‘అస్థి’త్వ అందాలు...
న్యూయార్క్‌లోని ఓ గ్యాలరీలో జెన్నిఫర్ ట్రాస్క్ ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతోంది. ఆమె తయారు చేసిన కళాకృతులను చూసి సందర్శకులంతా ముగ్ధులైపోతున్నారు. ఒకామె అడిగింది... ‘‘వీటిని ఎలా చేశారు’’ అని. ‘‘ఎముకలతో చేశాను’’ అంది జెన్నిఫర్. సందర్శకురాలు అవాక్కయ్యింది. ఎముకలతో ఇంతటి అద్భుత సృష్టిని చేయవచ్చా అంటూ ఆశ్చర్యపోయింది.
జెన్నిఫర్ తయారు చేసిన కళాఖండాలను చూస్తే ఎవరైనా అలాంటి అనుభూతికే లోనవుతారు. ఎక్కడైనా, ఏ జంతువు ఎముక అయినా కనిపిస్తే ఇబ్బందిగా ముఖం పెడతారు ఎవరైనా. కానీ జెన్నీ మాత్రం ఆనందంగా దాన్ని చేతిలోకి తీసుకుంటుంది. ఇంటికి తెచ్చి, రసాయనాలతో శుభ్రం చేసి, వాటితో అందమైన కళాకృతులను తయారు చేస్తుంది. వాల్ హ్యాంగింగ్స్, పేపర్ వెయిట్స్, టేబుల్ మీద అలంకరించుకునే ఫ్లవర్ బొకేలు, కంఠాభరణాలు, ఉంగరాలు... ఒకటేమిటి, ఎముకలతో వేటినయినా, ఎంత అందాన్నయినా సృష్టించగలదు జెన్నిఫర్.
ఇలా ఎముకలతో ఎందుకు అని అడిగితే కాస్త ఎమోషనల్‌గా సమాధానం చెబుతుంది జెన్నీ. ‘‘ప్రతి ప్రాణి శరీర నిర్మాణానికీ మూలం ఎముకలే. ఆ ప్రాణి చనిపోయాక మిగిలేది కూడా ఎముకలే. అంటే ప్రాణం అశాశ్వతం, ఎముక శాశ్వతం’’ అంటుంది. ప్రాణం పోయాక శరీరం మట్టిలో కలిసినా ఎముకలు అలాగే నిలిచివుంటాయి కదా! అందుకే వాటితో ఏది చేసినా కలకాలం నిలిచేవుంటుందనే ఉద్దేశంతోనే తన కళకు సాధనంగా ఎముకల్ని ఎంచుకున్నానంటుందామె. కారణం ఏదయితేనేం... జెన్నీ కళ కళ్లను కట్టిపడేస్తోందన్నది మాత్రం వాస్తవం!