పైకి తన్నే గ్యాస్..పగబట్టే ఆసిడ్!! | Bounce up and headed acid gas ..! | Sakshi
Sakshi News home page

పైకి తన్నే గ్యాస్..పగబట్టే ఆసిడ్!!

Published Tue, Jan 21 2014 12:19 AM | Last Updated on Sat, Sep 2 2017 2:49 AM

Bounce up and headed acid gas ..!

గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిప్లక్స్ డిసీజ్ (జీఈఆర్‌డీ)
 

ఎంత ఆరోగ్యవంతుడికైనా... కడుపులో గ్యాస్ పైకి ఎగజిమ్ముతూ... ఇబ్బంది పెట్టడం ఎప్పుడో ఒకసారి అనుభవంలోకి వచ్చే విషయమే. ఆ సమయంలో వ్యక్తి కిందామీదా అయిపోతాడు. ఒక్కోసారి గ్యాస్ పైకి తన్నే సమయంలో గుండె వద్ద ఇబ్బంది కలిగిస్తూ గుండెపోటేమో అనుకునేంత ఆందోళనకు గురిచేస్తుంది. అర్జెంటుగా ఆసుపత్రికి రప్పిస్తుంది. ఆహారం జీర్ణం కావడానికి అవసరమయ్యే ఆసిడ్ ఉత్పత్తి జరిగి గ్యాస్‌లా పైకి ఎగజిమ్ముతూ ఇబ్బంది పెట్టే ఈ సమస్యను వైద్యపరిభాషలో ‘గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్’ (జీఈఆర్‌డీ) అంటారు. ఈ సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం.
 
 
 సమస్య వస్తుందిలా...
 మనం తిన్న ఆహారం ఒక సన్నటి ఆహారనాళం (ఫుడ్ పైప్) ద్వారా కడుపులోకి వెళ్తుంది. ఈ ఫుడ్ పైప్ సాధారణంగా తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర అంగుళాల పొడవుంటుంది. ఇది కడుపు/ఆహారకోశం (స్టమక్) లోకి దారితీస్తుంది. ప్రతి ఒక్కరికీ ఆహారనాళం, ఆహార కోశం... ఈ రెండింటి జంక్షన్‌లో ఆహారం పైకి వెళ్లకుండా ఒక మెకానిజం ఉంటుంది. కడుపులోకి ఆహారం వచ్చిన తర్వాత అక్కడి నుంచి జీర్ణమయ్యే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఒకవేళ ఏదైనా కారణం వల్ల ఆసిడ్ పైకి ఎగజిమ్ముతున్నా, ఆహారం జీర్ణం కావడానికి తగినంత ఆసిడ్ అక్కడ లేకపోయినా, దాన్ని భర్తీ చేసేందుకు మరింత ఆసిడ్ ఉత్పన్నం అవుతుంది. దాంతో అది కడుపు కండరాల మీద ప్రభావం చూపి, అక్కడ స్టమక్ అల్సర్ (కడుపులో పుండ్లు) వచ్చేలా చేస్తుంది. ఇది ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయవచ్చు. ఒకవేళ ఆ పరిస్థితికి దారి తీయకపోయినా, రోజువారీ పనులకు ఆటంకంగా పరిణమిస్తుంది కాబట్టి... ఈ సమస్య రాకుండా చూసుకోవడమే మంచిది.
 
 
 రూల్ అవుట్ చేసుకోవాలి ఇలా...
 కొందరిలో ఛాతీ నొప్పిగా అనిపించి, ఆ నొప్పి ఛాతీ కింద ఉండే ఎముక కింద చిక్కుపడిపోయినట్లుగా వస్తుంటుంది. ఫలితంగా దాన్ని గుండెనొప్పితో ముడివేసి చాలామంది ఆందోళన పడుతుంటారు. ఈ నొప్పి గుండెను ఒత్తినట్లుగా అనిపిస్తుండటంతో గుండెపోటుగా పొరబడతారు. కాబట్టి ఈ రెండింటి లక్షణాలూ చూసి అది గుండెపోటు లేదా యాంజైనా కాదని నిర్ధారణ చేసుకోవడం ప్రధానం.
 
