ఇండియా–ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్‌కు వెంటపతిరాజుతో కలిసి కామెంటరీ చేస్తున్న షోయబ్ (ఎడమ)
సాక్షి, మహబూబ్‌నగర్: చిన్నప్పటి నుంచి వివిధ క్రీడలకు సరదాగా కామెంటరీ చేసిన ఆ యువకుడు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. క్రికెట్‌లో తనకున్న నైపుణ్యంతో అనతికాలంలోనే హిందీ, ఇంగ్లిష్, తెలుగులో కామెంటేటర్ (వ్యాఖ్యాత) గా ఎదిగాడు వనపర్తి జిల్లాలోని పెబ్బేరు పట్టణానికి చెందిన మహ్మద్ షోయబ్.
2013 నుంచి కామెంటేటర్‌గా..
తను పాలిటెక్నిక్ చదివే రోజుల్లో 2013 నుంచి కళాశాలల్లో నిర్వహించే క్రీడల్లో పాల్గొంటూ కామెంటేటర్‌గా మారిపోయాడు షోయబ్. దీనిపై పట్టు సాధించి జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లకు కామెంటరీ చేశాడు. 2014లో ఆల్ ఇండియా అండర్–19 టీ–20 లీగ్ మ్యాచ్‌లో కామెంటరీ చేశాడు. మహబూబ్‌నగర్‌లో జరిగిన ఎస్‌జీఎఫ్ జాతీయస్థాయి, ఎంపీఎల్ పోటీలకు హిందీలో కామెంటరీ చేసి ఆకట్టుకున్నాడు. 2016లో జరిగిన ఇండో–రష్యన్ ప్రమోషనల్ సిరీస్ క్రికెట్ మ్యాచ్‌లో (ఐసీసీ) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అధికారిక సభ్యులతో కలిసి కామెంటరీ చేశాడు.
2017లో ఇండియా–శ్రీలంక మధ్య జరిగిన బ్‌లైండ్ వరల్డ్‌కప్ మ్యాచ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. 2019 ఐపీఎల్ మ్యాచ్‌లకు తెలుగులో రేడియో కామెంటరీ చేసి ఆకట్టుకున్నాడు. ఇదే ఏడాది ఐసీసీ వరల్డ్‌కప్ మ్యాచ్‌లకు ఢిల్లీలో ఐడియా మొబైల్ చానల్ తరపున తెలుగులో కామెంటరీ చేశాడు. 2020లో ఇండియన్ సూపర్‌లీగ్ (ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు) ముంబై వేదికగా ఓ స్పోర్ట్స్ చానల్‌కు తెలుగులో వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. సిద్దిపేటలో జరిగిన సీఎం కేసీఆర్ కప్ క్రికెట్ పోటీలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి మంత్రి హరీష్‌రావుతో అభినందనలు అందుకున్నాడు.
ఇండియా–ఇంగ్లాండ్ టెస్ట్‌కు..
ఈనెల 2 నుంచి 6వ తేదీ వరకు ఓవల్‌గ్రౌండ్‌లో జరిగిన ఇండియా–ఇంగ్లాండ్ నాల్గో టెస్ట్‌కు షోయబ్ తెలుగులో కామెంటరీ చేసి ఆకట్టుకున్నాడు. భారత మాజీ ఆటగాడు వెంకటపతిరాజు, స్పోర్ట్స్ ఎనలిస్ట్ సీహెచ్.వెంకటేశ్, విజయ్ మహవడి, డబ్ల్యూవీ రామన్, సందీప్‌కుమార్‌తో కలిసి షోయబ్ కామెంటరీ చేశాడు.
ఎంతో సంతోషంగా ఉంది
ఇండియా–ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్‌కు అవకాశం రావడం ఊహించలేదు. నాలుగో టెస్ట్‌లో కామెంటరీ చేశాను. ఈ టెస్ట్ మ్యాచ్‌ను ఇండియా చరిత్రాత్మక విజయం సాధించడం సంతోషంగా ఉంది. నేను తెలుగులో కామెంటరీ చేయడం చాలా గర్వంగా ఉంది.
– మహ్మద్ షోయబ్, కామెంటేటర్
Comments
Please login to add a commentAdd a comment