హోమియో కౌన్సెలింగ్
మా పాపకు తొమ్మిదేళ్లు. వేసవిలో బాగానే ఉంటుంది కానీ, వర్షాకాలం, శీతాకాలాలలో విపరీతమైన జలుబు, ముక్కు దిబ్బెడ, తలనొప్పితో బాధపడుతుంటుంది. డాక్టర్‌కు చూపిస్తే సైనసైటిస్ అని చెప్పి, ఆపరేషన్ చేయాలన్నారు. హోమియోలో ఈ సమస్యకు పరిష్కారం ఉంటే చెప్పగలరు.
- పుష్ప, హైదరాబాద్
ప్రతి ఒక్కరిలోనూ నుదురు, కళ్లకు కింది భాగంలో ముక్కుకు రెండువైపులా గాలితో నిండిన సంచుల్లాంటి నిర్మాణాలుంటాయి. వీటినే సైనస్ అంటారు. ఈ సైనస్‌లు మెత్తటి శ్లేష్మపు పొరతో కప్పి ఉంటాయి. ఈ పొర ఒక పలుచటి ద్రవపదార్థాన్ని నిరంతరం ఉత్పత్తి చేస్తుంటుంది. ఈ ద్రవపదార్థం ఎటువంటి ఆటంకాలు లేకుండా ముక్కు రంధ్రాల్లోకి చేరుకుంటుంది. కాని కొన్ని సందర్భాల్లో ఇది ప్రవహించే మార్గంలో అవరోధాలు ఏర్పడి, అది సైనసైటిస్‌కు దారి తీస్తుంది. దీంతో సైనస్ భాగాలలో నొప్పితో బాటు బరువెక్కినట్లుంటుంది. తరచు జలుబు, అలర్జీ, నాసల్ పాలిప్స్, ముక్కు రంధ్రల మధ్య గోడ పక్కకు మరలడం, సైనస్ ఎముకలు విరగడం, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా సైనసైటిస్ వస్తుంది.
రకాలు: సైనసైటిస్ ముఖ్యంగా రెండురకాలు. 1. నాలుగు వారాలు లేదా అంతకంటే తక్కువ కాలవ్యవధిలో ఎక్కువగా ముక్కు నుంచి నీరు కారడం, నొప్పి ఉంటాయి. దీనినే అక్యూట్ సైనసైటిస్ అంటారు. 2. వ్యాధిలక్షణాలు 8 వారాలకంటే ఎక్కువ రోజులు ఉన్నట్లయితే దానిని క్రానిక్ సైనసైటిస్ అంటారు.
లక్షణాలు: ముక్కు నుంచి నీరు కారడం, ముక్కు దిబ్బడ, వాసన తెలియకపోవడం, దగ్గు, జ్వరం, పంటినొప్పి, శ్వాసపీల్చుకోవడం ఇబ్బందిగా ఉండటం, నాసికా రంధ్రాలలో చీము పట్టడం, తల ముందుకి వంచినప్పుడు నొప్పిగా, బరువుగా ఉండటం, తలనొప్పి, చెవులు బరువెక్కడం, నీరసం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి.
నిర్థారణ: ఎక్స్‌రే, సీటిస్కాన్, ఎమ్మారై, నాసల్ ఎండోస్కోపీ, ఐజీఐ, అలర్జీ టెస్ట్, పి.ఎఫ్టి ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చు.
హోమియో చికిత్స: హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో సైనసైటిస్‌కు ప్రత్యేక రీతిలో, సమర్థవంతమైన చికిత్స అందుబాటులో ఉంది. అధునాతనమైన కాన్‌స్టిట్యూషనల్ సిమిలిమం ద్వారా అసమతుల్యతకు గురైన రోగనిరోధక శక్తిని సరిచేసి, సైనసైటిస్‌ను సంపూర్ణంగా నివారిస్తారు. శరీరంలో రోగనిరోధకతను పెంపొందించి, తద్వారా అన్ని ప్రతికూల పరిస్థితులలో ఆరోగ్యవంతమైన జీవనం సాగించే విధంగా హోమియోకేర్ ఇంటర్నేషనల్ కచ్చితమైన వైద్యాన్ని అందిస్తుంది.