 కడుపులో అల్సర్స్‌కు మరో కారణం...
 కడుపు కండరాల్లో హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఆసిడ్స్ ఎక్కువగా స్రవించడం ద్వారా వచ్చే పెప్టిక్ అల్సర్స్‌కు ఈ బ్యాక్టీరియా కూడా ఒక కారణం. ఇలా ఆసిడ్ పైకి చిమ్మే వారిలో హెచ్.పైలోరీ ఉందా లేదా అని నిర్ధారణ చేసుకోవడం అవసరం. ఒకవేళ ఉంటే వారికి యాంటీబయాటిక్స్ ఇవ్వడం ద్వారా  సమస్యను అధిగమించవచ్చు.
 
 
 జీఈఆర్‌డినీ ప్రేరేపించే అంశాలు  (రిస్క్ ఫ్యాక్టర్స్)
 ఆహారం తీసుకునే విధానం (ఈటింగ్ ప్యాటర్న్):
 తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవడం వల్ల కడుపుపై పడే భారం కూడా తగ్గుతుంది. అయితే కొందరు చాలాసేపు ఆహారం తీసుకోకుండా, ఒకేసారి ఎక్కువ పరిమాణంలో తినేస్తుంటారు. ఆ తర్వాత వెంటనే పక్కలకు ఒరగడం, నిద్రకు ఉపక్రమించడం చేస్తుంటారు. దీంతో గుండెలో మంట రావడానికి అవకాశం ఎక్కువ.
 గర్భం ధరించడం (ప్రెగ్నెన్సీ): గర్భవతులకు ‘జీఈఆర్‌డీ’ రిస్క్ ఎక్కువ. ప్రధానంగా ఆఖరి మూడు మాసాల్లో ఈ సమస్యకు అవకాశం ఎక్కువ. వారిలో పెరిగే పిండం ఆహార కోశానికి అవసరమైన ఖాళీని తగ్గిస్తుంది. దాంతో ఆహారం పైకి ఎగజిమ్మి గుండెలో/ఛాతీలో మంట కనిపిస్తాయి.
 ఇంకా... స్థూలకాయం, పొగతాగే అలవాటు, ఆల్కహాల్ దురలవాటు, హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ కూడా రిఫ్లక్స్‌కు కారణాలే.  అయితే... పైన పేర్కొన్న ఏ ఒక్క అంశమో కాకుండా... కొన్ని సార్లు అనేక అంశాలు కలగలిసి ఈ రిస్క్‌ను పెంచుతాయి. ఇక పొగతాగడం, ఆల్కహాల్ తీసుకోవడం... ఈ రెండూ చేసేవారికి రిఫ్లక్స్ రిస్క్‌తో పాటు జీర్ణాశయంలో క్యాన్సర్ రిస్క్ కూడా ఎక్కువని గ్రహించాలి.
 
 
 జీఈఆర్‌డీ  తదుపరి పరిణామాలు
 సాధారణ సమస్యగా మొదలయ్యే జీఈఆర్‌డీని నియంత్రించుకోకపోతే ఇతర పరిణామాలకు కారణం కావచ్చు. అవి...
  జీర్ణకోశం ఒరుసుకుపోవడం (ఎరోసివ్ ఈసోఫేజైటిస్)
  జీర్ణకోశం ఇరుకుగా మారడం (ఈసోఫేజియల్ స్ట్రిక్చర్)
  బారెట్స్ ఈసోఫేగస్ ’(అంటే... క్రమంగా అది ఈసోఫేజియల్ క్యాన్సర్‌కు దారితీయడం. అయితే అదృష్టవశాత్తూ... భారతీయుల్లో ఈ కండిషన్ చాలా అరుదు).
 
 
 కడుపులో అల్సర్స్‌కు మరో కారణం...
 కడుపు కండరాల్లో హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఆసిడ్స్ ఎక్కువగా స్రవించడం ద్వారా వచ్చే పెప్టిక్ అల్సర్స్‌కు ఈ బ్యాక్టీరియా కూడా ఒక కారణం. ఇలా ఆసిడ్ పైకి చిమ్మే వారిలో హెచ్.పైలోరీ ఉందా లేదా అని నిర్ధారణ చేసుకోవడం అవసరం. ఒకవేళ ఉంటే వారికి యాంటీబయాటిక్స్ ఇవ్వడం ద్వారా  సమస్యను అధిగమించవచ్చు.
 
 సమస్యను తీవ్రతరం చేసే మందులు

 కొన్ని రకాల మందులు ఆసిడ్‌ను పైకి ఎగజిమ్మేలా చేస్తుంటాయి. ఉదాహరణకు నొప్పినివారణ మందులు/ఎన్‌ఎస్‌ఏఐడీ మందులు (పెయిన్ కిల్లర్స్/నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్) వంటివి ఆసిడ్ ఎక్కువగా పుట్టేలా చేసి కడుపులో అల్సర్స్‌ను పెంచుతాయి. వాటిని వాడాల్సి వచ్చినప్పుడు వాటి తీవ్రతను తగ్గించడానికి కొన్ని రక్షణ మందులనూ డాక్టర్లు సూచిస్తుంటారు.
 
 
 ఆయుర్వేదంలో పరిష్కారం ఇలా...
 ఇంగ్లీషులో జిఇఆర్‌డి అని పిలిచే ఈ వ్యాధి ఆయుర్వేదంలో అమ్లపిత్తం లక్షణాలను కలిగి ఉంటుంది. అమ్లపిత్తం తగ్గడానికి ఆయుర్వేద మార్గం ఇలా...
 ఆహారం: అల్పాహారమైనా, భోజనమైనా ప్రతిరోజూ నియమిత వేళల్లోనే స్వీకరించాలి. పులుపు, ఉప్పు, కారం పూర్తిగా మానెయ్యండి. తీపి పదార్థాలు, నూనె పదార్థాలు బాగా తగ్గించండి. ప్రతి రెండు గంటలకు ఒక లీటరు నీళ్లు తాగండి. అల్పాహారంలో ఇడ్లీ మంచిది. మొలకలు, గ్రీన్‌సలాడ్స్ కూడా తీసుకోండి. ఆవుపాలు, ఆవుమజ్జిగ వాడండి. బొంబాయిరవ్వ, బార్లీ, రాగులు మున్నగు వాటితో చేసిన జావ అప్పుడప్పుడూ తాగాలి.
 మందులు:   లఘుసూతశేఖర రస (మాత్రలు): ఉదయం 2, రాత్రి 2   అవిపత్తికర చూర్ణం: మూడుపూటలా ఒక్కొక్క చెంచా (నీటితో)   శుక్తిన్ (మాత్రలు ): ఉదయం 1, రాత్రి 1
 గమనిక: అధిక రక్తపోటు, మధుమేహం వంటి ఇతర వ్యాధులుంటే, వాటిని నియంత్రణలోకి తెచ్చుకోవాలి. ప్రతిరోజూ పరగడుపున ఒక అరటిపండు తినడం ఈ సమస్యకు మంచిది.
 
 
 పరిస్థితిని  మెరుగుపరిచే చిట్కాలు
 జీఈఆర్‌డీ కండిషన్ కనిపిస్తున్న వారు తక్కువ కొవ్వు ఉండే ఆహారాలు తీసుకోవాలి. మాంసాహారం ఇష్టమైన వారు తక్కువ కొవ్వు ఉండే చికెన్ (పౌల్ట్రీ), చేపల వంటి వైపునకు మొగ్గుచూపాలి. ఇక పాలలోనూ కొవ్వు తక్కువగా ఉండే డెయిరీ ఉత్పాదనలను వాడాలి. అంటే స్కిమ్‌డ్ మిల్క్ వంటివి. పుల్లటి పండ్లు... అంటే నారింజ, నిమ్మ, ద్రాక్ష, పైనాపిల్, టమాటాలకు కాస్త దూరంగా ఉండాలి.
 
 సాధారణ నివారణ ప్రక్రియలు
 ఈ జబ్బుకు నివారణ చాలా సులభం. జీవనశైలిలో మార్పులతో దీన్ని ప్రాథమికంగా నివారించుకోవచ్చు. ఆ మార్గాలు కూడా చాలా సులభం. అవి... వేళకు తినడం, కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు తినడం, రోజూ తీసుకునే కాఫీ, టీ వంటి పానీయాలు పరిమితంగానే తీసుకోవడం, చాక్లెట్లు చాలా తక్కువగా తీసుకోవడం, ఈ జబ్బు ఉన్నట్లు గమనిస్తే ఉల్లి, వెల్లుల్లి, పెప్పర్‌మింట్ వంటివాటిని తక్కువగా తీసుకోవడం, పొగతాగడం, మద్యపానాన్ని పూర్తిగా మానే యడం, శీతల పానీయాలు, కోలా డ్రింక్స్ కూడా మానేయాలి.
 
