బ్లూ ఈజ్ బ్యూటిఫుల్
నీలం సముద్రం. నీలం ఆకాశం. నీలం స్త్రీ హృదయ అంతరాళ అగాధం. తన చుట్టూ తన సౌందర్యం చుట్టూ కాంతి వలయాన్ని ఏర్పరచుకోవాలనుకునేవారు నీలి రంగును ధరిస్తారు. ధరించినవారినే కాదు చూసేవారిని కూడా సౌకర్యంగా ఉంచే రంగు అది.
ఇంకా చెప్పాలంటే నమ్మకమైనవారు నమ్ముకునే రంగు- నీలం. అందుకే డిజైనర్ అనితా డోంగ్రే తన ప్యాటర్న్స్‌ని ఆకాశానికి ఎగరేస్తారు. అగాధ నీలిమల్లో ముంచెత్తుతారు. ఆమె దృష్టిలో నీలం అంటే రాజసం. రాజ సౌందర్యానికి ఆనవాలు.. ఈ బ్యూటిఫుల్ బ్లూ.
►వెండి, బంగారు జలతారు దారాలతో అందంగా రూపుకట్టిన రాయల్ బ్లూ లెహంగా.. సింపుల్‌గా అనిపించే టాప్ వేడుకలపై ఎంత గ్రేస్‌గా వెలిగిపోవచ్చో కళ్లకు కడుతున్నారు నటి సమంతా!
►రాయల్ బ్లూ కలర్ లాంగ్ అనార్కలీ టాప్‌కు సెల్ఫ్ డిజైన్ అదనపు హంగు. ఏ వేదిక అయినా చూపుతిప్పుకోనివ్వని ఆకర్షణ.
మొఘల్ రాచకళ
అనితా డోంగ్రే ముంబయ్ ఫ్యాషన్ డిజైనర్. మొఘలుల నిర్మాణ కౌశలం, సంప్రదాయం, వారిదైన అతి గొప్ప సాంస్కృతిక వైభవం అనితా డోంగ్రే కలెక్షన్‌లో అత్యద్భుతంగా కనిపిస్తుంది. జైపూర్ మూలాల్లోకి వెళ్లి అక్కడి కళల నుంచి స్ఫూర్తిపొంది ఆ కళాత్మకతను తన డిజైన్లలో రూపొందించడం అనితా డోంగ్రే ప్రత్యేకత. ఆమె డిజైన్స్‌లో ప్రధానంగా బెనారస్ సిల్క్, కాటన్, బ్రొకెడ్, జైపూర్ సిల్క్, ఆంధ్రప్రదేశ్ ఇకత్ ఫ్యాబ్రిక్స్‌తో పాటు లక్నో చికంకారి కళతో పాటు టై అండ్ డై పద్ధతులు కూడా బాగా కనిపిస్తాయి. రాజస్థాన్ కళను బాగా ఆరాధించే అనితాడోంగ్రే ఆ ప్రాంతంలో చాలా మంది మహిళలకు తన కళ ద్వారా ఉపాధి అవకాశాలను కల్పించారు. ఫ్యాషన్ షోలలో ఎన్నో అవార్డులను కైవసం చేసుకున్నారు.
► రాయల్ బ్లూ ధోతి పైజామా, స్లీవ్‌లెస్ టాప్.. లాక్మేఫ్యాషన్ వీక్‌లో అనితా డోంగ్రె డిజైన్ చేసిన దుస్తుల్లో మోడల్.
► గాడీగా ఉండే రంగులు అంతగా నప్పవు అని చాలా మంది వాటిని పక్కన పెట్టేస్తారు. కానీ, రాయల్ బ్లూ కలర్ శారీకి చేసిన ఎంబ్రాయిడరీ వర్క్, అదే రంగు బ్లౌజ్ సూపర్బ్ అనిపిస్తాయి.
► బ్లూ ప్లెయిన్ టాప్- ఎంబ్రాయిడరీ బాటమ్... క్యాజువల్‌గా అనిపిస్తూనే స్టైలిష్‌గా కనిపిస్తారు.