
ప్రియురాలి గురించి ఎందరు ఎన్నిసార్లు వర్ణించినా అది తియ్యగానే ఉంటుంది. ఒక మామూలు మగవాడిని సైతం కవిగా మలుస్తుంది కదా ప్రేయసి! మరి ఆమెను వర్ణించే ప్రయత్నంలో అతడు కవిత్వం రాయకా తప్పదు; అతిశయాలకు పోకా తప్పదు. 2006లో వచ్చిన ‘బొమ్మరిల్లు’ చిత్రంలోని ‘అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి’ పాటలోని ఈ పాదాలు దీనికి సాక్ష్యమిస్తాయి.
‘తీపి కన్నా ఇంకా తీయనైన తేనె ఏది అంటే/ వెంటనే నీ పేరని అంటానే
హాయి కన్నా ఎంతో హాయిదైన చోటే ఏమిటంటే/ నువ్వు వెళ్లే దారని అంటానే
నీలాల ఆకాశం ఆ నీలం ఏదంటే/ నీ వాలు కళ్ళల్లో ఉందని అంటానే’
ఈ పాటకు క్రెడిట్ కులశేఖర్/ అనంత శ్రీరామ్ అని ఇద్దరి పేర్లూ వున్నప్పటికీ, ఈ వెర్షన్ రాసింది మాత్రం తానేనని అనంత శ్రీరామ్ స్వయంగా వెల్లడించారు. అప్పటికి ఆయన పరిశ్రమకు కొత్త కావడం, అప్పటికే కులశేఖర్‌కు నిర్మాత దిల్ రాజు డబ్బులు చెల్లించి ఉండటంతో మార్కెట్ దృష్ట్యా ఇద్దరి పేర్లూ వేశారట. ‘అది దిల్ రాజు గారి విశాల హృదయానికి చిహ్నం’ అంటారు అనంత శ్రీరామ్. ‘అపుడో ఇపుడో ఎపుడో’ లైన్ ఇచ్చింది మాత్రం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. పాడింది సినిమాలో నాయకుడు కూడా అయిన సిద్ధార్థ.
Comments
Please login to add a commentAdd a comment