 
 వ్యాధి నిర్ధారణ
 అడపాదడపా ఛాతీలో మంటగా అనిపించడం అందరిలోనూ జరిగేదే. అయితే ఈ ఇబ్బంది పదే పదే కనిపిస్తుంటే జీఈఆర్‌డీగా అనుమానించి డాక్టర్‌ను సంప్రదించాలి. సాధారణంగా యాంటాసిడ్స్ వాడగానే ఉపశమనం కలుగుతుంటే అది జీఈఆర్‌డీ అని నిర్ధారణ జరిగినట్లే. దీని ద్వారానే కొన్నిసార్లు డాక్టర్లు కొన్ని మందులు ఇచ్చి చూసే ధోరణితో ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అనే మందులు ఇస్తారు. దీనిద్వారా 80 శాతం నుంచి 90 శాతం మందిలో వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. కొందరిలో మరింత నిర్దిష్టత కోసం కొన్ని ల్యాబ్ పరీక్షలు, ఎండోస్కోపీ అవసరం కావచ్చు.
 
 గొంతులో కనిపించే లక్షణాలు
 చాలా అరుదుగా కొందరిలో గొంతు బొంగురుగా  (హోర్స్‌నెస్) కనిపిస్తుంది. దాంతో గొంతు మారుతుంది. మాటిమాటికీ గొంతు సవరించుకుంటూ ఉండాల్సి రావడం కూడా చూడవచ్చు. మింగడంలో ఇబ్బందినీ గమనించవచ్చు. గొంతులో మంట, దీర్ఘకాలికంగా దగ్గు వంటివీ కనిపిస్తాయి.
 
 ఆసిడ్ పైకి చిమ్మడానికి కారణాలు...

 ఆహార సంబంధమైనవి...
 ఈ సమస్యకు అనేక కారణాలున్నాయి. ఉదాహరణకు మనం రోజూ తినే ఆహారంలో కొన్ని స్వాభావికంగానే ఆసిడ్‌ను పెంచేవి ఉంటాయి. దాంతోపాటు మనం చేసే పనుల్లో కూడా గుండెమంటకు దోహదం చేసేవీ ఉంటాయి. ఉదాహరణకు బరువులు లేపడం, పక్కలకు ఒరగడం, కడుపునిండా తిని, వెంటనే పడుకోవడం.
 

మరికొన్ని ప్రధాన కారణాలు...
  మనం తీసుకునే ఆహారంలో కొవ్వు, ఉప్పు, కారం, మసాలాలు ఎక్కువగా ఉండటం.
 పీచు తక్కువగా ఉండే బేకరీ ఐటమ్స్ తీసుకోవడం.
ఒకేసారి ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం
 

శరీర (జీర్ణకోశ) నిర్మాణపరమైనవి...
 మన ఆహారనాళం, అన్నవాహిక లేదా జీర్ణకోశంలోకి వెళ్లే జంక్షన్‌లో ఒక మూత (స్ఫింక్టర్) లాంటి నిర్మాణం ఉంటుంది. ఈ మూతను వైద్యపరిభాషలో ‘లెస్’ అని పిలుస్తారు. జీర్ణకోశంలోకి వెళ్లిన ఆహారం పైకి రాకుండా ఈ లెస్ అడ్డుపడుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో అది బలహీనంగా ఉండటం వల్ల గొంతులోకి మెతుకులు రావడం, గ్యాస్, ఆసిడ్ రావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ‘లెస్’ అనే ఆ నిర్మాణం సరిగా పనిచేయాలంటే కడుపు కండరాలు మృదువుగా ఉండాలి, అక్కడి హార్మోన్లు సక్రమంగా స్రవించాలి. ఒకసారి కడుపులోకి ఆహారమంతా చేరుకున్న తర్వాత ఆ స్ఫింక్టర్ పూర్తిగా మూసుకుపోవాలి. లేదంటే ఈ లెస్ అనే నిర్మాణం బలహీన పడి ఆసిడ్ పైకి ఎగజిమ్ముతుంది.
 
 
 ఓ విచిత్రం... ఇంకా కొనసాగుతున్న అధ్యయనం
 కడుపులో అల్సర్స్‌కు కారణంగా భావించే హెలికోబ్యాక్టర్ పైలోరీ బ్యాక్టీరియా... నిజానికి ఆసిడ్ ఉత్పత్తిని నియంత్రిస్తూ ఉండాలి. అలా అదనపు ఆసిడ్ పైకి చిమ్మకుండా చూసే రక్షణ బాధ్యత కూడా ఆ బ్యాక్టీరియాదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఈ సూక్ష్మజీవులను తుదముట్టించడానికి ఇచ్చే యాంటీబయాటిక్ చికిత్స ‘రిఫ్లక్స్’ను ఇంకా ప్రేరేపిస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతానికి కడుపులో అల్సర్స్‌కు యాంటీబయాటిక్ చికిత్సనే ప్రొటోకాల్‌గా గుర్తిస్తున్నందు వల్ల ఇంకా ఇదే చికిత్స కొనసాగుతోంది. అయితే హెచ్.పైలోరీ బ్యాక్టీరియా కోసం యాంటీబయాటిక్స్ ఇవ్వడం సరైనదేనా, ఇది ఆసిడ్ రిఫ్లెక్స్‌ను పెంచుతుందా అన్న అంశంపై ఇంకా అధ్య యనాలు కొనసాగుతున్నాయి.
 
 గృహవైద్యం
 అప్పుడే పెరుగు చిలికిన మజ్జిగ తీసుకోవడం  మంచి గృహవైద్యం. తాజా మజ్జిగకు క్షారగుణం ఉంటుంది. ఇది కడుపులోని ఆసిడ్‌తో కలవగానే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేస్తుంది.  కడుపును చల్లగా ఉంచే తాజా పెరుగు, తియ్యటి పెరుగు కూడా మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. పెరుగులోని ప్రొ-బయోటిక్ ఫ్యాక్టర్స్ అక్కడి బ్యాక్టీరియాను నియంత్రించి కడుపులో మంటను తగ్గిస్తాయి.
 
 రాబోయే మరో కొత్త చికిత్స
 రేడియో ఫ్రీక్వెన్సీ: ఒక సూది లాంటి ఉపకరణం నుంచి వెలువడే రేడియో తరంగాల ద్వారా ‘లెస్’ స్ఫింక్టర్‌లో సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేసి, అంతా ఆరోగ్యవంతమైన రీతిలో ఉండేలా చేస్తారు. ఇలా చేసే ప్రక్రియలో వెలువడ్డ వేడి తరంగాలు అక్కడి చెడిపోయిన కండరాలను భస్మం చేయడం లేదా అక్కడ అడ్డదిడ్డంగా పనిచేస్తున్న నరాలను కాల్చేయడం చేసి, అంతా ఆరోగ్యవంతమైన భాగాలే పనిచేసేలా ఈ ప్రక్రియ చూస్తుంది.
 
 భవిష్యత్ చికిత్సల విషయంలో రాబోయే మార్పులు
 ఎండోస్కోపిక్ మార్గాల ద్వారా చేసే చికిత్సలతో ఉపశమనం మాత్రమే కలుగుతుందని, లక్షణాలు మాత్రమే తగ్గుతాయని భావిస్తున్న పరిశోధకులు ఇప్పుడు మరింత ప్రభావపూర్వకమైన చికిత్సల దిశగా పరిశోధిస్తున్నారు. ఇందులో భాగంగా యాంటీ రిఫ్లక్స్
 మెడికేషన్‌ను రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే ఇవి ప్రస్తుతం ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా నిర్వహిస్తున్న లాపరోస్కో పిక్ ఫండప్లికేషన్స్ కంటే ప్రభావవంతమైనవిగా ప్రస్తుతం కనిపించనప్పటికీ దీర్ఘకాలంలో సత్ఫలితాలనే ఇస్తాయని భావిస్తున్నారు.
 
 మరో కొత్త మార్గం ట్రాన్స్ ఓరల్ ఎండోస్కోపిక్ సూచరింగ్
 రిఫ్లక్స్ సమస్యను అధిగమించడానికి మరో మార్గం వదులైన లెస్ స్ఫింక్టర్‌కు కుట్లు వేయడం. ఈ ప్రక్రియలో ఎండోస్కోపీ చికిత్సలో భాగంగా ఒక చిన్న (మీనియేచర్) కుట్టు మిషన్‌ను లెస్ స్ఫింక్టర్ వద్దకు పంపి, అక్కడ దానికి కుట్లు వేసి, టైట్ చేస్తారు. దీనివల్ల ఆహారం పైకి తన్నకుండా ఉంటుంది. ఈ మొబైల్ కుట్టుమిషన్‌ను అక్కడికి పంపే ప్రక్రియలో ఎక్కడా శరీరాన్ని కోయాల్సిన అవసరం ఉండదు కాబట్టి కుట్లూ అవసరం పడవు. అలాగే అనస్థీషియా కూడా అవసరం ఉండదు.
 
 రాత్రిపూట కనిపించే జీఈఆర్‌డీ నివారణ ఇలా...
 కొందరిలో ఈ సమస్య రాత్రిపూట ఎక్కువగా ఉండి నిద్రలేకుండా చేస్తుంటుంది. ఇలాంటి రోగుల్లో చాలామందిఅది తీవ్రమైన గుండెజబ్బుగా అనుమానించి ఆందోళన పడటమూ సాధారణమే. ఇలాంటి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
 

రాత్రిపూట ఆలస్యంగా తినకూడదు.
 

రాత్రి ఆహారం తీసుకున్న తర్వాత కొద్దిదూరం నడవాలి  రాత్రిపూట చిరుతిండ్లను మానేయాలి  రాత్రి నిద్రకు ముందర రెండుగంటల పాటు ఏమీ తినకూడదు.
 

పక్కమీదకు వెళ్లగానే ఎడమవైపునకు ఒరిగి పడుకోవాలి  మీ తల వైపు భాగం కాస్త ఎత్తుగా ఉండేలా మీ పక్కను సర్దుకోండి. ఇలా రిఫ్లక్స్ సమస్యతో బాధపడేవారు వీలైతే ఒక మెత్త (దిండు)ను ఎక్కువగా పెట్టుకోవడం కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ దిండును తల కింద మాత్రమేగాక మీ భుజాల కింది వరకూ ఉండేలా చూసుకోవడం మంచిది.
 
 చికిత్స
 అన్నిటి కంటే ముఖ్యమైన నివారణ అయిన జీవనశైలిలో మార్పు తర్వాత కూడా ఫలితం కనిపించకపోతే ఆసిడ్‌ను నియంత్రించే మందులు వాడటం అవసరం. ఈ మందులు మనలో ఆసిడ్ ఉత్పత్తిని తగ్గించడం మాత్రమే కాకుండా లెస్ స్ఫింక్టర్ పనితీరును మెరుగుపరచడం, ఈసోఫేగస్, కడుపు కండరాలు సక్రమంగా స్పందించేలా / పనిచేసేలా చేస్తాయి. ఆ తర్వాత హెచ్2 బీటా బ్లాకర్స్, ప్రోటాప్ పంప్ ఇన్హిబిటర్స్ (పీపీఐ) అనే మందులతోనూ చికిత్స చేస్తారు. ఇవి ప్రభావవంతంగా పనిచేయడానికి కనీసం 6 నుంచి 12 వారాల వ్యవధి పట్టవచ్చు.
 
 శస్త్రచికిత్స
 ఇక జీవనశైలిలో మార్పులు, మందులు పనిచేయకపోతే శస్త్రచికిత్స గురించి ఆలోచించాల్సి ఉంటుంది. చాలా చిన్నవయసులోనే దీర్ఘకాలిక జీఈఆర్‌డీతో బాధపడుతూ, జీవితాంతం మందులు వాడాల్సిన సందర్భాల్లో శస్త్రచికిత్స గురించి ఆలోచించాల్సి రావచ్చు.
 
 డాక్టర్ ఐతా శ్రీవేణు,
 సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్,
 సిగ్నస్ గాస్ట్రోఎంటరాలజీ
 అండ్ అడ్వాన్స్‌డ్
 ఎండోస్కోపీ సెంటర్,
 మియాపూర్, హైదరాబాద్

 
 - డా. విఎల్‌ఎన్ శాస్త్రి, ఆయుర్వేద నిపుణులు
 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement