‘మాంగ్ మే సింధూర్’ అడిగే హీరోయిన్‌లు మాయమైపోయారు. ‘కర్‌వా చౌత్’ అంటూ వ్రతాలు చేసే హీరోయిన్‌లూ ఔట్ డేట్ అయిపోయారు. గతంలో ‘బికిని’ వేసుకుంటే బోల్డ్‌గా చేసింది అనేవారు. నేడు డార్క్ సైడ్ ఆఫ్ ది లైఫ్‌ను చూపించే పాత్ర చేస్తే బోల్డ్ అంటున్నారు. సరైన పాత్ర దొరికితే రొటీన్‌కు మారో గోలి అంటున్నారు.
నాలుగు డైలాగులు చెప్పాలి అయిదు పాటల్లో గెంతాలి. బ్రెయిన్ ఉన్నా ఉపయోగించకూడదు. బుజ్జి బుజ్జి మాటలు.. ముద్దు ముద్దు చేష్టలతో కథానాయకుడి ప్రాపకం కోసం పాకులాడుతూ ఉండాలి. ప్రేమ పేరుతో వెంటబడాలి. హీరో చిరాకు పడుతూ చీదరించుకుంటుంటే వానపాటల్లో తడుస్తూ అతగాడిని అలరించడానికి తడవాలి! ఇంకెన్నాళ్లీ బోరింగ్ హీరోయిన్స్ రోల్స్‌ను మోయాలి? అందుకే నో ... చెప్పారు కొందరు కథానాయికలు. ప్రాధాన్యమున్న పాత్రలను ఆశిస్తున్నారు. స్క్రిప్ట్ డిమాండ్‌ను బట్టి బోల్డ్‌గా నటించేందుకూ డిసైడ్ అయ్యి బాక్సాఫీస్ కలెక్షన్స్ పెంచుతున్నారు. రెమ్యునరేషన్‌ను శాసించే స్థాయికి ఎదుగుతున్నారు. అలాంటి బోల్డ్ నిర్ణయాలు తీసుకుంటున్న హీరోయిన్స్ ఇప్పుడు బోలెడుమంది. అందరికీ తెలిసిన కొందరి గురించి బ్రీఫ్ నరేషన్...
డర్టీ పిక్చర్.. గ్రేట్ ఐడెంటిటీ
‘పరిణీత’తో హిందీ సినిమా సఫర్ షురూ చేసినా విద్యాబాలన్‌కు గుర్తింపు వచ్చింది మాత్రం ‘డర్టీ పిక్చర్’తోనే. తెలుగు నటి సిల్క్ స్మిత బయోగ్రఫీ అంటూ వచ్చిన ఆ సినిమాలో సిల్క్ స్మితగా నటించి విద్యాబాలన్ న్యూస్ క్రియేట్ చేసింది. సౌత్ ఇండస్ట్రీలో బొద్దుగా ఉండే హీరోయిన్స్‌కే క్రేజ్ కనుక సిల్క్ స్మిత కూడా బొద్దుగా ఉండేది కనుక డర్టీ పిక్చర్ కోసం బరువు పెరిగింది విద్యా. ‘ఊలాలా... ఊలాలా’ అంటూ ప్రేక్షకులను వేడెక్కించే స్టెప్పులేసింది. ‘ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌టైన్‌మెంట్’ అంటూ గారాలు పోతూ ఆమె చెప్పిన డైలాగులు విద్యను వ్యాంప్‌గా నిలబెట్టలేదు. ఆమెలోని నటినే పరిచయం చేశాయి. ఆమెది డర్టీ డెసిషనే కాదు అని నిరూపించాయి. ఆ తర్వాత ‘ఇష్కియా’, ‘కహానీ’, ‘బేగంజాన్’, ‘తుమ్హారీ సులూ’ వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ రోల్స్ ఆమె వెంటపడ్డాయి! అవార్డుల పంట పండించి.. ఆమెకు గ్రేట్ ఐడెంటిటీ ఇచ్చాయి!
‘క్వీన్’ ఆన్ సిల్వర్‌స్క్రీన్...
