ఫన్‌డుటాకులు
ఓ పదిమంది వృద్ధులు ఒకచోట చేరితే ఏం చేయగలరంటే టక్కున చెప్పే సమాధానం.... ‘జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు’ అని. కానీ ‘డాక్టర్ ఎ.ఎస్.రావ్ నగర్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్’ దీనికి భిన్నం. వయసు శరీరానికి కానీ, మనసుకి మంచి ఆలోచనలకు కాదంటున్నారీ ఈ అసోసియేషన్ సభ్యులు.
నర్సింహారావ్, బిఎస్ నాయుడు, కె, ఆర్ శర్మ... ఈ ముగ్గురు స్నేహితులు కలిసి ఓ యాభైమంది సభ్యులతో 2001లో ఏర్పాటు చేసిన సంఘంలో ప్రస్తుతం 1,050మంది ఉన్నారు. వీరంతా వివిధ రంగాల్లో అనుభవజ్ఞులు. ‘తెల్లవారుజామున వాకింగ్‌తో మొదలయ్యే మా ప్రయాణం రాత్రి ఎనిమిదింటికి చెస్ ఆటతో ముగుస్తుంది. మధ్యలో బోలెడన్ని యాక్టివిటీస్’ అంటూ తమ సంఘం స్పెషాలిటీ గురించి చెప్పారు ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి రామ్మోహన్‌రావ్. మొన్నీమధ్యనే రాష్ట్ర ప్రభుత్వం ఈ సంఘాన్ని ‘బెస్ట్ ఇన్‌స్టిట్యూషన్ అవార్డ్’తో సత్కరించింది.
వాకింగ్ ట్రాక్...
అసోసియేషన్‌కి ప్రత్యేక భవనం ఏర్పాటు చేసుకున్నారు. దాని చుట్టూరా వాకింగ్ ట్రాక్ కూడా ఉంది. భవనంలోపలికి అడుగుపెట్టగానే బయట వరండాలో కనిపించేవి... ఓ యాభై కుర్చీలు. మధ్యలో టీపాయ్‌పై ఓ పది రకాల న్యూస్ పేపర్లు. ఇక ముందు గదిలో లైబ్రెరీ, రెండో గదిలో పది క్యారెమ్ బోర్డులు, ఆరు చెస్ బోర్డులుంటాయి. వాకింగ్ పూర్తయ్యాక ఇంటికెళ్లి టీ, టిఫిన్స్ ముగించుకుని మళ్లీ ఇక్కడికి చేరుకుంటారు. కాసేపు న్యూస్‌పేపర్లు తిరగేసి పుస్తకం అందుకునేవాళ్లు కొందరైతే... ట్రెడ్‌మిల్‌పైకి చేరేవారు ఇంకొందరు. ఆటలంటే ఇష్టమున్నవాళ్లు క్యారమ్ బోర్డు ముందో, చెస్ బోర్డు ముందో సెటిల్ అయిపోతారు. ఇవన్నీ కాదు పురాణకాలక్షేపం కావాలనుకునేవారు బిఎస్ రావ్‌గారి దగ్గరికి చేరిపోతారు. ఇలా చక్కని దినచర్యని ప్లాన్ చేసుకున్నారు.
నెలకో పుట్టినరోజు...
నెలమొత్తంలో ఎవరెవరి పుట్టినరోజులున్నాయో చూసుకుని అందరికీ ఒకరోజు గ్రాండ్‌గా పుట్టినరోజు సెలబ్రేట్ చేస్తారు. బర్త్‌డే అనగానే అందరికీ కేకులు, చాక్లెట్లు గుర్తొస్తాయి. కానీ ఇక్కడ అలా కాదు. అందరికీ సతీసమేతంగా ఆహ్వానాలుంటాయి. వారి కుటుంబసభ్యులు కూడా వస్తారు. ‘వారిని శాలువా కప్పి, పూలతో సత్కరించి, వాళ్ల జీవితం గురించి నాలుగు ముక్కలు చెప్పి ఘనంగా సన్మానిస్తాం. ఆ రోజు అందరికీ నచ్చిన మెనూతో భోజనాలుంటాయి’ అంటూ ఆనందంగా చెప్పారు వైస్ ప్రెసిడెంట్ శంకర్‌రావ్. ‘నెలకు రెండుసార్లు హెల్త్‌క్యాంపులు ఏర్పాటు చేసుకుంటాం. బీపీ, షుగర్ టెస్ట్‌ల పరికరాలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఎవరికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు పరీక్షలు చేసేసుకుంటాం. ఐ, డెంటల్ స్పెషలిస్ట్‌లు కూడా వస్తుంటారు’ అని మెడికల్ వ్యవహారాలు చూసే ఎస్.వి.రావ్ తెలిపారు.
రోజు గడవదు...
ఈ సంఘంలో ఉన్న వారి వెయ్యిమంది పిల్లల్లో తొంభైశాతంమంది విదేశాల్లోనే స్థిరపడ్డారు. దాంతో అన్నీఉన్నా... ఇంట్లో పిల్లల సందడి లేక బోర్‌ఫీలయ్యేవారికి అసోసియేషన్ బిల్డింగ్ బోలెడంత కాలక్షేపంతోపాటు సమాజానికి ఏదైనా చేయాలనే ఆలోచన ఉన్నవారికి చేయూతనిస్తుంది. ‘మా సంఘం తరపున ధూమపాన నిషేధం అమలు చేయిస్తున్నాం. అసోసియేషన్‌లో చేరేప్పటికి చైన్‌స్మోకర్లై ఉండి... కొద్దికాలంలోనే పూర్తిగా మానేసినవారు చాలామంది. అలాగే ఎవరైనా పొగతాగుతూ కనిపిస్తే.. కౌన్సెలింగ్ ఇచ్చి వారితో కూడా మాన్పించే ఉద్యమం చేపట్టాం’ అని గర్వంగా చెబుతారు డెరైక్టర్ తాతాచారి. ఆత్మీయానుబంధాలు పంచడానికి బంధువులే కానక్కర్లేదు. ‘ఈ భవనంతో మాకు చాలా అనుబంధం ఏర్పడింది. విదేశాల్లో పిల్లల దగ్గరికి వెళ్లినపుడు కూడా ఈ భవనం... ఇక్కడి స్నేహితులే గుర్తుకొస్తారు. ఎప్పుడెప్పుడు ఇక్కడికి వచ్చివాలదామా అనిపిస్తుంటుంది’ అని చెప్పారు ఎమ్. పి దాస్.
తోటి వారి కోసం...
అరవైదాటిన ఈ వృద్ధులంతా తమ గురించి మాత్రమే ఆలోచించుకోవడంలేదు. వీలైనపుడల్లా తలో వందా చందా వేసుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వృద్ధాశ్రమాలకు ఆర్థికసాయం చేస్తున్నారు. భద్రాచలం దగ్గరున్న ‘మానవసేవా సమితి’కి, ఇబ్రహీంపట్నంలో ఉన్న ‘మాతాపితా’ ఆశ్రమానికీ వెళ్తారు. ఒకరోజంతా అక్కడే ఉండి వారి సాదకబాధకాలు తెలుసుకుంటారు. తోచినసొమ్ముని చేతిలో పెట్టి వస్తారు. నగరం విస్తరిస్తున్నట్లే వృద్ధాప్యంలో ఒంటరిగా ఉంటున్న కుటుంబాల సంఖ్యా పెరుగుతోంది. దూరంగా ఉన్న బిడ్డలను తలుచుకుంటూ విశ్రాంత జీవితాన్ని అవిశ్రాంతంగా గడపకుండా... నలుగురితో కలిసి ఆనందమయం చేసుకోవడమే కాదు, నలుగురికి ఆర్థిక సాయమూ అందిస్తున్న వీరు అభినందనీయులు!
మీరూ పంపండి..
యాభై దాటితే సగం జీవితం అయిపోయినట్టేనా?.. ‘కాదు.. జస్ట్ బిగిన్’ అంటున్నారు సీనియర్ సిటిజన్స్. ఆటపాటలు.. ఇష్టమైన వ్యాపకాలతో స్నేహిస్తూ.. కాసింత చారిటీకి టైమిస్తూ జీవితాన్ని ‘కొత్త బంగారు లోకం’ చేసుకుంటున్న సీనియర్ సిటి‘జెమ్స్’ ఎందరో!. ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ అని చాటుతున్న మీరు.. మీ అసోసియేషన్ లేదా వృద్ధాశ్రమాల యాక్టివిటీస్ గురించి మాకు రాసి పంపండి.
మీ ఎక్స్‌పీరియన్స్ మరెందరికో ఇన్‌స్పిరేషన్.
ముదిమి వయసులో ఒంటరితనం ఎంత భయంకరమో మాటల్లో చెప్పలేం. చదువులు, ఉద్యోగాల పేరుతో రెక్కలొచ్చిన పిల్లలు తలోదిక్కూ ఎగిరిపోతే... దిగులుపడే పండుటాకులు ఎంతోమంది. అలాంటి కొందరు ఇప్పుడు ఒకచోట చేరి సరికొత్త జీవితానికి స్వాగతం పలుకుతున్నారు. సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్‌గా ఏర్పడి సిక్స్‌టీస్‌లో జీవితాన్ని స్వీట్ సిక్స్‌టీన్‌లా మార్చుకుంటున్నారు. వెయ్యిమందికిపైగా సభ్యులతో... నిత్యం కొత్త ఉత్సాహంతో కనిపించే ‘ఎ.ఎస్.రావ్ నగర్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్’ గురించి..... భువనేశ్వరి
మెయిల్: sakshicityplus@gmail.com