Taraswaram
-
తారాస్వరం: అమ్మాయిలకు చీరే అందం! - సోనాక్షీసిన్హా
పుట్టినరోజు: జూన్ 2, 1987 జన్మస్థలం: పాట్నా, బీహార్ తల్లిదండ్రులు: శత్రుఘ్నసిన్హా, పూనమ్ చదువు: ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ హాబీలు: పాత సినిమాలు ఇష్టంగా చూస్తాను. పుస్తకాలు చదువుతాను. సైకాలజీ చదవడం చాలా ఇష్టం. నచ్చే దుస్తులు: చీర అంటే ఇష్టం. నాకు తెలిసి చీరలో ఉన్నంత అందంగా, ముచ్చట మరే దుస్తుల్లోనూ కనిపించరు అమ్మాయిలు. ప్రత్యేక సందర్భాలన్నింటికీ నేను చీరలే కట్టుకుంటాను. మామూలుగా అయితే ప్యాంటు, లూజ్ షర్టు వేసుకుంటాను. తీరిక వేళల్లో: ఐప్యాడ్ తెరవడం, గేమ్స్ ఆడటం... ఇదే పని. అది నాకు చాలా ఇష్టమైన పని కూడా. ఎప్పుడైనా మూడ్ బాగోకపోతే: వెంటనే బయటకు చెక్కేస్తా. ఫ్రెండ్స్‌ని తీసుకుని సినిమాలకీ, షాపింగుకీ తిరుగుతా. మూడ్ అదే సరైపోతుంది. ఎప్పుడూ వెంట ఉండేవి: చాకొలెట్స్. అవి తినకపోతే చచ్చిపోతానేమో అన్నంత పిచ్చి. కోక్ తాగకపోయినా కూడా ఉండలేను. ఒకరకంగా నేను వీటికి అడిక్ట్ అయిపోయాను. అందుకున్న కాస్ట్లీ గిఫ్ట్: నా మొదటి కారు. నేను కాలేజీలో చదువుకుంటున్నప్పుడు రోజూ ట్రెయిన్లో వెళ్లి ఇబ్బంది పడుతున్నానని... నాన్న కొనిచ్చారు. సంతోషపెట్టేది: ఏదైనా పని చేసినప్పుడు చాలా బాగా చేశావు అని ఎవరైనా మెచ్చుకుంటే చాలు, చాలా తృప్తిగా సంతోషంగా అనిపిస్తుంది. బాధపెట్టేది: పుకార్లు. అయ్యో దేవుడా... ఏం సృష్టిస్తారో మామీద! వాటిని చదివి నిజమా అని షాకైపోతుంటాను. సోనాక్షి అలా సోనాక్షి ఇలా అని రాసేస్తుంటే చదివి... నేనిలా చేస్తున్నానా అని ఆశ్చర్యపోతూ ఉంటాను. లేనివి కూడా అంత అందంగా రాసే వాళ్ల క్రియేటివిటీని మెచ్చుకుని తీరాలి! ఎదుటివారిలో నచ్చేది: నిజాయతీ. అది లేనివాళ్లను దగ్గరకు కూడా రానివ్వను. ఎదుటివారిలో నచ్చనిది: నటన. కొందరు జీవితంలో కూడా నటించేస్తుంటారు. అలాంటివాళ్లని చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. మర్చిపోలేని కల: ఒకసారి ఓ విచిత్రమైన కల వచ్చింది. అందులో నాకు మరో రెండు చేతులు మొలిచాయి. ఉలిక్కిపడి లేచా. అద్దం ముందు నిలబడి నన్ను నేను ఎంతసేపు పరిశీలించి చూసుకున్నానో. అది నిజం కాదని నమ్మడానికి చాలా టైమ్ పట్టింది. మర్చిపోలేని అనుభవం: ఓ ఫ్యాషన్ షోలో ర్యాంపు మీద నడుస్తూ జారి పడిపోయాను. ఎంత సిగ్గుపడ్డానో చెప్పలేను. కానీ ఇప్పుడు తలచుకుంటే నవ్వు ఆగదు. నమ్మకం అబద్ధమైన సందర్భం: నేను చాలా లావుగా ఉండేదాన్ని. ఎంత లావు అంటే... ఎప్పటికీ తగ్గలేనేమో అనుకునేదాన్ని. కానీ సల్మాన్‌ఖాన్ నా ఆలోచనను తుడిచేశారు. ప్రయత్నిస్తే అవుతావు, నిజంగా సన్నబడితే నీకు నా పక్కన హీరోయిన్ చాన్స్ ఇస్తాను అన్నారు. అందుకే పట్టుదలగా ప్రయత్నించా. ఆయన పక్కన చాన్స్ కొట్టేశా. నా గురించి ఎవరికీ తెలియనిది: నాలో మంచి చిత్రకారిణి కూడా ఉంది. అంతేకాదు... నేను మంచి క్రీడాకారిణిని కూడా. వాలీబాల్, ఫుట్‌బాల్, త్రోబాల్, టెన్నిస్‌తో పాటు మరో ఐదారు రకాల ఆటలాడతాను. ఇష్టపడే కో స్టార్: అందరూ ఇష్టమే. ఎవరి మీదా అయిష్టత లేదు. కానీ అక్షయ్ కుమార్‌తో పని చేసేటప్పుడు ఎక్కువ కంఫర్టబుల్‌గా ఫీలవుతాను. ఇద్దరం కలిసి ఎక్కువ సినిమాలకు పని చేయడం వల్ల కావచ్చు. అందమంటే: మనసు. అది అందంగా ఉంటేనే మనిషి నిజంగా అందంగా ఉన్నట్టు. ప్రేమంటే: దానికది పుట్టాలి. ఎవరో వచ్చి ఐలవ్యూ చెప్పారు కదా అని మనలో పుట్టేయదు. అలా పుడితే అది ప్రేమ కూడా కాదు. ఒకరిని చూసి తనంత తానుగా మనసు స్పందించినప్పుడు పుట్టేదే అసలైన ప్రేమ. పెళ్లంటే: నమ్మకం. ఇద్దరు మనుషులు నమ్మకంతో కలసి ప్రయాణించడానికి వేసే తొలి అడుగే పెళ్లి. జీవితలక్ష్యం? ఏదో సాధించేయాలని ఇంతవరకూ ప్లాన్ చేసింది లేదు. అనుకోకుండా నటినైనా మంచి పేరు వచ్చింది. ఈ పేరుని ఇలా కాపాడుకుంటే చాలు. నాకు అవకాశాలు వచ్చినన్నాళ్లూ, ఇంకా చెప్పాలంటే... నన్ను ప్రేక్షకులు ఇష్టంగా చూసినన్నాళ్లూ నటిస్తాను. అంతే! -
తారాస్వరం: ఆరుసార్లు పెళ్లి చేసుకుంటా... - ప్రియాంకాచోప్రా
చరణ్ దొరకడం నా అదృష్టం: టాలీవుడ్లో నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ‘తుఫాన్’తో ఆ చాన్స్ వచ్చింది. అయితే తెలుగులో మాట్లాడ్డానికి నానా తంటాలు పడ్డాను. కాస్త పెద్ద డైలాగులు చెప్పాల్సి వచ్చినప్పుడు ఒకటే టెన్షన్. రామ్‌చరణ్ హెల్ప్ చేశాడు కాబట్టి సరిపోయింది కానీ, లేదంటే మామూలుగా కష్టపడేదాన్ని కాదు. అలాంటి మంచి కో స్టార్ దొరకడం నా అదృష్టం. నేను భారతీయురాలిని. అదే సమయంలో విదేశీయురాలిని కూడా. ఇలా ఎందుకంటున్నానంటే... నేను సగం అమెరికాలో పెరిగితే, సగం మన దేశంలో పెరిగాను. అందుకే రెండు రకాల సంస్కృతులకూ అలవాటు పడ్డాను. అయితే నాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది భారతీయ సినిమాయే కాబట్టి... మొదటి స్థానం ఇండియాదే. నేను చాలా మొండిదాన్ని. చేయాలనుకున్నదాని అంతు చూశాకే వదులుతాను. ఆ లక్షణమే నా జీవితాన్ని మలిచింది. అయితే ఎవరి మాటా విననని కాదు. వింటాను. కానీ నిర్ణయం నా మనసు చెప్పినట్టే తీసుకుంటాను! నాకు చిన్నప్పట్నుంచీ సింగర్‌ని కావాలని కోరిక. కానీ అనుకోకుండా నటినయ్యాను. అయితే ఆ కోరిక ఇప్పటికీ అలానే ఉంది. అందుకే ఈ మధ్య మ్యూజిక్ ఆల్బమ్ చేశాను. ఇంకా చేస్తాను. అంతకంటే నేను కోరుకునేది... సినిమాలకు పాడాలని. నా సినిమాలకు మాత్రమే కాదు... ఇతర హీరోయిన్లకు కూడా పాడాలని ఉంది. ఈ ఫీల్డ్‌లో ఎదగడం అంత ఈజీ కాదు. ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతాయి. ఎన్నో అవమానాలు ఎదురవుతాయి. నన్ను కూడా మొదట్లో కొందరు చాలా అవమానించారు. బాధపెట్టారు. ఎవరికీ చెప్పుకోలేక ఒంటరిగా కూర్చుని ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ దేవుడి దయవల్ల నేను గెలిచాను. ఈ రోజు ఈ పొజిషన్లో ఉన్నాను. నాకంటూ ఓ జీవితం ఉంది. దాన్ని అందరి ముందూ పరచడం నాకు నచ్చదు. ముఖానికి మేకప్ వేసినప్పుడు మాత్రమే ప్రియాంక నటి. అది తీశాక ఆమె ఓ సామాన్యమైన అమ్మాయి. ఇలా ఉండటానికే నేను ఇష్టపడతాను! ఎంత సంపాదించినా పక్కవాడి కోసం ఒక రూపాయి ఖర్చు పెట్టలేకపోతే ఆ సంపాదనకు అర్థం ఉండదు. నా తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లే. ఓ అంబులెన్సులో ఎక్విప్మెంట్, మందులు వేసుకుని గ్రామాలకు వెళ్లేవారు. పేదవాళ్లకి ఉచితంగా పరీక్షలు చేసి మందులిచ్చేవారు. నేను కూడా వాళ్లతో వెళ్లేదాన్ని. నా డ్యూటీ ఏంటో తెలుసా... అమ్మానాన్నలు చెప్పిన మందుల్ని లెక్కపెట్టి ఇవ్వడం. అప్పుడనిపించేది... ప్రపంచంలో ఇంతమంది పేదవాళ్లు ఉన్నారా, ఈ పరిస్థితిని ఎవరూ మార్చలేరా అని. చిన్నదాన్ని కావడంతో అప్పుడేమీ చేయలేకపోయాను. కానీ ప్రపంచ సుందరి కిరీటం అందుకోగానే సమాజం కోసం ఏదైనా చేయగల స్థాయికి చేరుకున్నానని అనిపించింది. వెంటనే యునిసెఫ్‌తో కలిసి పని చేయడం మొదలుపెట్టాను. ఇప్పటికీ చేతనైనంత చేస్తూనే ఉన్నాను. ఊహ తెలిసిన తర్వాత ఏ రోజూ ఫెయిల్యూర్‌కి భయపడలేదు నేను. ముఖ్యంగా సినీ పరిశ్రమలో జయాపజయాలు మన చేతుల్లో ఉండవు. ఒకవేళ సినిమా పోయినా దానికి మనమొక్కరిమే బాధ్యులం కాము. కాబట్టి నేనేనాడూ హిట్టు, ఫ్లాపుల గురించి ఆలోచించను. నాకు రోల్ మోడల్స్ అంటూ ఎవరూ లేరు. నాకు నేను కష్టపడి పైకొచ్చాను. అయితే బియాన్స్ నోల్స్ని చాలా ఇష్టపడతాను. వ్యక్తిగత జీవితాన్నీ, వృత్తి జీవితాన్నీ ఆమె బ్యాలన్స్ చేసుకునే తీరు ఎంతో బాగుంటుంది. ఆ విషయంలో ఆమెను స్ఫూర్తిగా తీసుకుంటాను. అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. టైమొచ్చినప్పుడు, తగినవాడు దొరికినప్పుడు చేసుకుంటా. అయితే మొత్తం ఆరుసార్లు చేసుకుంటాను. అంబాలాలోని మా తాతగారి ఇంట్లో ఓసారి, ఆస్ట్రేలియాలో సముద్రపు నీటి అడుగున ఒకసారి, లాస్ వేగాస్ చర్చిలో ఓసారి, స్విట్జర్లాండులోని లొకార్నో చర్చిలో ఓసారి, జర్మనీలో కొండ మీద ఓసారి, ఇటలీలో ఓసారి... ఇలా ఆరుసార్లు పెళ్లాడుతా. కానీ వరుడు మాత్రం ఒక్కడేనండోయ్! నేను విధిని నమ్ముతాను. చీమ కుట్టినా దాని వెనుక దేవుడి ఆజ్ఞ ఉందనుకుంటాను. అందుకే భవిష్యత్తు గురించి బెంగపడను. ఈరోజు ఇక్కడ ఉండాలని నిర్ణయించిన దేవుడే రేపు నేనెక్కడుండాలో డిసైడ్ చేస్తాడు. ఇక నేనెందుకు అనవసరంగా ఆలోచించి టెన్షన్ పడటం! -
తారాస్వరం: సహజత్వమే అసలైన అందం!
కరీనా కపూర్ : పుట్టినరోజు: సెప్టెంబర్ 21 ముద్దు పేరు: బెబో చదువు: న్యాయశాస్త్రంలో డిగ్రీ నచ్చే రంగులు: నలుపు, ఎరుపు నచ్చే ఆహారం: స్పాగెట్టీ నచ్చే నటుడు: రాజ్‌కపూర్ నచ్చే నటి: న ర్గీస్ నచ్చే పాట: రహే న రహే హమ్ (మమత-1966) నచ్చిన పుస్తకం: మాస్టర్ ఆఫ్ ద గేమ్ (సిడ్నీ షెల్డన్) * మిమ్మల్ని ఎలా నిర్వచించవచ్చు? నేనెక్కువ పాజిటివ్‌గానే ఆలోచిస్తాను. ఒక మనిషి గురించి గానీ, ఒక విషయం గురించి గానీ చెడుగా ఆలోచించడం నచ్చదు నాకు. ఒక్కమాటలో చెప్పాలంటే... నేను చాలా ఫెయిర్ ఇండ్ పాజిటివ్ పర్సన్‌ని. * ఫ్యాషన్ అంటే ఏమిటో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలంటారు అందరూ. దీనికేమంటారు? నిజానికి నాకంటే మోడ్రన్‌గా ఉండేవాళ్లు చాలామంది ఉన్నారు. ఫ్యాషన్ గురించి నాకంటే బాగా తెలిసినవాళ్లు బోలెడంతమంది ఉన్నారు. నేను నాకు నప్పేది వేసుకుంటాను తప్ప ఏదో ట్రెండ్ సెట్ చేసేయాలన్న తపన ఏమీ లేదు నాకు. * మీ దృష్టిలో అసలైన ఫ్యాషన్ ఏది? ఫ్యాషన్ అంటే చిత్ర విచిత్రమైన దుస్తులు, హెయిర్ స్టయిల్స్ కాదు. సహ జత్వమే అసలైన అందం. మన మేకప్ మన ఒరిజినాలిటీని కప్పేయకూడదు. ఎంత సింపుల్‌గా ఉంటే అంత అందంగా ఉంటాం అన్నది నేను నమ్ముతాను. * అంటే, మీరు అంతగా తయారవరా? ఎందుకవను! ఫ్యాషన్ షోల్లో ర్యాంపు మీద నడవాల్సి వచ్చినా, ఫంక్షన్లప్పుడు కూడా అందుకు తగ్గట్టుగా రెడీ అవుతాను. మిగతా సమయాల్లో అసలు మేకప్పే సరిగ్గా వేయను. * సైఫ్ మాత్రం వయసు పెరిగేకొద్దీ ఇంకా ఫిట్‌గా, స్టైల్‌గా తయారవుతున్నట్టున్నారే? అవును నిజమే. తను రెడ్‌వైన్ లాంటివాడు. కాలం గడిచేకొద్దీ హాట్ అవుతుంటాడు. తనదంతా అదో తరహా. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోడు. ఏది ఎంత అవసరమో అంతే. అంతకుమించి జోక్యం చేసుకోవడానికి ఇష్టపడడు. పబ్లిసిటీ కోసం కూడా పాకులాడడు. అలా ఉండటం ఈ ఫీల్డ్‌లో కాస్త కష్టమే. * మీవారికి కోపమెక్కువని అంతా అంటారు. నిజమేనా? కోపం లేకుండా ఎవరైనా ఉంటారా? అలాగే తనకీ. కాకపోతే అన్నిసార్లూ చూపించడు. ఎవరైనా అతిగా విసిగిస్తే మాత్రం ఇరిటేట్ అవుతాడు. అది అందరూ చేసేదే. కానీ తను సెలెబ్రిటీ కాబట్టి అందరూ పనిగట్టుకుని తన కోపం గురించి మాట్లాడతారు. అంతేతప్ప, తను చాలా మంచివాడు. * మీ ఇద్దరి బంధం దృఢంగా ఉండటానికి మీరేం చేస్తారు? కొన్ని సంవత్సరాల పాటు అతడితో కలిసి జీవించాను. పెళ్లి అనేది సమాజానికి అవసరం కాబట్టి పెళ్లి చేసుకున్నాను. కానీ నా వరకూ నేను ఏ రోజైతే అతడికి నా మనసులో స్థానం ఇచ్చానో, అప్పుడే తనకి భార్యనైపోయానని అనుకున్నాను. కలిసివున్న అన్నేళ్లలో మా బంధం బలంగా లేదని అనిపించివుంటే అసలు మేం పెళ్లి వరకూ వెళ్లేవాళ్లమే కాదు. కాబట్టి... ఆల్రెడీ రిలేషన్ దృఢంగా ఉన్నప్పుడు ఇక చేయడానికేముంటుంది! * అతడు మీ జీవితంలోకి వచ్చాక మీలో ఏదైనా మార్పు వచ్చిందా? సైఫ్ నాకు చాలా నేర్పుతాడు. ఎలా ఉండాలో చెబుతాడు. నేను స్వతహాగా చాలా సెన్సెటివ్. ఎవరైనా చిన్న మాటన్నా ఏడ్చేస్తాను. అలా ఉండకూడదని తను చెప్పాడు. త్వరత్వరగా రియాక్టవడం మంచి లక్షణం కాదు, బాధ కలిగినా కూడా దాని గురించి బాధపడటం అవసరమా అని ఆలోచించగలగాలి, అది తెలివైన వాళ్ల లక్షణం అని చెప్పాడు. ఇప్పుడు నేను ప్రతిదానికీ ఏడవడం లేదు. * మీ అత్తవారింట్లో ఎలా ఉంటుంది? అత్తయ్య చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. తను చాలా మోడ్రన్‌గా ఆలోచిస్తారు. కోడలంటే ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి అంటూ హద్దులు పెట్టే రకం కాదావిడ. పైగా మహిళలు తమకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకోవాలి అని నమ్మే వ్యక్తి. హాలీడే ట్రిప్‌కి వెళ్లినప్పుడు తన ఎదురుగానే నేను బికినీ వేసుకుని తిరుగుతాను. కానీ ఆవిడ ఏమీ అనరు. కాబట్టి నేను చాలా అదృష్టవంతురాలైన కోడలిని చెప్పవచ్చు. * పెళ్లయ్యాక మీకు కెరీర్ మీద శ్రద్ధ ఎక్కువైనట్టు కనిపిస్తోంది? ఒక్కసారి పెళ్లయితే హీరోయిన్గా కొనసాగడం కష్టమంటారంతా. కానీ నేనలా కాకూడదనుకున్నాను. అందుకే వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిని కలపకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. అంతే తప్ప పెళ్లికి ముందు తేలిగ్గా తీసుకోవడం, పెళ్లయ్యాక ఎక్కువ శ్రద్ధ పెట్టడమనేదేం లేదు. * మరి పిల్లల సంగతి...? నేనైతే పిల్లల్ని కనడానికి ప్రస్తుతం సిద్ధంగా లేను. నా మనసు ఇంకా కెరీర్ మీదే ఉంది. ఈ ఫీల్డ్‌లో డిమాండ్ ఉన్నప్పుడే మన హవా నడుస్తుంది. అప్పుడు దాన్ని ఉపయోగించకోకపోతే మరోసారి ఆ చాన్స్ రాదు. సైఫ్ కూడా నా మాట కాదనడు కాబట్టి పిల్లల సంగతి తర్వాత ఆలోచిస్తా! -
తారాస్వరం: నేనెప్పుడూ అలానే ఆలోచిస్తా!
కాజల్ అగర్వాల్ పుట్టినరోజు: జూన్ 19 నచ్చే రంగులు: నీలం, తెలుపు, ఎరుపు నచ్చే ఆహారం: హైదరాబాద్ బిర్యానీ నచ్చే ప్రదేశాలు: కేరళ, గోవా, మారిషస్ నచ్చే కారు: బీఎండబ్ల్యూ నచ్చిన పుస్తకం: బ్రిడ్జెస్ ఆఫ్ మ్యాడిసన్ కౌంటీ నచ్చే హీరో: ఆమిర్‌ఖాన్ నచ్చే హీరోయిన్: శ్రీదేవి, కాజోల్, సుస్మితాసేన్ మీ నిక్‌నేమ్: గుడ్డా. అంటే గుడియా అన్నమాట. దానికి అర్థం బొమ్మ అని. చూడ్డానికి బొమ్మలా ఉండేదాన్నని అందరూ నన్ను అలానే పిలిచేవారు. ఫస్ట్ క్రష్: తొమ్మితో తరగతిలో ఉన్నప్పుడే ఏర్పడింది. (నవ్వుతూ) డిటెయిల్స్ అడక్కండి. ప్రభావితం చేసిన వ్యక్తి: మా అమ్మ. తను చాలా తెలివైనది. సమర్థవంతురాలు. తను నా ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్. ఎలాంటి దుస్తులు నచ్చుతాయి: నా శరీరం చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. అందుకే ఏ డ్రెస్ వేసుకున్నా నాకు బాగానే నప్పుతుంది. నాకయితే జీన్స్, టీషర్ట్స్, చీరలు ఎక్కువ ఇష్టం. అందమంటే: మనసు. అది అందంగా ఉంటే... మనకు అన్నీ అందంగా కనిపిస్తాయి. మనమూ అందరికీ అందంగా కనిపిస్తాం. అందంగా ఉండటానికి ఏం చేస్తారు: క్రమశిక్షణతో కూడిన వ్యాయామం, క్రమ పద్ధతిలో ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యాన్ని మించిన అందమేముంది! ఎందుకలా చేశానా అని ఫీలయ్యేది: మోడలింగ్ అవకాశాలు రావడంతో అటు వెళ్లిపోయాను. తర్వాత సినిమాల్లోకి రావడంతో చదువుకు దూరమయ్యాను. అనుకున్నట్టుగా ఎంబీఏ చేయలేకపోయానని ఇప్పటికీ ఫీలవుతుంటా. మర్చిపోలేని ఫోన్‌కాల్: చందమామ రిలీజ్ అయ్యాక కృష్ణవంశీ ఫోన్ చేశారు. సినిమా పెద్ద హిట్, నిన్ను అందరూ మెచ్చుకుంటున్నారు అంటూ ఆయన చెప్పిన మాటల్ని నేను మర్చిపోలేదు. బెస్ట్ ఫ్రెండ్స ఉన్నారా: ఎందుకు లేరూ! అయితే ఇండస్ట్రీలో కాదు. ముంబైలో ఉన్నారు. ఒకమ్మాయి ఇండియాలోనే ఫేమస్ డాక్టర్. ఇంకొకమ్మాయి లాయర్. నా ఫ్రెండ్సంతా మంచి పొజిషన్సలో ఉన్నారు. అందుకు చాలా సంతోషపడుతుంటా! ఎదుటివారిలో నచ్చేది, నచ్చనిది: నచ్చేది నిజాయతీ, సచ్చీలత; నచ్చనిది హిపోక్రసీ. మీలో మీకు నచ్చేది: ఎప్పుడూ అవతలివారి స్థానంలో నిలబడి ఆలోచిస్తాను. వారి పరిస్థితిని అర్థం చేసుకుని నడచుకుంటాను. మీలో మీకు నచ్చనిది: అందరికీ త్వరగా దగ్గరైపోతాను. వాళ్లు దూరమైతే బాధపడిపోతాను. ఎదుటివాళ్లు తప్పుగా అనుకునేది: నేను కాస్త గట్టిగా మాట్లాడతాను. దాంతో అరిచినట్టు అనిపిస్తుంది. యాటిట్యూడ్ ప్రాబ్లెమ్ వల్ల అలా డామినేటింగ్‌గా మాట్లాడతానని, నాకు పొగరని అనుకుంటారు కొందరు. కానీ అది నిజం కాదు. మీ గురించి ఎవరికీ తెలియనిది: నేను చాలా చిన్న వయసులోనే నటినయ్యానన్న విషయం చాలామందికి తెలియదు. నా తొలిచిత్రం ‘క్యూం... హోగయానా’ చేసేటప్పటికి నా వయసు పదమూడు. ఊరికే సరదాగా చేసిన సినిమా అది. అత్యంత బాధపెట్టే విషయం: సిగ్నల్స్ దగ్గర కారు ఆగినప్పుడు చాలామంది పిల్లలు వచ్చి అడుక్కుంటూ ఉంటారు. కొంత మంది అయితే గబగబా కారు తుడిచేసి, డబ్బులిమ్మని చేతులు చాపుతారు. వాళ్లని చూస్తే మనసు అదోలా అయిపోతుంది. దేవుడిపై నమ్మకం: చాలా ఉంది. మా ఇంట్లో రోజూ పూజ చేస్తాం. పండుగలప్పుడు ప్రత్యేక పూజలు ఉంటాయి. మాకు దసరా చాలా స్పెషల్. అందరం కలిసి ఘనంగా జరుపుకుంటాం. ఒకవేళ అప్పటికి నేను షూటింగ్లో ఉంటే యూనిట్ సభ్యులతో కలసి చేసుకుంటాను. అంతేకానీ, ఆ పండుగను మాత్రం మిస్సవను. నమ్మే సిద్ధాంతం: సక్సెస్ అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. నీ చేయి జారిపోకుండా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. మళ్లీ జన్మంటూ ఉంటే: నేను పునర్జన్మను నమ్మను. కర్మఫలాన్ని నమ్ముతాను. మనకున్నది ఈ ఒక్క జన్మే అని భావించి, అందరూ మంచిగా ఉంటే ఏ సమస్యలూ ఉండవని నా అభిప్రాయం!