Anarkalis
-
అనార్కలీకి అరవై ఏళ్లు
ఆమెకు క్లాసికల్ డాన్స్ రాదు. నేర్చుకొని ‘ప్యార్ కియాతో డర్నా క్యా’ అంది. దిలీప్ కుమార్‌తో మాటలు లేవు. తెర మీద అతనిపై ఎంతో ప్రేమ ప్రదర్శించగలిగింది. హృద్రోగి. నిజమైన ఇనుప సంకెలలు ధరించి డైలాగులు చెప్పి సొమ్మసిల్లి పడిపోయింది. ఆమె చూపిన ఫ్యాషన్ నేటికీ అనార్కలీ డ్రెస్‌గా ఉనికిలో ఉంది. మధుబాల. భారతీయుల అపురూప అనార్కలీ. ‘మొఘల్–ఏ–ఆజమ్’ రిలీజయ్యి నేటికి సరిగ్గా 60 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఓ జ్ఞాపకం. ‘మొఘల్–ఏ–ఆజమ్’ కోసం అనార్కలీ పాత్ర మొదట నర్గీస్‌కు వెళ్లింది. కుదరలేదు. ఆనాటి సింగింగ్ సూపర్‌స్టార్ సురయ్యకు వెళ్లింది. ఆమెకూ కుదరలేదు. దాని కోసం మధుబాల జన్మెత్తి ఉన్నప్పుడు ఆ పాత్ర ఆమె దగ్గరకు వెళ్లడమే సబబు. మధుబాల అనార్కలీగా నటించింది. ఆ పాత్రకు తన సౌందర్యం ఇచ్చింది. ఆ పాత్రలోకి తన కళాత్మక ఆత్మను ప్రవేశపెట్టింది. మీకు గుర్తుందో లేదో. మధుబాల కేవలం 36 ఏళ్ల వయసులో చనిపోయింది. కాని నేటికీ జీవించే ఉంది. ఆమె చేసిన అనార్కలీ పాత్ర ఆమెను జీవింప చేస్తూనే ఉంది. అక్బర్ కుమారుడు జహంగీర్ (ముద్దుపేరు సలీమ్) తన రాజాస్థానంలో ఉన్న అనార్కలీ అనే నాట్యకత్తెతో ప్రేమలో పడ్డాడట. అలాగని దానికి ఎటువంటి చారిత్రక ఆధారం లేదు. కాని ప్రజలు ఆ ప్రేమకథను ఎంతో మక్కువగా చెప్పుకుంటూ వచ్చారు. 1920లో ఈ కథ మొదటిసారి ఉర్దూలో నాటకంగా వచ్చింది. ఆ నాటకం ఆధారంగా అనేక సినిమాలు వచ్చాయి. బీనారాయ్ అనార్కలీగా ‘అనార్కలీ’ సినిమా వచ్చి– ఏ జిందగీ ఉసీకి హై పాట గుర్తుందా– హిట్ అయ్యింది కూడా. కాని దర్శకుడు కె.ఆసిఫ్ చాలా పెద్దగా, అట్టహాసంగా, నభూతోగా ఈ ప్రేమకథను తీయదలిచాడు. ఎంత పెద్దగా అంటే ఆరేడు లక్షల్లో సినిమా అవుతున్న రోజుల్లో కోటి రూపాయలు ఖర్చు పెట్టి తీసేంతగా. అందుకు సలీమ్‌గా దిలీప్ కుమార్‌ను తీసుకున్నాడు. అక్బర్‌గా పృధ్వీరాజ్ కపూర్‌ను తీసుకున్నాడు. అనార్కలీగా మధుబాలని. హాలీవుడ్లో మార్లిన్ మన్రో ఉంది. మధుబాలను ఇండియన్ మార్లిన్ మన్రో అని పిలిచేవారు. వీనస్ క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమా అని ఆమె బిరుదు. ‘మహల్’, ‘మిస్టర్ అండ్ మిసెస్ 55’, ‘చల్తీ కా నామ్ గాడీ’... తెర మీద ఆమె ఒక అందమైన ఆకర్షణగా ఉంది. నిజానికి ఆమె నటనకు సవాలుగా నిలిచే సినిమా అంతవరకూ లేదనే చెప్పాలి. ‘మొఘల్–ఏ–ఆజమ్’తో ఆ అవకాశం వచ్చింది. దానిని ఆమె ఒక సవాలుగా స్వీకరించింది. మధుబాలకు పుట్టుక నుంచి గుండెకు సంబంధించిన సమస్య ఉంది. దానిని తర్వాతి కాలంలో గుర్తించినా వైద్యం ఏమీ లేక ఊరుకున్నారు. అయినప్పటికీ ఆ మగువ గుండె అనంత భావఘర్షణలను ఎదుర్కోవాల్సి వచ్చింది. దిలీప్‌కుమార్ ఆమెను వివాహం చేసుకోదలిచాడు. కాని అందుకు మధుబాల తండ్రి అడ్డుపడ్డాడు. అంతే కాదు వీళ్ల గొడవ కోర్టు కేసుల వరకూ వెళ్లింది. ఇద్దరూ తీవ్ర వ్యతిరేక భావనతో విడిపోయారు. ఇవన్నీ మొఘల్–ఏ ఆజమ్ నిర్మాణం జరిగిన సుదీర్ఘకాలం (1948–60) ల మధ్యే జరిగాయి. మొఘల్–ఏ–ఆజమ్ షూటింగ్ సమయంలో కొన్ని ఇంటిమేట్ సన్నివేశాలలో కూడా వారిద్దరి మధ్య మాటలు లేవు. కాని తెర మీద అవేమీ తెలియకుండా ఇద్దరూ చేయగలిగారు. షహజాదా సలీమ్ కోసం ప్రాణం పెట్టే ప్రియురాలిగా తన కంటి రెప్పల మీద సకల ప్రేమనంతా అనార్కలీ అయిన మధుబాల నింపుకోగలిగింది. మధుబాల క్లాసికల్ డాన్సర్ కాదు. కాని సినిమాలో ఆమె కృష్ణుడి ఆరాధన గీతం ‘మొహె ఫంగట్ పే’ పాటలో శాస్త్రీయ నృత్యం చేయాల్సి వచ్చింది. నాటి ప్రసిద్ధ కథక్ ఆచార్యుడు కిష్షు మహరాజ్ దగ్గర నేర్చుకుని చేసింది. ఇక చరిత్రాత్మకమైన ‘ప్యార్ కియాతో డర్నా క్యా’ పాటలో ఆమె మెరుపు వేగంతో పాదాలను కదిలించి, చురకత్తుల కంటే వాడిగా చూపులను విసిరి అక్బర్ పాదుషానే కాదు ప్రేక్షకులను కూడా కలవర పరుస్తుంది. ఇటు ప్రియుడి ప్రేమను వదలుకోలేక అటు రాచవంశానికి తుల తూగలేక ఇద్దరు పురుషుల మధ్య నలిగిపోయే పాత్రలో మధుబాల ప్రేక్షకులను సతమతం చేస్తుంది. దర్శకుడు కె.ఆసిఫ్ పర్ఫెక్షనిస్టు. అతను ఈ సినిమా కోసం మొదటిసీనులోనే రాజస్తాన్ ఎడారిలో పృథ్వీరాజ్ కపూర్‌ను ఉత్తపాదాలతో నడిపించాడు. మధుబాలాను అట్ట సంకెళ్లు వేసుకొని కారాగారంలో నటించడాన్ని అనుమతించలేదు. నిజమైన ఇనుప సంకెళ్లనే వేశాడు. ఆ సంకెళ్లు ఆమె లేలేత చర్మాన్ని కోసేవి. ఆ బరువుకు ఆమె సొమ్మసిల్లేది. అయినా సరే... ఆ పాత్ర కోసం ప్రాణాన్ని ఉగ్గబట్టుకుని నటించింది. ‘నీ చివరి కోరిక ఏమిటో కోరుకో’ అని అక్బర్ అడిగితే ‘ఒక్క రోజైనా మొఘల్ సామ్రాజ్యపు సింహాసనానికి రాణిగా ఉండాలని ఉంది’ అంటుంది అనార్కలీ. ‘నీ అల్పబుద్ధి మానుకున్నావు కాదు’ అంటాడు అక్బర్. ‘అయ్యా... ఇది నా కల కాదు. మీ కుమారుడి కల. అతని కల అసంపూర్ణంగా ఉంచి నేను మరణించలేను’ అంటుంది అనార్కలీ. మొఘల్–ఏ–ఆజమ్ సినిమాను ప్రేక్షకులు ఎన్నోసార్లు