తారాస్వరం: ఆరుసార్లు పెళ్లి చేసుకుంటా... - ప్రియాంకాచోప్రా
చరణ్ దొరకడం నా అదృష్టం: టాలీవుడ్‌లో నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ‘తుఫాన్’తో ఆ చాన్స్ వచ్చింది. అయితే తెలుగులో మాట్లాడ్డానికి నానా తంటాలు పడ్డాను. కాస్త పెద్ద డైలాగులు చెప్పాల్సి వచ్చినప్పుడు ఒకటే టెన్షన్. రామ్‌చరణ్ హెల్ప్ చేశాడు కాబట్టి సరిపోయింది కానీ, లేదంటే మామూలుగా కష్టపడేదాన్ని కాదు. అలాంటి మంచి కో స్టార్ దొరకడం నా అదృష్టం.
నేను భారతీయురాలిని. అదే సమయంలో విదేశీయురాలిని కూడా. ఇలా ఎందుకంటున్నానంటే... నేను సగం అమెరికాలో పెరిగితే, సగం మన దేశంలో పెరిగాను. అందుకే రెండు రకాల సంస్కృతులకూ అలవాటు పడ్డాను. అయితే నాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది భారతీయ సినిమాయే కాబట్టి... మొదటి స్థానం ఇండియాదే.
నేను చాలా మొండిదాన్ని. చేయాలనుకున్నదాని అంతు చూశాకే వదులుతాను. ఆ లక్షణమే నా జీవితాన్ని మలిచింది. అయితే ఎవరి మాటా విననని కాదు. వింటాను. కానీ నిర్ణయం నా మనసు చెప్పినట్టే తీసుకుంటాను!
నాకు చిన్నప్పట్నుంచీ సింగర్‌ని కావాలని కోరిక. కానీ అనుకోకుండా నటినయ్యాను. అయితే ఆ కోరిక ఇప్పటికీ అలానే ఉంది. అందుకే ఈ మధ్య మ్యూజిక్ ఆల్బమ్ చేశాను. ఇంకా చేస్తాను. అంతకంటే నేను కోరుకునేది... సినిమాలకు పాడాలని. నా సినిమాలకు మాత్రమే కాదు... ఇతర హీరోయిన్లకు కూడా పాడాలని ఉంది.
ఈ ఫీల్డ్‌లో ఎదగడం అంత ఈజీ కాదు. ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతాయి. ఎన్నో అవమానాలు ఎదురవుతాయి. నన్ను కూడా మొదట్లో కొందరు చాలా అవమానించారు. బాధపెట్టారు. ఎవరికీ చెప్పుకోలేక ఒంటరిగా కూర్చుని ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ దేవుడి దయవల్ల నేను గెలిచాను. ఈ రోజు ఈ పొజిషన్‌లో ఉన్నాను.
నాకంటూ ఓ జీవితం ఉంది. దాన్ని అందరి ముందూ పరచడం నాకు నచ్చదు. ముఖానికి మేకప్ వేసినప్పుడు మాత్రమే ప్రియాంక నటి. అది తీశాక ఆమె ఓ సామాన్యమైన అమ్మాయి. ఇలా ఉండటానికే నేను ఇష్టపడతాను!
ఎంత సంపాదించినా పక్కవాడి కోసం ఒక రూపాయి ఖర్చు పెట్టలేకపోతే ఆ సంపాదనకు అర్థం ఉండదు. నా తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లే. ఓ అంబులెన్సులో ఎక్విప్‌మెంట్, మందులు వేసుకుని గ్రామాలకు వెళ్లేవారు. పేదవాళ్లకి ఉచితంగా పరీక్షలు చేసి మందులిచ్చేవారు. నేను కూడా వాళ్లతో వెళ్లేదాన్ని. నా డ్యూటీ ఏంటో తెలుసా... అమ్మానాన్నలు చెప్పిన మందుల్ని లెక్కపెట్టి ఇవ్వడం. అప్పుడనిపించేది... ప్రపంచంలో ఇంతమంది పేదవాళ్లు ఉన్నారా, ఈ పరిస్థితిని ఎవరూ మార్చలేరా అని. చిన్నదాన్ని కావడంతో అప్పుడేమీ చేయలేకపోయాను. కానీ ప్రపంచ సుందరి కిరీటం అందుకోగానే సమాజం కోసం ఏదైనా చేయగల స్థాయికి చేరుకున్నానని అనిపించింది. వెంటనే యునిసెఫ్‌తో కలిసి పని చేయడం మొదలుపెట్టాను. ఇప్పటికీ చేతనైనంత చేస్తూనే ఉన్నాను.
ఊహ తెలిసిన తర్వాత ఏ రోజూ ఫెయిల్యూర్‌కి భయపడలేదు నేను. ముఖ్యంగా సినీ పరిశ్రమలో జయాపజయాలు మన చేతుల్లో ఉండవు. ఒకవేళ సినిమా పోయినా దానికి మనమొక్కరిమే బాధ్యులం కాము. కాబట్టి నేనేనాడూ హిట్టు, ఫ్లాపుల గురించి ఆలోచించను.
నాకు రోల్ మోడల్స్ అంటూ ఎవరూ లేరు. నాకు నేను కష్టపడి పైకొచ్చాను. అయితే బియాన్స్ నోల్స్‌ని చాలా ఇష్టపడతాను. వ్యక్తిగత జీవితాన్నీ, వృత్తి జీవితాన్నీ ఆమె బ్యాలన్స్ చేసుకునే తీరు ఎంతో బాగుంటుంది. ఆ విషయంలో ఆమెను స్ఫూర్తిగా తీసుకుంటాను.
అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. టైమొచ్చినప్పుడు, తగినవాడు దొరికినప్పుడు చేసుకుంటా. అయితే మొత్తం ఆరుసార్లు చేసుకుంటాను. అంబాలాలోని మా తాతగారి ఇంట్లో ఓసారి, ఆస్ట్రేలియాలో సముద్రపు నీటి అడుగున ఒకసారి, లాస్ వేగాస్ చర్చిలో ఓసారి, స్విట్జర్లాండులోని లొకార్నో చర్చిలో ఓసారి, జర్మనీలో కొండ మీద ఓసారి, ఇటలీలో ఓసారి... ఇలా ఆరుసార్లు పెళ్లాడుతా. కానీ వరుడు మాత్రం ఒక్కడేనండోయ్!
నేను విధిని నమ్ముతాను. చీమ కుట్టినా దాని వెనుక దేవుడి ఆజ్ఞ ఉందనుకుంటాను. అందుకే భవిష్యత్తు గురించి బెంగపడను. ఈరోజు ఇక్కడ ఉండాలని నిర్ణయించిన దేవుడే రేపు నేనెక్కడుండాలో డిసైడ్ చేస్తాడు. ఇక నేనెందుకు అనవసరంగా ఆలోచించి టెన్షన్ పడటం!