Wall hyangings
-
ప్యాచ్ వర్క్‌తో... మ్యాచ్ వర్క్!
రీయూజ్ గుజరాతీ, రాజస్థాన్ వాల్ హ్యాంగింగ్స్ చాలా కళాత్మకంగా ఉంటాయి. వీటిని ఇళ్లలో గోడల మీద అలంకరించుకుంటాం. అలాగే హోటల్స్ పెద్ద పెద్ద గోడల మీద అలంకరించి ఉండటం మనం చూస్తుంటాం. ఈ ప్రాంతానికే ప్రత్యేకమైన హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్చేసిన బెడ్ కవర్స్ కూడా చాలా అందంగా ఉంటాయి. గోడల మీద, బెడ్ మీద మాత్రమే కాకుండా ఈ ఫ్యాబ్రిక్‌ను బేస్‌గా తీసుకొని కొత్తరకం డిజైనరీ డ్రెస్సులను మనకు మనంగానే రూపొందించుకోవచ్చు. ప్యాచ్‌ల మాయాజాలం గుజరాతీ ప్యాచ్‌వర్క్ ఎంబ్రాయిడరీకి రంగురంగుల కాటన్ ప్యాబ్రిక్స్ను ఎంచుకుంటారు. వీటిని మందపాటి రంగుదారంతో కలిపి కుడతారు. అలాగే అద్దాలను, పూసలను ఉపయోగించి చేసిన అల్లికలు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ ప్యాచ్‌కి వెనకాల లైనింగ్‌గా మరో కాటన్ మెటీరియల్కూడా వాడతారు. దీంతో ఈ మెటీరియల్ చాలా స్టిఫ్‌గా ఉంటుంది. వీటితో మోడ్రన్ జాకెట్స్, సంప్రదాయ స్కర్ట్స్, టాప్స్ డిజైన్ చేసుకోవచ్చు. బేస్ డిజైన్ జాకెట్ లేదా స్కర్ట్, షల్వార్.. కి మొత్తం ఇదే ఫ్యాబ్రిక్‌ను వాడాల్సిన అవసరం లేదు. చేతులకు లేదా అంచులకు ఈ ఫ్యాబ్రిక్‌ను వాడితే కొత్తగా, చాలా అందంగా మీ డ్రెస్ మారిపోతుంది. హ్యాంగింగ్స్, బెడ్ కవర్స్ కొన్నాళ్లు వాడాక వీటిని తీసేయాలనుకుంటే ఆ డిజైన్స్‌లో కొంత భాగాన్ని ఇలా ప్యాచులుగా తీసుకొని డ్రెస్సులకు వేసుకోవచ్చు. - మంగారెడ్డి, ఫ్యాషన్ డిజైనర్ -
‘అస్థి’త్వ అందాలు...
న్యూయార్క్‌లోని ఓ గ్యాలరీలో జెన్నిఫర్ ట్రాస్క్ ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతోంది. ఆమె తయారు చేసిన కళాకృతులను చూసి సందర్శకులంతా ముగ్ధులైపోతున్నారు. ఒకామె అడిగింది... ‘‘వీటిని ఎలా చేశారు’’ అని. ‘‘ఎముకలతో చేశాను’’ అంది జెన్నిఫర్. సందర్శకురాలు అవాక్కయ్యింది. ఎముకలతో ఇంతటి అద్భుత సృష్టిని చేయవచ్చా అంటూ ఆశ్చర్యపోయింది. జెన్నిఫర్ తయారు చేసిన కళాఖండాలను చూస్తే ఎవరైనా అలాంటి అనుభూతికే లోనవుతారు. ఎక్కడైనా, ఏ జంతువు ఎముక అయినా కనిపిస్తే ఇబ్బందిగా ముఖం పెడతారు ఎవరైనా. కానీ జెన్నీ మాత్రం ఆనందంగా దాన్ని చేతిలోకి తీసుకుంటుంది. ఇంటికి తెచ్చి, రసాయనాలతో శుభ్రం చేసి, వాటితో అందమైన కళాకృతులను తయారు చేస్తుంది. వాల్ హ్యాంగింగ్స్, పేపర్ వెయిట్స్, టేబుల్ మీద అలంకరించుకునే ఫ్లవర్ బొకేలు, కంఠాభరణాలు, ఉంగరాలు... ఒకటేమిటి, ఎముకలతో వేటినయినా, ఎంత అందాన్నయినా సృష్టించగలదు జెన్నిఫర్. ఇలా ఎముకలతో ఎందుకు అని అడిగితే కాస్త ఎమోషనల్‌గా సమాధానం చెబుతుంది జెన్నీ. ‘‘ప్రతి ప్రాణి శరీర నిర్మాణానికీ మూలం ఎముకలే. ఆ ప్రాణి చనిపోయాక మిగిలేది కూడా ఎముకలే. అంటే ప్రాణం అశాశ్వతం, ఎముక శాశ్వతం’’ అంటుంది. ప్రాణం పోయాక శరీరం మట్టిలో కలిసినా ఎముకలు అలాగే నిలిచివుంటాయి కదా! అందుకే వాటితో ఏది చేసినా కలకాలం నిలిచేవుంటుందనే ఉద్దేశంతోనే తన కళకు సాధనంగా ఎముకల్ని ఎంచుకున్నానంటుందామె. కారణం ఏదయితేనేం... జెన్నీ కళ కళ్లను కట్టిపడేస్తోందన్నది మాత్రం వాస్తవం!