అనార్కలీకి అరవై ఏళ్లు | Sixty Years For Anarkalis | Sakshi
Sakshi News home page

అనార్కలీకి అరవై ఏళ్లు

Published Wed, Aug 5 2020 1:25 AM | Last Updated on Wed, Aug 5 2020 5:25 AM

Sixty Years For Anarkalis - Sakshi

ఆమెకు క్లాసికల్‌ డాన్స్‌ రాదు. నేర్చుకొని ‘ప్యార్‌ కియాతో డర్నా క్యా’ అంది. దిలీప్‌ కుమార్‌తో మాటలు లేవు. తెర మీద అతనిపై ఎంతో ప్రేమ ప్రదర్శించగలిగింది. హృద్రోగి. నిజమైన ఇనుప సంకెలలు ధరించి డైలాగులు చెప్పి సొమ్మసిల్లి పడిపోయింది. ఆమె చూపిన ఫ్యాషన్‌ నేటికీ అనార్కలీ డ్రెస్‌గా ఉనికిలో ఉంది. మధుబాల. భారతీయుల అపురూప అనార్కలీ. ‘మొఘల్‌–ఏ–ఆజమ్‌’ రిలీజయ్యి నేటికి సరిగ్గా 60 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఓ జ్ఞాపకం.

‘మొఘల్‌–ఏ–ఆజమ్‌’ కోసం అనార్కలీ పాత్ర మొదట నర్గీస్‌కు వెళ్లింది. కుదరలేదు. ఆనాటి సింగింగ్‌ సూపర్‌స్టార్‌ సురయ్యకు వెళ్లింది. ఆమెకూ కుదరలేదు. దాని కోసం మధుబాల జన్మెత్తి ఉన్నప్పుడు ఆ పాత్ర ఆమె దగ్గరకు వెళ్లడమే సబబు. మధుబాల అనార్కలీగా నటించింది. ఆ పాత్రకు తన సౌందర్యం ఇచ్చింది. ఆ పాత్రలోకి తన కళాత్మక ఆత్మను ప్రవేశపెట్టింది. మీకు గుర్తుందో లేదో. మధుబాల కేవలం 36 ఏళ్ల వయసులో చనిపోయింది. కాని నేటికీ జీవించే ఉంది. ఆమె చేసిన అనార్కలీ పాత్ర ఆమెను జీవింప చేస్తూనే ఉంది.

అక్బర్‌ కుమారుడు జహంగీర్‌ (ముద్దుపేరు సలీమ్‌) తన రాజాస్థానంలో ఉన్న అనార్కలీ అనే నాట్యకత్తెతో ప్రేమలో పడ్డాడట. అలాగని దానికి ఎటువంటి చారిత్రక ఆధారం లేదు. కాని ప్రజలు ఆ ప్రేమకథను ఎంతో మక్కువగా చెప్పుకుంటూ వచ్చారు. 1920లో ఈ కథ మొదటిసారి ఉర్దూలో నాటకంగా వచ్చింది. ఆ నాటకం ఆధారంగా అనేక సినిమాలు వచ్చాయి. బీనారాయ్‌ అనార్కలీగా ‘అనార్కలీ’ సినిమా వచ్చి– ఏ జిందగీ ఉసీకి హై పాట గుర్తుందా– హిట్‌ అయ్యింది కూడా. కాని దర్శకుడు కె.ఆసిఫ్‌ చాలా పెద్దగా, అట్టహాసంగా, నభూతోగా ఈ ప్రేమకథను తీయదలిచాడు. ఎంత పెద్దగా అంటే ఆరేడు లక్షల్లో సినిమా అవుతున్న రోజుల్లో కోటి రూపాయలు ఖర్చు పెట్టి తీసేంతగా. అందుకు సలీమ్‌గా దిలీప్‌ కుమార్‌ను తీసుకున్నాడు. అక్బర్‌గా పృధ్వీరాజ్‌ కపూర్‌ను తీసుకున్నాడు. అనార్కలీగా మధుబాలని.

హాలీవుడ్‌లో మార్లిన్‌ మన్రో ఉంది. మధుబాలను ఇండియన్‌ మార్లిన్‌ మన్రో అని పిలిచేవారు. వీనస్‌ క్వీన్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా అని ఆమె బిరుదు. ‘మహల్‌’, ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ 55’, ‘చల్తీ కా నామ్‌ గాడీ’... తెర మీద ఆమె ఒక అందమైన ఆకర్షణగా ఉంది. నిజానికి ఆమె నటనకు సవాలుగా నిలిచే సినిమా అంతవరకూ లేదనే చెప్పాలి. ‘మొఘల్‌–ఏ–ఆజమ్‌’తో ఆ అవకాశం వచ్చింది. దానిని ఆమె ఒక సవాలుగా స్వీకరించింది. మధుబాలకు పుట్టుక నుంచి గుండెకు సంబంధించిన సమస్య ఉంది. దానిని తర్వాతి కాలంలో గుర్తించినా వైద్యం ఏమీ లేక ఊరుకున్నారు.

అయినప్పటికీ ఆ మగువ గుండె అనంత భావఘర్షణలను ఎదుర్కోవాల్సి వచ్చింది. దిలీప్‌కుమార్‌ ఆమెను వివాహం చేసుకోదలిచాడు. కాని అందుకు మధుబాల తండ్రి అడ్డుపడ్డాడు. అంతే కాదు వీళ్ల గొడవ కోర్టు కేసుల వరకూ వెళ్లింది. ఇద్దరూ తీవ్ర వ్యతిరేక భావనతో విడిపోయారు. ఇవన్నీ మొఘల్‌–ఏ ఆజమ్‌ నిర్మాణం జరిగిన సుదీర్ఘకాలం (1948–60) ల మధ్యే జరిగాయి. మొఘల్‌–ఏ–ఆజమ్‌ షూటింగ్‌ సమయంలో కొన్ని ఇంటిమేట్‌ సన్నివేశాలలో కూడా వారిద్దరి మధ్య మాటలు లేవు. కాని తెర మీద అవేమీ తెలియకుండా ఇద్దరూ చేయగలిగారు. షహజాదా సలీమ్‌ కోసం ప్రాణం పెట్టే ప్రియురాలిగా తన కంటి రెప్పల మీద సకల ప్రేమనంతా అనార్కలీ అయిన మధుబాల నింపుకోగలిగింది. 

మధుబాల క్లాసికల్‌ డాన్సర్‌ కాదు. కాని సినిమాలో ఆమె కృష్ణుడి ఆరాధన గీతం ‘మొహె ఫంగట్‌ పే’ పాటలో శాస్త్రీయ నృత్యం చేయాల్సి వచ్చింది. నాటి ప్రసిద్ధ కథక్‌ ఆచార్యుడు కిష్షు మహరాజ్‌ దగ్గర నేర్చుకుని చేసింది. ఇక చరిత్రాత్మకమైన ‘ప్యార్‌ కియాతో డర్నా క్యా’ పాటలో ఆమె మెరుపు వేగంతో పాదాలను కదిలించి, చురకత్తుల కంటే వాడిగా చూపులను విసిరి అక్బర్‌ పాదుషానే కాదు ప్రేక్షకులను కూడా కలవర పరుస్తుంది. ఇటు ప్రియుడి ప్రేమను వదలుకోలేక అటు రాచవంశానికి తుల తూగలేక ఇద్దరు పురుషుల మధ్య నలిగిపోయే పాత్రలో మధుబాల ప్రేక్షకులను సతమతం చేస్తుంది.
దర్శకుడు కె.ఆసిఫ్‌ పర్‌ఫెక్షనిస్టు. అతను ఈ సినిమా కోసం మొదటిసీనులోనే రాజస్తాన్‌ ఎడారిలో పృథ్వీరాజ్‌ కపూర్‌ను ఉత్తపాదాలతో నడిపించాడు. మధుబాలాను అట్ట సంకెళ్లు వేసుకొని కారాగారంలో నటించడాన్ని అనుమతించలేదు. నిజమైన ఇనుప సంకెళ్లనే వేశాడు. ఆ సంకెళ్లు ఆమె లేలేత చర్మాన్ని కోసేవి. ఆ బరువుకు ఆమె సొమ్మసిల్లేది. అయినా సరే... ఆ పాత్ర కోసం ప్రాణాన్ని ఉగ్గబట్టుకుని నటించింది. ‘నీ చివరి కోరిక ఏమిటో కోరుకో’ అని అక్బర్‌ అడిగితే ‘ఒక్క రోజైనా మొఘల్‌ సామ్రాజ్యపు సింహాసనానికి రాణిగా ఉండాలని ఉంది’ అంటుంది అనార్కలీ. ‘నీ అల్పబుద్ధి మానుకున్నావు కాదు’ అంటాడు అక్బర్‌. ‘అయ్యా... ఇది నా కల కాదు. మీ కుమారుడి కల. అతని కల అసంపూర్ణంగా ఉంచి నేను మరణించలేను’ అంటుంది అనార్కలీ.

మొఘల్‌–ఏ–ఆజమ్‌ సినిమాను ప్రేక్షకులు ఎన్నోసార్లు చూడాలి. మొత్తం సినిమా కోసం. దిలీప్‌ కోసం. మధుబాల కోసం. డైలాగ్స్‌ కోసం. పాటల కోసం. ఆగస్టు 5, 1960లో విడుదల అయిన మొఘల్‌ ఏ ఆజమ్‌ భారతీయ సినిమా కలెక్షన్ల రికార్డులను కొత్తగా లిఖించింది. ఆ విజయంలో ఎవరి వాటా ఎంతైనా మధుబాల వాటా సరి సమానమైనది. అనార్కలీకి తన ప్రేమ దక్కనట్టు మధుబాలకు నిజ జీవితంలో ప్రేమ దక్కిందా... చెప్పలేము. గాయకుడు కిశోర్‌ కుమార్‌ను వివాహం చేసుకుని చేసిన 9 సంవత్సరాల కాపురం పెళుసైనది. సుకుమారి అయిన మధుబాల గుండె జబ్బుతో గువ్వంతగా మారి 1971లో మరణించింది. అమె వల్ల అనార్కలీ అనార్కలీ వల్ల ఆమె సజీవమవుతూనే ఉంటారు. ఆమె స్మృతికి కొన్ని అక్షర దానిమ్మ మొగ్గలు. ఇష్క్‌ మే జీనా ఇష్క్‌ మే మరనా ఔర్‌ అబ్‌ హమె కర్‌నా క్యా జబ్‌ ప్యార్‌ కియాతో డర్నా క్యా – సాక్షి ఫ్యామిలీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement