sixty years
-
అరవైలో అల్లికలు
అభిరుచి ఏ వయసులోనైనా మనకు ఆదాయ వనరుగా మారవచ్చు. గుర్తింపును తీసుకురావచ్చు. ఈ మాటను ‘లక్ష’రాల నిజం చేసి చూపుతోంది ఆరు పదుల వయసులో ఉన్న కంచన్ భదానీ అనే గృహిణి. జార్ఖండ్ రాష్ట్రంలో ఉండే కంచన్ ఏడాది క్రితం వరకు గృహిణి. ఇప్పుడు వ్యాపారవేత్తగా మారింది. అదీ తనకు బాగా నచ్చిన అల్లికల బొమ్మలతో. యేడాదిలోనే రూ.14 లక్షల రూపాయలు సంపాదించడమే కాకుండా, యాభై మంది గిరిజన మహిళలకు ఉపాధి కల్పిస్తూ తన సత్తా ఏంటో నిరూపించింది. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న కంచన్కు వచ్చిన ఈ ఆలోచన గురించి ఎవరైనా అడిగితే ఎన్నో విషయాలు వెలిబుచ్చుతుంది. ‘‘వస్త్ర పరిశ్రమ ఎంతో వేగవంతంగా మారిపోతోంది. అయినా ఇప్పటికీ ఇళ్లలో చేతితో కుట్టే ఎంబ్రాయిడరీకి, అల్లిన వస్తువులకు ఎనలేనంత డిమాండ్ ఉంది. ఒకప్పుడు తల్లులు, అమ్మమ్మలు చాలా సాధారణంగా రోజువారీ ఇంటి పనులు పూర్తి చేసిన తర్వాత టేబుల్ క్లాత్‌లు, సోఫా కవర్లు, బొమ్మల వరకు అనేక అలంకార వస్తువులను తయారుచేసేవారు. అలాంటి వస్తువులు కాలక్రమంలో తగ్గిపోతున్నాయి. ఇది గమనించే 2021లో ‘లూప్హూప్’ పేరుతో క్రోచెట్ బొమ్మల యూనిట్‌ను స్టార్ట్ చేశాను. దీనికి ముందు 50 మంది గిరిజన మహిళలకు క్రోచెట్ కళలో శిక్షణ ఇచ్చి, వారికి వర్క్స్ ఇస్తుండేదాన్ని. కోల్‌కతాలో పుట్టిన పెరిగిన నేను మా అమ్మమ్మ, అత్తలు తయారుచేసే క్రోచెట్ బొమ్మలు, టేబుల్ క్లాత్ తయారు చేయడం చూసి నేర్చుకున్నాను. ఆ రోజుల్లో ప్రతి ఆడపిల్లకు కుట్లు, అల్లికలు నేర్పేవారు. ► స్కూల్లోనూ నైపుణ్యం.. ఇంట్లోనే కాదు, స్కూల్లోనూ క్రోచెట్ వస్తువుల తయారీలో శిక్షణ ఉండేది. దీంతో ప్రాక్టీస్ బాగా అయ్యింది. పెళ్లయ్యాక పట్టణప్రాంతానికి వెళ్లాల్సి రావడం, బాధ్యతలు పెరగడంతో పై చదువులకు వెళ్లలేకపోయాను. కానీ, వచ్చిన క్రోచెట్ కళను ఇష్టంగా చేస్తుండేదాన్ని. మా వారి ఉద్యోగరీత్యా మేం జార్ఖండ్‌లోని జుమ్రీ తెలయాకు మారినప్పుడు అక్కడ గిరిజన స్త్రీలను చూశాను. వారు గనులలో పనులు చేసేవారు. రోజువారి కూలీ ఏ మాత్రం వారికి సరిపోదు. వారి బాధలను చూసి, ఏదైనా మార్పు తీసుకురాగలిగితే బాగుంటుందని ఆలోచించేదాన్ని. ఏదైనా చేస్తాను అనుకుంటాను, కానీ, ఏం చేయాలో కచ్చితంగా