రిచీ బెనాడ్ ఇక లేరు | Richie Benaud is no more | Sakshi
Sakshi News home page

రిచీ బెనాడ్ ఇక లేరు

Published Sat, Apr 11 2015 2:12 AM | Last Updated on Sun, Sep 3 2017 12:07 AM

Richie Benaud is no more

సిడ్నీ : ఓ మ్యాచ్‌లో ఆసీస్ పేసర్ మెక్‌గ్రాత్ బ్యాటింగ్‌కు దిగాడు. కిందామీదా పడి రెండు పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ సమయంలో మ్యాచ్‌కు వ్యాఖ్యాతగా పని చేస్తున్న ఓ వ్యక్తి... మెక్‌గ్రాత్ సెంచరీకి కేవలం 98 పరుగుల దూరంలోనే అవుటయ్యాడు.. అంటూ కామెంట్ విసిరారు. అంతే ప్యానెల్లో ఉన్న ఇతర సభ్యులు నవ్వు ఆపుకోలేకపోయారు. అంటే మెక్‌గ్రాత్‌కు అసలు బ్యాటింగే రాదనే విషయాన్ని వ్యంగ్యంగా చెప్పిన ఆ కామెంటేటర్ రిచీ బెనాడ్. క్రికెట్ కామెంటరీలో ప్రమాణాలను నిర్దేశించిన బెనాడ్ గురువారం రాత్రి మరణించారు. సుదీర్ఘకాలంగా చర్మ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఈ ఆస్ట్రేలియా పాతతరం ఆల్‌రౌండర్ వయసు 84 ఏళ్లు. 2013లో జరిగిన కారు ప్రమాదం నుంచి కోలుకుంటున్న బెనాడ్ నిద్రలోనే తుది శ్వాస విడిచారు.

1952లో ఆసీస్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన బెనాడ్ 63 మ్యాచ్‌లు ఆడారు. 2201 పరుగులతో పాటు తన లెగ్ స్పిన్‌తో 248 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆసీస్ తరఫున మేటి టెస్టు బౌలర్‌గా పేరుతెచ్చుకున్నారు. 259 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 11,179 పరుగులతో పాటు 945 వికెట్లు తీశాడు. 1964లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన బెనాడ్ ఆ తర్వాత ఆసీస్, ఇంగ్లండ్‌లో బ్రాడ్‌కాస్టర్ అవతారమెత్తారు. తన విలక్షణమైన సెటైర్లతో, కామెంట్రీని రక్తికట్టించేవారు.

1977లో వరల్డ్ సిరీస్ క్రికెట్‌ను ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన బెనాడ్... కెర్రీ-ప్యాకర్ సిరీస్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిం చారు. సచిన్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా మాజీ, ప్రస్తుత క్రికెటర్లు ఆయనకు నివాళులు అర్పించారు. ఐసీసీ, బీసీసీఐ సంతాపం ప్రకటించాయి. ఆసీస్ ఓ చాంపియన్ క్రికెటర్‌ను కోల్పోయిందని ఆ దేశ ప్రధాని టోనీ అబాట్ ట్వీట్ చేశారు. అధికార లాం ఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు.
 
నిఖార్సైన ఆల్‌రౌండర్

ఆసీస్ పాతతరం క్రికెటర్లలో బెనాడ్ పాత్ర ఎప్పటికీ మరువలేనిది. దూకుడైన బ్యాటింగ్‌తో పాటు లెగ్ స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థులకు వణుకు పుట్టించేవారు. ముఖ్యంగా భారత్‌పై బెనాడ్‌కు అద్భుతమైన బౌలింగ్ రికార్డు ఉంది. 8 టెస్టుల్లో 52 వికెట్లు తీశారు. 1956లో జరిగిన సిరీస్‌లో మూడు టెస్టుల్లో 23 వికెట్లు పడగొట్టారు. ఒక సిరీస్‌లో ఇన్ని వికెట్లు తీయడం ఏ బౌలర్‌కైనా ఇదే అత్యుత్తమం. చెన్నైలో జరిగిన ఓ మ్యాచ్‌లో 72 పరుగులకు 7 వికెట్లు తీసి కెరీర్ బెస్ట్ నమోదు చేశారు. ఇక 1959లో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 29 వికెట్లు తీశారు.

బెనాడ్ ఆసీస్ తరఫున టెస్టుల్లో 2 వేల పరుగులు, 200 వికెట్లు తీసిన తొలి క్రికెటర్. కెప్టెన్‌గా కూడా తిరుగులేని ఆధిపత్యాన్ని చూపించారు. 1958-59లో యాషెస్ గెలిచిన ఏడేళ్ల విరామం తర్వాత తిరిగి ట్రోఫీని ఆసీస్‌కు అందించారు. స్వదేశంలో 1960-61లో విండీస్‌తో జరిగిన సిరీస్‌లో కీలక పాత్ర పోషించారు. ఓవరాల్‌గా తన కెప్టెన్సీలో ఒక్క సిరీస్ కూడా బెనాడ్ కోల్పోకపోవడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement