ఊడ్చేస్తున్నాయ్!
ఇటీవల బాలీవుడ్, టాలీవుడ్ తారలను గమనిస్తున్నారా... ఏ వేడుకైనా ఫ్లోర్‌ను ఊడ్చేస్తున్నట్టుగా ఉండే పొడవాటి అనార్కలీ లెహంగాలలో తళుక్కుమంటున్నారు. టీవీ షో అయినా, అవార్డు, ఆడియో పంక్షన్ అయినా, పేజ్ 3 పార్టీలు, సినిమాల ప్రమోషన్లు... ఏ చిన్న సందర్భం వచ్చినా లాంగ్ అనార్కలీనే ఆశ్రయిస్తున్నారు. వీరేనా, మేమూ ఏమీ తీసిపోలేదంటూ చిన్నారులు.. చిన్నా-పెద్ద అమ్మలు కూడా వీటినే ధరించి మెరిసిపోతున్నారు. ఫ్లోర్‌నే కాదు అన్ని రకాల స్టైల్ డ్రెస్సులను ఊడ్చిపారేసి ఈ ఇయర్ ఫ్యాషన్‌లో ముందువరసలో నిలిచాయి ఈ లాంగ్ అనార్కలీలు.
అనార్కలీ నమూనా అని చెప్పుకున్నా మూలం మాత్రం పాశ్చాత్యుల లాంగ్ గౌనే. కానీ, ఇప్పుడదే మన సంప్రదాయంగా మారింది. పాశ్చాత్యుల వివాహవేడుకలో గౌన్ తప్పనిసరి అని మనకు తెలిసిందే! ఇప్పుడవే గౌన్లు అనార్కలీ కట్‌తో మన దగ్గర ప్రతి చిన్న సందర్భానికి, చిన్న నుంచి పెద్ద పార్టీల వరకు హైలైట్‌గా నిలుస్తున్నాయి. వీటినే ఫ్లోర్ లెంగ్త్ అనార్కలీ అని పిలుచుకుంటున్నారు.
సినిమాకే ఆకర్షణ...
బాలీవుడ్ సినిమాలలో అందాల భామలను మరింత ఆకర్షణీయంగా చూపడానికి రెండేళ్ల క్రితం మనీష్ మల్హోత్ర, అబు జాని, సందీప్ ఖోస్లా... వంటి ఇండియన్ ప్రసిద్ధ డిజైనర్లు ఈ ఫ్లోర్ లెంగ్త్ అనార్కలీలను అందంగా మోసుకొచ్చారు. వీటిని ధరించి దీపికా పదుకునే, కత్రినాకైఫ్, కరీనాకపూర్, పరిణీతి చోప్రా, ఐశ్వర్యారాయ్‌లే కాదు మాధురీ దీక్షిత్, శ్రీదేవి.. వంటి తారలు కూడా సినిమాలలోనూ, వేడుకలలోనూ అందంగా మెరిసిపోవడం మొదలెట్టారు. బాలీవుడ్ ఈ హవా ఇటు టాలీవుడ్‌కే కాదు అటు హాలీవుడ్‌కీ పాకింది.
సంప్రదాయం.. సమకాలీనం..
క్రియేటివ్ డిజైన్స్, కట్స్, స్టిచింగ్, ఎంబ్రాయిడరీ, మెరుపులీనే లేసులు, ప్యాచ్‌లు, అద్దాలు... హంగులకు హద్దే లేకుండా సాగిపోయే ఈ ఫ్యాషన్ సంప్రదాయం- సమకాలీనం రెండింటినీ పుణికిపుచ్చుకోవడంతో అంతటా హల్‌చల్ చేస్తోంది.
అంతర్జాతీయం...
చూడ గానే అంతర్జాతీయ ప్రాభవం, హెవీ ఎంబ్రాయిడరీ వర్క్, సూపర్బ్ అనిపించే డిజైన్స్, శరీరసౌష్టవాన్ని అందంగా చూపే నమూనాలు ఈ డ్రెస్‌ను హైలైట్‌గా నిలిపాయి. హెవీ బ్రొకేడ్, కళాత్మకమైన వర్క్ ఉన్న ఫ్యాబ్రిక్ ఈ తరహా అనార్కలీకి బాగా సూట్ అవుతుంది. అలాగే వెల్వెట్, జార్జెట్, క్రేప్, నెటెడ్‌లలో ఈవెనింగ్ గౌన్ కాస్త ఇంటర్నేషనల్ పార్టీవేర్‌గా మారిపోయి ఇప్పుడు ప్రపంచవ్యాప్త అతివల ఫ్యాషన్ డ్రెస్‌గా మారింది. పొడవు, పొట్టి, లావు, సన్నం అనే తేడా అనేదే లేకుండా అన్ని రకాల శరీరాకృతి గలవారికీ ఇవి బాగా నప్పడం ఈ డ్రెస్‌ను సొంతం చేసుకోవడానికి మరో ప్రత్యేక కారణంగా నిలిచింది. అంతేకాదు, ఒకింత గాగ్రా స్టైల్ ఫ్లెయిర్ అనిపించడం, విభిన్నమైన నెక్‌లైన్స్.. ఇలా అదనపు లక్షణాలు ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటోంది.
రాయల్ రాజసం...
అతివల నడకకు మరింత రాజసం, అందం, మెరుపు అద్దుతోంది అనార్కలీ. మొఘల్‌లు కాలం నాటి రాజసం అనార్కలీలో కనిపిస్తుంది. ఈ పొడవాటి అనార్కలీ గౌన్ ధరించి నడుస్తుంటే... కదిలే కుచ్చిళ్లు, విప్పార్చుకునే పెద్ద పెద్ద అంచులు... నాటి రాణివాసం హొయలను కళ్లకు కడతాయి. ఇన్ని విలక్షణాలు ఉండటంతో లక్షణంగా వెలిగిపోతోంది ఈ లాంగ్ అనార్కలీ.
- ఎన్.ఆర్