డయాబెటిక్ కౌన్సెలింగ్
నా వయసు 65 ఏళ్లు. గత 12 ఏళ్లుగా డయాబెటిస్‌తో బాధపడుతున్నాను. మొన్న హెర్నియా ఆపరేషన్ చేయించాల్సి వచ్చినప్పుడు, నేను వాడే మందుల్లో ఒకటి రక్తాన్ని పలుచగా చేసేది ఉందని, అది ఆపేయమన్నారు. ఆపరేషన్ కోసం దాన్ని ఆపేశాను. అది ఎలాగూ ఆపేసే మందు అయినప్పుడు, దాన్ని వాడాల్సిన అవసరం ఏమిటి? నేనేమైనా అవసరం లేని మందులు వాడుతున్నానా? నాకు అవసరం లేకపోయినా ఈ మందు ఎందుకు రాశారు? వివరించగలరు.
- ఎమ్. గోపాలరావు, గుంటూరు
మీరు రక్తాన్ని పలచబార్చే మందులు అని రాశారుగానీ వాటి పేర్లను ప్రస్తావించలేదు. ఈ మందులను డయాబెటిక్ రోగుల్లో గుండెపోటును, పక్షవాతాన్ని నివారించేందుకు ఉపయోగిస్తారు. ఎందుకంటే డయాబెటిస్ ఉన్నవారికి అవి వచ్చే అవకాశాలు ఎక్కువ. సర్జరీ సమయంలో రక్తాన్ని పలుచబార్చే మందులు వాడితే ఆగకుండా రక్తస్రావం అయ్యే అవకాశం ఉందని దాన్ని ఆపమని సలహా ఇచ్చారు. సర్జరీ తర్వాత మీ డాక్టర్ సలహాను అనుసరించి వాటిని మళ్లీ మొదలుపెట్టాలి. ఇవి చాలా సురక్షితమైన, ఉపయోగకరమైన మందులు. మీరు అనుకుంటున్నట్లుగా ఇవి వాడటం వృథా కాదు. మీరు మళ్లీ ఎప్పట్నుంచి వీటిని మొదలుపెట్టాలో మీ డాక్టర్‌ను అడిగి తెలుసుకోండి.
నా వయసు 59 ఏళ్లు. గత ఆరేళ్లుగా డయాబెటిస్‌తో బాధపడుతున్నాను. డాక్టర్లు చెప్పినట్లు క్రమం తప్పకుండా మందులు వాడుతున్నాను. ఇటీవల చేసిన పరీక్షలో షుగర్ లెవెల్స్ ఫాస్టింగ్ 155, పోస్ట్ లంచ్ 215 వచ్చాయి. నాకు తెలిసి నేను ఒక్కరోజు కూడా మందు వాడకుండా ఉండలేదు. చక్కెర ఎందుకు నియంత్రణలో ఉండటం లేదు. ఇప్పుడు నేనేం చేయాలో సలహా ఇవ్వండి.
- సునంద, విజయవాడ
మీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 155, భోజనం తర్వాత మీ రక్తంలోని చక్కెర పాళ్లు 215 అంటే మీ చక్కెర పాళ్లు ఉండాల్సిన దాని కంటే కాస్త ఎక్కువ ఉన్నట్లు అర్థం. (వాస్తవంగా నార్మల్ విలువలు - పరగడుపున రక్తంలోని చక్కెర పాళ్లు (ఫాస్టింగ్ బ్లడ్ షుగర్) 110, భోజనం తర్వాత ఆ విలువ 160 ఉండాలి). మీరు వాడుతున్న మందుల మోతాదు కాస్త పెంచాల్సిన అవసరం ఉంది. తద్వారా డయాబెటాలజిస్టులు మళ్లీ మీ రక్తంలోని చక్కెర మోతాదులను నార్మల్‌కు తీసుకువస్తారు. ఇక మీరు ఒకసారి హెచ్‌బీఏ1సీ పరీక్ష (దీనిలో రక్తంలో మూడు నెలల చక్కెర విలువల సరాసరి తెలుస్తుంది) కూడా చేయించాలి. కేవలం మీ ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ విలువలు మాత్రమే గాక, మీ హెచ్‌బీఏ1సీ విలువలు కూడా మీ మందును లేదా చికిత్సా విధానాన్ని మార్చడానికి ఉపయోగపడతాయి. ఈ విషయంలో మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పై పరీక్షలతో మీరు వాడే మందుల మోతాదునే కాస్త మారిస్తే చాలు. మీరు పై పరీక్షలు చేయించుకొని ఆ రిపోర్టులతో ఒకసారి మీ డయాబెటాలజిస్టును కలవండి.
డాక్టర్ బి.మహేశ్వర్
సీనియర్ జనరల్ ఫిజీషియన్,
స్పెషలిస్ట్ ఇన్ డయాబెటిస్ - క్రిటికల్ కేర్,
మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్స్, హైదరాబాద్
బ్లడ్ థిన్నర్స్ అనవసరం కాదు
Published Thu, Jun 25 2015 10:46 PM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM
Advertisement