ఇది ఎవరి గురించి ప్రస్తావనో హింట్ ఇచ్చేసినట్టే కదా! యెస్... కంగనా రనౌత్. ఆమె ఫిల్మోగ్రఫిలో మూడు నాలుగు మినహా అన్నీ ప్రత్యేకమైనవే. ‘లైఫ్ ఇన్ ఎ మెట్రో’, ‘ఫ్యాషన్’, ‘తనూ వెడ్స్ మనూ’, ‘క్వీన్’, ‘రంగూన్’.. లెక్క చేయాల్సిన సినిమాలు. ‘తనూ వెడ్స్ మనూ’లో మెట్రోపాలిటన్ సిటీ కల్చర్‌ను అడాప్ట్ చేసుకున్న కాన్పూర్ కన్సర్వేటివ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మాయిగా... దాని సీక్వెల్ అయిన ‘తనూ వెడ్స్ మనూ రిటర్న్స్’లో డీ గ్లామర్ స్పోర్ట్స్ ఉమన్‌గా ఈ గ్లామర్ క్వీన్ ఉనికి ఇండస్ట్రీలో హీరోయిన్‌ల ప్రిఫరెన్స్‌నే మార్చేసింది. ‘రంగూన్’లోనైతే కంగనా దేహం కూడా అభినయిస్తుందనే ప్రశంసలందుకుంది. ఆ బోల్డ్‌నెస్‌కే ఫిల్మ్‌ఫేర్ నుంచి నేషనల్ అవార్డ్స్ దాకా ఎన్నో పురస్కారాలు దాసోహమయ్యాయి.
చమ్మక్ చల్లో ఛమేలీ...
కన్‌ఫ్యూజ్ కావద్దు.. కరీనా కపూర్ గురించే! ఆమె మొదటి సినిమా ‘రెఫ్యూజీ’లో కరీనా పెర్‌ఫార్మెన్స్ చూసి ‘ప్చ్’ అన్నవాళ్లే ఓమ్‌కారాతో బెస్ట్ యాక్ట్రెస్ అంటూ కితాబిచ్చారు. ‘కుర్బాన్’ లో టాప్‌లెస్ అపియరెన్స్, ‘హీరోయిన్’లో లవ్ మేకింగ్ సీన్స్, అంతకుముందే ‘చమేలీ’, ఈ మధ్య ‘వీరే దీ వెడ్డింగ్’తో స్టీరియోటైప్‌ను బ్రేక్ చేసి యాక్టింగ్‌లో ఛాలెంజ్‌ను క్రియేట్ చేసింది కరీనా. బోల్డ్ అండ్ టాలెంటెడ్ అనే పేరుతెచ్చుకుంది. అవార్డ్స్ కన్నా ప్రేక్షకుల అప్లాజ్ మిన్న అనుకుంది.
డాలీ కి డోలీ..
సోనమ్ కపూర్... అనిల్ కపూర్ కూతురిగా కాకుండా ‘కపూర్’ సర్‌నేమ్ నీడ పడకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎదురైన సవాళ్లనన్నిటినీ ఎదర్కొని నిలబడ్డ నటి. ఆమె సినిమాల జాబితా చూస్తే ఎంత భిన్నమైన పాత్రలను ఎంచుకుంటుందో తెలుస్తుంది. తొలి సినిమా ‘సావరియా’ నార్మల్ ల్యాండింగే అయినా మిగతావన్నీ వేటికవే విభిన్నం. ‘డాలీ కి డోలీ’లో నిత్య పెళ్లికూతురిగా, ‘ఖూబ్‌సూరత్’లో సొంత వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిగా, ‘వీరే దీ వెడ్డింగ్’లో పెళ్లికి ముందే సెక్స్‌ను ఎక్స్‌పీరియెన్స్ చేసిన యువతిగా నటించి ఏ హీరోయిన్ చేయని సాహసం చేసింది సోనం కపూర్.
