‘నీ ధర్మం ఏదైనా కావచ్చు. కాని దాని పట్ల సత్యవర్తనతో మెలుగు’ అని బోధించినవాడు వివేకానంద. భారతీయ ఆధ్యాత్మికతను పునరుజ్జీవింప చేయడంలో ఆయన దాదాపు ఒక ప్రవక్త వలే కృషి చేశాడు. ముఖ్యంగా యువశక్తిని చైతన్యపరచాలని కోరుకున్నాడు. ప్రతి ఒక్కరికీ ఆలోచన అవసరమన్నాడు. సంకుచితాల సరిహద్దులను, క్రతువులను నిరసించాడు. నేడు ఆయన జయంతి. భిన్న సందర్భాలలో ఆయన మాట్లాడిన మాటలు కొన్ని...
కష్టాలతోను, యాతనలతోను నిండిపోయిన జీవితం గుండా నేను ఈడ్వబడ్డాను. నాకు అత్యంత ఆప్తులు, సన్నిహితులు దాదాపు పస్తులతో మరణించడం కళ్లారా చూశాను. నేను అవహేళనకు, విశ్వాస రాహిత్యానికి గురయ్యాను. నన్ను ఎవరు ఏవగించుకున్నారో, అపహాస్యం చేశారో వారి పట్ల సానుభూతి చూపినందున బాధలకు గురయ్యాను. నేను ముక్తినీ లేదా భక్తినీ ఖాతరు చేయను. నూరువేల నరకాలకైనా పోవడానిని నేను సిద్ధంగా వున్నాను. వసంతంలా నిశ్శబ్దంగా పరహితం ఆశిస్తాను. ఇదే నా మతం. జనం శ్రీరామకృష్ణుల పేరును అంగీకరించినా లేక అంగీకరించకపోయినా నేను పట్టించుకోను. కాని ఆయన బోధనలు, జీవితం సందేశం లోకమంతటా వ్యాప్తి చేయడానికి నా ప్రాణాలను అర్పించడానికి నేను సంసిద్ధుడనై ఉన్నాను. అవును, ఒక మహాత్ముని ఉత్సాహ ప్రోత్సాహకాల వల్లనే నా జీవిత మార్గనిర్దేశనం జరిగింది. నాకు శ్రీరామకృష్ణ పరమహంస ప్రేరణ కల్పించారన్న నిజాన్ని నేను నమ్ముతున్నాను.
అయితే నాకుగా నేను స్ఫూర్తిని పొందాను కూడా. నా జీవిత లక్ష్యం ఏమిటో నాకు తెలుసు. స్వదేశ స్వమత దురభిమానంతో నాకు సంబంధం లేదు. నేను భారత దేశానికి ఎంత చెందుతానో, ప్రపంచానికి కూడా అంతే చెందుతాను... ఏ దేశానికి నా మీద ప్రత్యేకమైన హక్కు ఉంది? ఏ దేశానికైనా నేను బానిసనా? మానవశక్తి కన్నా, దైవశక్తి కన్నా, అనురక్తి కన్నా మహత్తరమైన శక్తి నాకు అండగా ఉన్నట్లు ప్రత్యక్షంగా గోచరిస్తోంది. పిరికితనం అంటే నాకు పరమ రోత. సత్యమే నా దైవం. విశ్వమే నా దేశం. ఆశించడమే పరమ దుఃఖం, ఆశించకపోవడమే పరమ సుఖం. కోరికలు పూర్తిగా త్యజించి, నిశ్చింతగా ఉండాలి. మిత్రులు, శత్రువులు అనేవారు లేకుండా ఏకాకిగా జీవించాలి. ఆ విధంగా శత్రుమిత్రులు, సుఖదుఃఖాలు, రాగద్వేషాలు లేకుండా, జీవాలను హింసించక ఏ జీవహింసకూ కారకులు కాకుండా, ఒక పర్వతం నుండి మరొక పర్వతానికి, ఒక గ్రామం నుండి మరో గ్రామానికి భగవన్నామాన్ని ప్రబోధిస్తూ మనం పర్యటించాలి.
