నాడు
 సచిన్, లక్ష్మణ్, జహీర్, హర్భజన్, సెహ్వాగ్‌లను జట్టులోంచి తప్పించమని చాపెల్ నాతో అన్నాడు. చాపెల్ మాటలను అప్పట్లో నేను బోర్డు దృష్టికి తీసుకెళ్లాను. కోచ్ మాటలను వ్యతిరేకించాను. ఫలితంగా జింబాబ్వే పర్యటన తర్వాత జట్టులో నాకు స్థానం పోయింది. నాకే స్థానం పోతే ఇక మిగిలిన క్రికెటర్లు ఎలా స్పందిస్తారు. అందుకే ఈ వ్యవహారంలో మాట్లాడని క్రికెటర్లను తప్పుపట్టడానికేం లేదు. చాపెల్ చేసిన తప్పులు మాత్రం క్షమించరానివి.    - గంగూలీ
 
 మా వాళ్లూ కొందరు ఉన్నారు
 చాపెల్ వల్ల భారత క్రికెట్ దారుణంగా దెబ్బతింది.  మా జట్టులోనే కొంతమంది ఆటగాళ్లు తప్పుడు సమాచారం కోచ్‌కు ఇచ్చి పెద్ద పెద్ద గొడవలు పెట్టేవాళ్లు. సమయం వచ్చినప్పుడు ఆ ఆటగాళ్లు ఎవరనేది చెబుతా. చాపెల్‌ను నమ్ముకుంటే ఆటతో పనిలేకుండా జట్టులో ఉండొచ్చని వాళ్లు భావించారు. జింబాబ్వేలో గంగూలీ టెస్టులో బ్యాటింగ్ చేస్తుంటే... డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చుని చాపెల్ గంగూలీకి వ్యతిరేకంగా బీసీసీఐకి ఈ-మెయిల్ పంపాడు.

మ్యాచ్‌లో ఏం జరుగుతుందనే అంశాన్ని కూడా చాపెల్ పట్టించుకోలేదు. గంగూలీ రాగానే తనకి ఈ విషయం చెప్పా. తను కూడా షాక్ తిన్నాడు. మొత్తం ఏడుగురిని చాపెల్ జట్టు నుంచి తప్పించాలని చూశాడు. గంగూలీ మొదటి వాడు. నేను, సెహ్వాగ్, నెహ్రా, జహీర్, యువరాజ్ ఆ జాబితాలో ఉన్నాం. (భజ్జీ ఆరు పేర్లు మాత్రమే చెప్పాడు). ఆ సమయంలో ప్రతి ఒక్కరికీ పక్క వ్యక్తి అంటే భయం ఉండేది.

ఒకరి మీద ఒకరికి నమ్మకం లేక సరిగా మాట్లాడుకునేవాళ్లం కాదు.  2001 నుంచి 2005 వరకు గంగూలీ కష్టపడి నిర్మించిన మంచి జట్టును చాపెల్ సర్వనాశనం చేశాడు. ఆటగాళ్లను ఒకళ్ల మీదకు ఒకళ్లని ఉసిగొల్పేవాడు. లేదంటే బీసీసీఐ అధికారుల మధ్య పుల్లలు పెట్టేవాడు.    - హర్భజన్
 
 
 పుస్తకం చదివాక చెబుతా: ద్రవిడ్
  ‘సచిన్ పుస్తకం నేను ఇంకా చదవలేదు. అందులో చాలా అంశాలు ఉండే అవకాశం ఉంది. అవన్నీ చదివిన తర్వాత... ఒకవేళ నేను ఏదైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడతా. ఇప్పుడు స్పందించడం కరెక్ట్ కాదు. సచిన్ మాట్లాడిన ప్రతి అంశంపై నేను ఎలా కామెంట్ చేయగలను. ఇద్దరు వ్యక్తుల మధ్య ఏం జరిగిందో వాళ్లిద్దరికే తెలుస్తుంది’     - ద్రవిడ్


 
 అవి చీకటి రోజులు
 2005లో చాపెల్ కోచ్ అయిన తర్వాత ఒకసారి నా దగ్గరకు వచ్చాడు. ‘నేను కోచ్‌గా ఉన్నంతకాలం నువ్వు భారత జట్టుకు ఆడలేవు’ అని చెప్పాడు. నాకేం అర్థం కాలేదు. కొద్దిసేపు అయోమయంలో ఉండిపోయాను. ఇప్పుడేం చేయాలి? నేను తిరగబడాలా? కెప్టెన్‌తో మాటాడాలా? ఏం చేయాలో అర్థం కాలేదు. చాపెల్ కోచ్‌గా ఉన్న రెండేళ్ల కాలం భారత క్రికెట్‌కు చీకటి రోజులు. నాకో విషయం అర్థమైంది. తనొక ఎజెండాతో ఉండేవారు. అది జరగకపోతే సంబంధిత వ్యక్తులను పక్కన బెట్టాలని ప్రయత్నించేవారు. జట్టులోని చాలామంది సీనియర్లతో తనకు పడేది కాదు.

నేను తిరిగి భారత జట్టులోకి రాకుండా ఉండటానికి చాపెల్ చాలా గట్టిగా ప్రయత్నాలు చేశారు. నా పేరు సెలక్షన్‌లో ప్రస్తావనకు వస్తే చాపెల్ అడ్డుచెప్పేవాడు. తన వల్లే కనీసం 3 నుంచి నాలుగు నెలలు ఆలస్యంగా జట్టులోకి వచ్చాను. జట్టు అంతా సంతోషంగా ఉంటే విజయాలు వస్తాయి. కానీ చాపెల్ సమయంలో జట్టు అలా లేదు. ఒక వ్యక్తి ఇష్టాయిష్టాలతో మొత్తం డ్రెస్సింగ్ రూమ్‌ను నియంత్రించాలని అనుకునేవాడు.

భారత క్రికెటర్ల దాకే ఎందుకు? వెళ్లి చాపెల్‌తో కలిసి పని చేసిన ఆస్ట్రేలియా క్రికెటర్లను ఎవరినైనా అడ గండి. వాళ్లు కూడా ఇదే చెబుతారు. 2008లో భారత్‌లో ఆస్ట్రేలియా ఆడినప్పుడు మా ప్రత్యర్థి డ్రెస్సింగ్ రూమ్‌లో చాపెల్‌ను చూసి మేం మరింత కసిగా ఆడాం. (ఆ సిరీస్‌కు చాపెల్ ఆస్ట్రేలియా జట్టుకు కన్సల్టెంట్‌గా వచ్చాడు). ప్రతి మ్యాచ్‌లోనూ చాపెల్‌నే ఓడించాలనే కసితో మా సత్తా మైదానంలో చూపించాం. (ఆ సిరీస్‌ను భారత్ 2-0తో గెలిచింది)
 - జహీర్ ఖాన్
 
 పూర్తిగా అబద్ధం
 ‘నేను మాటల యుద్ధంలోకి వెళ్లదలచుకోలేదు. కానీ స్పష్టంగా ఒక విషయం చెబుతున్నా. నేను భారత్‌కు కోచ్‌గా పని చేసిన సమయంలో ఎప్పుడూ ద్రవిడ్ స్థానంలో సచిన్‌ను కెప్టెన్‌గా పరిగణనలోకే తీసుకోలేదు. పుస్తకంలో సచిన్ నా గురించి చెప్పిన విషయాలు ఆశ్చర్యానికి గురి చేశాయి. ఆ రోజుల్లో నేను సచిన్ ఇంటికి కేవలం ఒక్కసారి మాత్రమే వెళ్లాను.

అది కూడా అతను చెబుతున్న కాలానికి ఏడాది ముందు. అప్పుడు నాతో ఫిజియో, అసిస్టెంట్ కోచ్ కూడా ఉన్నారు. కేవలం అతను గాయం నుంచి కోలుకుంటున్నందున... ఎలా కోలుకుంటున్నాడో పరిశీలించడానికే వెళ్లాను. ఆ రోజు మధ్యాహ్నం ఉల్లాసంగా గడిచింది. అసలు కెప్టెన్సీ గురించి చర్చ రాలేదు’.
 -గ్రెగ్ చాపెల్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement