మాట్లాడరేమిటి! ఎవరక్కడ?
మానసికం
ఇంట్లో రాత్రి వేళ ఒంటరిగా ఉన్నప్పుడు వెనుక ఎవరో ఉన్నట్లుగా అనిపిస్తుంది. వెనక్కి తిరిగిచూస్తే ఎవరూ ఉండరు. కిటికీలో నుంచి ఎవరో తొంగిచూస్తున్నట్లు అనిపిస్తుంది. దగ్గరికి వెళ్లి చూస్తే ఎవరూ కనిపించరు... ఇలాంటివి చాలామందికి అనుభవంలో ఉన్న సంఘటనలే. అందుకే... వాటి గురించి లోతుగా పరిశోధించడానికి స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. కొందరు వ్యక్తులను ఎంచుకొని, వారి కళ్లకు గంతలు కట్టి రోబోట్ సహాయంతో ప్రయోగశాలలో కొన్ని పరిశోధనలు నిర్వహించారు.
ఈ ప్రయోగంలో పాల్గొన్నవారికి, ఒకరికి కనిపించిన దృశ్యాలు మరొకరికి కనిపించలేదు. అప్పటి వారి శారీరకస్థితి, ఆలోచన సరళిని బట్టి కంటి ముందు దృశ్యాలు ప్రత్యక్షం కావడం ప్రారంభమయ్యాయి. కొందరైతే ఆ దృశ్యాలను తట్టుకోలేక ‘‘ఇక ఆపండి’’ అని అరిచారు.
‘మెదడు పనితీరు’ ‘శరీర కదలికలు’ ‘బాడీ పొజిషన్ ఇన్ స్పేస్’ ఆధారంగా భ్రమాజనిత దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. దీంతో పాటు అతి భౌతిక, భావోద్వేగ సందర్భాలు, ఆప్తులను కోల్పోయిన దుఃఖం, శారీరక రోగాలు, మానసిక సమస్యలు, వైద్యపరిస్థితులు... మొదలైనవి భ్రమాజనిత దృశ్యాలకు కారణమవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.