సంపదలో దారిద్య్ర భయం ఉంది. జ్ఞానంలో అజ్ఞాన భయం ఉంది. సౌందర్యంలో వృద్ధాప్య భయం ఉంది. కీర్తిలో చాటునిందల భయం ఉంది. శరీర విషయంలో సైతం మృత్యు భయం ఉంది. లోకంలో సమస్తమూ భయంతో కూడుకొని ఉంది. వైరాగ్యం ఒక్కటే భయం లేనిది. నాలో ఎన్ని తప్పిదాలున్నా, కొంత సాహసం కూడా ఉందని భావిస్తాను. నాకు అవరోధాలు కల్పించడానికి, నా పురోగతిని వ్యతిరేకించానికి, వీలైతే నన్ను రూపుమాపడానికి కూడా కొన్ని ప్రయత్నాలు జరిగాయి. భగవదనుగ్రహం వల్ల అన్నీ వ్యర్థమయ్యాయి. అటువంటి ప్రయత్నాలు వైఫల్యం చెందటం సహజమే. గడచిన మూడేళ్ల నుండి కొన్ని అపార్థాలు చోటుచేసుకుంటూ వచ్చాయి. నేను విదేశాల్లో ఉన్నంత కాలం ఈ విషయంగా ఒక్క మాట కూడా పలుకక మౌనం పాటించాను. ఇప్పుడు నా మాతృభూమిపై నిలబడి కొంత వివరణ చెప్పగోరుతున్నాను. నా మాటల వల్ల మీలో ఎటువంటి స్పందన కలిగించగలనో అనే కౌతుకంతోనూ కాదు.
నేను ఇటువంటి వాటిని లక్షించేవాణ్ని కాను.ఎందుకంటారా? నాలుగేళ్ల కిత్రం దండ కమండలాలను మాత్రం చేతబూని, మీ నగరంలో ప్రవేశించిన ఆనాటి సన్యాసినే ఇప్పుడూను..! నా భవిష్యత్తు ఆశంతా సౌశీల్యురైన యువకుల మీదనే ఉంది. వాళ్లు బుద్ధికుశలురు, సర్వస్వాన్ని ఇతరుల సేవకై పరిత్యజించే వ్యక్తులుగా ఉండాలి. నా భావాలనుకార్యరూపంలోకి తేవడానికి తమ జీవితాలను త్యాగం చేసి తద్వారా తమకూ, దేశానికీ సౌభాగ్యం చేకూర్చేది ఈ యువకులే. నచికేతుని వంటి శ్రద్ధావంతులైన పది పన్నెండు మంది యువకులు నాకు లభిస్తే ఈ దేశప్రజల ఆలోచనలను, కార్యకలాపాలను కొత్త పుంతలు తొక్కించగలను. నాకు భగవంతుని పట్ల విశ్వాసం ఉంది, మనిషి పట్ల విశ్వాసం ఉంది. దుఃఖపూరితుల పట్ల విశ్వాసం ఉంది. ఇతరులను ఉద్ధరించటానికి నరకానికి పోవడంలో విశ్వాసం ఉంది. ఒక మనిషికి నిజంగా సహాయం లభిస్తుందంటే నేను నేరం చేసి శాశ్వత నరకవాసం అనుభవించడానికి కూడా సంశయించను.
మనిషి గురించి నేను ప్రేమలో పడడం వల్ల మళ్లీ జన్మించవలసి ఉంటుంది. వితంతువు కన్నీరు తుడిచివేయలేని, అనాధ నోటికి పట్టెడన్నం అందించలేని భగవంతుని పట్ల గాని మతం పట్ల గాని నాకు విశ్వాసం లేదు. ఎటువంటి కర్మకాండలతోగాని అంధ విశ్వాసంతో గాని నాకు సంబంధం లేదు. మతమే సమస్తమనీ, సమస్తంలోనూ మతమే ఉందని చూపించడమే నా లక్ష్యం. ఆలోచించడం మనిషి స్వభావం. ఇదే అతడికీ, జంతువులకూ ఉన్న తారతమ్యం. నేను యుక్తి (ట్ఛ్చటౌn)లోనే విశ్వాసం ఉంచి దానినే అనుసరిస్తున్నాను. మాసిపోయిన బట్టను పారవేసినట్లు నేను ఈ శరీరాన్ని త్యజించి బయటకు పోవడం మంచిదయుండవచ్చు. కాని పనిచేయడ మాత్రం విరమించను. భగవంతునితో ఐక్యాన్ని లోకంలోని యావన్మంది గుర్తించే వరకు నేను వారికి సర్వత్రా ప్రేరణను కల్పిస్తూనే ఉంటాను.
– సేకరణ: వైజయంతి పురాణపండ
Comments
Please login to add a commentAdd a comment