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్
ఫౌండర్ చైర్మన్
హోమియోకేర్ ఇంటర్నేషనల్,
హైదరాబాద్
న్యూరో కౌన్సెలింగ్
మా నాన్నగారి వయసు 62 ఏళ్లు. గత మూడు నెలలుగా తల నొప్పి, మాట్లాడటం కష్టం కావడం, కొద్దిగా వినికిడి లేకపోవడం, అప్పుడప్పుడూ వాంతులు వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించాం. ఆయన ఎమ్మారై స్కానింగ్ తీయించి, మెదడులో ట్యూమర్స్ ఉన్నాయని అన్నారు. దీనికి చికిత్స వివరాలు తెలుపండి.
- ఆర్. వెంకటేశ్వర్లు, చీరాల
మెదడు కణజాలంలో అసాధారణ పెరుగుదల వల్ల బ్రెయిన్ ట్యూమర్లు ఏర్పడతాయి. ఇందులో ఒక రకం క్యాన్సర్ ట్యూమర్. ఇందులో మళ్లీ రెండు రకాలు ఉంటాయి. మొదటిది మెదడులోనే ఏర్పడుతుంది. రెండోరకం శరీరంలోని ఇతర భాగాల్లో మొదలై... మెదడుకు వ్యాపించి, అక్కడ ట్యూమర్‌గా ఏర్పడుతుంది. మెదడు ట్యూమర్ వల్ల తలనొప్పి, ఫిట్స్, కంటిచూపు, నడక, మాట, స్పర్శలో తేడారావడం, వాంతులు, మానసికమైన మార్పు వంటి లక్షణాలు కనిపిస్తాయి. మెదడు ట్యూమర్ల నిర్ధారణ చేయడానికి సీటీ స్కానింగ్, ఎమ్మారై వంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియోథెరపీ వంటి చికిత్స ప్రక్రియలను అనుసరించాల్సి ఉంటుంది. అయితే కొన్ని రకాల ట్యూమర్లు నెమ్మదిగా పెరుగుతాయి. కొన్ని సందర్భాల్లో అలాంటి వాటికి జీవితకాలంలోనే ఎలాంటి శస్త్రచికిత్సా అవసరం ఉండకపోవచ్చు. చికిత్స ఎంతవరకు సఫలం అవుతుందన్న విషయం మెదడులో ఆ ట్యూమర్ ఉండే ప్రదేశాన్ని బట్టి, ఎంత త్వరగా పెరుగుతుందన్న అంశం పైన ఆధారపడి ఉంటుంది. మెదడులోనే పుట్టే ప్రైమరీ ట్యూమర్ల కంటే ఇతర చోట పుట్టి, మెదడుకు వ్యాపించే సెకండరీ లేదా మెటస్టాటిక్ ట్యూమర్లు మరింత వేగంగా పెరుగుతాయి. పరిమాణంలో పెద్దవిగా ఉన్న ట్యూమర్లకు సర్జరీ తప్పనిసరి. ఇలాంటి సందర్భాల్లో ముఖ్యమైన అవయవాలకు వెళ్లే నాడులకు ట్యూమర్లు దగ్గరగా ఉంటే వాటిని పూర్తిగా తొలగించడానికి వీలుపడదు. అలాంటప్పుడు ట్యూమర్‌ను కొంతమేరకు తీసివేసి, మిగిలిన దాన్ని స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ ద్వారా చికిత్స చేయవచ్చు.
న్యూరో సర్జరీ విభాగంలో ఎస్.ఆర్.ఎస్. అనే చికిత్స ప్రక్రియ భవిష్యత్తులో మరింత చిన్న చిన్న ట్యూమర్లకూ మరింత సమర్థంగా అందించే దిశగా ఒక విప్లవాత్మకమైన మార్పు అని చెప్పవచ్చు.
డాక్టర్ టి.వి.ఆర్.కె. మూర్తి
సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్
కేర్ హాస్పిటల్స్,
బంజారాహిల్స్,
హైదరాబాద్
కార్డియో కౌన్సెలింగ్
మా నాన్నగారి వయసు 54 ఏళ్లు. ఏడాది క్రితం ఆయనకు గుండెపోటు వచ్చింది. అప్పుడు యాంజియోప్లాస్టీ చేసి, ఒక స్టెంట్ వేశారు. కొన్నాళ్లు బాగానే ఉన్నారు. కానీ ఇప్పుడు నడుస్తున్నప్పుడు ఆయాసపడుతున్నారు. డాక్టర్ దగ్గరకు తీసుకెళితే పరీక్షలు చేసి, బైపాస్ చేయాలంటున్నారు. మా నాన్నగారికి బీపీతో పాటు షుగర్ కూడా ఉంది. ఈ వయసులో ఆయన సర్జరీని తట్టుకోగలరా? దయచేసి నా సమస్యకు సరైన పరిష్కారం చూపించగలరు.
- ఏ. సుబ్బారాయుడు, రాజమండ్రి
గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో అడ్డంకులు (బ్లాక్స్) ఏర్పడితేనే బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. రెండు లేదా మూడు అడ్డంకులు ఉంటే యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్ వేస్తారు. మీ నాన్నగారికి గుండె రక్తనాళాల్లో ఎక్కువగా బ్లాక్స్ ఏర్పడి ఉండవచ్చు. అందుకే డాక్టర్ బైపాస్ సర్జరీని సూచించి ఉంటారు. ఒకప్పుడు గుండె ఆపరేషన్లు అంటే ప్రజలు చాలా భయపడేవారు. కానీ ఇప్పుడు వైద్యరంగంలో అనేక మార్పులు, అత్యాధునిక వైద్య ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గుండె ఆపరేషన్లు చాలా సురక్షితంగా చేయగలగుతున్నారు. అందులో భాగంగానే అతి చిన్న కోతతో ‘మినిమల్లీ ఇన్వేజివ్ బైపాస్ సర్జరీ’ అనే అధునాతన పద్ధతి కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ విధానం ద్వారా ఛాతీ ఎముకలు కట్ చేయకుండానే కొన్ని ప్రత్యేకమైన పరికరాలతో శస్త్రచికిత్స సులువుగానే నిర్వహించవచ్చు. ఈ ఆపరేషన్ ద్వారా కోత తక్కువగా ఉండటం వల్ల నొప్పి కూడా తక్కువగానే ఉంటుంది. ఈ విధానంలో తక్కువ రక్తస్రావం జరుగుతుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్ సోకే అవకాశం కూడా చాలా తక్కువ. శస్త్రచికిత్స తర్వాత పేషెంట్ 3 - 4 రోజుల్లోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారు. ముఖ్యంగా ఈ చికిత్సా విధానం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అలాగే 50 పైబడిన వారికి కూడా ఈ శస్త్రచికిత్స విధానం అత్యంత సురక్షితం.
బీపీ, షుగర్ ఉన్నవారికి కూడా నిపుణుల ప్రత్యేక పర్యవేక్షణలో శస్త్రచికిత్స నిర్వహిస్తారు. ఎటువంటి ఆందోళన అవసరం లేదు.
డాక్టర్ సుఖేష్ కుమార్ రెడ్డి
సీనియర్ కార్డియోథొరాసిక్ సర్జన్ యశోద హాస్పిల్స్
సోమాజిగూడ
హైదరాబాద్
బీపీ, షుగర్ ఉన్నా... బైపాస్ సర్జరీ చేయవచ్చు
Published Mon, Dec 21 2015 10:44 PM | Last Updated on Sun, Sep 3 2017 2:21 PM
Advertisement
Advertisement