చూడాలి. మొత్తం సినిమా కోసం. దిలీప్ కోసం. మధుబాల కోసం. డైలాగ్స్ కోసం. పాటల కోసం. ఆగస్టు 5, 1960లో విడుదల అయిన మొఘల్ ఏ ఆజమ్ భారతీయ సినిమా కలెక్షన్ల రికార్డులను కొత్తగా లిఖించింది. ఆ విజయంలో ఎవరి వాటా ఎంతైనా మధుబాల వాటా సరి సమానమైనది. అనార్కలీకి తన ప్రేమ దక్కనట్టు మధుబాలకు నిజ జీవితంలో ప్రేమ దక్కిందా... చెప్పలేము. గాయకుడు కిశోర్ కుమార్‌ను వివాహం చేసుకుని చేసిన 9 సంవత్సరాల కాపురం పెళుసైనది. సుకుమారి అయిన మధుబాల గుండె జబ్బుతో గువ్వంతగా మారి 1971లో మరణించింది. అమె వల్ల అనార్కలీ అనార్కలీ వల్ల ఆమె సజీవమవుతూనే ఉంటారు. ఆమె స్మృతికి కొన్ని అక్షర దానిమ్మ మొగ్గలు. ఇష్క్ మే జీనా ఇష్క్ మే మరనా ఔర్ అబ్ హమె కర్నా క్యా జబ్ ప్యార్ కియాతో డర్నా క్యా – సాక్షి ఫ్యామిలీ -
టాప్ టు బాటమ్ .. లేస్
న్యూలుక్ పాత డ్రెస్సులను కొత్తగానే కాదు కొత్త డ్రెస్సులకు మరిన్ని హంగులు అద్దడంలో ‘లేస్’లది ప్రత్యేక పాత్ర. సాదా సీదా డ్రెస్సులను అబ్బురపరచే డిజైన్ల అమరికతో రూపుకట్టాలంటే ‘లేస్’ఉండాల్సిందే! మొదట్లో లినెన్, సిల్క్, గోల్డ్, సిల్వర్ దారాలనే లేస్ డిజైన్లలో ఉపయోగించేవారు. ప్రస్తుతం నూలుదారాలతోనూ లేసుల తయారీ వచ్చేసింది. యంత్రాల మీద సింథటిక్ ఫైబర్ లేసులు లక్షలాది డిజైన్లతో అందంగా రూపుకడుతున్నాయి. ప్రపంచమంతా సందడి చేస్తున్న ‘లేసు’లు 19వ శతాబ్దిలో ఉత్తర అమెరికాలో మొదలైనట్టు, అటు తర్వాతే ప్రపంచమంతా ఈ డిజైన్స్ పట్ల ఆసక్తి చూపినట్టు తెలుస్తోంది. అనార్కలీ, ఫ్రాక్, మిడీ, టీ షర్ట్... ఏదైనా ఇప్పటికే వాడేసి ఉన్నా దానికి నచ్చిన లేస్‌లను మెడ, ఛాతి, చేతుల భాగంలో జత చేసి చూడండి. ఓ కొత్త రూపుతో డిజైనర్ డ్రెస్ మీ సొంతం అవుతుంది. ఈవెనింగ్ పార్టీవేర్ డ్రెస్ కావాలనుకుంటే మిడ్ ప్రాక్ మీదకు లేస్ బ్లౌజ్ లేదా షగ్ ్రవేసుకుంటే చాలు స్టైలిష్‌గా కనిపిస్తారు. లేస్లతో తయారుచేసిన బేర్‌ఫుట్ శాండల్స్ మోడల్స్ నేడు ఎన్నో వెరైటీలు వచ్చాయి. వీటిని ధరించాక శాండల్స్ లేదా చెప్పులు వేసుకుంటే పాదాల అందం రెట్టింపు అవుతుంది. ప్లెయిన్ ఆరెంజ్ ఫ్రాక్‌కి కాంట్రాస్ట్ కలర్ లేస్‌ని కుడితే ఎక్కడ ఉన్నా ప్రధాన ఆకర్షణగా నిలుస్తారు. ప్లెయిన్ షర్ట్‌లకు కాలర్, జేబులు, ముంజేతుల దగ్గర లేస్‌లను జత చేస్తే ఆధునికమైన ఆకర్షణ. పాత బెల్‌బాటమ్ కింది భాగం నుంచి మోకాళ్ల వరకు లేస్‌ను జత చేస్తే ఓ కొత్త డిజైన్ ఆకట్టుకుంటుంది. ప్లెయిన్ టీ షర్ట్ ధరించినప్పుడు మెడలో వెడల్పాటి లేస్‌ను ధరిస్తే నెక్ డిజైన్‌గా కంటికి ఇంపైన ఆకర్షణ. -
బ్లూ ఈజ్ బ్యూటిఫుల్
నీలం సముద్రం. నీలం ఆకాశం. నీలం స్త్రీ హృదయ అంతరాళ అగాధం. తన చుట్టూ తన సౌందర్యం చుట్టూ కాంతి వలయాన్ని ఏర్పరచుకోవాలనుకునేవారు నీలి రంగును ధరిస్తారు. ధరించినవారినే కాదు చూసేవారిని కూడా సౌకర్యంగా ఉంచే రంగు అది. ఇంకా చెప్పాలంటే నమ్మకమైనవారు నమ్ముకునే రంగు- నీలం. అందుకే డిజైనర్ అనితా డోంగ్రే తన ప్యాటర్న్స్ని ఆకాశానికి ఎగరేస్తారు. అగాధ నీలిమల్లో ముంచెత్తుతారు. ఆమె దృష్టిలో నీలం అంటే రాజసం. రాజ సౌందర్యానికి ఆనవాలు.. ఈ బ్యూటిఫుల్ బ్లూ. ►వెండి, బంగారు జలతారు దారాలతో అందంగా రూపుకట్టిన రాయల్ బ్లూ లెహంగా.. సింపుల్‌గా అనిపించే టాప్ వేడుకలపై ఎంత గ్రేస్‌గా వెలిగిపోవచ్చో కళ్లకు కడుతున్నారు నటి సమంతా! ►రాయల్ బ్లూ కలర్ లాంగ్ అనార్కలీ టాప్కు సెల్ఫ్ డిజైన్ అదనపు హంగు. ఏ వేదిక అయినా చూపుతిప్పుకోనివ్వని ఆకర్షణ. మొఘల్ రాచకళ అనితా డోంగ్రే ముంబయ్ ఫ్యాషన్ డిజైనర్. మొఘలుల నిర్మాణ కౌశలం, సంప్రదాయం, వారిదైన అతి గొప్ప సాంస్కృతిక వైభవం అనితా డోంగ్రే కలెక్షన్లో అత్యద్భుతంగా కనిపిస్తుంది. జైపూర్ మూలాల్లోకి వెళ్లి అక్కడి కళల నుంచి స్ఫూర్తిపొంది ఆ కళాత్మకతను తన డిజైన్లలో రూపొందించడం అనితా డోంగ్రే ప్రత్యేకత. ఆమె డిజైన్స్‌లో ప్రధానంగా బెనారస్ సిల్క్, కాటన్, బ్రొకెడ్, జైపూర్ సిల్క్, ఆంధ్రప్రదేశ్ ఇకత్ ఫ్యాబ్రిక్స్‌తో పాటు లక్నో చికంకారి కళతో పాటు టై అండ్ డై పద్ధతులు కూడా బాగా కనిపిస్తాయి. రాజస్థాన్ కళను బాగా ఆరాధించే అనితాడోంగ్రే ఆ ప్రాంతంలో చాలా మంది మహిళలకు తన కళ ద్వారా ఉపాధి అవకాశాలను కల్పించారు. ఫ్యాషన్ షోలలో ఎన్నో అవార్డులను కైవసం చేసుకున్నారు. ► రాయల్ బ్లూ ధోతి పైజామా, స్లీవ్‌లెస్ టాప్.. లాక్మేఫ్యాషన్ వీక్‌లో అనితా డోంగ్రె డిజైన్ చేసిన దుస్తుల్లో మోడల్. ► గాడీగా ఉండే రంగులు అంతగా నప్పవు అని చాలా మంది వాటిని పక్కన పెట్టేస్తారు. కానీ, రాయల్ బ్లూ కలర్ శారీకి చేసిన ఎంబ్రాయిడరీ వర్క్, అదే రంగు బ్లౌజ్ సూపర్బ్ అనిపిస్తాయి. ► బ్లూ ప్లెయిన్ టాప్- ఎంబ్రాయిడరీ బాటమ్... క్యాజువల్‌గా అనిపిస్తూనే స్టైలిష్‌గా కనిపిస్తారు. -
కొట్టొచ్చే కట్టు
అదేంటో మనం ఎంత ఖర్చుపెట్టి కొనుక్కున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినామన చీరలు చీరల్లాగే ఉంటాయి. కొట్టొచ్చేలా చీరకట్టు ఉండాలంటే కొంచెం బోల్డుగా, ఇంకొంచెం బ్యూటిఫుల్‌గా ‘సత్యపాల్’లా మనమూ ప్లాన్ చేసుకోవచ్చు. బంగారు జరీతో రూపుకట్టిన ఫ్లోర్ లెంగ్త్ అనార్కలీ సూట్ ఇది. లేత, ముదురు ఎరుపుల కాంబినేషన్, ఎంబ్రాయిడరీ ఈ డ్రెస్‌ను అందంగా రూపుకట్టాయి. లేత పింక్ గులాబీ పువ్వు రంగు ఈ చీర షిఫాన్, సిల్క్, జార్జెట్ లతో రూపొందించినది. సంప్రదాయంగా కనిపిస్తూనే ఆధునికం అనిపించే కట్స్‌తో ఈ చీర సమకాలీనతకు అద్దం పడుతోంది. సత్యపాల్ బ్రైడల్ శారీ కలెక్షన్లో ఇదీ ఒక మోడల్ చీర. ఫ్యాబ్రిక్‌తో మ్యాజిక్... మన దేశ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లలో సత్యపాల్ ఒకరు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఈ సృజనాత్మక రంగంలో ఉన్నారు సత్యపాల్. పాల్ కేవలం డ్రెస్ డిజైనర్ మాత్రమే కాదు హ్యాండ్ బ్యాగ్స్, క్లచెస్, పురుషుల యాక్ససరీస్ కూడా డిజైన్ చేస్తారు. ముఖ్యంగా భారతీయ చీరలు అనగానే సత్యపాల్ క లెక్షన్ కళ్లముందు నిలుస్తుంది. అంతగా సత్యపాల్ డిజైన్స్ ప్రసిద్ధి పొందాయి. చీరను ఆధునికంగా చూపించడంలో పాల్ది ‘అచ్చు’వేసిన చెయ్యి. జార్జెట్ ఫ్యాబ్రిక్స్‌తో పాల్ చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు. రంగల కలబోత, ప్రింట్లు, ఎంబ్రాయిడరీ డిజైన్స్ చూపు తిప్పుకోనివ్వవు. అలాగే సల్వార్ కమీజ్, లెహంగా ఛోలీ, లాంగ్ అనార్కలీ డ్రెస్‌ల సృజనలో ఎంతో ప్రత్యేకత కనిపిస్తుంది. జపాన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, అమెరికాలలో పాల్ డిజైన్స్‌కు మంచి మార్కెట్ ఉంది. ఈ డిజైన్స్ చూసి మన డ్రెస్ సెలక్షన్లో సరైన ఎంపిక చేసుకోవచ్చు. నలుపు తెలుపు కాంబినేషన్‌తో డిజైన్ ఈ చీర అందం మల్టీకలర్లో ఉన్న ప్రింట్లలోనే ఉంది. ఆధునికంగా కనిపించడానికి ఉపయోగించిన లాంగ్ స్లీవ్స్ జాకెట్టు అదనపు హంగుగా అమరింది. బ్రైడల్ వేర్లో భాగంగా సత్యపాల్ డిజైన్ చేసిన లెహంగా ఛోలీలు అత్యంత ఆకర్షణీయంగా కనిపాస్తాయి. అందుకు కారణం రంగుల ఎంపికనే. పసుపు, పాల మీగడలాంటి రంగుల కలబోతతో ఈ జార్జెట్ చీరను సింగారించారు. మెరుపుల అంచు, దాని కింద భాగంలో బంగారు వెండి జరీ గీతలు ఈ చీరను మరింత సుందరంగా మార్చాయి. దీనికి మ్యాచింగ్‌గా సిల్వర్ గ్లిటర్డ్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ఆధునికంగా మార్చివేసింది. -
చింపేశారు...
...కట్ చేశారు... కట్ చేస్తూ స్లిట్స్ పెంచేశారు... స్టైల్లో ఓ అడుగు ముందుకేశారు... టోటల్‌గా ఫ్యాషన్‌ని చింపేశారు! పొట్టి, పొడవాటి కుర్తాలు అటు క్యాజువల్‌గానూ, ఇటు అకేషనల్గానూ వయసు తేడా లేకుండా మగువలంతా ధరిస్తున్నారు. అనార్కలీ డ్రెస్సులను అందంగా అలంకరించుకుంటున్నారు. వీటిలో స్టైల్ అంటూ ఏమీ లేదు అనుకున్నారేమో! ఇప్పుడు సైడ్ స్లిట్ కట్స్‌తో ఓ స్టైల్‌ను క్రియేట్ చేస్తున్నారు. కట్ చేస్తే... షార్ట్, లాంగ్ కుర్తాలకు సైడ్ స్లిట్స్ మనకు తెలిసిందే. వీటినే ఇంకా నడుము పై దాకా కట్ చేస్తే.. ఇదే ఇప్పటి స్టైల్. ‘సన్నని నడుము, మంచి శరీరాకృతి గల వారికి ఈ కట్ సూపర్‌గా నప్పుతుంది’ అంటూ డిజైనర్లు చెబుతున్నారు. అనార్కలీ సింగిల్ కట్... అనార్కలీ అంబ్రెల్లా మాదిరి ఎంత అందంగా కుచ్చిళ్లతో ఉంటుందో మనకు తెలిసిందే. అన్ని రకాల సంప్రదాయ పద్ధతులకు సరిగ్గా నప్పే డ్రెస్‌గా అనార్కలీ ముందుంది. ఇప్పుడు దీన్ని సైడ్ ఫ్రంట్ సింగిల్ కట్‌తో వెడ్డింగ్ డ్రెస్‌గా రూపొందిస్తున్నారు. ఈ కట్స్ కుర్తాను ఎంచుకునే ముందు... షిఫాన్, జార్జెట్, క్రేప్, నెటెడ్, సిల్క్ మాత్రమే కాకుండా మంచి ఫాల్ ఉన్న బెనారస్, కాటన్ ... మెటీరియల్స్ కూడా వీటికి బాగా నప్పుతాయి. మల్ మల్ లేదా కాటన్ అయితే చాలా తక్కువ థ్రెడ్ వర్క్స్ ఉన్నవి ఎంచుకుంటే మేలు. కుట్టడానికి మెటీరియల్ ఇచ్చినప్పుడు మీ శరీరాకృతికి తగిన విధంగా మంచి కటింగ్‌తో కుర్తీ ఉండాలి. రెడీమేడ్ డ్రెస్ కొనుగోలు చేసేటప్పుడు మీ శరీరాకృతికి ఒక అంగుళం సైజ్ పెద్దది తీసుకుంటే చాలు అది లావుగా ఉన్నవారికి ఈ తరహా కుర్తాలు అంతగా నప్పువు. వీటి వల్ల చూడటానికి ఇంకా లావుగానూ కనిపిస్తారు. భారీ ఫ్యాబ్రిక్, ఎంబ్రాయిడరీ ఎక్కువ ఉన్న వాటిని ఈ తరహా టాప్స్‌కి ఎంచుకోవద్దు. గంజి దట్టంగా ఉండే కాటన్, చందేరి మెటీరియల్స్ చూడటానికి గాడీగా కనిపిస్తాయి. అలాగే పెద్ద పెద్ద అంచులు, గోటా వర్క్, హెవీ ఎంబ్రాయిడరీల జోలికి వెళ్లకూడదు. సింపుల్‌గా, లైట్‌గా చూడటానికి కంటికి నప్పే విధంగా ఉండాలి. తక్కువ ఎంబ్రాయిడరీ, స్వరోస్కి-జరీ మెరుపులు చాలా తక్కువగా, చిన్న చిన్న అంచులు ఉన్న టాప్స్ చాలా బాగుంటాయి. - ఎన్.ఆర్ -
ఊడ్చేస్తున్నాయ్!
ఇటీవల బాలీవుడ్, టాలీవుడ్ తారలను గమనిస్తున్నారా... ఏ వేడుకైనా ఫ్లోర్‌ను ఊడ్చేస్తున్నట్టుగా ఉండే పొడవాటి అనార్కలీ లెహంగాలలో తళుక్కుమంటున్నారు. టీవీ షో అయినా, అవార్డు, ఆడియో పంక్షన్ అయినా, పేజ్ 3 పార్టీలు, సినిమాల ప్రమోషన్లు... ఏ చిన్న సందర్భం వచ్చినా లాంగ్ అనార్కలీనే ఆశ్రయిస్తున్నారు. వీరేనా, మేమూ ఏమీ తీసిపోలేదంటూ చిన్నారులు.. చిన్నా-పెద్ద అమ్మలు కూడా వీటినే ధరించి మెరిసిపోతున్నారు. ఫ్లోర్‌నే కాదు అన్ని రకాల స్టైల్ డ్రెస్సులను ఊడ్చిపారేసి ఈ ఇయర్ ఫ్యాషన్‌లో ముందువరసలో నిలిచాయి ఈ లాంగ్ అనార్కలీలు. అనార్కలీ నమూనా అని చెప్పుకున్నా మూలం మాత్రం పాశ్చాత్యుల లాంగ్ గౌనే. కానీ, ఇప్పుడదే మన సంప్రదాయంగా మారింది. పాశ్చాత్యుల వివాహవేడుకలో గౌన్ తప్పనిసరి అని మనకు తెలిసిందే! ఇప్పుడవే గౌన్లు అనార్కలీ కట్‌తో మన దగ్గర ప్రతి చిన్న సందర్భానికి, చిన్న నుంచి పెద్ద పార్టీల వరకు హైలైట్‌గా నిలుస్తున్నాయి. వీటినే ఫ్లోర్ లెంగ్త్ అనార్కలీ అని పిలుచుకుంటున్నారు. సినిమాకే ఆకర్షణ... బాలీవుడ్ సినిమాలలో అందాల భామలను మరింత ఆకర్షణీయంగా చూపడానికి రెండేళ్ల క్రితం మనీష్ మల్హోత్ర, అబు జాని, సందీప్ ఖోస్లా... వంటి ఇండియన్ ప్రసిద్ధ డిజైనర్లు ఈ ఫ్లోర్ లెంగ్త్ అనార్కలీలను అందంగా మోసుకొచ్చారు. వీటిని ధరించి దీపికా పదుకునే, కత్రినాకైఫ్, కరీనాకపూర్, పరిణీతి చోప్రా, ఐశ్వర్యారాయ్లే కాదు మాధురీ దీక్షిత్, శ్రీదేవి.. వంటి తారలు కూడా సినిమాలలోనూ, వేడుకలలోనూ అందంగా మెరిసిపోవడం మొదలెట్టారు. బాలీవుడ్ ఈ హవా ఇటు టాలీవుడ్‌కే కాదు అటు హాలీవుడ్‌కీ పాకింది. సంప్రదాయం.. సమకాలీనం.. క్రియేటివ్ డిజైన్స్, కట్స్, స్టిచింగ్, ఎంబ్రాయిడరీ, మెరుపులీనే లేసులు, ప్యాచ్‌లు, అద్దాలు... హంగులకు హద్దే లేకుండా సాగిపోయే ఈ ఫ్యాషన్ సంప్రదాయం- సమకాలీనం రెండింటినీ పుణికిపుచ్చుకోవడంతో అంతటా హల్చల్ చేస్తోంది. అంతర్జాతీయం... చూడ గానే అంతర్జాతీయ ప్రాభవం, హెవీ ఎంబ్రాయిడరీ వర్క్, సూపర్బ్ అనిపించే డిజైన్స్, శరీరసౌష్టవాన్ని అందంగా చూపే నమూనాలు ఈ డ్రెస్‌ను హైలైట్‌గా నిలిపాయి. హెవీ బ్రొకేడ్, కళాత్మకమైన వర్క్ ఉన్న ఫ్యాబ్రిక్ ఈ తరహా అనార్కలీకి బాగా సూట్ అవుతుంది. అలాగే వెల్వెట్, జార్జెట్, క్రేప్, నెటెడ్లలో ఈవెనింగ్ గౌన్ కాస్త ఇంటర్నేషనల్ పార్టీవేర్‌గా మారిపోయి ఇప్పుడు ప్రపంచవ్యాప్త అతివల ఫ్యాషన్ డ్రెస్‌గా మారింది. పొడవు, పొట్టి, లావు, సన్నం అనే తేడా అనేదే లేకుండా అన్ని రకాల శరీరాకృతి గలవారికీ ఇవి బాగా నప్పడం ఈ డ్రెస్‌ను సొంతం చేసుకోవడానికి మరో ప్రత్యేక కారణంగా నిలిచింది. అంతేకాదు, ఒకింత గాగ్రా స్టైల్ ఫ్లెయిర్ అనిపించడం, విభిన్నమైన నెక్‌లైన్స్.. ఇలా అదనపు లక్షణాలు ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటోంది. రాయల్ రాజసం... అతివల నడకకు మరింత రాజసం, అందం, మెరుపు అద్దుతోంది అనార్కలీ. మొఘల్లు కాలం నాటి రాజసం అనార్కలీలో కనిపిస్తుంది. ఈ పొడవాటి అనార్కలీ గౌన్ ధరించి నడుస్తుంటే... కదిలే కుచ్చిళ్లు, విప్పార్చుకునే పెద్ద పెద్ద అంచులు... నాటి రాణివాసం హొయలను కళ్లకు కడతాయి. ఇన్ని విలక్షణాలు ఉండటంతో లక్షణంగా వెలిగిపోతోంది ఈ లాంగ్ అనార్కలీ. - ఎన్.ఆర్ -
క్లాస్ కట్.. మాస్ స్టిచ్
అనార్కలీ చాకొలెట్ బ్రౌన్ కలర్ జార్జెట్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసి పొడవాటి అనార్కలీ డ్రెస్ ఇది. హై నెక్, బ్యాక్ అండ్ ఫ్రంట్ మిర్రర్ వర్క్ చేయడంతో సంప్రదాయ కళ ఉట్టిపడుతోంది.ఫ్యాషన్‌షోలలో ఓ వెలుగు వెలిగి ప్రముఖుల ప్రశంసలు అందుకున్న రెడ్ బ్లూ కాంబినేషన్ స్టైల్... ట్రెడిషనల్ లవర్స్ బెస్ట్ ఆప్షన్‌గా ఎంచుకునే గ్రీన్, బ్రౌన్ కలర్‌ఫుల్ స్మైల్... సూపర్ కట్‌తో క్లాస్‌ని మెప్పించడమే కాదు కంఫర్ట్ ఫ్యాబ్రిక్ ఏదైనా ఇలాగే స్టిచ్ చేసి డూపర్‌గా మాస్‌లోనూ మెరిసిపోవచ్చు. ఫ్యాషన్ షోలో ఓ వెలుగు వెలిగిన కట్స్‌ని మీ కోసం తీసుకువచ్చాం... ట్రై చేయండి.. అదరహో అనిపించండి. ఇండో-వెస్ట్రన్.. టై అండ్ డై చేసిన చిలకపచ్చ జార్జెట్ ఇండో వెస్ట్రన్ లాంగ్ గౌన్. మిర్రర్ వర్క్ చేసిన రా సిల్క్ ఫ్లాప్‌ను ఛాతి భాగంలో జత చేశారు. రెడ్ బ్లూ కలెక్షన్... స్వచ్ఛమైన సిల్క్ క్లాత్ మీద కొల్కతా చేనేతకారులు బంగారు జరీతో మోటిఫ్స్‌ను రూపొందించారు. ఈ క్లాత్‌తో ఇండో వెస్ట్రన్ డ్రెస్ రూపొందించారు డిజైనర్. ఇటీవల కలంత ఫెస్టివల్లో బెస్ట్ జ్యూరీ అవార్డ్ పొందిన ఈ కలెక్షన్, లాక్మే ఫ్యాషన్వీక్కూ ఎంపికైంది. పలాజో ప్యాంట్, స్లీవ్‌లెస్ బ్లౌజ్, అదనంగా జత చేసిన ఫ్లాప్.. నేటితరం అమ్మాయిల స్టైల్‌కు బాగా నప్పుతుంది. పూర్తిగా నీలం రంగు పట్టు క్లాత్‌తో డిజైన్ చేశారు. పలాజో ప్యాంట్‌కు నడుము భాగంలో పూర్తి కాంట్రాస్ట్ కలర్ ప్యాటర్న్‌ను జత చేస్తే న్యూలుక్‌తో వెలిగిపోవచ్చు. రెడ్ కలర్ స్టైల్ లాంగ్ జాకెట్టును చీరల మీదకూ ధరించవచ్చు. ఎంత ట్రెడిషనల్ చీర కట్టుకున్నా ఈ తరహా బ్లౌజ్ వల్ల లుక్ పూర్తి స్టైలిష్‌గా మారిపోతుంది. డ్రెస్ డిజైనింగ్‌లో మనసు పెట్టి చేస్తేనే అనుకున్న ఫలితాలు వస్తాయి. జార్జెట్, క్రేప్ మెటీరియల్స్ వెస్ట్రన్వేర్కి బాగా నప్పుతాయి. ఇండోవెస్ట్రన్ స్టైల్‌కి కూడా పట్టును చాలా బాగా చూపించవచ్చు. పట్టు, జార్జెట్ క్లాత్‌లతో ఈ డిజైన్స్‌ని రూపొందించాను. తక్కువ ఖర్చుతో ఈ డిజైన్స్ కావాలంటే కాటన్, టస్సర్ వంటి మంచి ఫాల్ ఉన్న ఫ్యాబ్రిక్‌ను ఎంచుకోవచ్చు. ఈ డిజైనర్ దుస్తులు ఇటు సంప్రదాయ, అటు పాశ్చాత్య వేడుకలకూ బాగా నప్పుతాయి. - ఆల్టియా కృష్ణ, ఫ్యాషన్ డిజైనర్, సుధర్మ బొటిక్, హైదరాబాద్ (డిజైన్స్‌కి సరైన సూచనలకోసం fashion A° MøsŒæ ^ólçÜ*¢ features.sakshi@gmail.comకు మెయిల్ చేయండి)