తెలిసేది కాదు. ► కుటుంబ బాధ్యతలలో.. ముగ్గురు పిల్లల తల్లిగా నాకు ఇంటి బాధ్యతలు ఎక్కువే ఉండేవి. ఎప్పుడూ తీరికలేకుండా ఉండేదాన్ని. దీంతో నా సామాజిక ఆకాంక్షలపై దృష్టి పెట్టలేకపోయేదాన్ని. పిల్లలు పెద్దయ్యి, వారి జీవితాల్లో స్థిరపడ్డాక నా అభిరుచిని కొనసాగించాలనే ఆలోచన పెరిగింది. క్రోచెట్ నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న మహిళలకు అప్పుడప్పుడు క్లాసులు తీసుకునేదాన్ని. 2021లో మా పిల్లలతో కూర్చొని చర్చిస్తున్నప్పుడు ఈ క్రోచెట్ బొమ్మల తయారీ పెద్ద ఎత్తున చేసి, అమ్మకాలు జరిపితే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. ► సోషల్ మీడియాలో.. క్రోచెట్ బొమ్మల అమ్మకాలను ఆన్లైన్ ద్వారా చేయాలనే ఆలోచనతో వెబ్సైట్, సోషల్ మీడియా సెటప్స్కి మా పిల్లలు సాయం చేశారు. నేను గిరిజన మహిళలకు క్రొచెట్ వర్క్ నేర్పిస్తూ, వారితో ఈ బొమ్మలను తయారుచేయిస్తుంటాను. యాభై మంది గిరిజన మహిళలు తమ ఇళ్ల వద్దే ఉంటూ సౌకర్యంగా ఈ పనులు చేస్తుంటారు. నా దగ్గర కావల్సిన మెటీరియల్ తీసుకెళ్లి, బొమ్మలతో వస్తారు. ఒక్కొక్కరు రోజుకు 2–3 గంటల క్రోచెట్ అల్లిక చేస్తే నెలకు ఐదు వేల రూపాయలు వస్తాయి. మా జట్టులో ఉండే కొందరు నెలలో 30 బొమ్మలకు పైగా చేస్తారు. దీంతో ఇంకొంత ఆదాయం పెరుగుతుంది. ఆ విధంగా ఏడాది కాలంలో మూడు వేల బొమ్మలను అమ్మగలిగాను. పద్నాలుగు లక్షల రూపాయలు సంపాదించగలిగాను. చదువుకునే పిల్లలు, తీరిక ఉండే గృహిణుల్ని ఈ పనిని ఎంచుకుంటున్నారు. ► మృదువైన బొమ్మలు తాబేళ్లు, కుందేళ్లు, ఆక్టోపస్‌లు, ఏనుగులు, మనుషుల బొమ్మలు వీటిలో ప్రధానంగా ఉంటాయి. వెబ్సైట్, సోషల్‌మీడియా, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలోనూ ఈ బొమ్మలు అందుబాటులో ఉన్నాయి. ఏ పదార్థాలనూ వృథా చేయకుండా ఉన్నితో వీటిని తయారుచేస్తాం. పసిపిల్లలు వీటితో ఆడుకోవడం చాలా ఇష్టపడతారు. ఆదివాసీ సమాజం కోసం ఏదైనా చేయాలన్న నా కల ఇలా తీరడం సంతోషంగా ఉంది. ఏదైనా పనిని ప్రారంభించడానికి అభిరుచి ఉండాలి కానీ, వయసుపైబడటం ముఖ్యం కాదని నమ్ముతున్నాను’’ అని వివరిస్తుంది కంచన్. -
అనార్కలీకి అరవై ఏళ్లు
ఆమెకు క్లాసికల్ డాన్స్ రాదు. నేర్చుకొని ‘ప్యార్ కియాతో డర్నా క్యా’ అంది. దిలీప్ కుమార్‌తో మాటలు లేవు. తెర మీద అతనిపై ఎంతో ప్రేమ ప్రదర్శించగలిగింది. హృద్రోగి. నిజమైన ఇనుప సంకెలలు ధరించి డైలాగులు చెప్పి సొమ్మసిల్లి పడిపోయింది. ఆమె చూపిన ఫ్యాషన్ నేటికీ అనార్కలీ డ్రెస్‌గా ఉనికిలో ఉంది. మధుబాల. భారతీయుల అపురూప అనార్కలీ. ‘మొఘల్–ఏ–ఆజమ్’ రిలీజయ్యి నేటికి సరిగ్గా 60 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఓ జ్ఞాపకం. ‘మొఘల్–ఏ–ఆజమ్’ కోసం అనార్కలీ పాత్ర మొదట నర్గీస్‌కు వెళ్లింది. కుదరలేదు. ఆనాటి సింగింగ్ సూపర్‌స్టార్ సురయ్యకు వెళ్లింది. ఆమెకూ కుదరలేదు. దాని కోసం మధుబాల జన్మెత్తి ఉన్నప్పుడు ఆ పాత్ర ఆమె దగ్గరకు వెళ్లడమే సబబు. మధుబాల అనార్కలీగా నటించింది. ఆ పాత్రకు తన సౌందర్యం ఇచ్చింది. ఆ పాత్రలోకి తన కళాత్మక ఆత్మను ప్రవేశపెట్టింది. మీకు గుర్తుందో లేదో. మధుబాల కేవలం 36 ఏళ్ల వయసులో చనిపోయింది. కాని నేటికీ జీవించే ఉంది. ఆమె చేసిన అనార్కలీ పాత్ర ఆమెను జీవింప చేస్తూనే ఉంది. అక్బర్ కుమారుడు జహంగీర్ (ముద్దుపేరు సలీమ్) తన రాజాస్థానంలో ఉన్న అనార్కలీ అనే నాట్యకత్తెతో ప్రేమలో పడ్డాడట. అలాగని దానికి ఎటువంటి చారిత్రక ఆధారం లేదు. కాని ప్రజలు ఆ ప్రేమకథను ఎంతో మక్కువగా చెప్పుకుంటూ వచ్చారు. 1920లో ఈ కథ మొదటిసారి ఉర్దూలో నాటకంగా వచ్చింది. ఆ నాటకం ఆధారంగా అనేక సినిమాలు వచ్చాయి. బీనారాయ్ అనార్కలీగా ‘అనార్కలీ’ సినిమా వచ్చి– ఏ జిందగీ ఉసీకి హై పాట గుర్తుందా– హిట్ అయ్యింది కూడా. కాని దర్శకుడు కె.ఆసిఫ్ చాలా పెద్దగా, అట్టహాసంగా, నభూతోగా ఈ ప్రేమకథను తీయదలిచాడు. ఎంత పెద్దగా అంటే ఆరేడు లక్షల్లో సినిమా అవుతున్న రోజుల్లో కోటి రూపాయలు ఖర్చు పెట్టి తీసేంతగా. అందుకు సలీమ్‌గా దిలీప్ కుమార్‌ను తీసుకున్నాడు. అక్బర్‌గా పృధ్వీరాజ్ కపూర్‌ను తీసుకున్నాడు. అనార్కలీగా మధుబాలని. హాలీవుడ్లో మార్లిన్ మన్రో ఉంది. మధుబాలను ఇండియన్ మార్లిన్ మన్రో అని పిలిచేవారు. వీనస్ క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమా అని ఆమె బిరుదు. ‘మహల్’, ‘మిస్టర్ అండ్ మిసెస్ 55’, ‘చల్తీ కా నామ్ గాడీ’... తెర మీద ఆమె ఒక అందమైన ఆకర్షణగా ఉంది. నిజానికి ఆమె నటనకు సవాలుగా నిలిచే సినిమా అంతవరకూ లేదనే చెప్పాలి. ‘మొఘల్–ఏ–ఆజమ్’తో ఆ అవకాశం వచ్చింది. దానిని ఆమె ఒక సవాలుగా స్వీకరించింది. మధుబాలకు పుట్టుక నుంచి గుండెకు సంబంధించిన సమస్య ఉంది. దానిని తర్వాతి కాలంలో గుర్తించినా వైద్యం ఏమీ లేక ఊరుకున్నారు. అయినప్పటికీ ఆ మగువ గుండె అనంత భావఘర్షణలను ఎదుర్కోవాల్సి వచ్చింది. దిలీప్‌కుమార్ ఆమెను వివాహం చేసుకోదలిచాడు. కాని అందుకు మధుబాల తండ్రి అడ్డుపడ్డాడు. అంతే కాదు వీళ్ల గొడవ కోర్టు కేసుల వరకూ వెళ్లింది. ఇద్దరూ తీవ్ర వ్యతిరేక భావనతో విడిపోయారు. ఇవన్నీ మొఘల్–ఏ ఆజమ్ నిర్మాణం జరిగిన సుదీర్ఘకాలం (1948–60) ల మధ్యే జరిగాయి. మొఘల్–ఏ–ఆజమ్ షూటింగ్ సమయంలో కొన్ని ఇంటిమేట్ సన్నివేశాలలో కూడా వారిద్దరి మధ్య మాటలు లేవు. కాని తెర మీద అవేమీ తెలియకుండా ఇద్దరూ చేయగలిగారు. షహజాదా సలీమ్ కోసం ప్రాణం పెట్టే ప్రియురాలిగా తన కంటి రెప్పల మీద సకల ప్రేమనంతా అనార్కలీ అయిన మధుబాల నింపుకోగలిగింది. మధుబాల క్లాసికల్ డాన్సర్ కాదు. కాని సినిమాలో ఆమె కృష్ణుడి ఆరాధన గీతం ‘మొహె ఫంగట్ పే’ పాటలో శాస్త్రీయ నృత్యం చేయాల్సి వచ్చింది. నాటి ప్రసిద్ధ కథక్ ఆచార్యుడు కిష్షు మహరాజ్ దగ్గర నేర్చుకుని చేసింది. ఇక చరిత్రాత్మకమైన ‘ప్యార్ కియాతో డర్నా క్యా’ పాటలో ఆమె మెరుపు వేగంతో పాదాలను కదిలించి, చురకత్తుల కంటే వాడిగా చూపులను విసిరి అక్బర్ పాదుషానే కాదు ప్రేక్షకులను కూడా కలవర పరుస్తుంది. ఇటు ప్రియుడి ప్రేమను వదలుకోలేక అటు రాచవంశానికి తుల తూగలేక ఇద్దరు పురుషుల మధ్య నలిగిపోయే పాత్రలో మధుబాల ప్రేక్షకులను సతమతం చేస్తుంది. దర్శకుడు కె.ఆసిఫ్ పర్ఫెక్షనిస్టు. అతను ఈ సినిమా కోసం మొదటిసీనులోనే రాజస్తాన్ ఎడారిలో పృథ్వీరాజ్ కపూర్‌ను ఉత్తపాదాలతో నడిపించాడు. మధుబాలాను అట్ట సంకెళ్లు వేసుకొని కారాగారంలో నటించడాన్ని అనుమతించలేదు. నిజమైన ఇనుప సంకెళ్లనే వేశాడు. ఆ సంకెళ్లు ఆమె లేలేత చర్మాన్ని కోసేవి. ఆ బరువుకు ఆమె సొమ్మసిల్లేది. అయినా సరే... ఆ పాత్ర కోసం ప్రాణాన్ని ఉగ్గబట్టుకుని నటించింది. ‘నీ చివరి కోరిక ఏమిటో కోరుకో’ అని అక్బర్ అడిగితే ‘ఒక్క రోజైనా మొఘల్ సామ్రాజ్యపు సింహాసనానికి రాణిగా ఉండాలని ఉంది’ అంటుంది అనార్కలీ. ‘నీ అల్పబుద్ధి మానుకున్నావు కాదు’ అంటాడు అక్బర్. ‘అయ్యా... ఇది నా కల కాదు. మీ కుమారుడి కల. అతని కల అసంపూర్ణంగా