అనార్కలీ ఆఫ్ ఆరా
స్వరాభాస్కర్ అని తెలిసే ఉంటుంది. ఎరోటిక్ ఫోక్ డాన్సర్‌గా కనిపిస్తుంది ‘అనార్కలీ ఆఫ్ ఆరా’ లో స్వర. అది బోల్డ్ రోల్ కాదు.. గ్లామరస్ అపియరెన్స్ మాత్రమే అని అంటుంది ఆమె. నచ్చని విషయాన్ని ముక్కు పగలగొట్టినట్టే చెప్తుంది. కాంట్రవర్సీలకు భయపడదు. రియల్ లైఫ్‌లోని ఈ గుణమే స్క్రీన్ మీద పాత్రలను ఎంచుకునేటప్పుడూ చూపిస్తుంది స్వరా. కమర్షియల్ రోల్స్‌కి పెద్దగా తావివ్వకుండా ‘లిజన్ అమాయా’, ‘నీల్ బట్టే సన్నాట’, ‘వీరే ది వెడ్డింగ్’ లాంటి మల్టీప్లెక్స్‌కే స్కోప్ ఇస్తోంది. ఇవన్నీ గ్లామర్ గ్రామర్ లేనివే. అంత ధైర్యం లేకపోతే ‘వీరే దీ వెడ్డింగ్’లో స్వయంతృప్తి చెందే సీన్‌లో ఎలా నటించగలదు?
లస్ట్ స్టోరీస్..
అనగానే ముందు గుర్తొచ్చే పేరు రాధికా ఆప్టే. ఆ సినిమాలోని ఫస్ట్ స్టోరీలో నటించింది ఆమె. స్టూడెంట్ పట్ల లస్ట్ ఉన్న టీచర్‌గా. దీనికి నిజంగానే గట్స్ ఉండాలి. ఉన్నాయని ప్రూవ్ చేసుకుంది రాధికా ఆప్టే. అంతేకాదు పాపులర్ బ్యానర్స్ నుంచి చాన్స్‌లు వస్తున్నప్పుడే ‘అహల్య’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించి యాక్టింగ్ నో బార్ అని చూపింది. తర్వాత ‘ఫోబియా’ లాంటి ఆఫ్‌బీట్ సినిమాలను, నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌నూ సీరియస్‌గా తీసుకుంది. ఎంతో బోల్డ్‌గా ఉంటే తప్ప ఇంత వెర్సటాలిటీ ప్రదర్శించలేరు.
లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా
అరవైఏళ్ల రత్నా పాఠక్ షా తీసుకున్న డేర్‌స్టెప్ ‘లిప్‌స్టిక్ అండర్ మై బురా’్ఖలోని ఆమె పాత్ర. ఏటికి ఎదురీదే గుణంతో పాటు నటననూ వారసత్వంగా తీసుకుంది రత్న.. ఆమె తల్లి దీనా పాఠక్ నుంచి. కెరీర్ తొలినాళ్లలో ప్యార్‌లల్ సినిమాల్లోనే ఎక్కువగా నటించింది. సెకండ్ ఇన్నింగ్స్‌ను కమర్షియల్ మూవీస్‌తో స్టార్ట్ చేసింది. ఈ మలిప్రారంభమే ఆమెలోని బోల్డ్‌నెస్‌కు ప్రతీక. ఇక లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా సినిమాలోనైతే ఫాంటసీల్లో బతుకుతున్న యాభై ఏళ్ల విడోగా జీవించి సినీ క్రిటిక్స్‌తో చప్పట్లు కొట్టించింది. వీళ్లేకాక ప్రియాంక చోప్రా, కొంకణ్ సేన్ శర్మ, హుమా ఖురేషి, రీచా చద్దా, నేహా ధుపియా లాంటి హీరోయిన్సూ మూసకు భిన్నంగా నటించినవారే. షబానా ఆజ్మీ లాంటి ఆ తరం హీరోయిన్స్ కూడా కథను అనుసరించి బోల్డ్ క్యారెక్టర్స్ చేశారు. దీపా మెహతా ‘ఫైర్’లో షబానా ఆజ్మీ, నందితా దాస్ లెస్బియన్స్‌గా నటించారు. ఇదీ బోల్డ్ స్టోరీ. బోల్డ్ అంటే ఈ నటీమణుల విషయంలో స్ట్రాంగ్ అనే. డాన్సింగ్ డాల్ కాన్సెప్ట్‌కు ఎండ్ పలికి ఫీమేల్ ప్రొటాగనిస్ట్ స్టోరీస్‌కు డిమాండ్ పెంచాలనే. కథకు అవసరమైతే బోల్డ్‌సీన్స్ ఓకే అంటున్నారు ఈ స్ట్రాంగ్, బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ లేడీస్.
– శరాది
Comments
Please login to add a commentAdd a comment