తారాస్వరం: సహజత్వమే అసలైన అందం!
కరీనా కపూర్ : పుట్టినరోజు: సెప్టెంబర్ 21
ముద్దు పేరు: బెబో
చదువు: న్యాయశాస్త్రంలో డిగ్రీ
నచ్చే రంగులు: నలుపు, ఎరుపు
నచ్చే ఆహారం: స్పాగెట్టీ
నచ్చే నటుడు: రాజ్‌కపూర్
నచ్చే నటి: న ర్గీస్
నచ్చే పాట: రహే న రహే హమ్ (మమత-1966)
నచ్చిన పుస్తకం: మాస్టర్ ఆఫ్ ద గేమ్ (సిడ్నీ షెల్డన్)
* మిమ్మల్ని ఎలా నిర్వచించవచ్చు?
నేనెక్కువ పాజిటివ్‌గానే ఆలోచిస్తాను. ఒక మనిషి గురించి గానీ, ఒక విషయం గురించి గానీ చెడుగా ఆలోచించడం నచ్చదు నాకు. ఒక్కమాటలో చెప్పాలంటే... నేను చాలా ఫెయిర్ ఇండ్ పాజిటివ్ పర్సన్‌ని.
* ఫ్యాషన్ అంటే ఏమిటో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలంటారు అందరూ. దీనికేమంటారు?
నిజానికి నాకంటే మోడ్రన్‌గా ఉండేవాళ్లు చాలామంది ఉన్నారు. ఫ్యాషన్ గురించి నాకంటే బాగా తెలిసినవాళ్లు బోలెడంతమంది ఉన్నారు. నేను నాకు నప్పేది వేసుకుంటాను తప్ప ఏదో ట్రెండ్ సెట్ చేసేయాలన్న తపన ఏమీ లేదు నాకు.
* మీ దృష్టిలో అసలైన ఫ్యాషన్ ఏది?
ఫ్యాషన్ అంటే చిత్ర విచిత్రమైన దుస్తులు, హెయిర్ స్టయిల్స్ కాదు. సహ జత్వమే అసలైన అందం. మన మేకప్ మన ఒరిజినాలిటీని కప్పేయకూడదు. ఎంత సింపుల్‌గా ఉంటే అంత అందంగా ఉంటాం అన్నది నేను నమ్ముతాను.
* అంటే, మీరు అంతగా తయారవరా?
ఎందుకవను! ఫ్యాషన్ షోల్లో ర్యాంపు మీద నడవాల్సి వచ్చినా, ఫంక్షన్లప్పుడు కూడా అందుకు తగ్గట్టుగా రెడీ అవుతాను. మిగతా సమయాల్లో అసలు మేకప్పే సరిగ్గా వేయను.
* సైఫ్ మాత్రం వయసు పెరిగేకొద్దీ ఇంకా ఫిట్‌గా, స్టైల్‌గా తయారవుతున్నట్టున్నారే?
అవును నిజమే. తను రెడ్‌వైన్ లాంటివాడు. కాలం గడిచేకొద్దీ హాట్ అవుతుంటాడు. తనదంతా అదో తరహా. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోడు. ఏది ఎంత అవసరమో అంతే. అంతకుమించి జోక్యం చేసుకోవడానికి ఇష్టపడడు. పబ్లిసిటీ కోసం కూడా పాకులాడడు. అలా ఉండటం ఈ ఫీల్డ్‌లో కాస్త కష్టమే.
* మీవారికి కోపమెక్కువని అంతా అంటారు. నిజమేనా?
కోపం లేకుండా ఎవరైనా ఉంటారా? అలాగే తనకీ. కాకపోతే అన్నిసార్లూ చూపించడు. ఎవరైనా అతిగా విసిగిస్తే మాత్రం ఇరిటేట్ అవుతాడు. అది అందరూ చేసేదే. కానీ తను సెలెబ్రిటీ కాబట్టి అందరూ పనిగట్టుకుని తన కోపం గురించి మాట్లాడతారు. అంతేతప్ప, తను చాలా మంచివాడు.
* మీ ఇద్దరి బంధం దృఢంగా ఉండటానికి మీరేం చేస్తారు?
కొన్ని సంవత్సరాల పాటు అతడితో కలిసి జీవించాను. పెళ్లి అనేది సమాజానికి అవసరం కాబట్టి పెళ్లి చేసుకున్నాను. కానీ నా వరకూ నేను ఏ రోజైతే అతడికి నా మనసులో స్థానం ఇచ్చానో, అప్పుడే తనకి భార్యనైపోయానని అనుకున్నాను. కలిసివున్న అన్నేళ్లలో మా బంధం బలంగా లేదని అనిపించివుంటే అసలు మేం పెళ్లి వరకూ వెళ్లేవాళ్లమే కాదు. కాబట్టి... ఆల్రెడీ రిలేషన్ దృఢంగా ఉన్నప్పుడు ఇక చేయడానికేముంటుంది!
* అతడు మీ జీవితంలోకి వచ్చాక మీలో ఏదైనా మార్పు వచ్చిందా?
సైఫ్ నాకు చాలా నేర్పుతాడు. ఎలా ఉండాలో చెబుతాడు. నేను స్వతహాగా చాలా సెన్సెటివ్. ఎవరైనా చిన్న మాటన్నా ఏడ్చేస్తాను. అలా ఉండకూడదని తను చెప్పాడు. త్వరత్వరగా రియాక్టవడం మంచి లక్షణం కాదు, బాధ కలిగినా కూడా దాని గురించి బాధపడటం అవసరమా అని ఆలోచించగలగాలి, అది తెలివైన వాళ్ల లక్షణం అని చెప్పాడు. ఇప్పుడు నేను ప్రతిదానికీ ఏడవడం లేదు.
* మీ అత్తవారింట్లో ఎలా ఉంటుంది?
అత్తయ్య చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. తను చాలా మోడ్రన్‌గా ఆలోచిస్తారు. కోడలంటే ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి అంటూ హద్దులు పెట్టే రకం కాదావిడ. పైగా మహిళలు తమకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకోవాలి అని నమ్మే వ్యక్తి. హాలీడే ట్రిప్‌కి వెళ్లినప్పుడు తన ఎదురుగానే నేను బికినీ వేసుకుని తిరుగుతాను. కానీ ఆవిడ ఏమీ అనరు. కాబట్టి నేను చాలా అదృష్టవంతురాలైన కోడలిని చెప్పవచ్చు.
* పెళ్లయ్యాక మీకు కెరీర్ మీద శ్రద్ధ ఎక్కువైనట్టు కనిపిస్తోంది?
ఒక్కసారి పెళ్లయితే హీరోయిన్‌గా కొనసాగడం కష్టమంటారంతా. కానీ నేనలా కాకూడదనుకున్నాను. అందుకే వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిని కలపకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. అంతే తప్ప పెళ్లికి ముందు తేలిగ్గా తీసుకోవడం, పెళ్లయ్యాక ఎక్కువ శ్రద్ధ పెట్టడమనేదేం లేదు.
* మరి పిల్లల సంగతి...?
నేనైతే పిల్లల్ని కనడానికి ప్రస్తుతం సిద్ధంగా లేను. నా మనసు ఇంకా కెరీర్ మీదే ఉంది. ఈ ఫీల్డ్‌లో డిమాండ్ ఉన్నప్పుడే మన హవా నడుస్తుంది. అప్పుడు దాన్ని ఉపయోగించకోకపోతే మరోసారి ఆ చాన్స్ రాదు. సైఫ్ కూడా నా మాట కాదనడు కాబట్టి పిల్లల సంగతి తర్వాత ఆలోచిస్తా!