ఉంచి నేను మరణించలేను’ అంటుంది అనార్కలీ. మొఘల్–ఏ–ఆజమ్ సినిమాను ప్రేక్షకులు ఎన్నోసార్లు చూడాలి. మొత్తం సినిమా కోసం. దిలీప్ కోసం. మధుబాల కోసం. డైలాగ్స్ కోసం. పాటల కోసం. ఆగస్టు 5, 1960లో విడుదల అయిన మొఘల్ ఏ ఆజమ్ భారతీయ సినిమా కలెక్షన్ల రికార్డులను కొత్తగా లిఖించింది. ఆ విజయంలో ఎవరి వాటా ఎంతైనా మధుబాల వాటా సరి సమానమైనది. అనార్కలీకి తన ప్రేమ దక్కనట్టు మధుబాలకు నిజ జీవితంలో ప్రేమ దక్కిందా... చెప్పలేము. గాయకుడు కిశోర్ కుమార్‌ను వివాహం చేసుకుని చేసిన 9 సంవత్సరాల కాపురం పెళుసైనది. సుకుమారి అయిన మధుబాల గుండె జబ్బుతో గువ్వంతగా మారి 1971లో మరణించింది. అమె వల్ల అనార్కలీ అనార్కలీ వల్ల ఆమె సజీవమవుతూనే ఉంటారు. ఆమె స్మృతికి కొన్ని అక్షర దానిమ్మ మొగ్గలు. ఇష్క్ మే జీనా ఇష్క్ మే మరనా ఔర్ అబ్ హమె కర్నా క్యా జబ్ ప్యార్ కియాతో డర్నా క్యా – సాక్షి ఫ్యామిలీ -
ఫన్డుటాకులు
ఓ పదిమంది వృద్ధులు ఒకచోట చేరితే ఏం చేయగలరంటే టక్కున చెప్పే సమాధానం.... ‘జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు’ అని. కానీ ‘డాక్టర్ ఎ.ఎస్.రావ్ నగర్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్’ దీనికి భిన్నం. వయసు శరీరానికి కానీ, మనసుకి మంచి ఆలోచనలకు కాదంటున్నారీ ఈ అసోసియేషన్ సభ్యులు. నర్సింహారావ్, బిఎస్ నాయుడు, కె, ఆర్ శర్మ... ఈ ముగ్గురు స్నేహితులు కలిసి ఓ యాభైమంది సభ్యులతో 2001లో ఏర్పాటు చేసిన సంఘంలో ప్రస్తుతం 1,050మంది ఉన్నారు. వీరంతా వివిధ రంగాల్లో అనుభవజ్ఞులు. ‘తెల్లవారుజామున వాకింగ్‌తో మొదలయ్యే మా ప్రయాణం రాత్రి ఎనిమిదింటికి చెస్ ఆటతో ముగుస్తుంది. మధ్యలో బోలెడన్ని యాక్టివిటీస్’ అంటూ తమ సంఘం స్పెషాలిటీ గురించి చెప్పారు ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి రామ్మోహన్‌రావ్. మొన్నీమధ్యనే రాష్ట్ర ప్రభుత్వం ఈ సంఘాన్ని ‘బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అవార్డ్’తో సత్కరించింది. వాకింగ్ ట్రాక్... అసోసియేషన్‌కి ప్రత్యేక భవనం ఏర్పాటు చేసుకున్నారు. దాని చుట్టూరా వాకింగ్ ట్రాక్ కూడా ఉంది. భవనంలోపలికి అడుగుపెట్టగానే బయట వరండాలో కనిపించేవి... ఓ యాభై కుర్చీలు. మధ్యలో టీపాయ్‌పై ఓ పది రకాల న్యూస్ పేపర్లు. ఇక ముందు గదిలో లైబ్రెరీ, రెండో గదిలో పది క్యారెమ్ బోర్డులు, ఆరు చెస్ బోర్డులుంటాయి. వాకింగ్ పూర్తయ్యాక ఇంటికెళ్లి టీ, టిఫిన్స్ ముగించుకుని మళ్లీ ఇక్కడికి చేరుకుంటారు. కాసేపు న్యూస్‌పేపర్లు తిరగేసి పుస్తకం అందుకునేవాళ్లు కొందరైతే... ట్రెడ్మిల్పైకి చేరేవారు ఇంకొందరు. ఆటలంటే ఇష్టమున్నవాళ్లు క్యారమ్ బోర్డు ముందో, చెస్ బోర్డు ముందో సెటిల్ అయిపోతారు. ఇవన్నీ కాదు పురాణకాలక్షేపం కావాలనుకునేవారు బిఎస్ రావ్గారి దగ్గరికి చేరిపోతారు. ఇలా చక్కని దినచర్యని ప్లాన్ చేసుకున్నారు. నెలకో పుట్టినరోజు... నెలమొత్తంలో ఎవరెవరి పుట్టినరోజులున్నాయో చూసుకుని అందరికీ ఒకరోజు గ్రాండ్‌గా పుట్టినరోజు సెలబ్రేట్ చేస్తారు. బర్త్‌డే అనగానే అందరికీ కేకులు, చాక్లెట్లు గుర్తొస్తాయి. కానీ ఇక్కడ అలా కాదు. అందరికీ సతీసమేతంగా ఆహ్వానాలుంటాయి. వారి కుటుంబసభ్యులు కూడా వస్తారు. ‘వారిని శాలువా కప్పి, పూలతో సత్కరించి, వాళ్ల జీవితం గురించి నాలుగు ముక్కలు చెప్పి ఘనంగా సన్మానిస్తాం. ఆ రోజు అందరికీ నచ్చిన మెనూతో భోజనాలుంటాయి’ అంటూ ఆనందంగా చెప్పారు వైస్ ప్రెసిడెంట్ శంకర్రావ్. ‘నెలకు రెండుసార్లు హెల్త్‌క్యాంపులు ఏర్పాటు చేసుకుంటాం. బీపీ, షుగర్ టెస్ట్‌ల పరికరాలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఎవరికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు పరీక్షలు చేసేసుకుంటాం. ఐ, డెంటల్ స్పెషలిస్ట్‌లు కూడా వస్తుంటారు’ అని మెడికల్ వ్యవహారాలు చూసే ఎస్.వి.రావ్ తెలిపారు. రోజు గడవదు... ఈ సంఘంలో ఉన్న వారి వెయ్యిమంది పిల్లల్లో తొంభైశాతంమంది విదేశాల్లోనే స్థిరపడ్డారు. దాంతో అన్నీఉన్నా... ఇంట్లో పిల్లల సందడి లేక బోర్ఫీలయ్యేవారికి అసోసియేషన్ బిల్డింగ్ బోలెడంత కాలక్షేపంతోపాటు సమాజానికి ఏదైనా చేయాలనే ఆలోచన ఉన్నవారికి చేయూతనిస్తుంది. ‘మా సంఘం తరపున ధూమపాన నిషేధం అమలు చేయిస్తున్నాం. అసోసియేషన్‌లో చేరేప్పటికి చైన్స్మోకర్లై ఉండి... కొద్దికాలంలోనే పూర్తిగా మానేసినవారు చాలామంది. అలాగే ఎవరైనా పొగతాగుతూ కనిపిస్తే.. కౌన్సెలింగ్ ఇచ్చి వారితో కూడా మాన్పించే ఉద్యమం చేపట్టాం’ అని గర్వంగా చెబుతారు డెరైక్టర్ తాతాచారి. ఆత్మీయానుబంధాలు పంచడానికి బంధువులే కానక్కర్లేదు. ‘ఈ భవనంతో మాకు చాలా అనుబంధం ఏర్పడింది. విదేశాల్లో పిల్లల దగ్గరికి వెళ్లినపుడు కూడా ఈ భవనం... ఇక్కడి స్నేహితులే గుర్తుకొస్తారు. ఎప్పుడెప్పుడు ఇక్కడికి వచ్చివాలదామా అనిపిస్తుంటుంది’ అని చెప్పారు ఎమ్. పి దాస్. తోటి వారి కోసం... అరవైదాటిన ఈ వృద్ధులంతా తమ గురించి మాత్రమే ఆలోచించుకోవడంలేదు. వీలైనపుడల్లా తలో వందా చందా వేసుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వృద్ధాశ్రమాలకు ఆర్థికసాయం చేస్తున్నారు. భద్రాచలం దగ్గరున్న ‘మానవసేవా సమితి’కి, ఇబ్రహీంపట్నంలో ఉన్న ‘మాతాపితా’ ఆశ్రమానికీ వెళ్తారు. ఒకరోజంతా అక్కడే ఉండి వారి సాదకబాధకాలు తెలుసుకుంటారు. తోచినసొమ్ముని చేతిలో పెట్టి వస్తారు. నగరం విస్తరిస్తున్నట్లే వృద్ధాప్యంలో ఒంటరిగా ఉంటున్న కుటుంబాల సంఖ్యా పెరుగుతోంది. దూరంగా ఉన్న బిడ్డలను తలుచుకుంటూ విశ్రాంత జీవితాన్ని అవిశ్రాంతంగా గడపకుండా... నలుగురితో కలిసి ఆనందమయం చేసుకోవడమే కాదు, నలుగురికి ఆర్థిక సాయమూ అందిస్తున్న వీరు అభినందనీయులు! మీరూ పంపండి.. యాభై దాటితే సగం జీవితం అయిపోయినట్టేనా?.. ‘కాదు.. జస్ట్ బిగిన్’ అంటున్నారు సీనియర్ సిటిజన్స్. ఆటపాటలు.. ఇష్టమైన వ్యాపకాలతో స్నేహిస్తూ.. కాసింత చారిటీకి టైమిస్తూ జీవితాన్ని ‘కొత్త బంగారు లోకం’ చేసుకుంటున్న సీనియర్ సిటి‘జెమ్స్’ ఎందరో!. ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ అని చాటుతున్న మీరు.. మీ అసోసియేషన్ లేదా వృద్ధాశ్రమాల యాక్టివిటీస్ గురించి మాకు రాసి పంపండి. మీ ఎక్స్పీరియన్స్ మరెందరికో ఇన్స్పిరేషన్. ముదిమి వయసులో ఒంటరితనం ఎంత భయంకరమో మాటల్లో చెప్పలేం. చదువులు, ఉద్యోగాల పేరుతో రెక్కలొచ్చిన పిల్లలు తలోదిక్కూ ఎగిరిపోతే... దిగులుపడే పండుటాకులు ఎంతోమంది. అలాంటి కొందరు ఇప్పుడు ఒకచోట చేరి సరికొత్త జీవితానికి స్వాగతం పలుకుతున్నారు. సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్‌గా ఏర్పడి సిక్స్టీస్లో జీవితాన్ని స్వీట్ సిక్స్టీన్లా మార్చుకుంటున్నారు. వెయ్యిమందికిపైగా సభ్యులతో... నిత్యం కొత్త ఉత్సాహంతో కనిపించే ‘ఎ.ఎస్.రావ్ నగర్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్’ గురించి..... భువనేశ్వరి మెయిల్: sakshicityplus@gmail.com